Thursday, May 20, 2021

సర్వ జగత్తూ భగవత్ సృష్టే! ......వనం జ్వాలా నరసింహారావు

 సర్వ జగత్తూ భగవత్ సృష్టే!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-05-2021)  

మహాకవి బమ్మెర పోతనామాత్య రచించిన శ్రీమహాభాగవతంలో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి, పిండోత్పత్తి క్రమం గురించి అనేక రహస్యాలున్నాయి.

సృష్టి అంతా భగవత్ సృష్టే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పద్నాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! అతడి అనుగ్రహంతో మాత్రమే బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు.

విలాసార్థం జగత్తును పుట్టించాలనే సంకల్పం విరాట్స్వరూపుడైన ఆ మహాపురుషుడికి కలిగింది. ఆ ఆలోచనతో బ్రహ్మాండాన్ని చీల్చాడు. మొదలు తన సుఖం కొరకు శుచిగా ఉండే నీళ్లను పుట్టించాడు. ఆ జలరాశిలో పవళించాడు. ఆ విరాట్స్వరూపుడి హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం నుండి శోభిల్లి పలుకు తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. ఇలా, ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని. ఈ రెండింటి కలయికవల్ల సంభాషణం వెలువడింది. నీరు అగ్నికి ప్రతిరోధకం అయింది. మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. దీని దేవత వాయువు. దీనికి వాసన పట్టే గుణం ఉంది. తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. వీటి దేవత సూర్యుడు. భగవంతుడు చెవి అనే ఇంద్రియ కారకుడు అయ్యాడు.  దీని దేవత దిక్కులు. తరువాత చర్మం ఏర్పడింది. దాని నుండి రోమాలు పుట్టాయి. వీటి మూలదేవత చెట్లు. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి. స్త్రీ-పురుష కలయిక వల్ల సంతానం కలిగింది. అదే విధంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది. పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. హృదయం పుట్టింది అలాగే. విరాట్పురుషుడి తనువు నుండి ఏడు ధాతువులు, ఏడు ప్రాణాలు పుట్టాయి. ఇదంతా ఆ పరమేశ్వరుడి స్థూల శరీరం.      

ఈ స్థూల శరీరం, భూమి, నీరు (పంచ భూతాలు, మనస్సు, బుద్ధి) మొదలైన ఎనిమిది ఆవరణలతో చుట్టుకోబడి ఉంటుంది. సంపూర్ణమైన వైభవంతో బ్రహ్మాండాన్ని మించి వెలుగుతుంటుంది. విరాట్పురుషుడి రూపానికి ఆది, అంతం ఉండదు. మనస్సుకు కాని, మాటకు కాని గోచరం కాదు. తేజోవంతమైన ఈ భగవత్ స్వరూపం స్థూల-సూక్ష్మ రూపాలలో మహాపురుషుడి మాయా శక్తి వల్ల ఏర్పడింది. ఈ మాయా ప్రభావాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. లక్ష్మీపతి బ్రహ్మరూపుడై జగత్సృష్టి చేశాడు. విష్ణు రూపుడై కాపాడాడు. శివుడి రూపంలో సమస్త విశ్వాన్నీ హరింప చేస్తాడు. ఈ విధంగా ధర్మరూపుడై ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. రక్షించాడు. అణచి వేశాడు. సమస్త రూపాలనూ తానే ధరించాడు.

విష్ణుమూర్తి నుండి ఆకాశం, ఆ నింగి నుండి వాయువు, ఆ గాలి నుండి అగ్ని, దాన్నుండి నీరు, నీటి నుండి నేల, ఆ భూమి నుండి అనేక రకాల ప్రాణులు పుట్టాయి. ఈ అన్నిటికీ మూలాధారుడైన వాడు నారాయణుడు. అతడు చిదానంద స్వరూపుడు. అవ్యయుడు. జన్మరహితుడు. అంతం లేనివాడు. ఆద్యంతాలు కానరానివాడు. ఎంత మహానుభావులైనా కూడా ఇలాంటి దైవం నిర్మించిన ఈ సృష్టికి హేతువును, సృష్టి సరణిని గ్రహించలేక పోతున్నారు. ఈ విశ్వమంతా భగవంతుడి స్వరూపమే! సమస్తం ఆయనే! ఆయనే సర్వానికి ప్రభువు. బుద్ధులన్నిటికీ ఆయనే ఉపలక్షణం.

సృష్టికి పూర్వం తనదైన మాయతో తనలోనే లయం అయిన శక్తిని తానే విశ్వగర్భుడై, తానొక్కడే అయి వెలుగుతూ ఉంటాడు. ఆయనకు జనన-మరణాలు లేవు. భగవంతుడికి సృష్టి సంకల్పం కలిగేసరికి తానే కార్యం, కారణం అయి తన కడుపులో నుండి విశ్వాన్ని సృష్టించాడు. తన మాయ వల్ల మహాత్తత్త్వాన్ని పుట్టించాడు. ఇది భగవంతుడికి మాత్రమే కనిపిస్తూ, సృష్టి చేయాలనే కోరికతో మరో రూపాన్ని పొందింది. దాంట్లో నుండి క్రమంగా కారణం, కార్యం, కర్త అనే పేర్లతో భేదాలు ఏర్పడి, పంచ భూతాలు, ఇంద్రియాలు, మనస్సు పుట్టాయి. ఆ తరువాత అహంకారం ఏర్పడింది. ఇది సత్త్వరజోస్తమో గుణాలతో కూడి ఉంటుంది.

పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు వేర్వేరుగా ఉండి సమైక్యం కాలేకపోవడంతో సృష్టి సామర్థ్యం వాటికి చాల లేదు. అందువల్ల దేవతలందరు నారాయణుడిని ప్రార్థించారు. జగత్తును సృష్టించే శక్తిని తమకివ్వమని అడిగారు. విష్ణుమూర్తి కూడా జగత్తును సృష్టించే శక్తి రాకపోవడాన్ని గమనించాడు. అప్పుడు ప్రకృతిలో తన శక్తిని ప్రవేశపెట్టి, 27 తత్త్వాలలో తానూ ప్రవేశించి వాటికి ఏకత్వాన్ని కలిగించాడు. ఆ 27 తత్త్వాలు: పంచభూతాలైన పృథ్వి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం; పంచకర్మేంద్రియాలైన నోరు, కాళ్లు, చేతులు, మల అవయవం, మూత్ర అవయవం; పంచజ్ఞానేనింద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; చతురాంతః కరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం; పురుషుడు, ప్రకృతి, మహత్తు.

ఈ విధంగా జగత్తును నిర్మించడంలో శ్రీహరి ఇందులో పాల్గొన్న అన్నిటికీ పరస్పరం అన్యోన్యతను కలిగించగా తత్త్వ సమూహం అంతా ఆయన విరాట్స్వరూపంగా గోచరించింది. ఈ విరాట్ పురుషుడు బ్రహ్మాండం అనే గర్భ రూపంలో వేల సంవత్సరాలు ఉన్నాడు. దాని నుండే సృష్టి అంతా వచ్చింది. భగవంతుడు సంకల్ప రూపంలో ఉంటాడు. అందువల్ల సృష్టి సమస్తం చైతన్య రూపంలో ఉంటుంది కాని ఇంకా శరీరాలు ఏర్పడవు. క్రమంగా ఆ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడే స్థితి కలుగుతుంది. అదే కర్మశక్తి. ఈ శక్తి వల్ల అనేక ప్రవృత్తి భేదాలు, దాని నుండి ప్రాణాలు వస్తాయి. ఇన్ని శక్తులు అంతర్గతంగా ఉన్నందున తనెవరో తెలుసుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. ఆధ్యాత్మ, ఆదిభూత, ఆధిదైవం అనే మూడు కలిసిన విరాట్ పురుషుడు జీవులకు ఆత్మగా పిలవబడుతుంది. ఈ విధంగా ప్రకటితమైన విరాట్ పురుషుడు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికమనే భేదాలతో ఉంటాడు.

విరాట్పురుషుడి కొంత భాగం ముఖం కాగా, శ్రీహరి అంశతో అగ్నిదేవుడు అక్కడ స్థావరం ఏర్పరుచుకున్నాడు. ఆ కారణంగా జీవుడు శబ్దాన్ని పలకగలుగుతున్నాడు. కొంత భాగం వేరుగా కన్నులు అయ్యాయి. సూర్యభగవానుడు కన్నులకు అధికారై జీవులకు రూపవిజ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరికొంత భాగం చర్మమై వాయువు అక్కడ నిలిచాడు. విరాట్పురుషుడి మరికొంత భాగం వేరై చెవులుగా ఏర్పడింది. ఈశ్వరాంశ అయిన దిక్కులు జీవుడి శ్రవణ ఇంద్రియాన్ని కూడి అతడికి శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. అలాగే ఈశ్వరాంశ అయిన వరుణుడు జీవుడి రసనేంద్రియంగా కనిపిస్తూ రుచులను తెలుసుకుంటున్నాడు. అలాగే పరమేశ్వరుడు నుండి ముక్కు విడిగా ఆయన అంశకల ఆశ్వినీదేవతలకు స్థానమైజీవుడికి వాసన చూసే శక్తిని ఇచ్చింది. పరమపురుషుడు నుండి వేరైన చర్మం ఆయన అంశాలైన కేశాలను కూడడం వల్ల ప్రాణికి దురదకు గోక్కోవడం అనేది కలిగింది. ఈశ్వరాంశ అయిన ప్రజాపతి శుక్రంతో అమ్యోగం పొందడం వల్ల జీవుడు అపరిమితమైన ఆనందాన్ని పొందుతున్నాడు. అలాగే గుదస్థానంలో అచ్యుతాంశ అయిన మిత్రుడు వాయువుతో కూడి ఉండడం వల్ల జీవుడికి మలమూత్ర విసర్జన శక్తి కలుగుతున్నది.

విరాట్పురుషుడి చేతులతో ఇచ్చిపుచ్చుకునే శక్తి కలవాడై జేవుడు జీవనోపాధిని పొందుతున్నాడు. పాదాలను విష్ణువు అధిష్టించి నడిచే శక్తిని కలిగించడం వల్ల జీవుడు నడవకలుగుతున్నాడు. చంద్రుడు మనస్సులో ప్రవేశించడం వల్ల జీవుడు సంకల్ప-వికల్పాలను పొందుతున్నాడు. అలాగే అహంకారంలో రుద్రుడు ప్రవేశించినప్పుడు జీవుడు కర్తవ్యాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తాడు. బుద్ధి వాగీశ్వరుడి నివాసమై జ్ఞానంశతో కూడినప్పుడు జీవుడికి విషయ పరిజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మకు నివాసమై చైతన్యాన్ని పొందినప్పుడు జీవుడు విజ్ఞాని అవుతాడు.

పరమాత్మ నాభి కేంద్రంగా, పద్నాలుగు భువనాలకు కారణమైన ఒక పద్మం పుట్టింది. అందులో నుండి బ్రహ్మ పుట్టాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ద్వారా లోక సృష్టి చేయాలని సంకల్పించాడు. విష్ణువు వరప్రభావం వల్ల బ్రహ్మ తన మహిమతో చతుర్దశ భువనాలను సుందరంగా సృష్టించాడు. తన ధర్మానికి ఫలస్వరూపంగా దేవతలు, పశుపక్ష్యాదులు, నరులు, ఇతరాలతో కూడిన ఈ అనంత సృష్టిని బ్రహ్మ నిర్మించాడు. ఆది, అంతం లేనిది, అవ్యయమైనది అయిన తత్త్వమే ఈ సృష్టికి మూల కారణం. ఈశ్వరుడు కాలానికి తగిన రూపం ధరించి, కాలానికి తగిన రూపాన్ని గైకొని, కేవలం వినోదానికై తనను తానే సృష్టించుకున్నాడు. ఆ ఈశ్వరుడిలోనే లోకాలన్నీ ఉంటాయి. అన్ని లోకాలలోనూ ఈశ్వరుడు ఉంటాడు. ఈ అనంత విశ్వానికి కార్యం, కారణం రెండూ ఆయనే! ఆ మహాపురుషుడి నుండి వెలువడి ఈ విశ్వం ప్రకాశిస్తున్నది. శ్రీమహావిష్ణువు మాయవల్ల ఈ విశ్వమంతా ఒక పద్ధతిలో పుట్టి, పెరిగి, నాశనమవుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది.

జీవుడికి పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం తిరిగి పునర్జన్మ ఇచ్చే మహానుభావుడు ఈశ్వరుడు మాత్రమే!! కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని పొందే క్రమంలో పురుషుడి వీర్యంగా మారి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి ‘కలిలమై (శుక్ర-శోణిత సంయోగం), అయిదు రాత్రులకు ‘బుద్బుద మై (బుడగ), పడవ దినానికి రేగు పండంత అయ్యి, ఆ పైన మాంస పిండమై, ఆపై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ మీద నెలకు శిరస్సు, రెండు నెలలకు కాళ్లు-చేతులు పుడతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు కలుగుతాయి. నాల్గవ నెలకు రసం, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడుతాయి. అయిదవ నెలకు ఆకలి దప్పికలు కలుగుతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన తిరుగుతూ, తల్లి తిన్న అన్నపానాదాల వల్ల తృప్తిని పొందుతాడు.

ఇక అక్కడి నుండి ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) కలిగి, సూక్ష్మ జీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ, క్రిములు పాకి భాద పెటుతుంటే మూర్చలో మునిగిపోతాడు. తల్లి తిన్న కారం, చెడు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాలతో బాధపడుతున్న శరీరావయవాలు కలవాడై మావితో కప్పబడి, బయటకు ప్రేగులతో కప్పబడి, మాతృగర్భంలో శిరస్సు వంచుకుని, వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్ప లేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో పూర్వ జన్మలలో చేసిన పాపాలను తలచుకుని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, కొంచే సుఖం కూడా లేకుండా ఉంటాడు.

ఏడవ నెలలో జ్ఞానం కలిగి, కదలికలు ప్రారంభమై, మలంలోని క్రిములతో కలసి ఒక్క దిక్కున ఉండకుండా, గర్భంలో సంచరిస్తూ, ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి, తిరిగి గర్భవాస దుఃఖానికి చింతిస్తూ, బంధవ రూపములైన సప్త ధాతువులతో బద్ధుడై, రెండు చేతులు జోడించి, దీనవదనుడై, జీవుడు సర్వేశ్వరుడిని స్తుతిస్తాడు.  ఇలా స్తుతిస్తూ, స్వచ్చమైన జ్ఞానం కలవాడైన జీవుడు తొమ్మిది మాసాలు గడుపుతాడు. పదవ మాసం రాగానే జీవుడు అధోముఖుడై ఉచ్చ్వాస నిస్శ్వాసాలు లేకుండా దుఃఖంతో బాధపడుతూ, జ్ఞానాన్ని కోల్పోయి, రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలమీద పడి ఏడుస్తూ జ్ఞానహీనుడై జడుడి లాగా అయిపోతాడు. తన భావాన్ని అర్థం చేసుకోలేని ఇతరుల వల్ల పెంచబడుతూ, తన కోరికలను చెప్పుకోలేక, ఒక పక్కమీద పడుకుంటాడు. అవయవాలలలో ఎక్కడ దురద వేసినా గోక్కోలేక, కూర్చోలేక, లేవలేక, నడవలేక, ఓపిక చాలక, జనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారం శైశవంలో ఆ అనుభవాలను పొందుతూ పెరుగుతుంటాడు జీవుడు. ఇదీ జగత్ సృష్టి రహస్యం!

No comments:

Post a Comment