యాదవకుల నాశనం, బలరామ శ్రీకృష్ణుల నిర్యాణం
అవతార పరిసమాప్తి
ఆస్వాదన-141
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (09-10-2023)
ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగిన 35 సంవత్సరాల తరువాత 36 వ
సంవత్సరంలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అన్ని దిక్కులలోను ఉల్కలు
రాలాయి. మండు వేసవిలో దట్టమైన పొగమంచు ఆకాశమంతా విస్తరించింది. ప్రతిరోజూ ఏదో ఒక
వైపరీత్యం జరుగుతుంటే, కొంతకాలం గడిచాక ఒకనాడు ధర్మరాజు, శ్రీకృష్ణ బలరాములు తప్ప మిగతా
యాదవులంతా ఒకరితో ఒకరు పోట్లాడి చనిపోయారన్న విషాద వార్త విన్నాడు. తన తమ్ములను
పిలిచి ఈ వార్త తెలియచేశాడు. హస్తినాపురమంతా ఆ వార్త విని శోక సముద్రంలో
మునిగిపోయింది.
దీనికో నేపధ్యం వున్నది. చాలా కాలం క్రితం కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు తమ శిష్యులతో కలిసి శ్రీకృష్ణుడిని చూడాలన్న కోరికతో
ద్వారకకు వచ్చారు. యాదవుల మరణానికి కారణమైన ఈ ఋషుల రాక కూడా శ్రీకృష్ణుడి
సంకల్పమే. ద్వారక వీధుల్లో ఆ ఋషులు వెళ్తున్న సమయంలో వృష్టి వంశానికి చెందిన
కొందరు యాదవులు సాంబుడనే వాడికి ఆడదాని వేషం వేసి, ఋషుల
దగ్గరికి పోయి ఆమెకు సంతానం కలుగుతుందా, లేదా, అని అడిగారు. ఋషులకు అది కపట వేషమని తెలిసి కోపం వచ్చింది. ‘శ్రీకృష్ణుడి
కుమారుడైన ఈ సాంబుడు యాదవకుల నాశన కారణమైన ఒక రోకలిని కంటాడని’ అన్నారు. బలరామకృష్ణులు
తప్ప తక్కిన యాదవులంతా ఆ రోకలికున్న విచిత్ర శక్తి వల్ల నశిస్తారని, బలరాముడు యోగనిష్ఠతో తన శరీరం వదిలి సముద్రంలోకి ప్రవేశిస్తాడని, కృష్ణుడు నీలమీద పడుకొని వుండగా ‘జర’ అనే రాక్షసి
ఆయన్ను చంపుతుందని యాదవులకు చెప్పి ఆ ఋషులు కృష్ణుడిని కలవకుండానే వెల్లిపోయారు.
వెంటనే ఈ వార్త కృష్ణుడికి తెలిసింది. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన కృష్ణుడికి కాలవిధిని మరల్చడం
సాధ్యపడదని మనసులో అనుకున్నాడు.
ఆ మర్నాడే సాంబుడి కడుపులో నుండి భయంకరమైన, కఠినమైన ఒక
రోకలి వెలువడింది. బంధువులు ఆ విషయాన్ని వసుదేవుడికి చెప్పగా, ఆయన ఆ
రోకలిని పొడిగా చేసి సముద్రంలో కలపమని ఆజ్ఞాపించాడు. వారలాగే చేశారు. కొందరు
యాదవులకు ఆ సమయంలో గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన విషయం,
దాని మూలాన యాదవ సంతానం కూడా కౌరవుల లాగానే నశించబోవడం గుర్తుకొచ్చింది. ఆ విధంగా
యాదవుల వినాశనకాలం ఎప్పుడైతే సమీపించిందో అప్పుడే ద్వారకానగరంలో చెప్పరాని
ఉపద్రవాలు సంభవించడం మొదలైంది. మహోత్పాతాలు అనేకం ఆ నగరంలో పుట్టాయి. యముడు
దండాన్ని ధరించి సంచరించ సాగాడు.
ప్రతిరోజూ ద్వారకలో ఏదో ఒక అశుభసూచకమైన సంఘటన జరుగుతుంటే,
దానిని గమనించిన కృష్ణుడు గాంధారి ఇచ్చిన శాపాన్ని స్మరించాడు. ఆమె అన్న 36వ
సంవత్సరం రానే వచ్చింది అనుకున్నాడు. ఇక యాదవ నాశనం తప్పదని,
అలా జరగడానికి ఒక పుణ్యక్షేత్ర సమీప భూమైతే మంచిదన్న నిశ్చయానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు
తన దివ్యదృష్టితో యాదవుల క్షయాన్ని గుర్తించాడు. ద్వారకావాసులంతా జాతర చేయాల్సి
వున్నదని రాజసభలో ప్రకటించాడు. నగరంలో కూడా చాటింపు చేయించాడు. ఆ మర్నాడు
శ్రీకృష్ణుడి చక్రం, గరుడధ్వజం ఉన్నట్లుండి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వాటి వెంటనే
బలరాముడి తాటి జెండా కూడా స్వర్గాన్ని చేరుకున్నది. ఆ సమయంలో నాలుగు గుర్రాల
శ్రీకృష్ణుడి రథం ఆకాశమార్గంలో స్వర్గానికి చేరిపోయింది. అప్పుడు ఆకాశంలో నిలబడి
దేవతలు సముద్ర యాత్రకు బయల్దేరమని యాదవులను ప్రబోధించారు. ఎన్ని ఉత్పాతాలు
సంభవించినా యాదవులలో ఏ కదలికా లేదు. ఏ తొందరపాటూ లేదు. ప్రతి ఇంట్లోను మద్యం, మాసం లాంటివి సమకూర్చుకునే ప్రయత్నంలో పడ్డారు.
యాదవులతో కూడి శ్రీకృష్ణుడు వేరే రథంలో సముద్ర తీరానికి
బయల్దేరాడు. బలరాముడు కూడా అలాగే పాదచారిగానే బయల్దేరాడు. యాదవ స్త్రీలు పల్లకీలలో
బయల్దేరారు. అంతా సముద్ర తీరం చేరారు. శ్రీకృష్ణుడి మంత్రి,
పురోహితుడు ఉద్దవుడు తపస్సు చేసికోవడానికి అడవికి వెళ్లాడు. బలరాముడు కూడా
వెళ్తానంటే సరేనన్నాడు శ్రీకృష్ణుడు. తపస్సుకి బయల్దేరిన ఉద్దవుడిని దిగబెట్టి
వచ్చిన బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూచున్నాడు. ఆయనలోని మోహం నశించి
జ్ఞానజ్యోతి ప్రకాశించింది. వండిన భోజనాలను యాదవులు కోతులకు పంచిపెట్టారు.
నృత్యాలు చేశారు ఆ తరువాత. సముద్రానికి పూజలు చేశారు. మత్తుపానీయాలను శ్రీకృష్ణుడు
చూస్తుండగానే బాగా తాగారు. యాదవులు ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చంపుకున్నారు. బాగా తాగినవారిలో సాత్యకి, కృతవర్మ, చారుధేష్ణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వారున్నారు.
సాత్యకి మద్యం మత్తులో కృతవర్మను అవమానంగా మాట్లాడాడు.
కృతవర్మ కూడా ఎదురు మాట్లాడి సాత్యకిని అవమానించాడు. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం
పెరిగింది. ఋషుల శాప ప్రభావం వల్ల సాత్యకి కోపం అతిశయించి,
కృతవర్మ గొంతును నరికేశాడు. అప్పుడు భోజాంధకులు ఒక్కటిగా కలిసి సాత్యకిని
చుట్టుముట్టారు. అప్పుడు వృష్టి వంశీయులైన వీరులు భోజాంధకులతో యుద్ధానికి దిగారు.
ఒకరినొకరు ముట్టడించి యుద్ధం చేశారు. ఇరువర్గాలవారికి ఆ సమయంలో అక్కడికక్కడే మూడు
అంచులున్న తుంగ పరకలు యుద్ధానికి ఆయుధాలలాగా లభించాయి. ఋషుల శాప ప్రభావం వల్ల
తుంగలన్నీ రోకళ్లుగా స్ఫురించాయి. యదువీరుల మధ్య యుద్ధం చాలా అతిశయమైన రీతిలో
జరిగింది. ఉన్నవారు వున్నచోటునే విజృంభించి యుద్ధం చేశారు. ఆ సమయంలో వృష్టి వంశమంతా నశించింది.
యుద్ధభూమిలో చచ్చిపడివున్న అనిరుద్ధుడిని,
ప్రద్యుమ్నుడిని, సాంబుడిని,
సాత్యకిని, గదుడిని చూసిన శ్రీకృష్ణుడికి కోపం కలిగింది.
యుద్ధంలో చావకుండా మిగిలిన శత్రువీరుల మీద పడి తుంగపరకలతో చంపాడు. ఈ విధంగా
యాదవులంతా రోకటి విజృంభణ వల్ల చనిపోయారు.
చావకుండా మిగిలి
వున్న దారుకుడు, బభ్రుడు,
కృష్ణుడి దగ్గరికి వెళ్లి, యాదవ సమూహమంతా చచ్చిందని చెప్పారు. వారు ఇచ్చిన సూచన ప్రకారం
శ్రీకృష్ణుడు బలరాముడు వెళ్లిన దారిలోనే పోయి ఒక చెట్టుకింద ఆయన్ను చూశాడు. ఆ
క్షణంలోనే, దారుకుడిని పిలిచి, అతడిని తక్షణం పాండుకుమారుల దగ్గరికి
వెళ్లమని, యాదవ వర్గమంతా నశించిన సంగతి చెప్పమని, అర్జునుడిని తన మాటగా ద్వారకానగర సమీపానికి
తీసుకురమ్మని అన్నాడు కృష్ణుడు. దారుకుడు వెంటనే వేగంగా వెళ్లిపోయాడు అదేపని మీద.
స్త్రీలను, ఏనుగులను,
గుర్రాలను ద్వారకలో చేర్చి రమ్మని బభ్రుడికి చెప్పగా అతడు బయల్దేరిన వెంటనే ఒక
బోయవాడు ఒక తుంగపరకను వాడిమీద వేయగా అతడు నేలకొరిగాడు. బభ్రుడికి చెప్పిన పని తానే
చేయడానికి బయల్దేరుతూ కృష్ణుడు, తాను పోయి వచ్చేంత దాకా బలరాముడిని ఆ చెట్టు
కిందనే వుండమని అన్నాడు. ద్వారకకు వెళ్లిన శ్రీకృష్ణుడు అన్ని సంగతులూ వసుదేవుడికి
వివరించి, తనకు ఇక జీవితం గడపడానికి మనస్సు రావడం లేదని, బలరాముడితో కలిసి తపస్సు చేస్తానని, ఇక అన్ని విషయాలు ఆయనే చూసుకోవాలని చెప్పాడు.
వసుదేవుడు ఆ
మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. యాదవ స్త్రీలు హాహాకారాలు చేశారు. కృష్ణుడు అందర్నీ
ఓదార్చి, త్వరలో అర్జునుడు వచ్చి వారి దుఃఖాలను
పోగొట్టుతాడని చెప్పాడు. ఆ తరువాత తండ్రికి వీడ్కోలు చెప్పి అన్న బలరాముడి
దగ్గరికి పోయి తండ్రిగారి అనుమతితో వచ్చానని అన్నాడు. ఆ తరువాత బలరాముడి ముఖం
నుండి ఒక వేయినోళ్ల మహాసర్పం ఎర్రటి కాంతితో బయటపడడాన్ని కృష్ణుడు
గమనించాడు. ఆ విధంగా బలరాముడు తన యోగబలం వల్ల తన దేహాన్ని వదలిపెట్టి, ఆకాశమార్గంలో సముద్రంలోకి ప్రవేశించాడు.
ఆదిశేషస్వరూపుడైన ఆ బలరాముడికి వరుణుడు స్వాగతం పలికాడు. నాగులు పూజలు చేశారు. గంగానదిలాంటి
పెద్దనదులన్నీ వచ్చి పూజించాయి బలరాముడిని. కృష్ణుడు తన మూర్తి భేదాన్నైన
బలరాముడిని తన మహారూపంలో కలుపుకొన్నాడు.
బలరాముడు అవతారం
చాలించి వెళ్లిపోయిన తరువాత శ్రీకృష్ణుడు ఆ ప్రదేశం వదిలి అక్కడక్కడా తిరిగాడు.
మనసులో ఏం చేయాలా అని ఆలోచించాడు. తాను దేహాన్ని వదిలిపెట్టడానికి ఒక హేతువును
ఆలోచించుకొన్నాడు. మునులు ఇచ్చిన శాపవాక్యం గుర్తుకొచ్చింది. తన అరికాలిలోనే తనకు
ప్రాణాపాయం జరుగుతుందన్న దుర్వాసుడి మాటలు కూడా జ్ఞప్తికి వచ్చాయి. ప్రాణత్యాగం
ఎలా చేయవచ్చో స్ఫురించింది. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను అణచిపెట్టి, గాఢమైన సమాధిని పొంది, విష్ణువు అంశ అయిన కృష్ణుడు నేలమీద
పడుకొన్నాడు. ఆ సమయంలో ‘జర’ అనే రాక్షసి నేలను కాలితో రాస్తూ నెమ్మదిగా ఆ అడవిలో
ప్రవేశించింది. అక్కడ తిరుగుతున్న ఒక వేటగాడికి, కృష్ణుడు జింక అన్న భ్రాంతిని ఆవహింపచేసింది.
భ్రాంతికి లోనైన
వేటగాడు బాణాన్ని వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదం అడుగు భాగంలో దూరి పాదం పైభాగంలో
బయటికి పొడుచుకొని వచ్చింది. వెంటనే వేటగాడు జింకను (అని భ్రమించిన)
తీసుకెళ్లడానికి సమీపంలోకి వచ్చాడు. కృష్ణుడిని చూసి, ఎవరో మహానుభావుడని గుర్తించి, అతడి పాదాల వద్ద శిరస్సు వుంచి కిందపడ్డాడు.
వాడిని ఓదార్చిన కృష్ణుడు, ఆ తరువాత, మానవీయమైన దేహాన్ని విడిచి, తన స్థానాన్ని పొందడానికి వెళ్లిపోయాడు.
స్వర్గలోకానికి వెళ్ళిన శ్రీకృష్ణుడికి మునులు,
సిద్ధులు, రుద్రులు,
వసువులు, మరుత్తులు,
దేవతలు, దేవేంద్రుడు మొదలైన వారు ఎదురొచ్చి కాళ్లకు
మొక్కారు. శ్రీకృష్ణుడిని దేవేంద్రుడు పరిపరి విధాల స్తోత్రం చేశాడు. కృష్ణుడి మీద
ఇంద్రుడు సాటిలేని భక్తితో పూలవాన కురిపించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి
వేదమంత్రాలతో శ్రీమహావిష్ణువును ప్రస్తుతించాడు. నారాయణుడు దేవతలందరితో
ఆదరపూర్వకంగా సంభాషించాడు. ఆనంద రూపమైన జ్ఞానంతో పరిశుద్ధమైనదీ, కొలవడానికి వీలు లేనట్టిదీ, అయిన తన
స్థానప్రాప్తిని తానే కల్గించుకొన్నానని అన్నాడు. ఇలా అంటూ తన స్థానంలో కూచున్నాడు
శ్రీమన్నారాయణుడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, మౌసలపర్వం, ఏకాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
శ్రీకృష్ణావతారపరిసమాఫ్తిని గురించిన కథనం మహాభారతంలోనూ శ్రీమద్భాగవతంలోనూ కొద్ది తేడాలతో ఉంది. ఈరెండూ వేదవ్యాసకృమే ఐనా కథనంలో భిన్నత్వం చిత్రం అనిపిస్తుంది.
ReplyDelete