Monday, October 2, 2023

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

 బ్రహ్మర్షి విశ్వామిత్రుడు

వనం జ్వాలా నరసింహారావు

భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక (అక్టోబర్ నెల 2023)

(విశ్వామిత్రుని యాగసంరక్షణ పూర్తయింది. జానకీ స్వయంవరం కోసం రామలక్ష్మణులను మిథిలకు తీసుకువెళుతూ విశ్వామిత్రుడు గౌతమాశ్రమాన్ని దర్శింపచేశాడు. రాముని రాకతో అహల్యకు శాపవిమోచనం కలిగింది. గౌతముని కొడుకైన శతానందుని వల్ల శ్రీరామచంద్రుడు తన గురువు విశ్వామిత్రుని కథ విన్నాడు)

వాల్మీకి రామాయణంలో అహల్యా వృత్తాంతం మనం లోకసామాన్యంలో వినేదానికంటే భిన్నంగా వుంటుంది. వాల్మీకి మతమే వేరు. అహల్య శిలగా మారిందని ఆయనెక్కడా చెప్పలేదు. గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. దుఃఖానుభవం లేకుండా, రాయిగా పడి వుంటే, పాప ఫలం అనుభవించినట్లు కాదు. అహల్యలోని జారత్వ దోషం పోవాలంటే, అనేక సంవత్సరాలు తపించి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలని గౌతముడు శపించాడు. అప్పటి న్యాయశాస్త్ర ప్రకారం అహల్య  ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే అర్థం స్ఫురిస్తుందిక్కడ.

విశ్వామిత్రుడి యాగానికి అహర్నిశలూ రక్షణ కలిగించిన రామలక్ష్మణులు ఆయన ఆజ్ఞానుసారం మిథిలానగరానికి పోతూ, దానికి చేరువలోనే ఓ చక్కటి ఆశ్రమ ప్రదేశాన్ని చూసారు. దాని వివరాలను వారికి తెలియచేశాడు విశ్వామిత్రుడు. గౌతముడి ఆశ్రమంలో ప్రవేశించి, అహల్యను ఉద్ధరించేలా సంకల్పించమని శ్రీరాముడిని కోరాడు. విశ్వామిత్రుడిలా చెప్పడంతో, లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి, గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అహల్యను చూశారు. ఆమె తపస్సునే భాగ్యంగా కలిగి వుంది. గొప్ప తపస్సు చేయడం వల్ల ఆమెకు అతిశయించిన తేజస్సు వుంది. శాప వశాత్తూ, దేవ, దాన, మానవులకు అప్పటివరకు కనిపించకుండా, పోయింది. మనుష్యులలో ఎవరికీ ఆమె సౌందర్యం లేదు. ఆమెను బ్రహ్మ మాయతో సృష్టించి, గౌతమునికి ఇచ్చాడు. అటువంటి అహల్య  మంచు కప్పి, మబ్బు కమ్మిన చంద్రకాంతిలా అప్పటివరకు వుంది. నీటిలో కనిపిస్తున్న సూర్యుడిని ఎండలో చూడడం ఎలా సాధ్యంకాదో అలా ఆమెను చూడడం కూడా సాధ్యం కాలేదు.

అటువంటి అహల్యకు ఆ ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం తొలిగింది. పూర్వరూపంలో లోకానికి కనపడింది. శ్రీరామ లక్ష్మణులు ఆమెకు నమస్కరించారు. వారు అవతారమూర్తులని గౌతముడు తనకు శాపమిస్తున్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకున్న అహల్య, వారికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చింది. రామచంద్రమూర్తి అవి తీసుకుంటున్నప్పుడు దేవతలు దుందుభులు మోగించి, మేలు-మేలని అహల్యను మెచ్చుకున్నారు. గౌతముడు ఆమెను పరిగ్రహించి శ్రీరాముడిని పూజించాడు.

ధేనువు కోసం యుద్ధం

మిథిలాలానగరం వచ్చిన శ్రీరామచంద్రమూర్తికి అహల్యా, గౌతముల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి కథ వినిపించాడు.

‘విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ, ఒక పర్యాయం, సేనలతోగూడి భూమంతా తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్తాడు. మహర్షి వారికి ఆతిథ్యమిచ్చి గౌరవించదల్చాడు. తన కామధేనువైన శబలను అన్ని రకాల భక్ష్య భోజ్యాల్ని ఏర్పాటుచేయమని ఆదేశించాడు. శబల ఆ ప్రకారమే చేయగా, రాజు సంతృప్తిగా, కడుపునిండా భోజనం చేశాడు. తనకు కామధేనువు శబలనివ్వమని అడిగాడు. వశిష్ఠుడు నిరాకరించడంతో విశ్వామిత్రుడు బలవంతంగా దానిని ఈడ్చుకొని పోసాగాడు. వశిష్టుడు తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తానని శబల ప్రార్థించింది. వశిష్ఠుడి ఆజ్ఞ లభించగానే, కామధేనువు కల్పించిన శూరులు విశ్వామిత్రుడి సైన్యం మీదపడి దహిస్తుంటే, విశ్వామిత్రుడు తన అస్త్రాలతో వారిని పీనుగుపెంటల్లా చేసాడు.’

‘ఆస్థితిలో వున్న తన సైన్యాన్ని చూసిన శబల, మరోమారు మహావీరులను సృజించి, రాజును ఓటమి పాలుచేసింది. దానితో ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై అస్త్రవిద్యలన్నీ ఉపదేశించాడు. ఆ ధైర్యంతో, గర్వంతో తిరిగి వచ్చిన విశ్వామిత్రుడు వశిష్ఠుడి తపోవనమంతా, కాల్చి బూడిద చేశాడు. కోపగించిన వశిష్ఠుడు మందలించినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న బ్రహ్మ దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు. విశ్వామిత్రుడు, ప్రయోగించిన రకరకాల శస్త్రాస్త్రాలను వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో హరించివేశాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు.’

‘తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని మింగాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు ఆ తరువాత శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడు తన క్షాత్రం వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయిమడని, శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించినందువలనే వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని అర్థం చేసుకుని, మళ్లీ తపస్సుకు పూనుకున్నాడు.’

వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం జపించే గాయత్రీ మంత్రమే. అదే ఆయన బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకొకరైతే బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు. ఇవేవీలేకుండా, వశిష్ఠుడు దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? వశిష్ఠ, విశ్వామిత్రుల మధ్య జరిగిన యుద్ధం ‘ఆత్మ-అనాత్మల, మధ్య జరిగిన యుద్ధం. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం లేదా శ్రీమధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.

గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. సంపూర్ణంగా అనాత్మవిద్య ఎవరు నేర్చుకున్నప్పటికీ, ఆత్మవంతుడిని గెలవడం సాధ్యం కాదు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడికి కూడా నీ కీడుతలపెట్టలేదు. ఇది ఆత్మవంతుడైన మహానుభావుల లక్షణం.

         ‘ఓటమికి కుమిలిన విశ్వామిత్రుడు వేయి సంవత్సరాలు తపస్సుచేసిన తర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, ఆయన రాజర్షి అయ్యాడని వరమిచ్చినా తృప్తిపడకుండా మరో వేయేళ్లు కొనసాగించాడు. మళ్లీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన ఋషి అయినాడని చెప్పినా  తృప్తి చెందని విశ్వామిత్రుడు, అంతకంటే ఘోరమైన, కఠోరమైన తపస్సు చేయసాగాడు. మేనక ఆయన తపస్సు విఘ్నం చేస్తుంది. అందులోంచి బయటపడి నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. బ్రహ్మదేవుడు మళ్లీ ప్రత్యక్షమై ఆయన మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను జితేంద్రియుడనయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయనింకా జితేంద్రియుడు కాలేదని అనడంతో తపస్సు కొనసాగించాడు. మళ్లీ విశ్వామిత్రుడి దగ్గర కొచ్చిన బ్రహ్మ, అతడి తపస్సు ఫలించిందని చెప్పినప్పటికీ ఆమాట వశిష్టుడి నోటి వెంట వినాలని వుందన్నాడు. ఆయన కోరిక మేరకు దేవతలు వశిష్ఠుడి వద్దకు పోయి, అది నెరవేర్చమని ఆయన్ను ప్రార్థించారు. ఆ మహా తపస్వి వచ్చి, విశ్వామిత్రుడు నిజమైన బ్రహ్మర్షి అయ్యాడని చెప్పాడు. అంతటితో తృప్తి చెందాడు విశ్వామిత్రుడు.’

విశ్వామిత్రుడు తొలుత రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. తర్వాత ఋషి అయ్యాడు. అప్పటిదాకా భార్యా పిల్లలు ఆయన వెంటే వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. జితేంద్రియుడు కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి, ఆహారం మాని, వాయువే ఆహారంగా తపస్సు చేశాడు. కామాన్ని, కోపాన్ని జయించడానికి మౌనంగా, కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి అయ్యాడు. రాజైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడంటే దానికొక ప్రత్యేకమైన కారణముందనే అనాలి. ఎవరికైనా, ఎంత చేసినా కామ క్రోధాలు అనివార్యం. వాటిని తనకు వశపడేటట్లు చేసుకున్నవాడే ఉత్తముడు.

(వాసుదాస స్వామి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా).

2 comments:

  1. "వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం జపించే గాయత్రీ మంత్రమే. అదే ఆయన బ్రహ్మాస్త్రం."
    I heard that Gayathri Manthra is contributed by Vishwamithra. How come Vashistha practiced it without Vishwamithra telling him or he himself practicing it?

    ReplyDelete
  2. When you write something that you can't backup, you lose credibility in everything you write.

    ReplyDelete