Wednesday, October 4, 2023

సనాతన ధర్మ విజ్ఞాన సర్వస్వం మహాభారతం : వనం జ్వాలా నరసింహారావు

 సనాతన ధర్మ విజ్ఞాన సర్వస్వం మహాభారతం-మొదటి భాగం

ధర్మం ఉన్న చోటే విజయం-రెండవ భాగం  

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (04-10-2023) , (05-10-2023) 

సనాతన ధర్మ విజ్ఞాన సర్వస్వం మహాభారతం

వేదవ్యాసభగవానుడు మానవాళికి ప్రసాదించిన మహోన్నత ఇతిహాసమైన శ్రీమహాభారతం వైదిక పురాణాలు, ధర్మ, తత్వ, వేదాంత, న్యాయ సహా సకల శాస్త్రాల సమ్మిళితం. అనంతమైన భారతీయుల వైదిక జ్ఞానం, జీవన విధానానికి మూలం. సనాతన ధర్మానికి ప్రతీక. సనాతన ధర్మ శాస్త్ర విజ్ఞాన సర్వస్వం. లోకరీతిని వివిధ కోణాలలో వివరిస్తూనే, సానూన్య ధర్మాలనూ, విశేషధర్మాలనూ సోదాహరణంగా ఉపదేశించే ధర్మనీతి సంహిత. ధర్మసూక్ష్మాలను సూత్రీకరించే జాతీయ కావ్యం.

మహాభారతంలో అనేక సందర్భాలలో ధర్మం మీద సందర్భోచితంగా విజ్ఞానపరమైన చర్చలు కనిపిస్తాయి. ఇవి నిశితంగా విశ్లేసిస్తే సనాతన ధర్మ విచారణ అర్థం చేసుకోవచ్చు. ఆవేశంతో పరస్పరం విమర్శించుకున్నప్పటికీ, విమర్శ హేతుబద్ధంగా వుండాలనేది పౌష్యుడు, ఉదంకుడు ఒకరికొకరు ఇచ్చిన శాపాలే తార్కాణం. శిష్యరికానికి వచ్చిన శత్రువుకైనా విద్యాదానం చేయాలనే సనాతన ధర్మానికి ఉదాహరణ శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకున్న బృహస్పతి కుమారుడైన కచుడి వృత్తాంతం. వధూవరులిద్దరూ ఇష్టపడితే వివాహం చేసుకోవచ్చనే సనాతన ధర్మాన్ని తెలియచేసేదే దుష్యంతుడు, శకుంతలల గాంధర్వ వివాహం. కౌరవపాండవుల గురువులైన కృపాచార్య, ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతం కేవలం సనాతన ధర్మ విధానంలో భాగమే కాకుండా ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి (టెస్ట్ ట్యూబ్ బేబీ) వేదకాలంలో పడ్డ బీజం. కణికుడు దుర్యోధనుడికి బోధించిన రాజనీతి ధర్మం సనాతనమే, ఆధునికమే!

నారదుడు ధర్మరాజుకు రాజధర్మం గురించి చెప్పిన విషయాలన్నీ సనాతన ధర్మాలే. ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా అవి అన్వయిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉదాహరణలు చెప్పుకోవాలంట్: అధికార పక్షంలో ప్రయోజనాలు పొంది, దురాశా దురహంకారాలు పెంచుకుని, విపక్షాలతో చేరి, అధికార పక్షాన్ని బలహీనపరిచే వెన్నుపోటుదారులను కనిపెట్టి వుండమని నారదుడు ఆ కాలంలోనే హెచ్చరించాడు. యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయాలనే కుటుంబ పించను పథకం భారత కాలంలోనే వుండేదని, లంచగొండులైన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభువు అప్రమత్తుడై ఉండాలని నారద మహర్షి అప్పుడే సూచించాడు. అధికాహారోత్పత్తికి విత్తనాలు, ఆర్థికాభివృద్ధికి తక్కువ వడ్డీతో రుణాలు ప్రభువులు అప్పుడే ఇచ్చేవారని అర్థం చేసుకోవాలి.

ఆశ్రయించిన పావురాన్ని కూడా కాపాడడం ధర్మమని ఆత్మార్పణకు సిద్ధమైన శిబి చక్రవర్తి కథ; విద్య గురుముఖతః నేర్చుకుంటేనే శోభ అనే యవక్రీతుడి వృత్తాంతం; ఎదుటివారి బలాన్ని తెలుసుకోకుండా తన బలాన్ని ఎక్కువగా భావించడం అహంకారమని చెప్పే హనుమ-భీమ కలయిక; ఐశ్వర్య మదంతో ఇతరులను అవమానిస్తే కలిగే దుష్ఫలితం, దానం, పరోపకారం, సత్యం, అహింస అనేవి గొప్ప ధర్మాలేనని తెలియచెప్పే నహుషుడి వృత్తాంతం; మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడైన కౌశికుడికి తెలియచేసిన ధర్మ విశేషాలు; స్నేహితుల చెడు సలహాలు విని పరాభవం పాలైన దుర్యోధనుడి ఘోషయాత్ర; పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పే సతీ సావిత్రి వృత్తాంతం; పరస్త్రీ ద్రౌపదిని పరాభావిస్తే జరిగే అనర్ధాన్ని తెలియచేసే సైంధవుడి చర్య; ‘బిక్షాం దేహి అని అర్థించిన ఇంద్రుడికి సహజ కవచకుండలాలను దానం చేసిన కర్ణుడి దాతృత్వం; విశ్వసాహితీజగత్తులో నిరుపమానమైన యక్షప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు మొదలైనవన్నీ సందర్భానుసారంగా అన్వయించుకుని ఆచరించాల్సిన (సనాతన కాలం నాటి) ధర్మాలే.

అలాగే: అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాసానికి వెళ్లేముందు ధౌమ్యుడు పాండవులకు చెప్పిన సేవాధర్మాలు, ‘సామాన్య నియమావళి’, వృత్తి ధర్మ ప్రభోధ, ఎన్నటికీ ఆచరణ యోగ్యమైన సనాతన ధర్మాలే. ఉత్తర గోగ్రహణంలో, గెలుపు అనుమానమైతే సంధి మేలని దుర్యోధనుడికి భీష్ముడు ఇచ్చిన సలహా రాజనీతి ధర్మానికి తార్కాణం. విరాటరాజు పాచికతో ధర్మరాజును కొట్టగా, కారుతున్న రక్తపు చుక్కలు తన పైటతో ద్రౌపది ఆపిన సందర్భం ధార్మిక న్యాయానికి ప్రతీక. ఉత్తరను భార్యగా కాకుండా కోడలుగా స్వీకరిస్తానని అర్జునుడు చెప్పడం, విద్యాదానం చేసిన శిష్యురాలికి గురువు తండ్రి సమానుడని తెలియచేయడమే. ఇవన్నీ సందర్భానుసారంగా ఎప్పటికీ ఆచరించాల్సిన (సనాతన కాలం నాటి) ధర్మాలే.

దుర్యోధనార్జునులు శ్రీకృష్ణుడి సాయం కోరడం అంటే, యుద్ధం జరిగే నేపధ్యంలో స్నేహితుల, సన్నిహితుల సాయం అవసరమని తెలియచేయడమే. ద్రుపద పురోహితుడి, సంజయుడి, శ్రీకృష్ణుడి రాయబారాలు యుద్ధ, దౌత్యనీతిని బోధిస్తాయి. రాయబార పూర్వరంగంలో శ్రీకృష్ణుడు ద్రౌపదీ పాండవుల అంతరంగం తెలుసుకోవడం దూత ధర్మానికి నిదర్శనం. హస్తినలో ధృతరాష్ట్ర, దుర్యోధన, విదుర, కుంతీదేవి లను ముందుగా కలవడంతో సహా, రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం వరకూ దౌత్యవేత్తలు నేర్చుకునే ధర్మాలు అనేకం. కర్ణుడి జన్మరహస్యం చెప్పి పాండవులతో కలవమన్న శ్రీకృష్ణుడు, కుంతీదేవి అంతరంగ ఆవిష్కరణ, తిరస్కరించిన కర్ణుడి యజమాని పట్ల నిబద్ధత అనుపమానం. ఇవన్నీ సందర్భానుసారంగా అన్వయించుకుని, యుగయుగాలుగా ఆచరించాల్సిన సనాతన ధర్మాలే.

కురుపాండవ యుద్ధం తధ్యమని నిర్ణయం కాగానే, పాండవులు ధృష్టద్యుమ్నుడికి, కౌరవులు భీష్ముడికి సర్వసేనాధిపత్యం అప్పచెప్పడం, ఇరుపక్షాలవారు తమబలాన్ని, ఎదురివారి బలాన్ని అంచనావేయడం, అనాదిగా సాగుతున్న యుద్ధనీతి ధర్మమే. 18 రోజులపాటు జరిగిన యుద్ధంలో కౌరవ పక్షాన భీష్ముడి తరువాత ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామలకు సర్వసేనాధిపత్యం ఇవ్వడంలో దుర్యోధనుడి రాజధర్మం, రాజనీతి ప్రస్ఫుటం. 

యుద్ధ విషయాలను ధృతరాష్ట్రుడికి వివరించడానికి వేదవ్యాసుడు సంజయుడిని నియమించడ మంటే, మహాభారత కాలంలోనే ఇప్పటి ఆధునిక యుగంలో లాగా సరాసరి యుద్ధరంగం నుండే వార్తల సేకరణకు నాంది పలికినట్లు అర్థం చేసుకోవాలి. జగత్తులోని విశేషాలన్నీ సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించడం అంటే, సంస్కృత మహాభారత రచనా కాలం నాటికే భారతీయులకు భూ పరిజ్ఞానం వున్నదని, ఇతర దేశీయులకు అంతటి పరిజ్ఞానం లేదని, యుద్ధం జరగబోయే నేపథ్యంలో భూగోళ వర్ణన ప్రస్తావన తేవడానికి కారణం మహాభారతాన్ని సమకాలీన విజ్ఞాన సర్వస్వమని చెప్పడమేనని భావించాలి. ఇవన్నీ సనాతన ధర్మానికి ఎలా అన్వయించుకోవాలో అనేది, అర్థం చేసుకోవడం మీద ఆధారపడి వుంటుంది.

భీష్ముడిమీద కోపంతో యుద్ధంలో పాల్గొనని కర్ణుడిని యుద్ధరంగంలో చూసిన శ్రీకృష్ణుడు, భీష్ముడు మరణించే వరకు పాండవ పక్షంలో చేరి ఆయన మీద పగతీర్చుకోమని చమత్కారంగా చెప్పడం, కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు అవసరమనే శ్రీకృష్ణుడి దౌత్య, రాజనీతి, ధర్మానికి, చక్కటి ఉదాహరణ. తిరస్కరించడం కర్ణుడి స్వామిభక్తి, నిబద్ధత అనే ధర్మానికి నిదర్శనం.

ధర్మం ఉన్న చోటే విజయం

కురుపాండవ యుద్దారంభంలో అర్జున విషాదయోగం,  శ్రీకృష్ణుడి తత్త్వజ్ఞానోపదేశం (భగవద్గీత), అర్జునుడి అహంకార, మమకారాలను తొలగించి, క్షత్రియ ధర్మం యుద్ధమని చెప్పి, ఆత్మజ్ఞానం కలిగించి, ఆధ్యాత్మికతత్త్వం బోధించి, కర్తవ్యోన్ముఖుడిని చేయడం ధర్మాలలోకల్లా గొప్ప ధర్మం. అహర్నిశలూ ఆచరణయోగ్యమైన సనాతన ధర్మం.  

18 రోజులపాటు ఏకధాటిగా జరిగిన మహాభారత సంగ్రామంలో, ఒకతటి-రెండు సందర్భాలలో మినహాయించి, అదీ ఇరుపక్షాల వారి అంగీకారంతోనే, సూర్యాస్తమయం కావడంతోనే ఇరుపక్షాలు యుద్ధ విరమణ చేయడం అనే సనాతన ధర్మాన్ని నేటి ఆధునిక యుగంలో అనుసరిస్తే జరిగేది మంచే కాని చెడు కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో, ఇరుపక్షాలు పన్నిన ‘యుద్ధ వ్యూహాలు’ నేటి ఆధునిక యుద్ధాలలో, ‘ఆపరేషన్ ఫలానా...’ అంటూ వివిధ పేర్లతో పిలిచేవాటికి మూలం. సనాతన ధర్మం. వీటిలో అద్భుతమైన క్రౌంచ, గరుడ, అర్థచంద్రాకార, మొసలి (మకర), డేగాకార, మండల, వజ్ర, కూర్మ, శృంగాటక, సర్వతోభద్ర, అర్ధమండలాకార, పద్మ (చక్ర), దుర్జయ, త్రిముఖ వ్యూహాలున్నాయి. వీటి శాస్త్రీయతను అధ్యయనం చేస్తే మంచిది.

అభిమన్యుడి మరణానికి దుఃఖించిన ధర్మరాజుకు మృత్యువు తత్త్వాన్ని, మహాత్మ్యాన్ని, షోడశ రాజచరిత్రను వేదవ్యాసుడు చెప్పిన దాంట్లో అనేక ధర్మాలు ఇమిడి వున్నాయి. ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన ధర్మరాజు ఆడిన అబద్ధాన్ని, ప్రాణాలు కాపాడుకునే సమయంలో అసత్యం ఆడితే తప్పేమీ లేదంటూ శ్రీకృష్ణుడు సమర్ధిస్తాడు. కౌరవుల ఓటమి దరిమిలా, దుర్యోధనుడు తన చుట్టూ శూన్యం కావడం, తన యోధుల్లో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, ముగ్గురు మాత్రమే మిగలడం చూసి, ఏకాకిగా యుద్ధభూమినుండి తొలగి, ద్వైపాయనమనే కొలనులో సంస్తంభన విద్యతో దాక్కోవడం, బలహీన పడ్డప్పుడు వెనుకంజ వేసే ధర్మాన్ని తెలియచేస్తుంది. దుర్యోధనుడు శూరుడని, కొలనులో దూరడం ధర్మం కాదని, ఆయన అభిమానం ఎక్కడికి పోయిందని, యుద్ధంలో రాజులు వెనుకంజ వేయవచ్చా అని, ధర్మరాజు విసిరిన చివరి సవాలును స్వీకరించిన దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేయడం, ఓడిపోవడం ధర్మాధర్మ విచక్షణలో భాగాలే. సర్వసైన్యాద్యక్షుడైన అశ్వత్థామ పాండవుల సంతానానికి చెందిన గర్భాలన్నింటి మీద అస్త్రం వేసినప్పటికీ గురుపుత్రుడయినందున అర్జునుడు ధర్మబద్ధంగా వదిలిపెట్టాడు.

పట్టాభిషేకం అనంతరం, రాజ్యాన్ని పొందిన ధర్మరాజు, గాంధారీ, ధృతరాష్ట్ర, విదురులే రాజ్యానికి అసలైన ప్రభువులని చెప్పి, వారి అనుమతి తీసుకుని మాత్రమే పాలన సాగించాడు. ఇది పెద్దల పట్ల గౌరవం అనే ధర్మాన్ని సూచిస్తున్నది. ఇప్పుడు అది లేశమైనా కనపడదు. అంపశయ్యపై వున్న భీష్ముడు స్వర్గస్తుడైతే సర్వజ్ఞానాలైన, వేదం, వేదాంతాలు, తత్త్వ జ్ఞానాదులన్నీ ఆశ్రయరహితాలై అదృశ్యమై పోతాయని, అందువల్ల భీష్ముడి దగ్గరికి వెళ్లి, సమస్త ధర్మాలను తెలుసుకోవాలని ధర్మరాజుతో చెప్పి, వెంట తీసుకునివెళ్లి, ధర్మరాజుకు సమస్త సనాతన ధర్మాలను ఉపదేశించడానికి భీష్ముడిని నియమించాడు శ్రీకృష్ణుడు. ధర్మ వివేకాలతో కూడిన జ్ఞానాన్ని పొందడానికి ధర్మరాజాదులు వచ్చారని, వారికి జ్ఞానోపదేశం చేయమని, ధర్మార్థ కామ మోక్షాలను తెలియచేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు భీష్ముడికి.

భారతంలో శాంతి, ఆనుశాసనిక పర్వాలు చదివి, అర్థం చేసుకుంటే, ఆధునికతకు అన్వయించుకునే అద్భుతమైన సనాతన ధర్మాలన్నో అవగతమౌతాయి. ఉదాహరణలుగా కొన్ని చెప్పుకోవాలంటే: బ్రహ్మ నీతి శాస్త్రం, వైన్యుడి దండనీతి, వర్ణాశ్రమ ధర్మాల వివరాలు; బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా రాజ్యపాలన చేయడం; క్షత్రియోచిత ధర్మపాలనే రాజధర్మం; అమాత్యుడి గుణగణాలు; రాజధాని ఎలా వుండాలి; యుద్ధంలో సాహసం; ధర్మమార్గానువర్తనం, ఉపేక్ష అనే ఐదో ఉపాయం; నిజం చెప్పడం, అసత్యమాడక పోవడం; ధనార్జన మెలకువలు, మృదుత్వ నడవడి, ఆపద్ధర్మం; పాపాలన్నిటికీ మూలం పేరాశ; ఇంద్రియనిగ్రహం; ఆత్మాధీనమైన జీవితం; సృష్టి అంతా పంచభూతాత్మకం లాంటివి చాలా వున్నాయి.

ఆధ్యాత్మ యోగ విద్య, జప విధానం, దానిఫలితం, జ్ఞానయోగం; దైవధ్యాన పద్ధతి, మోక్షమార్గం, జ్ఞానం, విధి చేష్టలు; కృతాది యుగాల ప్రమాణాలు; వేదాల మీద భక్తి, స్మృతుల మీద విశ్వాసం, సదాచారం; అమృతత్వమైన తత్త్వజ్ఞానం; యోగ, సాంఖ్యశాస్త్రాల స్వరూపాలు; అక్షరం, క్షరం తత్త్వాలు, జీవతత్త్వ-పరతత్త్వాలు, విద్య-అవిద్యలు; నిష్కామత్వం, గృహస్థులకు అతిథిపూజ; కన్యాదానానికి అర్హత, గోదానం, భూదానం, విద్యా దానం, అన్నదానం, జల దానం; అపరిగ్రహం, అహింస తీరుతెన్నులు లాంటి సమస్త సనాతన ధర్మాలను ధర్మరాజుకు ఉపదేశించి భీష్ముడు నిర్యాణం చెందాడు.

సనాతన ధర్మం స్వరూపం తెలిసినవారు మాత్రమే దాన్ని గురించి విశ్లేషించగలరని, కాల పరిణామం వల్ల, పరిశీలాత్మకమైన సూక్ష్మబుద్ధి లేనందువల్ల, ధర్మం స్పష్టతను కోల్పోయి, అధర్మం ధర్మమనే భావన కలిగిస్తుందని, ధర్మం దారితప్పుతుందని, తద్వారా దోషం ఏర్పడుతుందని చెప్పాడు భీష్ముడు. సనాతన ధర్మ సూక్ష్మం తెలియని వారి మాటలు ప్రమాదకరమైనవని అప్రమత్తంగా వుండాలని ఎప్పుడో, ఏనాడో భీష్ముడు చెప్పిన మాటలు సదాస్మరణీయం. ఇదిలావుండగా సెప్టెంబర్ 17, 2023న జాతీయ సమైక్యతా దినోత్సవంసందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తన సందేశంలో, మహాభారతంలో 11 సార్లు వచ్చే శ్లోకంలోని 'యతో ధర్మస్తతో జయః' (ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది) అనే వాక్యాలతో ముగించడం విశేషం.  అందుకే, సముద్రంలో అగాధాలకన్నా సనాతన ధర్మం ఎన్నో రెట్లు లోతైనది.

No comments:

Post a Comment