Monday, August 31, 2026

యుద్ధభూమిలో నాలుగు రోజులు (18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామం-4) : వనం జ్వాలా నరసింహారావు

 యుద్ధభూమిలో నాలుగు రోజులు

(18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామం-4)

వనం జ్వాలా నరసింహారావు

భక్తిపత్రిక సెప్టెంబర్ నెల, 2026 సంచిక

(కురుక్షేత్ర యుద్ధంలో మొదటిరోజు గీతా ప్రవచనం కొనసాగింది. రెండోరోజున అర్జునుడి ధాటికి కురుక్షేత్రం కంపించి పోయింది. అతడి అస్త్ర ధాటికి కౌరవ సేనలు నిలువలేకపోయాయి. అది చూసిన భీష్ముడు, దుర్యోధనుడి కోరిక మేరకు మూడోరోజున వీరవిహారం చేశాడు. అర్జునుడి రథసారధి అయిన శ్రీకృష్ణుడిని సైతం భీష్ముడు అనేక విధాలుగా బాణాలతో నొప్పించాడు. దాంతో శ్రీకృష్ణపరమాత్మ చక్రాన్ని ధరించి, భీష్ముడికి లంఘించాడు. కానీ అర్జునుడి కోరిక మేరకు వెనుదిరిగాడు. ఆ తరువాత....

కురుక్షేత్రంలో నాలుగో రోజు యుద్ధం కొనసాగుతుండగా, ఒకింత విజయోత్సాహంతో కౌరవ సేన సింహనాదాలు చేస్తున్నప్పుడు, అది గమనించిన ఘటోత్కచుడు, మాయా యుద్ధానికి సమయం ఆసన్నమైందని భావించాడు. వెంటనే విజృంభించి తన బాణాలతో దుర్యోధనుడిని, భగదత్తుడిని నొప్పించాడు. భీష్మద్రోణాదులు ఘతోత్కచుడికి, దుర్యోధనుడికి మధ్యగా చేరి, అతడి మీద బాణాలు ప్రయోగించారు. ధర్మరాజుతో సహా పాండవులు, ద్రుపదుడు, విరాటుడు కౌరవులమీద బాణవర్షం కురిపించారు.

అలా ఘోర యుద్ధం జరిగింది. కౌరవ సేనల చీకాకును, దీనావస్థను గమనించిన భీష్ముడు, ఆ సమయంలో ఘతోత్కచుడితో యుద్ధం చేయడానికి మనస్సు అంగీకరించడం లేదన్నాడు. అప్పటికే సూర్యుడు అస్తమించాడని, ఆ రోజుకు యుద్ధాన్ని విరమించి మర్నాడు ఉదయం ప్రారంభించడం మంచిదని ద్రోణుడితో అన్నాడు. ద్రోణుడు అంగీకరించాడు. కౌరవసేనలు యుద్ధం విరమించి వెనుకంజ వేయగా పాండవ సేనలు సంతోష తన్మయత్వంతో సింహనాదాలు చేసి ఉత్సాహాన్ని ప్రకటించాయి. దుర్యోధనాదులు చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు. ఘటోత్కచుడిని ప్రశంసిస్తూ పాండవ సేనలు తమ శిబిరాలకు వెళ్ళాయి.

నాలుగోనాటి యుద్ధం ముగిసిన తరువాత ఆ రాత్రి దుర్యోధనుడు, ‘పాండవులు భీష్ముడిని, ద్రోణుడిని, శల్యుడిని ఇతర శూరులను ఏమాత్రం లెక్క చేయక పోవడానికి, విజృంభించడానికి గల కారణం ఏమిటని’ భీష్ముడిని ప్రశ్నిచాడు. జవాబుగా భీష్ముడు, ‘నీకు ఇదివరకే చెప్పాను. పాండవులకు శ్రీకృష్ణుడు బాసటగా ఉన్నంత కాలం వారు సాధించలేనిది ఏదీ వుండదు. శ్రీకృష్ణుడు పరమాత్మ అవతారం. అతడిని తెలుసుకోగల వారికి విపత్తులు రావు. పాండవులకు అతడి మహాత్మ్యం తెలుసు. వారు అతడి శరణు పొందారు. నువ్వు శ్రీకృష్ణుడిని లెక్కచేయవు. నరనారాయణులతో (అర్జునుడు, శ్రీకృష్ణుడు) శత్రుత్వం వద్దని నిన్ను మహా మునులు వారించారుకదా? నువ్వు మదాంధుడివై శత్రుత్వాన్ని మానలేదు. ఇకనైనా శ్రీకృష్ణుడిని ఆశ్రయించి పాండవులతో పొత్తు పెట్టుకుని బతుకుఅని హెచ్చరిస్తూ అన్నాడు. దుర్యోధనుడు ఎప్పటి మాదిరిగానే భీష్ముడి మాటలను నిర్లక్ష్యం చేశాడు.  

అయిదోరోజు యుద్ధం    

మహాభారత యుద్ధంలో అయిదోరోజున పొద్దు పొడవగానే భీష్ముడి నాయకత్వంలో కౌరవ సేనలు యుద్ధానికి సన్నద్ధమై వెళ్లాయి. కౌరవ సేన ఆనాడు మొసలి (మకర) వ్యూహంగా ఏర్పడింది. పాండవ సేన డేగ ఆకారంగా ఏర్పడింది. పాండవ వ్యూహంలో భీముడు ముఖ స్థానంలో, ధృష్టద్యుమ్నుడు, శిఖండి రెండు కన్నులుగా, సాత్యకి తలగా, అర్జునుడు కంఠస్థానంలో, విరాట, ద్రుపదులు ఎడమ రెక్కగా, కేకయులు కుడి రెక్కగా, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు వీపున, నకుల సహదేవులు, ధర్మరాజు తోక భాగాన నిలిచారు. ఉభయ సేనలు ఢీకొన్నాయి. భీముడు మకరవ్యూహంలోకి ప్రవేశించి, భీష్ముడిని అమ్ముల గుంపుతో కప్పివేశాడు. భీష్ముడు అగ్గిలాగా ప్రజ్వలించి, పాండవ సేనను చీకాకు పరచాడు. అప్పుడు అర్జునుడు వచ్చి భీష్ముడిని ఎదుర్కొన్నాడు.

అదే సమయంలో దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికిపోయి, భీష్మద్రోణులు పాండవులను ఉపేక్షిస్తున్నారని ఆరోపించాడు. తమ శక్తి ఆపాటిదే అని ముక్తసరిగా జవాబిచ్చాడు ద్రోణుడు. దుర్యోధనుడికి మాటలకు నొచ్చుకున్న ద్రోణుడు కౌరవసేనను దాటి ముందుకు రాగా, సాత్యకి విజృంభించి ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. భీముడు సాత్యకికి తోడురాగా, భీష్ముడు, శల్యుడు ద్రోణుడికి సాయం చేయడానికి వచ్చారు. భీముడికి బాసటగా ద్రౌపదీ సుతులొచ్చారు. అప్పుడు శిఖండి తన మీదికి రావడం చూసిన భీష్ముడు, ‘ఒక ఆడదానితో యుద్ధం చేస్తానా?’ అని భావించి, అక్కడినుండి తొలగిపోయాడు. ఇది గమనించి ద్రోణుడు శిఖండిని మరలించాడు. భీముడు, భీష్ముడు తమ-తమ సేనలకు నాయకత్వం వహించారు. సమయం చూసి దుర్యోధనుడు భీముడిని ఎదుర్కొన్నాడు. ఆయనకు మద్దతుగా తమ్ములు చేరారు. అర్జునుడు మల్లీ విజృంభించాడు. కౌరవ సైన్యం వెనుకకు మరలింది. దుర్యోధనుడు వారికి ధైర్యం చెప్పగా, దుశ్శాసనుడు ఆర్జునుడిని, భీముడిని ఎదుర్కొన్నాడు.

ఇరు పక్షాల వీరాధివీరులైన ధర్మరాజు, ధృష్టద్యుమ్నుడు, విందానువిందులు, సైంధవుడు, భీముడు, వికర్ణుడు, సహదేవుడు, శిఖండి, దుర్యోధనుడు, విరాటుడు, ద్రోణుడు మొదలైన వారు ఒకరినొకరు ఢీకొన్నారు. పోరు భీకరంగా సాగింది. భీముడి పోరాటం భయంకరంగా మారడంతో భీష్ముడు విజృంభించాడు. ఒకరినొకరు బాణాలతో నొప్పించుకున్నారు. ఇంతలో సాత్యకి రంగ ప్రవేశం చేశాడు. భీష్ముడు సాత్యకి సారథి తలను తుంచడంతో సాత్యకి ఆపదలో పడ్డాడని, ఆదుకోమని పాండవ సేనలో అరుపులు వినపడ్డాయి. విరాటుడు, భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆర్జునుడిని అశ్వత్థామ ఢీకొన్నాడు కాసేపు. అప్పుడు అశ్వత్థామ కవచాన్ని ఛేదించి అర్జునుడు వేరే దిక్కు యుద్ధానికి పోయాడు. భీమ దుర్యోధనులు భీకరమైన పోరాటం చేశారు.

చిత్రసేనుడు, భీష్ముడు దుర్యోధనుడికి తోడు రాగా వారితో అభిమన్యుడు తలపడి, విజృంభించి కౌరవసేనను బాదిస్తుంటే, లక్ష్మణకుమారుడు ఎదుర్కొన్నాడు. కాసేపటికే అభిమన్యుడి బాణాల ధాటికి తట్టుకోలేని లక్ష్మణకుమారుడి దేహం తూట్లుపడగా, కృపుడు అతడిని తన రథం మీద ఎక్కించుకుని అక్కడినుండి తప్పించాడు. యుద్ధం అన్ని దిక్కులా కొనసాగుతున్నప్పుడు సాత్యకి విజృంభణను చూసిన భూరిశ్రవుడు అతడిని వెనక్కు మరలించాడు. ఆ తరువాత భూరిశ్రవుడు మీద యుద్ధానికి దిగిన సాత్యకి పది మంది కొడుకులను అతడు సంహరించాడు. కోపంతో మళ్లీ యుద్ధానికి వచ్చిన సాత్యకి, భూరిశ్రవుల మధ్య ఘోరమైన పోరు జరిగింది. ఇద్దరూ విరథుయ్యారు. నేలమీద దిగి కత్తులతో యుద్ధం చేశారు. అప్పుడు సాత్యకిని భీముడు, భూరిశ్రవుడిని దుర్యోధనుడు తమ రథాల మీద ఎక్కించుకుని తీసుకుపోయారు.

ఇంతలో పొద్దు కుంకే సమయం దగ్గర పడింది. శత్రువులు యుద్ధం విడిచి శిబిరాలకు వెళ్లిపోతారని భావించిన అర్జునుడు కౌరవ రథికుల మీద మంత్ర బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు కౌరవ సైనికులను సంహరించడం చూసిన భీష్ముడు సహించలేక పాతికవేల రథాలను పోరాటానికి ప్రోత్సహించాడు. వారంతా ఆర్జునుడిని ఎదుర్కున్నారు. కాని అవన్నీ అర్జునుడి బాణాలకు ఆహుతయ్యాయి. కౌరవసేన అతిశయం అణగారిపోయింది. సూర్యరశ్మి తగ్గి, సూర్యుడు పడమటి కొండమీద మెరుస్తూ దర్శనమిచ్చాడు. ఉభయ సైన్యాల సేనలు కాగడాల కాంతులలో తమ తమ విడిదులకు చేరారు. రాత్రుల్లో కురు పాండవ పక్షాలకు సంబంధించిన భటులు హృదయానికి ఆనందం కలిగించే సంగీత సభలలో, సాహిత్య గోష్టులలో కాలక్షేపం చేస్తుండేవారు.

ఆరోరోజు యుద్ధవిశేశాలు

తెల్లవారేసరికల్లా అర్జునుడి ఆలోచనకు అనుగుణంగా పాండవ సేనానాయకుడు ధృష్టద్యుమ్నుడు మకరవ్యూహం తీర్చిదిద్దాడు. ద్రుపదరాజు తలగా, నకులసహదేవులు కన్నులుగా, భీముడు నోరు చివరగా, అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు, ఘటోత్కచుడు కపోలాలుగా, సాత్యకితోపాటు ధర్మరాజు కంఠం దగ్గర నిలుచున్నారు. ధృష్టద్యుమ్నుడితో పాటు విరాటరాజు వెన్నుదగ్గర, కేకయరాజులు ఎడమపక్కగా, ధృష్టకేతుడు, కరూశరాజు కుడిపక్కగా, కుంతిభోజుడు, శతానీకుడు మొల దగ్గర, శిఖండి, ఇరావంతుడు తోకదగ్గర నిలుచున్నారు.

భీష్ముడు పన్నిన క్రౌంచవ్యూహంలో అతడు, ద్రోణుడు ముక్కు దగ్గర, కృపుడు, అశ్వత్థామ కన్నులుగా, శిరస్సు దగ్గర కృతవర్మ, కాంభోజుడు, బాహ్లికుడు, శూరసేన రాజుతో పాటు దుర్యోధనుడు కుత్తుక దగ్గర, వక్షం దగ్గర సౌవీర రాజుతో సహా భగదత్తుడు, వీపున విందుడు, అనువిందుడు, ఎడమ పక్కన సుశర్మ, కుడి పక్క యవనరాజు నిలిచారు. వెనుకగా శ్రుతాయువుతో కలిసి భూరిశ్రవుడు నిలిచాడు. కౌరవ సేన, పాండవ సేన యుద్ధానికి సమాయుత్తమై యుద్ధం మొదలవగానే భీముడు తన రథాన్ని ద్రోణుడు వున్న దిక్కుగా నడిపించాడు. అతడి ధాటికి ఎదురు నిలువలేక కౌరవ వీరులు వెనక్కు పారిపోసాగారు. భీముడు ద్రోణాచార్యుడి సారథిని చంపాడు. సారథి లేనందున స్వయానా తన రథాన్ని నడుపుతూ యుద్ధం చేస్తున్న ద్రోణుడికి భీష్ముడు సాయంగా వచ్చాడు.

భీముడు విజృంభించినందువల్ల కౌరవసేనకు విపరీతంగా నష్టం జరిగింది. ఆ సమయంలో తనకు చిక్కిన దుర్యోధనుడి పన్నెండు మంది తమ్ములను (దుశ్శాసనుడితో సహా) ఏక కాలంలో ఎదుర్కొన్నాడు భీముడు. వారంతా చతురంగ బలాలతో భీముడిని చుట్టుముట్టారు. భీముడు ఆనందంతో, తనకేదో మంచి అవకాశం దొరికినట్లుగా భావించి, రథం మీద నుండి కిందకు దూకాడు. భీముడు రణరంగంలో కౌరవ కుమారులమీద వీరవిహారం చేశాడు. భీముడి ధాటికి ఎదురులేకపోయింది. అటువైపుగా వచ్చిన ధృష్టద్యుమ్నుడు, భీముడు రథం మీద లేకపోవడం చూసి, భీముడికి తోడుగా వచ్చాడు. కౌరవ రాకుమారులంతా కలిసి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు.

ధృష్టద్యుమ్నుడు తనకు ద్రోణుడు ఉపదేశించిన ‘ప్రమోహనబాణంప్రయోగించి రాజకుమారులను మూర్ఛపోయేట్లు చేశాడు. అదే సమయంలో ద్రోణుడు ద్రుపదుడిమీద విజృంభించాడు. ద్రుపదుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ద్రోణుడప్పుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి మోహనబాణం శక్తిని పోగొట్టాడు. కౌరవ రాజుకుమారులు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించారు. దొమ్మియుద్ధంలో భీముడు కింద వుండరాదని అంటూ ధృష్టద్యుమ్నుడు అతడిని కేకయరాజు రథం మీద ఎక్కించాడు. ఈ లోపున ద్రోణుడు విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడి ధనుస్సు ఖండించాడు. సారథిని చంపాడు. మరో సారథి తెచ్చిన రథాన్ని ఎక్కాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణ, ధృష్టద్యుమ్నుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది.

మరో పక్క భీముడికి, దుర్యోధనుడికి మధ్య యుద్ధం జరిగింది. దుర్యోధనుడికి తోడుగా ఆయన తమ్ములు వచ్చారు. అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, ధృష్టకేతుడు, కేకయులు, భీముడికి అండగా వచ్చారు. అంతా కలిసి కౌరవ రాజకుమారులమీద విజృంభించారు. వారి ధాటికి కౌరవ రాజకుమారులు తట్టుకోలేకపోయారు. పారిపోయారు. దుర్యోధనుడు భీముడితో భయంకరమైన యుద్ధానికి దిగాడు. భీముడికి సాయంగా వచ్చిన ద్రౌపది కొడుకులు దుర్యోధనుడి మీద బాణాలు ప్రయోగించి, నొప్పించి, తరిమివేశారు.

ఇంతలో భీష్ముడు శత్రుసేనలో ప్రవేశించి పాండవ సేనను చెదరగొట్టగా అర్జునుడు అతడి ఎదుర్కొన్నాడు. ఇదిలా వుండగా భీముడు, ఎలాగైనా అదేరోజున దుర్యోధనుడిని చంపాలన్న కోరికతో, దుర్యోధనుడిని ఎదుర్కొని, అతడి రథాశ్వాలను, సారథిని చంపి, దుర్యోధనుడి విల్లు విరిచాడు. మరిన్ని బాణాలను వేయడంతో దుర్యోధనుడు మార్చపోయి, స్పృహతప్పి పడిపోయాడు. మూర్ఛిల్లిన దుర్యోధనుడిని కృపాచార్యుడు తన రథం మీద ఎక్కించుకుని వెళ్లాడు. ఆ సమయంలో భీముడి మీదికి వచ్చిన జయద్రథుడిని అభిమన్యాదులు ఎదుర్కొన్నారు భీకరంగా. కౌరవ కుమారులు తిరిగొచ్చి ద్రౌపదీ తనయులతో పోరాడారు. ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానీకుడు పరాక్రమం ప్రదర్శించి విజృంభించాడు. కేకయ దేశాదిపతులు, ద్రుపదుడు అతడికి తోడుగా నిలబడ్డారు. సూర్యాస్తమయం కాబోతున్న తరుణంలో భీష్ముడు ప్రళయకాల యముడిలాగా విజృంభించి పాండవుల వ్యూహాన్ని చీల్చి, తన సేనలను ఉపసంహరించి విడిదులకు పొమ్మని ఆదేశించాడు. ఆ రోజుకు యుద్ధ విరమణ జరిగింది.

ఏడోరోజు విశేషాలు

ఉదయాన్నే భీష్ముడు యుద్ధరంగాన్నంతా వ్యాపించే విధంగా ‘మండలవ్యూహాన్ని’ ఏర్పాటు చేశాడు. దాని మధ్యభాగాన దుర్యోధనుడున్నాడు. అతడి తమ్ములు, అతడికి సాయపడే రాజులు ఇరుపక్కలా నిలిచారు. అప్పుడే యుద్ధరంగానికి వచ్చిన పాండవులు ఆ వ్యూహాన్ని తేరిపార చూశారు. ధర్మరాజు ఆదేశానుసారం సేనాపతైన ధృష్టద్యుమ్నుడు ‘వజ్రవ్యూహాన్ని’ ఏర్పాటు చేశాడు. ద్రోణుడు విరాటుడిని, అశ్వత్థామ శిఖండిని, ధుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, శల్యుడు నకుల సహదేవులను, విందానువిందులు యుధామన్యుడిని, పలువురు రాజులు అర్జునుడిని ఎదుర్కున్నారు. అలాగే భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేనుడిని, దుశ్శాసనుడిని, వికర్ణుడిని, ఘటోత్కచుడు భగదత్తుడిని, సాత్యకి అలంబసుడిని, ధృష్టకేతుడు భూరిశ్రవుడిని, చేకితానుడు కృపాచార్యుడిని, ధర్మరాజు శ్రుతాయువుని, చాలా మంది రాజులు భీష్ముడిని ఎదిరించారు.

(వాస్తవానికి, క్రితం నాటి రాత్రి భీష్ముడితో దుర్యోధనుడు, కౌరవులు ఎంత పూనికగా వ్యూహం పన్నుతూ ముందుకు సాగుతున్నా పాండవ సేన దానిని నాశనం చేస్తున్నదని, భీష్ముడు చూస్తుండగానే భీముడి చేతుల్లో తాను భంగపడ్డానని, భీష్ముడి అండతో పాండవులను గెలుస్తానన్న ఆశ తనకు వుండేదని, దాన్ని ఆయన తప్పగొట్టుతున్నాడని, భీష్ముడు దేవతలను కూడా జయించగల పరాక్రమవంతుడని, అయినా యుద్ధరంగంలో పాండవులు అంత పరాక్రమవంతులు కావడానికి కారణం ఏమిటని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు నవ్వి, తనను అలా అనడం భావ్యం కాదని, తాను యుద్ధంలో తన శరీరం దాచుకోలేదని, పాండవులు ఎప్పటికీ జయింపరానివారే అని పలుమార్లు చెప్పానని, అయినప్పటికీ తాను దుర్యోధనుడే జయించాలన్న ఉద్దేశంతో ఒళ్లు దాచుకోకుండా యుద్ధం చేస్తానని, దుఃఖపడవద్దని చెప్పాడు).

కౌరవ రాజులు ఒక్కసారిగా విజృంభించి కృష్ణార్జునులను బాణ వర్షంలో ముంచివేయగా, అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ధాటికి కౌరవ సేనలు భీష్ముడి చాటుకు పారిపోయారు. దుర్యోధనుడి ప్రోద్బలంతో రాజులంతా అర్జునుడి మీద యుద్ధం చేస్తున్న భీష్ముడికి అండగా నిలిచారు. ద్రోణుడికి, విరాటుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువురు భీకరంగా పోరాడారు. ద్రోణుడి బాణాల దెబ్బకు విరాటుడు భయంతో పరుగెత్తాడు. ఇంకో పక్క శిఖండికి, అశ్వత్థామకు మధ్య పోరు జరిగింది. మరోవైపున ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు కూడా అతడి మీద బాణాలు వేశాడు. విల్లు విరిగిన దుర్యోధనుడిని శకుని తన రథంలో ఎక్కించుకుని పోయాడు. సాత్యకి, అలంబసుల మధ్య జరిగిన యుద్ధంలో సాత్యకిది పైచేయి కాగా అలంబసుడు భయపడి పారిపోయాడు. సాత్యకి కురుసైన్యం మీద ఉరికాడు.

భీముడికి, కృతవర్మకు జరిగిన యుద్ధంలో గాయపడ్డ కృతవర్మ వృషకుడి రథం మీద వెళ్లాడు. యుధామన్యుడు విజృంభించి విందానువిందుల మీద బాణాలు గుప్పించి, అనువిందుడి రథాన్ని నుగ్గు చేశాడు. ఇంతలో, భగదత్తుడి ఏనుగు విజృంభించి పాండవుల సేనను చిందరవందర చేస్తుంటే, ఘటోత్కచుడు దానిని ఆపాడు. భగదత్తుడికి, ఘటోత్కచుడికి జరిగిన యుద్ధంలో తనది పైచేయి కాగా, మళ్లీ ఏనుగును పురికొల్పాడు భగదత్తుడు. శల్యుడికి, నకులసహదేవులకు మధ్య జరిగిన యుద్ధంలో శల్యుడు మూర్ఛపోగా అతడి సారథి రథాన్ని యుద్ధభూమి నుండి అవతలకు తోలుకుని పోయాడు. అదే సమయంలో ధర్మరాజు శ్రుతాయువు మీద బాణాలు వేశాడు. ధర్మరాజు విజృంభించగా కౌరవ సైన్యం చిందరవందరైంది.

No comments:

Post a Comment