Tuesday, January 10, 2012

“తెలంగాణ మార్క్సిస్టు సవ్యసాచి” ఖమ్మం జిల్లా రావెళ్ల సత్యం: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

సుమారు ఐదు దశాబ్దాల అనంతరం రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో జరుపుకునే ఏర్పాట్లలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తలమునకై వుంది.
ఖమ్మం జిల్లాలో (1964 లో) మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించిన తరువాత, పార్టీ పరంగా, బహు ప్రజా సంఘాల, రాష్ట్ర స్థాయి-అఖిల భారత స్థాయి మహాసభలు నిర్వహించినప్పటికీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా వున్న రోజుల్లో నిర్వహించిన రాష్ట్ర మహాసభలు తప్ప ఇంతవరకూ సిపిఐ(ఎం) ఒక్క సారికూడా రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరుపుకోలేదు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాముఖ్యత సంతరించుకున్న ఇతర సభలు ఎన్నైనా పేర్కొనవచ్చు. రాష్ట్ర ఎస్.ఎఫ్.. రెండో మహా సభలు ఖమ్మంలో 1967 జనవరి 2-7 తేదీలలో జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ కార్మిక మహా సభలు 1980 నవంబర్ లో జరిగాయి. ఆ నాటి పశ్చిమ బెంగాల్ రెవెన్యూ మంత్రి బినయ్ కృష్ణ చౌదరి, సుందరయ్య, కేరళ నుండి చాతున్నిమాస్టర్ హాజరయ్యారు. 1977 ఆగస్టులో యు.టి.ఎఫ్ రెండవ రాష్ట్ర మహా సభలు జరిగాయి. ఆ నాటి కేంద్ర విద్యామంత్రి ప్రకాశ్ చంద్ర చందుర్ హాజరయ్యారు. 1985 ఏప్రిల్ లో రాష్ట్ర ప్రజా నాట్య మండలి తృతీయ మహా సభలు జరిగాయి. రాష్ట్ర రైతు మహా సభలు 1986 ఏప్రిల్‍లో జరిగాయి. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బసు, బసవ పున్నయ్య హాజరయ్యారు. 1989 ఏప్రిల్ లో అఖిల భారత రైతు మహా సభలు పెద్ద ఎత్తున జరిగాయి. కేరళ ముఖ్య మంత్రిగా వున్న ఇ. కె. నాయనార్ హాజర్ అయ్యారు. 1996 నవంబర్ 2-4 తేదీలలో నాలుగవ అఖిల భారత వ్యవసాయ కార్మిక మహా సభలు ఖమ్మంలో జరిగాయి. ఈ విషయాలన్నీ సిపిఎం పార్టీ నుంచి ఎన్నికైన మాజీ రాజ్యసభ సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమ నాయకుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవిత చరిత్ర (ప్రచురణకు సిద్ధంగా వున్న) "అనుభవాలే అధ్యాయాలుగా" లో విపులంగా పేర్కొనడం జరిగింది. పలు సభలకు ఆహ్వాన సంఘ అధ్యక్షుడుగా నో, అనువాదకుడుగా నో, కీలక నిర్వాహకులలో ఒగరుగానో డాక్టర్ హాజరయ్యారు.
జిల్లా-రాష్ట్ర వ్యాప్తంగా రైతు-కూలీ ఉద్యమాలకు, గ్రామాలలో భూస్వాముల వ్యతిరేక పోరాటాలకు, ఆరణాల కూలీలకు-అధిక వడ్డీలకు-మేరల పెంపుకు-కుల వివక్షతలకు-దళిత-వెనుకబడిన వర్గాల ఐక్య ఉద్యమాలకు, పౌరహక్కుల ఉద్యమాలకు, ప్రభుత్వ మాన్యాలను-బంచరాయి భూములను పేదల స్వాధీనం చేసే ఉద్యమాలకు  ఏనాడో దూరమైన కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), ఒక్క సారి ఆ ఉద్యమ స్పూర్తి దాయకులైన ఖమ్మం జిల్లా వారిని కొందరినైనా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మంచిదేమో!
మార్క్స్-లెనిన్ నీతి సూత్రాలను నిబద్ధతతో పాటిస్తూ, వాటిని అమలు పెట్టడంలో స్థిర చిత్తుడుగా వుంటూ, ఎటువంటి బెదిరింపులకు-బలప్రయోగాలకు లొంగకుండా, ఆజన్మాంతం మంచి కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న అరుదైన వ్యక్తి ఖమ్మం జిల్లా గోకినేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ రావెళ్ల సత్యం. అనుక్షణం బీదా-బిక్కీ మధ్య మెదలాడుతూ, తెల్లటి ముతక బట్టల పంచె-అంగీ-పైన తెల్ల పచ్చ గళ్ల కండువా ధరించిన, ఒంటి చేతి చెట్టంత ఎత్తు పెద్దమనిషి సత్యం గారు. తన చిన్నతనంలో మామిడి చెట్టు ఎక్కి కిందపడినప్పుడు, చేతికి తగిలిన తీవ్రమైన దెబ్బ మూలాన, కుడి మోచేతి వరకు తొలగించాల్సి వచ్చింది. అలా ఒంటి చేత్తోనే, మరణించేంతవరకు, సవ్యసాచిలా కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని ఖమ్మం జిల్లాలో సమున్నతంగా నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. పన్నెండేళ్ల వయసులో, పొరుగూరు కమలాపురంలో వున్న బాబాయి వనం నరసింగరావును కలవడానికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా, రావెళ్ల సత్యంను, 1959 సంవత్సరంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చూడడం తటస్థించింది. ఆ తరువాత పరిచయం చేసుకున్నాను కొన్నాళ్లకు. ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకునే ప్రక్రియలో భాగంగా ప్రచారం కొరకు చుట్టుపక్కల గ్రామాలలో తిరుక్కుంటూ అక్కడకొచ్చారాయన. అప్పట్లో "జోడెద్దుల" కాంగ్రెస్ గుర్తుకు, "చేతి" గుర్తున్న కమ్యూనిస్టులకు మధ్యనే ప్రధాన పోటీ. అల నాడు ఆయన ప్రచారం చేసిన కమలాపురం గ్రామంలో, కమ్యూనిస్టు అభ్యర్థుల మీద పోటీ చేసిన బడా భూస్వాములకు సైతం ఒక్క టంటే ఒక్క ఓటు కూడా పడని వార్డులున్నాయంటే, అది రావెళ్ల సత్యం గొప్పదనంగానే భావించాలి.

1959 నాటికి స్వాతంత్ర్యం వచ్చి పన్నెండేళ్లు అయింది. ఐనా, ఓటర్ల జాబితాలో, మహాత్మా గాంధీ ఆశయమైన హరిజనోద్ధరణకు విరుద్ధంగా, దళితుల పేర్ల చివర "గాడు" చేర్చేవారు. "పుల్లిగాడు" సన్ ఆఫ్ "మల్లి గాడు" అని వుండడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ముఖ్యుడు రావెళ్ల సత్యం. బహుశా ఆయన లాంటి వారు చేసిన ఉద్యమ ఫలితంగానే, దరిమిలా పేర్ల చివర "గాడు" తగిలించడం మానుకుంది ప్రభుత్వం. రావెళ్ల సత్యం కృషి ఫలితంగా ఖమ్మం సమితి కింద వున్న అనేక గ్రామాలలో కమ్యూనిస్టు అభ్యర్థులు గెలుపొందడం, పంచాయితీ సమితిని పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది. అదనంగా మెరికలలాంటి కార్యకర్తలను కూడా తయారుచేయగలిగారాయన. ప్రగల్భాలను, దూషణ-భూషణలను, పదవీ వ్యామోహాలను, ధన దాహాలను దరికి రానీయని ఈ నిష్కళంక కమ్యూనిస్టు యోధుడు, పుచ్చలపల్లి సుందరయ్యకు ప్రియ శిష్యుడు.

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినేపల్లి గ్రామం సాయుధపోరాట కమ్యూనిస్టు వీరులకు, స్వాతంత్ర్య సమరయోధులకు పుట్టిల్లు. స్వర్గీయ మచ్చా వీరయ్య లాంటి కామ్రేడ్స్ నాయకత్వంలో ఆ గ్రామానికి చెందిన అనేకమంది కార్యకర్తలు వీర తెలంగాణ విప్లవ సాయుధ తిరుగుబాటులో పాల్గొని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా-రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. అలా పోరు సలిపినవారిలో రావెళ్ల సత్యం ఒకరు. వీర తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రపుటల్లో చిర స్థాయిగా నిలిచింది. నూనూగుమీసాల లేత వయసులోనే, వైవాహిక బంధాన్ని కూడా లెక్క చేయకుండా, వున్న ఒక్క చేతితో తుపాకి పట్టుకుని, బుల్లెట్లు సంధించిన థీశాలి రావెళ్ల. 1945-1946 మధ్య కాలంలో, ఉర్దూలో ప్రాధమిక విద్యాభ్యాసం ముగించుకున్న రావెళ్ల సత్యం, ఇతరులకు సహాయపడేందుకు, తన ఇంటి ఆవరణలోని పశువుల పాకలో ఒక పాఠశాలను నిర్వహించేవారు. చివరకు అదే కమ్యూనిస్టు పార్టీకి అడ్డగా మారింది. అలా ఆరంభమైన ఆయన కమ్యూనిస్టు జీవన యానం, 1945-1948 మధ్య కాలంలో, పొరుగునున్న కృష్ణా జిల్లా మలకాపురం సరిహద్దు కాంపుకు చేరుకుని, సమరయోధుడుగా శిక్షణ పొంది, పై కమిటీ ఆదేశాల మేరకు అజ్ఞాతవాసానికి పోయేటట్లు చేసింది. అజ్ఞాతంలో వుండగానే కృష్ణా జిల్లా సరిహద్దులో అరెస్టు కాబడి, మద్రాస్ రాష్ట్రంలోని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. జైల్లో, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, మోటూరు హనుమంతరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో కామ్రేడ్ రాయల వీరయ్య కూడా నిర్బంధంలో వుండేవారప్పుడు. కడలూరు జైలులో ఆయన నిర్బంధంలో వున్నప్పుడు, ఒకరోజు జైలులో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో, తోటి డిటెన్యూ రాయల వీరయ్య చేతి వేళ్లు తెగిపోయాయి. 1951 డిసెంబర్ నెలలో, మొదటి సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత, సహచర డిటెన్యూలతో పాటు రావెళ్ల కూడా విడుదలయ్యారు. జైలునుంచే ఆయన సరాసరి ఎన్నికల ప్రచార సమరంలోకి దూకారు. 

అప్పట్లో ద్విసభ్య నియోజక వర్గాల ఆనవాయితీ వుండేది. వాటిలో ఖమ్మం ఒకటి. ఆ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, సంచీ చేతబట్టుకుని, సుమారు రెండు నెలల పాటు, ఒంటరిగా తిరిగారు రావెళ్ల. ఇంకా అప్పటికి, ప్రభుత్వ నిర్భంద ఛాయలు ప్రజలను భీతావహులను చేస్తూనే వున్నాయి. పలువురింకా నిజాం జైళ్లలో మగ్గుతూనే వున్నారు. కొందరప్పటికీ, అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. వయోజనులకు అదే మొదటి ఓటింగ్. కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తల కొరత కొట్టొచ్చినట్లు కనబడేది. అన్ని లోటులనూ రావెళ్ల పూరించారు. తానే ఆన్నీ అయ్యారు. ఎన్నికల ఫలితాలలో విజయం పార్టీ పరమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఇంకా సడలించనందున, పి.డి.ఎఫ్ (పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్) పేరుతో, చేతి గుర్తుతో, ఖమ్మం ద్విసభ్య నియోజకవర్గం నుండి పోటీలోకి దిగిన కమ్యూనిస్టు అభ్యర్థులిద్దరూ గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా స్వర్గీయ నామవరపు పెద్దన్న, జనరల్ అభ్యర్థిగా కర్నాటి కృష్ణయ్య భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం, అనారోగ్యానికి గురైన రావెళ్ల సత్యం, హైదరాబాద్ ఎర్రగడ్డ క్షయ ఆసుపత్రిలో చేరి, స్వస్థత చేకూరగానే, ఖమ్మం చేరుకుని, పార్టీ పూర్తికాలం ఆర్గనైజర్‌గా పనిచేయడం ప్రారంభించారు. 1960 లో ఖమ్మం జిల్లా మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేసి సహకార ఉద్యమానికి పేరు-ప్రతిష్టలు తేవడమే కాకుండా, రైతుబాంధవుడని పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలం ఖమ్మం జిల్లా సహకార బాంక్ ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు. 1964 లో పార్టీ చీలిపోయినప్పుడు, సిపిఎం పక్షాన వుండి, ఆ సంవత్సరం మిగతా నాయకులతో పాటు నిర్బంధానికి గురై, 16 మాసాల పాటు హైదరాబాద్ సెంట్రల్ జైలు జీవితం గడిపారు. నాయకుల నిర్బంధాలతో కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలను ఆపలేమని భావించిన ప్రభుత్వం, అందరు డిటెన్యూలతో పాటు 1966 మే నెలలో రావెళ్ల సత్యంను కూడ విడుదల చేసింది. పార్టీ చీలిపోయినా, రావెళ్ల లాంటి వారి చొరవతో, పెద్దగా సిపిఎంకు నష్టం జరగలేదు. 1967 సాధారణ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఖమ్మం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచారు.

రావెళ్ల సత్యంకు ఏ పని అప్ప చెప్పినా కార్య దక్షతతో చక్కదిద్దేవారని పేరుండేది. కిచెన్ మేనేజ్‌మెంటులో కడు నేర్పరి. కడలూరు జైలులోను, హైదరాబాద్ సెంట్రల్ జైలులోను అదే డ్యూటీ ఇచ్చారాయనకు. సెంట్రల్ జైలులో రోజువారీ వంట సరుకులు-కూరగాయలు కొని తేవడం, దగ్గరుండి వండించి వడ్డించడం ఆయన చాలా పకడ్బందీగా నిర్వహించేవారని, అదే జైలులో డిటెన్యూగా వున్న ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమ నాయకుడు డాక్టర్ వై. రాధాకృష్ణ మూర్తి చెప్తుండేవారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి జిల్లా-రాష్ట్ర-అఖిల భారత పార్టీపరమైన మహాసభలకు వంటశాల నిర్వహణ బాధ్యత ఆయనకే అప్ప చెప్పేవారు. ప్రతి పైసాకి జమా ఖర్చులు రాసేవారు. ఎల్లవేళలా, పాకెట్ సైజు అకౌంటు పుస్తకం, చిన్న పెన్ను, ముతక చొక్కా పక్క జేబులో ఒక చైన్ కీ గడియారం ఆయన దగ్గరుండేవి. ముత్యాలలాంటి దస్తూరీతో అకౌంటు పుస్తకంలో ఎప్పటి లెక్కలప్పుడే రాసే అలవాటుండేది ఆయనకు. గ్రామాలలో తిరగని ప్రతి దినం, ఉదయాన్నే గోకినేపల్లి నుంచి బస్‍లో ఖమ్మం వచ్చి, పార్టీ పనులన్నీ చక్కదిద్దుకుని, తిరిగి రాత్రికి బస్సు ఎక్కి ఇంటికి చేరుకునేవారు. అలా ఒకరోజు ఇంటికెళ్తున్నప్పుడు, ఆదమరిచి వున్న సమయంలో ఎవరో ఆయన గడియారాన్ని తస్కరించారు. పరధ్యానానికి ఆమడ దూరంలో వుండే రావెళ్ల, ఆ రోజున, కేరళ కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ మరణించాడన్న తప్పుడు వార్త వినడంతో అలా అయిపోయారు. గడియారం పోయినందుకు చాలా మనోవేదనకు గురయ్యారు రావెళ్ల.

1964 సంవత్సరం నాటికి, రెండు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఒకవైపు స్థానిక సంస్థల కింద వుండే గ్రామ పంచాయితీలకు-సమితులకు మెరుగైన అధికారాలున్నప్పటికీ, రాజకీయపరమైన వివక్షలు-కక్షలు-కార్పణ్యాలు తీవ్రంగా వుండేవి. కాంగ్రెస్ గుప్పిట్లో వున్న ఖమ్మం పంచాయితీ సమితి పరిధిలోని గ్రామాలలో అనేక రకాల వేధింపులకు ప్రజలు గురవుతుండేవారు. గ్రామాలలో రైతు, కూలీల బ్రతుకులు దుర్భరంగా వుండేవి. దానికి తోడు అతివృష్టి, అనావృష్టి సమస్యలుండేవి. భూస్వాముల, ధనికుల ప్రత్యక్ష-పరోక్ష దోపిడీ కొనసాగేది. సరైన రహదారి సౌకర్యం వుండకపోయేది. విద్యుత్ సౌకర్యం వున్న గ్రామాలు ఏ ఒకటి-రెండో మాత్రమే. ఆ రోజులు నిజాం పాలనకు నకలంటే అతిశయోక్తి కాదేమో! ఆ నేపధ్యంలో రావెళ్ల సత్యం సారధ్యంలో, స్థానిక మార్క్సిస్టు నాయకులైన గండ్లూరి కిషన్‌రావు (సమితి మాజీ ఉపాధ్యక్షుడు), తాళ్లూరి వైకుంఠం, బాజి హనుమంతు (మాజీ ఎమ్మెల్యే), వనం నరసింగరావు (పాలేరు సహకార చక్కెర కర్మాగారం మాజీ అధ్యక్షుడు), చుట్టు పక్కల గ్రామాలలోని రైతు-కూలీ సమస్యలను అధ్యయనం చేయడం, సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడం మొదలైంది. వాస్తవానికి ఆ ప్రయత్నం ఎన్నో సత్ఫలితాలను ఇచ్చింది.

1968 లో సిపిఎం పార్టీపై నక్సలిజం ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్తంగా నక్సలిజం వూపందుకుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు, తీవ్రవాదంవైపు మొగ్గుచూపినవారికి, వ్యతిరేకించిన సిపిఎం వారికి మధ్య చర్చలు-వాదోపవాదాలు జరిగాయి. పుచ్చలపల్లి సుందరయ్య వాదనతో ప్రభావితుడైన రావెళ్ల సత్యం నాయకత్వంలో పనిచేస్తున్న గండ్లూరి, బాజి, వనం లాంటి వారంతా, నక్సలిజంవైపు ఆకర్షితులైన బత్తుల, బోసు, లింగాల లాంటి వారితో ఎవరి మార్గం వారే చూసుకుందాం అని చెప్పారు. వారిని పల్లెలు వదిలి తుపాకిలు పట్టమనితాము మాత్రం పల్లెల్లోనే వుండి ప్రజలను చైతన్య ఉద్యమాలవైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు. ఆ సంభాషణ అనంతరం అడవుల్లోకి వెళ్ళిన బత్తుల వెంకటేశ్వరరావు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పల్లెల్లోనే వుండిపోయిన ఇతరుల నాయకత్వంలో రైతు-కూలీ ఉద్యమాలు సాగాయి. ఆరణాల కూలీలు, అధిక వడ్డీలు, జెట్టీలు, తక్కువ మొత్తంలో పాలేర్ల వేతనాలు, మేరల పెంపు, కుల వివక్షతలకు వ్యతిరేకంగా రావెళ్ల సత్యం బృందం నాయకత్వంలో దళిత-వెనుకబడిన వర్గాల ఐక్య ఉద్యమం వూపందుకుంది. ప్రభుత్వ మాన్యాలు, బంచరాయి భూములు పేదల స్వాధీనమయ్యాయి. కూలీల శ్రమ దోపిడీ చిహ్నాలైన "పిచ్చ మానికలు", "కుండలు" ధ్వంసమయ్యాయి. భూస్వాముల భూములలో కలుపుకున్న మిగులు ప్రభుత్వ భూములు పేదల వశమయ్యాయి. వరి నాట్ల, జొన్న కోతల, వేరు శనగ పీకుడుకు ఇవ్వాల్సిన కూలీ రేట్లను ముఠా నాయకులే నిర్ణయించే స్థాయికి ఉద్యమం చేరుకుంది. చివరకు భూస్వాములు కొనుక్కునే పశువుల ఎరువు ఎక్కించాల్సిన "బండి జల్లల" కొలతలు కూడా కూలీలే నిర్ణయించడం మొదలైంది. అదో మహోద్యమం. ముదిగొండ మండలంలోని అన్ని గ్రామాలకు ఆ ఉద్యమం పాకింది. బలపడింది. సహజంగానే ధనిక రైతుల్లో వ్యతిరేకత మొదలైంది. రైతులను కలుపుకుపోయి ఉద్యమాన్ని బలోపేతం చేస్తే మంచిదన్న  రావెళ్ల సత్యం సూచనను కూలీలు అర్థం చేసుకోలేక పోయారు. దాంతో, ధనిక రైతులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం సమితి అధ్యక్షుడు సామినేని ఉపేంద్రయ్యను ఆశ్రయించారు. నాటి హోంమంత్రి జలగం వెంగళ్ రావు అనుయాయుడైన ఉపేంద్రయ్య అండతో రావెళ్ళ అనుచరులపై గ్రామ-గ్రామాన నిర్బంధ కాండ మొదలైంది. దానికి కేంద్రంగా బాణాపురం గ్రామాన్ని ఎంచుకున్నారు.

ముదిగొండ మండలం బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్‌రావు మీద ప్రారంభమైన పోలీసు దమన కాండ, చుట్టుపక్కల గ్రామాలైన పమ్మి, అమ్మ పేట, గంధసిరి, కమలాపురం గ్రామాలకు కూడా విస్తరించింది. పోలీసు క్యాంపులు పెట్టి మరీ కమ్యూనిస్టులను-సానుభూతిపరులను హింసించసాగారు. హత్యాకాండ కూడా మొదలైంది. లైసెన్సులు లేని తుపాకిల వాడకం కూడా వెలుగులోకి వచ్చింది. ఐనా, ప్రభుత్వం ఒక పక్షాన్నే సమర్థించడం కొనసాగింది. ముక్క చిన నర్సయ్య, గండ్ర వీరభద్రా రెడ్డి లాంటి నాయకులు హత్యకు గురయ్యారు. అంతా పోలీసులకు తెలిసే జరిగిందని అనుకునేవారు. ధనవంతులైన భూస్వాములకు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా, విచక్షణారహితంగా రావెళ్ల సత్యం నాయకత్వంలో పని చేస్తున్న కమ్యూనిస్టులందరి పైనా క్రిమినల్ కేసులు బనాయించేవారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాటిలో "బైండోవర్ కేసులు" వుండేవి. ఆ నేపధ్యంలో 1970 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీలో జలగం వెంగళ్ రావును వ్యతిరేకిస్తున్న మరో జిల్లా మంత్రి శీలం సిద్దారెడ్డి వర్గంతో సర్దుబాటు చేసుకున్న మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, రావెళ్ల సత్యం ప్రాంతమైన గోకినేపల్లి ఫిర్కాలో అత్యధిక స్థానాలు సంపాదించి తిరిగి ఖమ్మం సమితిని చేజిక్కించుకుంది. దురదృష్టవశాత్తు సమితి అధ్యక్షుడుగా కావాల్సిన రావెళ్ల సత్యంను, కో-ఆప్షన్ సభ్యుడుగా ఎన్నికవకుండా, పార్టీకి చెందిన కొందరు కుట్ర పన్నడంతో ఆయన ఓడిపోయారు. ఆయన స్థానంలో రాయల వీరయ్యను అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్‌రావును ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. 1982 సంవత్సరానికల్లా ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పెనుమార్పులు సంభవించాయి. వామపక్షాల మధ్య ఒడంబడిక కుదిరింది. ఖమ్మం సమితికి సిపిఎం, పక్కనే వున్న తిరుమలాయపాలెం సమితికి సిపిఐ అభ్యర్థులు పోటీచేశారు. ఖమ్మం సమితి అధ్యక్షుడుగా రావెళ్ల సత్యం ఎన్నికయ్యారు. సమితి అధ్యక్షుడుగా ఆయన సేవలు చిరస్మరణీయం. అటెండర్ దగ్గర నుంచి, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వరకు సత్యం సలహాలకు విలువిచ్చేవారు.

జనవరి 1927 లో గోకినేపల్లి గ్రామంలో జన్మించిన రావెళ్ల సత్యం ఫిబ్రవరి 2, 1985 న గుండె జబ్బుతో అరవై సంవత్సరాలన్నా నిండకుండానే మరణించారు. వాస్తవానికి రావెళ్ల సత్యంను 1985 లో జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. విధి వక్రించి ఆయన మరణించడంతో అది నెరవేరలేదు. ఆయనే కనుక బ్రతికుండి పోటీచేసి గెలిచినట్లయితే, జిల్లాలో సిపిఎం పతాకాన్ని ఎంతో సమున్నత స్థానానికి తీసుకెళ్తేవారు. అది జరగకపోగా, అలనాటి ఆయన సహచరులంతా పార్టీనుండి బహిష్కృతులై సిపిఎం పడుతున్న కష్టాలను బయట నుంచే బాధతో గమనిస్తున్నారు. 

No comments:

Post a Comment