Tuesday, January 24, 2012

ఈ మంత్రివర్గ విస్తరణ...సి. ఎం. కు ప్లస్సా, మైనస్సా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (19-01-2012)
వనం జ్వాలా నరసింహారావు
(ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి; మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ అవసరం; మధ్యేమార్గం పార్టీకి శ్రేయస్కరం కాదు; పద్ధతి మార్చుకోవాల్సిన అధిష్టానం; అప్పుడే రాష్ట్రంలో పార్టీకి గౌరవం....ఎడిటర్)


సమిష్టి బాధ్యతారాహిత్యానికి, సమన్వయ లోపానికి నిలువెత్తు నిదర్శనమైన రాష్ట్ర మంత్రి మండలిలో మరో ఇద్దరు-ముగ్గురు చేరవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కష్ట కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్షానికి అండగా నిలిచిన నాటి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు చిరంజీవి అనుయాయులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని, వారీపాటికే బంధు మిత్రులకు తమ ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపారని, మీడియాలో కబుర్లొచ్చాయి. సర్వసాధారణంగా మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రికి బదులుగా, ఆ విషయాన్ని, తాజా కాంగ్రెస్ నాయకుడు-మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ప్రకటించడం కొంత ఎబ్బెట్టుగా వున్నప్పటికీ, వార్త బయటకు పొక్కడానికి మాత్రం ఆయనదే బాధ్యత అనాలి. అసలాయనకు వారిద్దరిమీదనే ఎందుకంత ప్రేమ అన్నది అంతుచిక్కని విషయం. ఇక వారిద్దరిలో కనీసం ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లోను, మంత్రిపదవి దక్కకుండా చేయాలని, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి మాట నెగ్గేలా చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగితే, ఆయనకు వ్యతిరేకంగా, కొందరు మంత్రివర్గ సభ్యులతో సహా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, పలు ఎన్నికల బహిరంగ సభలలో అశేష జనాన్ని ఆకర్షించి, ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చిరంజీవికి ఆ కోరిక నెరవేరలేదు. పోనీ పార్టీని బతికించుకుని, కనీసం వచ్చే ఎన్నికల నాటికన్నా, మళ్ళీ తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో వున్నాడా అంటే, అదీ చేయలేకపోయాడు. నెత్తిమీద కుంపటి దించుకుని, పార్టీని-పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెంచుకుంటున్నాడు. అదిప్పట్లో నెరవేరే అవకాశం లేనప్పుడు, తన అనుయాయులకు రాష్ట్ర మంత్రి మండలిలో స్థానం కలిపించమని అడిగే బదులు, తానే రాష్ట్ర మంత్రివర్గంలో చేరకూడదా? రాష్ట్ర మంత్రి పదవి తన స్థాయికి తగదనుకుంటున్నాడా? లేక, ఏకంగా కేంద్రమంత్రిగా నో, అవకాశం చిక్కితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నో కావాలని కలలు కంటున్నాడా? మించిపోయిందేమీ లేదు! తాను చేరదలుచ్కున్నట్లు ముఖ్యమంత్రికి, గులాంనబీ ఆజాద్‌కు సంకేతం ఇచ్చి, అటు కిరణ్‌కుమార్‌కు, ఇటు బొత్స సత్యనారాయణకు కొంత ఊరట కలిగించడం మంచిది. కడప కాంగ్రెస్ నాయకులకూ మంచిది కూడా!


ఏదేమైనా, కాంగ్రెస్ రాజకీయం, ఎక్కడ జరగాలో అక్కడికే మళ్లీ చేరింది. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ రాజకీయాలెప్పుడూ ఢిల్లీలోనే జరుగుతాయి. మధ్య-మధ్య రాష్ట్ర రాజధానికి, అప్పుడప్పుడూ జిల్లాలకూ చేరుకుంటాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంప్రదింపులకు ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకునే లోపునే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లడం గులాంనబీ ఆజాద్‌తో మాటామంతీ జరపడం జరిగిపోయాయి. చెరో మాట అనడంతో, సీను సోనియాగాంధీ దగ్గరకు మారింది ప్రస్తుతానికి. ఫలానావారికి మంత్రివర్గంలో చోటు దక్కనుందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఇంతకూ విస్తరణా? పునర్వ్యవస్థీకరణా? చిరంజీవి చెప్పినట్లు కేవలం ఆ ఇద్దరికి మాత్రమే చోటు కలిగించడమా? ముఖ్యమంత్రికి-సహచర మంత్రివర్గ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒకరిద్దరికి మాత్రమే ఉద్వాసనా? శాఖల్లో సమూలంగా మార్పులు-చేర్పులా? అనే విషయమన్నా ఈ సారి తేలుతుందేమో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఉపఎన్నికలలో, అలానే 2014 ఎన్నికలలో పరువు-ప్రతిష్టలతో బయట పడాలంటే, కనీసం గౌరవప్రదమైన ప్రతిపక్షంగానన్నా ఎన్నికవాలంటే, అధిష్టానం తన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం వుంది. ఏ అధిష్టానమైతే, కనీసం ఒక్కసారన్నా మంత్రిపదవి అనుభవం పొందని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టిందో, అదే అధిష్టానం, ఆయనా పీఠం మీద పటిష్టంగా వుండడానికి చర్యలు తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత అనేక సమస్యలను ఢీ కొన్నప్పటికీ, తడబడుతూ అడుగులు వేసినప్పటికీ, గత ఏడాది కాలంలో, కష్టాల కడలిని అధిగమించు తూ, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతున్నారనే ది వాస్తవం. అలాంటప్పుడు, ఆయనను బలపర్చాల్సిన అధిష్టానం, సమాంతరంగా దానికి విరుద్ధంగా ఏ చర్యను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రోత్సహిస్తే నష్టం పార్టీకే! అందుకే, తప్పో-ఒప్పో, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పూర్తిగా కాకపోయినా, పరిమిత మోతాదులోనన్నా స్వేచ్ఛ ఇవ్వాలి. అధిష్టానం అభీష్టం మేరకు, ఢిల్లీ నాయకులు చెప్పిన ఒకరిద్దరికి మంత్రి మండలిలో స్థానం కలిగించమని కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించడంతో సహా, ఆయన కావాలనుకున్న "టీం" ను ఏర్పాటు చేసుకునే వీలు కలిగించాలి. ఆయన తొలగించాలనుకుంటున్న మంత్రులను, అధిష్టానం దృష్టిలో ఏదో ఒక ప్రత్యేకమైన కారణం వుంటే తప్ప, అలా చేసే వీలు కిరణ్ కుమార్ రెడ్డికి కలిగించాలి. అవసరమైతే, అల నాడు అంజయ్య విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన విధానాన్నే, నేడు సోనియాగాంధీ కూడా పాటించి తీరాలి. హైదరాబాద్ రావాలి. వచ్చి ఆయనకు మద్దతుగా తానూ-తన అధిష్టానం నూటికి-నూరు పాళ్లు వుందన్న సంకేతాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వారిని తొలగించనన్నా తొలగించాలి-లేదా-తప్పు ముఖ్యమంత్రి దే అని భావిస్తే తదనుగుణంగా చర్యలన్నా చేపట్టాలి. మధ్యేమార్గం మంచిదికాదు. పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.


ఈ నేపధ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సహా, చిన్నా-చితకా పార్టీలు కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ, ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, ఏదో ఒక పేరుమీద యాత్ర చేపట్టడమో, పనిగట్టుకుని ప్రత్యర్థుల మీద దాడికి దిగడమో, లేదా ఎదురుదాడి చేయడమో, అదేమీ కాకపోతే టెలివిజన్ ఛానళ్ల పుణ్యమా అని చర్చలలో పాల్గొన్నప్పుడు అందివచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా, తమ-తమ వ్యూహాలను కాసింత బహిర్గతం చేయడమో గమనించాల్సిన విషయం. గతకొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు; తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు పోరుబాట; జగన్ రైతు దీక్షా శిబిరం; తెరాస-ఐకాస సమైక్యతా వాదుల యాత్రలను అడ్డుకునే ప్రయత్నాలు; భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయడం అనే విషయాలు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అధిష్టానం నియమించిన సమన్వయ కమిటీ సాధించిదేమిటో కాని, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు-కుమ్ములాటలు మాత్రం బహిర్గతం అయ్యాయి. కిరణ్‍కూ, బొత్సకూ; ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విభేదాలున్న ట్లు స్పష్టమైనాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు గులాంనబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేస్తే, బొత్సను అడ్డుకునే ప్రక్రియకు కిరణ్ శ్రీకారం చుట్టారనుకుంటున్నారు. కొందరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, విడతలవారీగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలను (సూర్య దినపత్రిక) ప్రముఖంగా ప్రచురించారు. వారికి కొందరు ఎంపీల మద్దతుకూడా వుందని అంటున్నారు. ఇదంతా గమనించిన ఆజాద్‌కు ఆగ్రహం కూడా కలిగిందట. ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ ఎంత సీరియస్‌గా వుంటుందో కాని, ప్రతిపక్షాలు మాత్రం ఒక కన్నేసి వుంచాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సడలిందని ప్రచారం చేయసాగాయి. ప్రజా సమస్యలను ఆయన అసలే పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. ముఖ్యంగా రైతు సమస్యలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజం ఎత్తాయి. చివరకు మీడియా కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపాయి.


ఇందులో భాగంగా, ఒకానొక పాపులర్ టెలివిజన్ ఛానల్, రైతు ఆత్మహత్యలపై-సమస్యలపై, అన్ని రాజకీయ పార్టీల-రాజకీయేతర ప్రముఖుల-పాత్రికేయుల-సామాజిక కార్యకర్తల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో ఒక ఆసక్తికరమైన గోష్టిని నిర్వహించిందిటీవల. గోష్టిలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచనలను రేకెత్తించే అంశాలను తెరమీదకి తెచ్చారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో గ్రామీణ-వ్యవసాయదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ బహిర్గతం చేసిన విషయాలను ప్రభుత్వం పట్టించుకుని తీరాల్సిందే. వెలుగులోకి వస్తున్న రైతు ఆత్మహత్యలను, సాధారణ ఆత్మహత్యలుగా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి మూడు గంటలకు దేశవ్యాప్తంగా సంభవిస్తున్న చోటుచేసుకుంటున్న ఆరు రైతు అత్మ హత్యలలో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినదే అని ఆయన అన్నారు. మద్దతు ధర లేక, సాంప్రదాయ పద్దతులకు స్వస్తి పలికిన నేపధ్యంలో, పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడం వల్ల కూడా రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. మరి ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు చేపట్టిన రైతు పోరుబాట కాని, జగన్ రైతు దీక్షా శిబిరం కార్యక్రమం కాని, ఎంతవరకు రైతు సమస్యలను ప్రతిబింబించాయో ప్రశ్నార్థకమే!
          
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని భావనలో వున్న కిరణ్ కుమార్ రెడ్డికి, అందుకే, అధిష్టానం మరింత మద్దతు ఇవ్వాలి. రైతు సమస్యలతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పార్టీపరంగా ఆయనకు వ్యతిరేకతను తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఈ విషయాలపై అధిష్టానం దృష్టి సారించాలి.


(ఈ ఆర్టికల్ 18-01-2012, మంత్రివర్గ విస్తరణ జరుగవచ్చన్న ఊహాగానాలకు పూర్వం రాసింది)

No comments:

Post a Comment