Thursday, March 15, 2012

విజ్ఞానాన్ని అందించిన స్వామీ ప్రణవానంద: వనం జ్వాలా నరసింహారావు


విజ్ఞానాన్ని అందించిన స్వామీ ప్రణవానంద
నమస్తే తెలంగాణ దినపత్రిక (16-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయాలను అధ్యయనం చేసి, మ్యాపులు గీశాడు. ఆయన పర్యటనలకు సంబంధించి హెదిన్ అనేకానేక విషయాలను గ్రంధస్థం చేశాడు. "థ్రూ ఏసియా" అన్న ఆయన ప్రఖ్యాత గ్రంధం వందేళ్ల క్రితం 1898 లో ప్రచురించడం జరిగింది. ఏసియా సంస్కృతిని గురించి అధ్యయనం చేయదల్చుకున్న వారికి ఆయన రాసిన పుస్తకాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. ఐతే స్వెన్ హెదిన్ గీసిన టిబెట్ మ్యాపులకు, భారత దేశానికి-ఆంధ్ర ప్రదేశ్‌కు-తూర్పు గోదావరి జిల్లాకు చెందిన, స్వామీ ప్రణవానంద గీసిన మ్యాపులకు చాలా తేడా వుందని పరిశోధకులంటారు. ఇరువురి మ్యాపులను శ్రద్ధగా పరిశీలించిన పలువురు, స్వెన్ హెదిన్ సరిగ్గా చూడకుండా, కేవలం తెలివితేటలు ఉపయోగించి, మ్యాపులు గీశాడంటారు. కాకపోతే, ఒక యూరోపియన్ గీసిన మ్యాపులు బాగాలేవనే ధైర్యం మనకు లేదు కదా! అప్పటి తరం వారికే లేనప్పుడు, ఇప్పటి తరం వారికి అసలే వుండదు. ప్రణవానంద గీసిన మ్యాపులను స్వెన్ హెదిన్ ఈసడించుకున్నాడు కూడా. ప్రణవానంద తన టిబెట్ యాత్రను గురించి రాసిన గ్రంధాన్ని కాని, ఆయన అక్కడ నుంచి సేకరించి తెచ్చిన, వృక్ష-పక్షి-ఖనిజ అవశేషాలను కానీ, ఆంధ్ర విశ్వ విద్యాలయం ముట్టనే లేదట! కానీ, కలకత్తా విశ్వ విద్యాలయం "ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్" పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించింది. ఆయన పట్టుకొచ్చిన వస్తు జాలాన్ని తీసుకుని ప్రదర్శన శాలలో పెట్టింది. లక్నో ప్రదర్శనశాల వారు కూడా కొన్నింటిని తీసుకున్నారు. అదీకాక అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, టిబెట్‍కు సంబంధించిన ఎంతో సమాచారాన్ని స్వామీ ప్రణవానంద ద్వారా సేకరించి, నాలుగువేల పేజీల డాక్యుమెంటు తయారు చేయించుకుని, భవిష్యత్‍లో అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు బధ్రపరిచారట. ఇంతకీ ఎవరీ ప్రణవానంద స్వామి?

స్వామీ ప్రణవానంద స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొని, టిబెట్ వెళ్ళి, అక్కడి నైసర్గిక స్థితిగతులన్నీ చూసి, తెలుసుకుని, మ్యాపులు గీసి భారత్ దేశానికి సమర్పించుకున్న మహనీయుడు. ప్రణవానంద స్వామి సరిగ్గా 115 సంవత్సరాల క్రితం 1896 మార్చ్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. 1918 లో లాహోర్‌లోని దయానంద కళాశాల నుంచి పట్టభద్రుడై నాడు. భగత్‌సింగ్ ప్రభృతుల బృందానికి చెందిన వ్యక్తి. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిక్కులన్నీ అనుభవించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే, ఘర్వాల్ జిల్లాలో క్షామ నివారణ చర్యలలో స్వచ్చందంగా పనిచేశాడు. 1920 నుంచి 1926 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాదీ ప్రచారం, హరిజన సేవ చేయడమే కాకుండా, తెలుగునాట మొట్టమొదటి హిందీ విద్యాలయం నెలకొల్పిన ఖ్యాతి దక్కించుకున్నాడు. అప్పట్లోనే పది నెలలు జైలు జీవితం కూడా అనుభవించాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో అణుశాస్త్ర విభాగం నెలకొల్పిన స్వామీ జ్ఞానానంద హిమాలయాలలో ఆధ్యాత్మిక విషయాలలో పరిశోధనలు కూడా చేశారు. స్వాములనేవారు, కేవలం స్వాములోరిగానే మిగిలిపోకుండా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా, సాంకేతిక విజ్ఞానులుగా ఉండాలనేది జ్ఞానానంద సందేశం. అలాంటి మహనీయుడి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించాడు ప్రణవానంద. ఇరువురిదీ అంతటి ఉదాత్త ఆశయ సమ్మేళనం!

1928 లో ప్రారంభమైంది ప్రణవానంద అన్వేషణ. తొలుత ఉత్తర ప్రదేశ్‌కు చేరుకున్న ప్రణవానంద, అక్కడ అల్మోరా ఫిటోర్‍ఘర్ ప్రాంతంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని గమనించాడు. అక్కడ సంచార వైద్య సేవలు ప్రారంభించాడు. హిమాలయాల పాదమైన ఉత్తర ప్రదేశ్ నుంచే హిమాలయాలకు చేరుకోవాలన్నది ఆయన ఆశయం. హిమాలయ యాత్రను ఆధ్యాత్మిక సాధన కోసం ఉద్దేశించినప్పటికీ, తీరా మొదలెట్టిన తరువాత, అది వృక్ష-జంతు-ఖనిజ-పురా తత్వ-సాంఘిక-ఐతిహాసిక విజ్ఞానాలన్నింటికీ విస్తరించిన ఆసక్తికర అంశంగా మారిపోయింది. కైలాస పర్వతాన్ని చుట్టి వచ్చాడు. మానస సరోవరానికి చేరుకున్నాడు. మన వాళ్ళు నమ్మకంగా నమ్ముతుండే, "సహస్ర దళాలు", "హంసలు" అక్కడ లేవని స్పష్టం చేశాడు. నవీన శాస్త్రీయ పద్ధతులకు అనుగుణంగా, మానస సరోవర్, రాక్షస తావ్, గౌరీకుండ్‍ల లోతులను-అడుగున వున్న మట్టిని-రాతి నమూనాలను సేకరించాడు. బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు, కర్నాలి నదుల జన్మస్థానాల నుంచి, టిబెట్‍లో అవి ప్రవహించే మేరనంతా చూశాడు. అక్కడ నివసించే లామాలతో స్నేహం చేసుకుని, సాహిత్యం-చరిత్ర లోతులను అవలోకించి, అధ్యయనం చేశాడు ప్రణవానంద.

సాధారణంగా, పురాతన గ్రంధాలలో ఏది రాస్తే, దానినే, రాసినంతవరకే నమ్మడం మనలో చాలామందికి అలవాటు. కొత్త విషయాలు చెప్పినా వినరు. తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా పలువురిలో మృగ్యం. ప్రణవానంద స్వామి అలా కాదు. బౌద్ధ లామాలతో నెలలకు-నెలలు, సంవత్సరాల తరబడి వుండి, అక్కడి ప్రకృతిని ఒక సుబోధక విమర్శనా గ్రంధంగా మలచ గలిగాడు. ఆ జిజ్ఞాసే ఆయనతో పాతికేసి పర్యాయాలు కైలాస గిరి ప్రదక్షిణలు, మానస సరోవర ప్రదక్షిణలు చేయించింది. ప్రకృతి సౌందర్యంతో పాటు, ప్రకృతిలో నిక్షిప్తమై వున్న విజ్ఞాన రహస్యాలను కూడా ఆకళించుకోగలిగాడు. తనలో వున్న వైద్య నిపుణత్వంతో, అక్కడున్న చిన్నా-పెద్దా, అధికార-అనధికార వర్గాల వారందరితో స్నేహం చేసుకున్నాడు. ఇలాంటి పర్యటనలు సాధారణంగా విదేశీయులే చేయడం, వారి అనుభవాలను గ్రంధస్థం చేయడం పరిపాటి. మనమేమో వాటిని చదివి వారి గొప్పతనాన్ని ఉగ్గడించడం కూడా పరిపాటే! స్వామీ ప్రణవానంద అంతకంటే మిన్నగా, విజ్ఞాన వైవిధ్యాన్ని చూపే అనుభవాలను తెలియ చెప్పారు. అక్కడి సరస్సులను శోధించడానికి భారతదేశం నుంచి ఒక "ఉక్కు పడవను" మోసుకో పోగలిగారు. అక్కడి నుంచి మొదటిసారిగా సముద్ర వస్తు అవశేషాలను తీసుకోరాగలిగారు. అవును మరి...ఒకప్పుడు హిమాలయాలు సముద్ర ప్రాంతమే కదా! ఆయన ఏది చేసినా పరిశోధక దృష్టితోనే. సన్యాసి చేయాల్సిన పని అదే అనిపించాడు. కస్తూరి మృగంపై ఆయన చేసిన పరిశోధన చెప్పుకోదగింది. అలానే ఔషధాలపై చేసిన పరిశోధనలు కూడా.

అలా స్వామీ ప్రణవానంద హిమాలయాలలో, టిబెట్‍లో చేసిన అన్వేషణ-అధ్యయనం, హిమాలయాల అనేకానేక అందాలను ఆవిష్కరించింది. సింధూ, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలీ నదుల వాస్తవ జన్మస్థానాలను కనిపెట్టగలిగాడాయన. లండన్‌లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ, భారత దేశంలోని సర్వే ఆఫ్ ఇండియా ఆయన పరిశోధనలను అంగీకరించారు. 1941 లో సర్వే ఆఫ్ ఇండియా వారు ముద్రించిన మ్యాపులలో ప్రణవానంద గీసినవన్నీ వున్నాయి. సుమారు ఐదువందల సంవత్సరాలకు పైగా యూరోపియన్ మిషనరీలను, అన్వేషకులను టిబెట్ ఆకర్షించింది. ఇండియా నుంచి మాత్రం, ప్రణవానంద లాంటి ఒకరిద్దరు మాత్రమే అక్కడకు వెళ్ళి పరిశోధనలు చేయగలిగారు.

ప్రణవానంద రాసిన "ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్" అనే గ్రంధాన్ని కలకత్తా విశ్వ విద్యాలయం వారు 1950 లో ప్రచురించారు. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ పరిచయం చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, "ఖర్చు లేకుండానే ఇంత పరిశోధన చేశారీ సన్యాసి. ఆత్మానందం కొరకు ఇంత పని చేశాడు. ఇరవై ఐదేళ్లకు పైగా పవిత్ర హిమాలయాలలో గడిపాడు. ఆయన పరిశోధనలను నిపుణులు మెచ్చారు" అని అన్నారు. 1954 లో టిబెట్ ఎల్లలలోని మన దేశ ప్రాంతంలో భారత ప్రభుత్వం చెక్ పోస్టులను పెట్టి, విదేశీయులను దరిదాపులలోకి రాకుండా చేసింది, ప్రణవానంద సూచనల మేరకే! వృద్ధాప్యంలో కూడా తొంబై ఏళ్ల వయస్సులో మరణించడానికి ముందు, తూర్పు గోదావరి జిల్లాలో, ఒక ప్రదేశంలో శ్రీ చక్ర దేవాలయం కట్టడానికి శ్రమ పడ్డాడు. అదేమైందో మరి. 1960 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.

ఎవరు నిజం చెప్పారో, ఎవరు అబద్ధం చెప్పారో కాని, సింధు నది, సట్లెజ్-బ్రహ్మపుత్ర నదుల మూలాలను తొలిసారిగా కనుక్కున్నది తానేనంటాడు స్వెన్ హెదిన్. టిబెటన్లు మినహా తాను తప్ప మరెవ్వరూ, ఆ మూలాల దగ్గరకు చేరుకోలేక పోయారని బల్ల గుద్ది మరీ చెప్పాడు. ఐతే స్వెన్ హెదిన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్న విషయాన్ని, స్వామీ ప్రణవానంద బయట పెట్టాడు. 1928-1938 మధ్యలో, ఆయన మానసరోవర్-కైలాస్‍గిరి ప్రాంతాలలో చేసిన యాత్రలు, మానవ మాత్రులెవ్వరూ పోలేని ప్రాంతానికి ఆయన వెళ్లడమే కాకుండా ఒక ఏడాది పాటు నివసించడం, స్వెన్ హెదిన్ చెప్పిన విషయాలపై కొంత అనుమానాలకు తావిచ్చింది. వృత్తి రీత్యా భౌగోళిక శాస్త్రవేత్త కాకపోయినా, స్వామీ ప్రణవానంద పరిశోధనలు, ఆ నదుల వాస్తవ మూలాలను అధ్యయనాత్మకంగా కనుగొన్న దాఖలాలు స్పష్టంగా బయట పెట్టాయి. వాస్తవానికి ఏ జీవనది ఎక్కడ ఉద్భవించిందో అన్న విషయాలపై చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది. ఐనా ఎవరిది వాస్తవమో కనుక్కోవడం అంత కష్టమేమీ కాదు. అదే జరిగింది సింధు నది, సట్లెజ్-బ్రహ్మపుత్ర నదుల విషయంలో కూడా. స్వామీ ప్రణవానంద రాసిన "ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్" పుస్తకంలో, టిబెట్ ప్రాంతంలోని మానసరోవర్-కైలాసగిరి భాగాన్ని గురించే ఎక్కువగా వుంటుంది.

ఏదేమైనా స్వామీ ప్రణవానంద లాంటి అరుదైన సహజ భౌగోళిక శాస్త్రవేత్తల జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కావడం మన గర్వించ తగ్గ విషయం. మార్చ్ నెలలో ఆయన 115 వ జయంతి సందర్భంగా స్వామీజీని గుర్తుచేసుకోవడం ఎంతైనా సమంజసం. సాధులు, సన్యాసుల వేషధారణలో ఉన్నా శాస్త్రీయ దృష్టితో భవిష్యత్ తరాలకు ఎంతో ఉపకరించే పరిశోధనలు చేసిన వారు ఎందరో మన చరిత్రలో కనిపిస్తారు.
  

1 comment:

  1. ఏనుగుల మహల్ లో శ్రీ చక్ర దేవాలయాన్ని నిర్మాణం చేసారు స్వామీజీ.
    అక్కడ ఆయన రాసిన పలు గ్రంథాలు లభ్యమవుతున్నాయి.
    మంచి వ్యాసం రాసినందుకు అభినందనలు.

    ReplyDelete