Saturday, June 8, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part THREE: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part THREE
వనం జ్వాలా నరసింహారావు

జీతగాళ్లు వంతులవారీగా రాత్రి వేళల్లో మా ఇంటి ముందు పడుకోవడానికి వచ్చేవారు. రాత్రుళ్లు లేచి పశువులకు కావాల్సిన దానా వేయడం, నీళ్లు తాపించడం వారి బాధ్యత. ఇంకా తెలతెలవారుతుండగానే, పొద్దున్నే లేవడం, విశాలమైన మా ఇంటి వాకిలి శుభ్రం చేయడం, ఇంటి ముందర కలాపి జల్లడం కూడా వాళ్ల బాధ్యతే. వాకిలి శుభ్రం చేయడానికి పొడగాటి కందికట్టె చీపురు (పొలికట్టె) ఉపయోగించేవారు. కలాపి జల్లే నీళ్లలో పశువుల పేడను కలిపేవారు. ఆ తతంగమంతా దాదాపు గంట సేపు జరిగేది. అలానే, ఉదయాన్నే కొందరు "జొన్న తొక్కు" వంపడానికి వచ్చే వారు. బదులుగా "చల్ల" పోయించుకు పోయేవారు. వారొచ్చే వేళ కల్లా, మరో జీతగాడు, ఇంటి వెనుక వంట ఇంటి పక్కన "చల్ల” చిలికేవాడు. ఒక గుంజకు "కవ్వం" కట్టి తాడుతో పెరుగు చిలికి చల్ల చేసేవాడు. పెద్ద బానెడు చల్ల, అందులో పెద్ద "వెన్న ముద్ద", చల్లలో చాలా భాగం మునిగి పోయి తయారయ్యేది. ఎండాకాలంలో మేం ఉదయాన్నుంచే చల్ల ముంచుకుని తాగే వాళ్లం. వెన్న పూస కూడా తినే వాళ్లం. వెన్న పూస నుంచి "నెయ్యి" తయారు చేసేవారు. వెన్న ముద్ద చల్లలో పూర్తిగా మునుగుతే, ఈ ప్రపంచం అంతమై పోతుందని ఒక నమ్మకం వుండేది మా చిన్నతనంలో. ఇటీవలి కాలంలో నేను చల్ల చిలకడం చూడలేదు…..వెన్న మునగడం కూడా చూడలేదు.



నా చిన్నతనంలో మా వూళ్లో, ఆ మాటకొస్తే ఖమ్మం మేముండే మామిళ్లగూడెంలో విద్యుత్ సరఫరా లేదు. కిరోసిన్ దీపాల వెలుగులోనే వుండేవాళ్లం. ఆ వెలుగులోనే చదువుకునే వాళ్లం. నేను, బహుశా హెచ్.ఎస్.సీ చదువుతున్నప్పుడనుకుంటా....ఖమ్మం మా ఇంట్లో ఒక పోర్షన్ లో అప్పట్లో ఖమ్మం తాలూకా తహశీల్దారుగా పనిచేస్తున్న లంకా రంగారావు గారు అద్దెకుండేవారు. రంగారావు గారి అన్న గారైన లంకా సూర్యప్రకాశ సిద్ధాంతిగారితో మా నాన్నగారు మా పేరు మీద ప్రతి ఏటా పంచాంగాలు రాయించేవారు. ఆయన స్వగ్రామం ఖమ్మం పాడు. ఆ క్రితం సంవత్సరమే మామిళ్లగూడెంలో విద్యుత్ స్థంబాలు పాతారు. అంతవరకూ, పెట్రోమాక్స్ లైట్లే వీధి దీపాలు. సాయంత్రం కాగానే, చీకటి పడటానికి కొంచెం ముందర, మున్సిపాలిటీ వాళ్లొచ్చి స్తంభాలకు వీధి దీపాలు తగిలించి పోయేవారు. మా ఇంటి ముందు కూడా ఒక స్తంభం వుండేది. రంగారావు గారు తన పలుకుబడిని ఉపయోగించి 1960-1961 ప్రాంతంలో మా ఇంటికి విద్యుత్ కనెక్షన్ తెప్పించారు. మూడు పోర్షన్‌లకు మూడు విడి-విడి కనెక్షన్లు పెట్టించాం. అప్పట్లో మా ఇంట్లోనే మరో పోర్షన్ లో మాదిరాజు సుబ్బారావు గారనే వకీలుగారు అద్దెకుండేవారు. ఆయన కుమారుడు పార్థసారథి నా క్లాస్ మేట్. మేం మధ్య పోర్షన్ లో వుండేవాళ్లం. ఇక మా గ్రామానికి విద్యుత్ 1978 వరకు రాలేదు. అదే సంవత్సరం మా ఇంట్లో కనెక్షన్ పెట్టించుకున్నాం. మా పెళ్ళి జరిగినప్పుడు మా ఇంట్లో విద్యుత్ దీపాలు లేవు. ఇప్పుడైతే విద్యుత్ కనెక్షన్ లేని ఇల్లే లేదు.

ఖమ్మంలో మా ఇంటి పక్కన ఒక "భూత్ బంగళా" లో మామిళ్లగూడెం బజారు మొత్తానికి భూమి సొంతదారుడైన "కన్నప్ప" నివసించేవాడు. ఇప్పుడా ఇల్లు లేదు. అతడికి తెలుగు మాట్లాడడం రాదు. ఎప్పుడూ తాగుతుండేవాడు. మా నాన్నకు మంచి స్నేహితుడు. ఖమ్మం మామిళ్లగూడెంలో మొదటగా కట్టిన ఇళ్లలో మాది బహుశా అన్నింటికన్నా మొదటిదనుకుంటా. మాది పదహారు గదుల ఇల్లు. ప్రతి పోర్షన్ కు మూడు గదులు, ఒక వంట గది వున్నాయి. వంట గదులకు ప్రధాన పోర్షన్ కు మధ్య ఖాళీ జాగా వుంచారు నాన్న గారు. ఆ ఖాళీ జాగాలో ఒక కొస నుంచి మరొక కొస వరకు పిల్లలం కూర్చుని, ఒకరి వంటకాలు మరొకరు వాడుకుంటూ, అల్లరి-కేరింతల మధ్య భోజనం చేసే వాళ్లం. ఇంటి వెనుక భావి, ఇంటి ముందర మునిసిపాలిటీ నీటి కనెక్షన్ వుండేవి. ఇప్పటి లాగా ఫ్లెష్‌ ఔట్ మరుగుదొడ్లుండేవి కావు మా ఇంట్లో. సఫాయివాడు (స్కావెంజర్) ప్రతి రోజు వచ్చి శుభ్రం చేసేవాడు. వాడికి, నెలకు అప్పట్లో ఐదు రూపాయలిచ్చినట్లు గుర్తు.

మా చిన్నతనంలో వంటా-వార్పూ అంతా కట్టెల పొయ్యిల మీదే. స్నానానికి నీళ్లు కాగ పెట్టడం కూడా కందికట్టె నిప్పుల మీదే. ఇక ఇంట్లో వుంది "ఓపెన్ బాత్ రూమే"! ఖమ్మంలోని స్నానాల గదికి కాని, మా వూళ్లోని స్నానాల గదికి కాని, పైకప్పు లేదు. నాన్న గారు సాధారణంగా బావి దగ్గరే స్నానం చేసేవారు. అమ్మ కూడా మడి స్నానం బావి దగ్గరే. మాకు (పిల్లలకు) కూడా జీతగాడు బావిలోంచి నీళ్లు తోడి పోస్తుంటే అలా...ఒక గంట సేపు స్నానం చేసే వాళ్లం. వారానికోసారి తలంట్లుండేవి (తల మీద స్నానం). దాని కొరకు ప్రత్యేకంగా పని వాళ్లుండే వారు. ఆ పని చేసిన, వీరామ, భద్రి, మంగి, రామనర్సి (అంతా ఆడ వారే) లాంటి వాళ్ల పేర్లు కొన్ని గుర్తున్నాయింకా. ఇంటి అవసరాలకు కావాల్సిన "ఇసురు రాయి" తో పిండి (శనగ, బియ్యం, జొన్న) విసరడానికి, రోట్లో కారం-పసుపు దంచడానికి, దోస వరుగులు-మామిడి వరుగులు కోసి ఎండ పెట్టడానికి, మొక్క జొన్నలు వలవడానికి, అలాంటి పనులనేకం చేయించడానికి వాళ్లనే ఉపయోగించుకునే వారు. అంతో-ఇంతో కూలిచ్చేవారు. పంటలు చేతి కొచ్చిన రోజుల్లో అలాంటి వారికి కొంత బోనస్ కూడా ఇచ్చేవారు నాన్న గారు. నా పెళ్ళి అయ్యేంతవరకు నాకు "ఫాన్" గాలి అంటే తెలవదు. "గాస్ పొయ్యి" కూడా పెళ్ళి ఐన తరువాతే కొన్నాం. అప్పట్లో దాని ఖరీదు సిలిండర్ డిపాజిట్ తో సహా 300 రూపాయల లోపే! అది కూడా మా మామ గారి బహుమతే!


మరిన్ని విశేషాలు....మరోసారి....

4 comments:

  1. Mytheli Arvind: Paddnana chals thanks maku enno visyallu chellustunni

    ReplyDelete
  2. Turlapati Sambasivarao: A nice exercise.bt I feel it will serve more useful purpose,if you try to explain how old is gold,in culture,traditions,habits,thinking etc

    ReplyDelete
  3. Ravindranath Muthevi:

    జ్వాలా గారూ !
    మీ వివరణలు చాలా బాగున్నాయి. అందరినీ తప్పక చదివింపజేస్తాయి. 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'లో సురవరం ప్రతాప రెడ్డి గారు 1860 లో బందరులో జరిగిన ఓ వివాహంలో ఉపయోగించిన సరకుల జాబితా ఆధారంగా నాటి ధరవరలను సాధికారికంగా చదువరులకు తెలిపారు. మీరు కూడా మీ బాల్యంలోని సఫాయీ కార్మికుడు,ఇతర కూలీల సాపేక్ష (Relative)నెలసరి ఆదాయం, అలాగే ఏదైనా లిఖిత ఆధారంతో మీ వివాహం లేక మీ ఇంట్లో జరిగిన ఒక శుభ కార్యానికి అయిన ఖర్చు వగైరాలను స్థూలంగా తెలిపితే నాటి సామాన్యుల జీవనం, వారి ఆర్థిక స్థితిగతులపై చదువరులకు ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది.వెన్నముద్ద స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువైనందున చల్లపై తేలుతుంది. అది మునిగితే ప్రపంచం అంతమౌతుందనే అంధ విశ్వాసం మా ప్రాంతపు ప్రజల్లోనూ ఉంది. పోతే జీతగాళ్ళు ఊడ్చేందుకు ఉపయోగించే చీపురు కట్ట, పొరక కట్ట లేక పొలి కట్టలుగా మా ప్రాంతంలో కందికంప కంటే పరాసి కంపను ఎక్కువగా వాడతారు.ఇదే స్థాయిలో వివరణలిస్తూ మీ రచన కొనసాగించండి.
    మీ... ముత్తేవి రవీంద్రనాథ్. 

    ReplyDelete
  4. TurlapaaTi Sambasiva Rao: Mere recording of chronological events may not be of interest to readers.Autobiobiography shld not be to highlight the greatness of an individual or family.Rather it should be to bring out the ideology,highlight the wisdom associated with the time of the writter and etc.Hope as an intellectual and communicating author u will consder the suggestion in ur future parts.with best wishes

    ReplyDelete