Sunday, June 23, 2013

ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల విద్యార్థిగా: వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల విద్యార్థిగా
వనం జ్వాలా నరసింహారావు

హెచ్.ఎస్.సీ పరీక్షల్లో హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసవడమే కాకుండా లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాను. ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో చేరాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది. ఆ విషయాలలోకి పోయే ముందర ఒక్క సారి ఖమ్మం కళాశాల ఆవిర్భావం గురించి కొంత రాస్తే బాగుంటుందేమో!

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావించారట. అది తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు (జగ్గయ్య పేట వాసి) గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు ముందర శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఇటీవలే ఐదారు సంవత్సరాల క్రితం గెంటాల నారాయణరావు గారి విగ్రహాన్ని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు. గెంటాల నారాయణరావు గారి సమీప బంధువు భాను మూర్తి విగ్రహావిష్కరణకు చొరవ తీసుకోవడమే కాకుండా ద్రవ్య సహాయం కూడా చేశారు.

కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. కాలేజీ మైదానం పక్కనున్న షెడ్డుల్లో మా క్లాస్ జరిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి. సత్యనాధం లెక్చరర్, సుబ్బారావు ట్యూటర్ (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) మాకు ఇంగ్లీష్ చాలా చక్కగా బోధించేవారు. నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో (రచయిత గుర్తుకు రావడం లేదు) "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. తెలుగును ఎం. హనుమంతరావు సార్ చెప్పేవారు. ఆయన బోధించిన మనుచరిత్రలోని ఒక పద్యం ఇంకా గుర్తుంది. "అటజనికాంచె భూమిసురు డంబరచుంబి, శిర స్సర జ్ఝరీ పటల, ముహుర్ముహు ర్లుఠ, దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల, పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌, కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌". ఇక జనరల్ స్టడీస్ క్లాసులను జగన్మోహన రావు గారు, వై. వి. రెడ్డి గారు ఎంతో ఆహ్లాదకరంగా తీసుకునేవారు. వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు. ఎన్. వి. సాంబశివరావు సార్ లెక్కల సబ్జెక్ట్ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు బోధించేవారు. భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ ఎ. విస్సన్న పంతులు గారు, రసాయన శాస్త్రం ఆదిశేషా రెడ్డి గారు బోధించేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. భౌతిక శాస్త్రానికి చక్రపాణి గారు, రసాయన శాస్త్రానికి సి. ఆంజనేయులు గారు డిమాన్ స్ట్రేటర్లుగా పని చేశారు. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.


పి.యు.సి లో నా క్లాస్ మేట్స్ పేర్లు ఎక్కువగా గుర్తుకు రావడం లేదు. నా హెచ్.ఎస్.సీ క్లాస్ మేట్ ఎల్. వి.ఎస్.ఆర్. శర్మ నాతో పాటు పి.యు.సి లో కూడా చేరాడు. మరొక క్లాస్ మేట్ సి. బాల మౌళి. అతడు మా బజారులోనే (మామిళ్లగూడెం) నివసించే కొలిపాక ఆనంద రావు (అప్పట్లో సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసేవాడు) అనే మా శ్రీమతి వైపు బంధువుకు బావ మరిది. పి.యు.సి లో థర్డ్ క్లాస్ విద్యార్థిగా వున్నప్పటికీ, దరిమిలా హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసుకుని, సి.ఎ చదివి పెద్ద ఛార్టెడ్ అకౌంటెంటుగా పేరు తెచ్చుకున్నాడు. మరో పి.యు.సి విద్యార్థి సత్యనారాయణ ఇంజనీరయ్యాడు. క్లాస్ మేట్స్ గా వున్న నలుగురు అమ్మాయిల పేర్లు గుర్తున్నాయి. ఒకరు హేమ నళిని (మా బాబాయి వనం నర్సింగరావు ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు) కాగా, మరొకరి పేరు నయన తార (ఈ అమ్మాయి అక్క- నా డిగ్రీ క్లాస్ మేట్ చంద్ర లేఖను రసాయన శాస్త్రం లెక్చరర్ ఆదిశేషా రెడ్డి వివాహం చేసుకున్నాడు). ఇంకో అమ్మాయి పేరు దేవి (ఈమె అన్నయ్య బారు సీతారాం రావు నాకు సీనియర్). మరో అమ్మాయి ఫకీర్ బీ (ఈ అమ్మాయిని విద్యార్థి సంఘం నాయకుడు, ఆ తరువాత రాజకీయ నాయకుడు ఖాదర్ అలీ పెళ్లి చేసుకున్నాడు). నాకు గుర్తున్నంతవరకు ఒక్క దేవి తప్ప మిగతా అమ్మాయిలు పి.యు.సి లో ఫెయిలయ్యారు. నేను కూడా పి.యు.సి లో అత్తెసరు మార్కులతో థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. కాలేజీలో నేను పి.యు.సి చదువుతున్నప్పుడే బాబాయి వనం నర్సింగరావు బి. ఎస్సీ  డిగ్రీ మూడో సంవత్సరంలో చదువుతుండగా, ఆయన తమ్ముడు స్వర్గీయ వనం రంగారావు డిగ్రీ బి. ఏ రెండో సంవత్సరంలో చదివేవాడు.

పి.యు.సి లో చేరిన తరువాత చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఆసక్తి పెరగ సాగింది. కళాశాల రాజకీయాలపై-కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. వాటి మీద ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం బాబాయి నర్సింగరావు. ఖమ్మం కళాశాల రాజకీయాలలో నర్సింగరావు ది క్రియాశీలక పాత్రే కాకుండా "కింగ్ మేకర్" పాత్ర కూడా. ఆయనకు తోడు, బి. ఎస్సీ  డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మరో సమీప బంధువు-స్నేహితుడు కొండపల్లి శ్రీ భార్గవ కూడా కాలేజీ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించేవాడు. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ-లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అండ దండలుండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కాగా, మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. నర్సింగరావు కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ పక్షాన నాయకత్వం వహించేవాడు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా సాగుతుండేవి. కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు. కళాశాల రాజకీయాలకు మరో కేంద్రం మామిళ్ల గూడెం లోని మా ఇల్లు.

          మా ఇంట్లో మూడు పోర్షన్లుండేవి. ఒక దాంట్లో (మధ్య పోర్షన్) ఆ రోజుల్లో కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్న కె. వై. ఎల్. నరసింహారావు గారు, మరో దాంట్లో (దక్షిణ వైపు) ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్ గా పని చేస్తున్న జగన్మోహన్ రావు అద్దెకుండేవారు. ఉత్తరం వైపున్న పోర్షన్ మా కింద వుండేది. అమ్మా-నాన్నలు మా వూళ్లో ఎక్కువగా వుండేవారు. నేను హోటెల్ లో (ఆనంద రావు హోటెల్ అనుకుంటా) భోజనం చేస్తూ చదువుకునేవాడిని. బి. ఎస్సీ  ఫైనల్ ఇయర్ చదువుతున్న బాబాయి నర్సింగరావు, తమ్ముడు రంగారావుతో కలిసి వేరే గదిలో వుంటున్నప్పటికీ, ఎక్కువగా మా ఇంట్లోనే గడిపేవాడు. రాజకీయాలన్నీ అక్కడి నుంచే నడిచేవి. నేను పి.యు.సి లో చేరిన సంవత్సరం (1962-1963) జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో విద్యార్థి సంఘానికి పోటీ చేసిన వాళ్లలో సామినేని రాధాకృష్ణమూర్తి (అధ్యక్షుడు), ఖాదర్ అలీ (కార్యదర్శి), భార్గవ (కల్చరల్ కార్యదర్శి) పేర్లు గుర్తున్నాయి. ఆ ఏడాది అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన టి. రామయ్య గెలిచినప్పటికీ, కార్యదర్శితో సహా అధిక భాగం సీట్లను కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన వారం-పది రోజుల పాటు చాలా టెన్షన్ గా వుండేది. కొట్లాటలు జరిగేవి. దరిమిలా అంతా సర్దుకు పోయేది.

ఇంతకు ముందే చెప్పినట్లు నా పి.యు.సి చదువు పాడు కావడానికి మరో కారణం క్రికెట్ ఆట. కాలేజీలో చేరడంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టాను. "మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్" ఆధ్వర్యంలో మా బజారులోని ఒక ఖాళీ స్థలంలో ఆడడంతో పాటు, కాలేజీ మైదానంలో కళాశాల జట్టుకు ఆడడం కూడా చేసేవాడిని. లెక్చరర్లు వైద్య, జడ్డి, వరదరాజన్ లాంటి వాళ్ల మద్దతు కూడా బాగా లభించేది. విద్యార్థులతో సమానంగా వాళ్లు కూడా ఆటలో పాల్గొనేవారు. మా ఇంట్లో కూచుని క్యారం బోర్డు ఆడడమో, ఉదయం-సాయంత్రం క్రికెట్ ఆడడమో నిత్య కృత్యమై పోయింది. తీరిక దొరికినప్పుడు ఇంట్లో గదిలో కూడా, ఆ కాస్త స్థలంలో క్రికెట్ ఆడుతుంటే పక్క పోర్షన్ లో వుండే ఇంగ్లీష్ లెక్చరర్ కె. వై. ఎల్. నరసింహారావు గారు తరచుగ మందలించేవారు. పి.యు.సి చదువుతున్నప్పుడు, హెచ్.ఎస్.సీ చివరి రోజుల్లో కొనుక్కున్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో లెక్చరర్లు కూడా సైకిల్ మీదనే కాలేజీకి వెళ్తుండేవారు. కొందరైతే నడిచే వెళ్లేవారు. స్కూటర్లు, కార్లు లేనే లేవు. సైకిల్ పైన నేను, శర్మ డబుల్స్ పోయే వాళ్లం. గుట్టల బజార్ దగ్గర సైకిల్ తొక్కలేక ఇద్దరం దిగే వాళ్లం. వాడిని సైకిల్ తోయమని పురమాయించేవాడిని. గుట్ట ఎక్కిన తరువాత మళ్లీ డబుల్స్ రైడ్!

పి.యు.సి పరీక్షలొచ్చాయి. అప్పట్లో "పరీక్షలు రాయను" అనడం ఒక ఫాషన్. నేను అదే మాట అన్నాను మా నాన్నతో. బహుశా ఒకటో-రెండో సబ్జెక్టులు రాసిన తరువాత, మంచి మార్కులు రావని, థర్డ్ క్లాస్ లో పాసైతే, ఇంజనీరింగులో సీటు రాదని, అందుకే మిగతా పరీక్షలు రాయనని వూళ్లో వున్న నాన్నగారికి కబురు చేశాను. ఆయన హుటాహుటిన ఖమ్మం చేరుకుని, నాకు నచ్చ చెప్పి మిగతా పరీక్ష రాయడానికి ఒప్పించారు. హైదరాబాద్, వరంగల్ లలో (ఆ రోజుల్లో నాకు గుర్తున్నంతవరకు రెండే ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి) ఇంజనీరింగులో సీటు రాకపోతే, బెంగుళూరు పంపించి చదివిస్తానని అన్నారు. సరేనని చెప్పి పరీక్ష రాయడం కొనసాగించాను. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బొమ్మకంటి సత్యనారాయణ గారి సిఫార్సుతో, అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రి టి. హయగ్రీవా చారి గారి ద్వారా ఎంత ప్రయత్నించినా ఇంజనీరింగులో సీటు దొరక లేదు. బెంగుళూరు ఎమ్మెస్ రామయ్య కాలేజీలో ప్రయత్నం చేశాం కాని ఫలితం లేకపోయింది. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. శర్మ ఫెయిలయ్యాడు. చాలామంది ఫెయిలయ్యారు. ఒకరిద్దరు తప్ప ఇంజనీరింగులో-మెడిసిన్ లో సీట్లు తెచ్చుకున్నవారు లేరనే అనాలి. బాల మౌళి థర్డ్ క్లాస్ లో పాసయ్యాడు. హైదరాబాద్ వెళ్లి పోయాడు.

ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.

డిగ్రీలో ఎప్పటిలాగే చదువు, క్రికెట్, రాజకీయాలు కొనసాగాయి. చదువు తక్కువ, మిగతావి ఎక్కువ. నర్సింగరావు డిగ్రీ చదవడం పూర్తైనప్పటికీ, పరీక్ష పాసవనందున, కాలేజీతో అనుబంధం వుంచుకోవడంతో పాటు రాజకీయాలలో ఇంకా పాల్గొంటూనే వుండేవాడు. ఆయన వెంబడి మేమూ అదే పని. డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే నేను ఖమ్మంలో చదివాను. మరుసటి ఏడాది హైదరాబాద్ వెళ్లిపోయాను. ఆ వివరాలు తరువాత రాస్తాను. డిగ్రీలో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను కె. వై. ఎల్. నరసింహారావు గారు, వరదరాజన్ గారు, జడ్డి గారు, సత్యనాధం గారు బోధించేవారు. తెలుగు ఎం. హనుమంతరావు గారు. యడవల్లి ఆదినారాయణ గారు చెప్పేవారు. నాకు గుర్తున్నంతవరకు "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు" సబ్జెక్ట్ గా వుండేది తెలుగులో. బమ్మెర పోతన నాటకం కూడా వుండేది.

జనరల్ స్టడీస్ సబ్జెక్టును జగన్మోహన్ రావు, వై. వి. రెడ్డి, సుబ్రహ్మణ్యం గార్లు చెప్పేవారు. భౌతిక శాస్త్రం ఎమ్మెస్ ఆచారి గారు, . విస్సన్న పంతులుగారు బోధించేవారు. లెక్కలు కె. కోదండరాం రావు గారు, రసాయన శాస్త్రాన్ని జి. వి. నరసింహారావు (ఆర్గానిక్) గారు, ఆదిశేషా రెడ్డి (ఇన్ ఆర్గానిక్) గారు చెప్పేవారు. డిమాన్ స్తేటర్లుగా చక్రపాణి గారు, ఆంజనేయులు గారు డిగ్రీలో కూడా వుండేవారు. నా క్లాస్ మేట్స్ పేర్లు కొన్ని మాత్రమే గుర్తున్నాయి. అప్పట్లో "రౌడీ శంకర్" గా పేరు పొందిన ఎన్. శంకర్ రావు, మా ఇంటి ఎదురుగా వుండే మోటమర్రి వెంకట రామారావు, ఎస్. రాజేశ్వర రావు, సి.హెచ్. విజయ రామ శర్మ, ఎస్.ఎం.ఎన్. రాయ్, కళాధర్, నాగేశ్వర రావు, రోజా-పుష్ప అనే అక్క చెల్లెళ్లు, దేవి, చంద్రలేఖ నా క్లాస్ మేట్స్. శంకర్ రావు దరిమిలా మునిసిపల్ వార్డ్ మెంబర్ గా పని చేశాడు. వెంకట రామారావు హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేశాడు. రాజేశ్వర రావు, రాయ్, శర్మ బాంక్ అధికారులుగా రిటైర్ అయ్యారు. కళాధర్ ఏ. జి. ఆఫీస్ లో పని చేసి రిటైర్ అయ్యాడు. చంద్రలేఖ ఆదిశేషా రెడ్డి గారిని వివాహమాడింది. శర్మ, రాయ్, రాజేశ్వర రావు, నాగేశ్వర రావు క్రికెట్ ఆటగాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. మాతో పాటు మామిళ్లగూడెంలోనే వుంటుండే మా సమీప బంధువు వనం రంగారావు కూడా కాలేజీలో బి. ఎ లో చేరి క్రికెట్ ఆటగాడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. దరిమిలా రాష్ట్ర స్థాయి క్రీడాకారుడుగా ఎదిగాడు.


ఖమ్మం మామిళ్లగూడెంలో వున్న మా ఇంట్లో అద్దెకుంటుండే కె. వై. ఎల్. నరసింహారావు గారికి కాలేజీ ప్రిన్సిపాల్ గా పదోన్నతి వచ్చింది. ఆయన మా ఇంట్లో చాలా కాలం అద్దెకున్నారు. ఐతే, నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన ఏడాదే, మా కుటుంబం ఖమ్మంలో కాపురం పెట్టింది. అద్దెలకివ్వగా మిగిలిన ఒక్క పోర్షన్ మా కుటుంబానికి సరిపడకపోవడంతో కె. వై. ఎల్. నరసింహారావు గారిని ఖాళీ చేయమని మా నాన్నగారు కోరారు. ఆయన గారికి సరైన అద్దె ఇల్లు లభించనందున ఎంతకాలం గడిచినా ఖాళీ చేసే సూచనలు కనిపించ లేదు. మా కుటుంబానికి ఇంట్లో మిగిలిన ఒక్క పోర్షన్ సరిపోనందున ఎదురింటిలో ఒక భాగం అద్దెకు తీసుకుని వుండాల్సిన పరిస్థితి వచ్చింది. కె. వై. ఎల్. గారిని ఖాళీ చేయించేందుకు మా నాన్న గారు కొంత బలప్రయోగం వుపయోగించాల్సి వచ్చింది. ఆయన ఖాళీ చేయక తప్పలేదు కొంతకాలానికి. ఐతే, ఆయన కళాశాల ప్ర్రిన్సిపాల్ గా పని చేస్తున్నందున, నేను అక్కడే చదువుతున్నందున, నా చదువుకు ఆయనేమన్నా ఇబ్బందులు కలగ చేయవచ్చనే అనుమానంతో, మా నాన్నగారు నా చదువు హైదరాబాద్ కు మార్పించాలన్న ఆలోచన చేశారు. ఫలితంగా 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత ఏబై సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఆ నాడు వచ్చిన నేను, ఇక్కడే స్థిరపడి పోతానని అప్పట్లో భావించలేదు. ఆ విషయాలన్నీ ముందు---ముందు.

3 comments:

  1. ఆరంభ యవ్వనంలోని కళాశాల ముచ్చట్లు ముదమార వినేటట్లు చేస్తాయి!ముందుముందు మురిపాలవిందుకోసం ఎదురుచూస్తున్నాం!

    ReplyDelete
  2. Pavan Kondapalli: Namaste sir,Swargeeya sreeramabhakta Gentaala Narayana Rao garu maaammagaariki petallibharta vaaridi anumanchipally.Meerandaru Bhanu,Bhanumurty anipiluchukunevaari asaluperu Varkolu Janardhnrao aayanagaaru maaammagariki pedamenattarendokoduku,aayanagaaru Gentala narayan rao gari attagariki pempakampoyaaru.Narayanrao gaaribhaarya maaammagaari baabai Nedunoori jaganaadharaogaaribhaarya akkachellellu,vaaridi station karepalli(Sigareni).Bommakanti satyanarayanaraogaaru maaammagaari akkabharta.

    ReplyDelete