Monday, June 10, 2013

నానమ్మ వనం కనకమ్మగారి నుంచి మనుమరాలు కనక్ వనం వరకు-Part ONE: వనం జ్వాలా నరసింహారావు

నానమ్మ వనం కనకమ్మగారి నుంచి
మనుమరాలు కనక్ వనం వరకు-Part ONE
వనం జ్వాలా నరసింహారావు

మూడున్నర సంవత్సరాల క్రితం మూడవ సారి మా అమెరికా ప్రయాణానికి ముఖ్య కారణం కోడలు పారుల్-కుమారుడు ఆదిత్యలకు పుట్టబోయే కూతురుని చూడడం. మేం వెళ్లింది సెప్టెంబర్ 22, 2009 న. అప్పటికింకా పాపాయి పుట్టడానికి మరో రెండు నెలల వ్యవధి వుంది. ఈ లోపు దసరా-దీపావళి పండుగలను హైదరాబాద్ లో వుంటే ఎలా జరుపుకునే వాళ్లమో అలానే జరుపుకున్నాం. అక్కడా ఇండియా లాగానే తెలిసిన వాళ్లొచ్చారు. దీపాలంకరణ దగ్గర్నుంచి, కలిసి మెలిసి విందు భోజనం చేయడం వరకూ ఏ తేడా కనిపించలేదు. కాకపోతే పటాసులు కాల్చడం మాత్రం జరగలేదు.

ప్రసవ సమయంలో కాబోయే తల్లి, తన తల్లి పక్కనుండాలని భారతదేశంలో పుట్టి-పెరిగిన వారందరూ సహజంగా అనుకుంటారు. హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అది ఒక సర్వసాధారణ విషయం. గర్భిణీ స్త్రీకి తన తల్లి పక్కనుంటే అదో ధైర్యం. మా పారుల్ కు సంబంధించినంతవరకు, ఆ విషయంలో, కొంచెం తేడా వుందనాలి. వాళ్లమ్మ ను పిలిచినట్లే మా శ్రీమతిని (తన అత్త గారిని) కూడా "మమ్మీ" అని పెళ్ళి అయినప్పటి నుంచీ పిలవడం (నన్ను పాపా అని కూడా అంటుంది) వల్ల, తనకు పాపాయి పుట్టినప్పుడు, మా శ్రీమతి వున్నా అదే ధైర్యంతో వుండేదేమో ! కాకపోతే ఈ విషయంలో ఆదిత్య అది న్యాయం కాదనుకున్నాడు.

అపురూపమైనది ఆడజన్మ. ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ మాతృదేవత గా మారుతుంది స్త్రీ. అందుకే, ఆమెకు ఆ సమయంలో, కష్టం కలగకుండా ఉల్లాసంగా ఉంచుతూ, శాయశక్తులా సంతోష పెడుతుంటారు భర్త, అత్త-మామలు, తల్లి-తండ్రులు. హిందువుల ఆచారం ప్రకారం గర్భిణీ స్త్రీలకు "సీమంతం" జరిపించాలి. సాంప్రదాయం ప్రకారం,  స్త్రీ గర్భం ధరించిన తొమ్మిదో నెలలో తల్లి గారింట్లో సీమంతం జరుపుతారు. (పారుల్ అమెరికాలో వున్నందున తల్లి-తండ్రులు అక్కడే జరిపించారు).

ఈ సీమంతానికి అత్తగారు చీర, రవిక, పూలు పండ్లు, తిను బండారాలతో సారెను పెడ్తారు. ఈ సారెను కడుపు సారెఅని కూడా అంటారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె-భర్త పాటించవలసిన నియమాలు కూడా ఈ సంస్కారంలో భాగమే. గర్భవతికి సీమంతం చేసే రోజు సాయంత్రం జడను పూలతో కుట్టి అలంకరించి కుర్చీలో కూర్చొబెట్టి ఆశీర్వదింపజేస్తారు. సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. మేం అమెరికాలోనే హ్యూస్టన్ లో వుంటున్న మా రెండో అమ్మాయి కిన్నెర దగ్గరకు వెళ్లిన రెండు మూడు రోజుల్లో జరిపించారు సీమంతాన్ని పారుల్ తల్లిదండ్రులైన వర్ష-వినోద్ కపూర్ లు. మేం హైదరాబాద్ లో వుండగానే సీమంతం గురించి మా వియ్యంకులతో వివరంగా మాట్లాడాం. మా శ్రీమతికి-పారుల్ అమ్మగారి మధ్య సంభాషణ జరగాలంటే, దుబాసీగా మా బుంటి (పెద్దమ్మాయి) వుండాలి. అమెరికాలో కిన్నెర చేస్తుందా పనిని. బుంటి ద్వారా సీమంతానికి అవసరమైన వాటి వివరాలను పారుల్ వాళ్ల అమ్మకు తెలియచేయడం వల్ల, అవన్నీ ఇండియా నుంచే తెచ్చుకోవడంతో, అంతా, శాస్త్రోక్తంగా జరిగిపోయింది.

సీమంతం నాడు ఉదయమే పారుల్ కు హారతి పట్టి, మంగళ స్నానం చేయించారు. సాయంకాలం పట్టు చీరె ధరింపచేసి కుర్చీలో కూర్చోపెట్టి, పారుల్ కు తల్లి  వర్ష కపూర్తాను చెచ్చిన తెల్ల పట్టుచీరను బొట్టుపెట్టి చేతికిచ్చింది. అది కట్టు కొచ్చిన తర్వాత, ఆమె చీరె పమిటను ఒడిలా చేసి, అందులో మొదలు చలివిడిని (బియ్యపు పిండితో చేసిన తీపి పదార్ధం) మూడు వుండలుగా చేసి తల్లి పెట్టారు. తర్వాత అదే ఒడిలో, తొమ్మిదేసి చొప్పున, ఐదు రకాల తీపి పదార్ధాలను (అరిసెలు, లడ్డులు, మైసూరు పాక్, పాలకోవా, బాదూషా), మూడు రకాల పండ్లను (బత్తాయి, ఏపిల్, కమలా ఫలాలు), కొన్ని తమలపాకులు, పోకచెక్కలు (తాంబూలం) పెట్టి హారతిచ్చారు. బంగారు ఆభరణాలను  (గాజులు) చేతికి తొడిగారు. హారతిచ్చిన తర్వాత ఆహ్వానిత బంధు-మిత్రులు తమకు తోచిన విధంగా పారుల్ ఒడిలో వుంచి బహుమతులిచ్చారు. సాయంకాలం పేరంటంలో పారుల్ కు, రక రకాల గాజులు తొడిగి, వచ్చిన ముత్తైదువులకు ఆమెతో గాజులిప్పించారు. మా పారుల్ తల్లిగారి వైపు వాళ్లు సీమంతాన్ని " గోద్ భరై" అని పిలుస్తారు. వేడుక మాత్రం అంతటా ఒకటే. మేం హ్యూస్టన్ నుంచే ఆశీర్వదించాల్సి వచ్చింది.

ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కాకపోతే కొంత ఆలస్యంగా వచ్చింది. నవంబర్ 24 ఉదయం 8-36 కు (విరోధి నామ సంవత్సరం-మార్గ శిర మాసం-సప్తమి తిథి-ధనిష్ట నక్షత్రం-కుంభ రాశి) ఆదిత్య-పారుల్ కూతురు-మా మూడో మనుమరాలు కనక్ పుట్టిందన్న వార్త విని ఆనందంతో ఆ వార్తను బంధు మిత్రులతో పంచుకున్నాం. వారంరోజుల కిందనే అవుతుందనుకున్న డెలివరీ కాకపోవడంతో పారుల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అతుల్ షేథ్  సలహామీద, "ఎల్కమీనో రిఆల్ ఆసుపత్రిలో"  సీ-సెక్షన్ చేయాల్సి వచ్చింది.


మా ఆదిత్యకు ఇంతకు ముందు సెప్టెంబర్ 3, 2003న ఏకాదశి-పునర్వసు సంగమంలో కొడుకు పుట్టాడు. ఢిల్లీలో గుర్గాంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టిన వాడి పేరు అన్ష్. వాడిప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్)లో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే నన్ను మొదలు తాతను చేసింది మా రెండో అమ్మాయి కిన్నెర. అమెరికా-సిన్సినాటిలో వున్నప్పుడు ఆగస్ట్ 4, 1999 అక్కడి బెతెస్ఢా ఆసుపత్రిలో పుట్టాడు మా మొదటి మనుమడు. అశ్వినీ నక్షత్రంలో పుట్టిన వాడికి "యష్విన్" అని పేరు పెట్టాం.

ఆ తర్వాత మా పెద్దమ్మాయి బుంటి (ప్రేమ మాలిని) నాకు మొదటి మనుమరాలిని ఇచ్చింది. అపురూపంగా ఫిబ్రవరి 18, 2001న హైదరాబాద్ లోని ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో పుట్టిన దాని పేరు " (భువన) మిహిర". అదిప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) లో ఎనిమిదవ తరగతి చదువుతున్నది. ఇక మధ్యలో మరో మనుమరాలినిచ్చింది కిన్నెర. ఏప్రియల్ 15, 2004 న అది కూడా సిన్సినాటిలోని బెతెస్ఢా ఆసుపత్రిలోనే పుట్టింది. దాని పేరు "మేథ". యష్విన్ ఇప్పుడు ఎనిమిదవ గ్రేడ్, మేథ ఆరో గ్రేడ్ హ్యూస్టన్ లో చదువుతున్నారు. ఇలా ముగ్గురు మనుమరాళ్లతో, ఇద్దరు మనుమళ్లతో నాకు-మా శ్రీమతికి ఎప్పుడూ "అసలు కంటె కొసరెక్కువ" అన్న నానుడి ప్రకారం, వాళ్ల గురించిన ఆలోచనే. హైదరాబాద్ లో వుంటే అమెరికాలో పిల్లలెరా వున్నారని, అమెరికాకు వస్తే అక్కడ హైదరాబాద్ లో వాళ్లేం చేస్తున్నారని దిగులే. అయితే, అక్కడా-ఇక్కడా వుండలేం కదా ! గూగుల్ ఆసియా పసిఫిక్ దేశాల మానవ వనరుల డైరెక్టర్ గా, మా అబ్బాయి ఆదిత్య ఉద్యోగరీత్యా ఒక ఏడాది క్రితం సింగపూర్ బదిలీ అయ్యాడు. ప్రస్తుతం అక్కడే కాపురం.

అదిత్య కంటె ముందు మాకు ఇద్దరాడపిల్లలు కలిగారు. వీడొక్కడే కొడుకు. నేను మా అన్నదమ్ముల్లో పెద్దవాడిని. అలానే ఆదిత్య తరంలో మా అన్నదమ్ముల పిల్లల్లో వీడే పెద్ద. (దత్తు పోయిన మా తమ్ముడు నా కంటే ముందే పెళ్లి చేసుకున్నందున వాడి కొడుకు ఆదిత్య కంటె పెద్ద). అప్పట్లో (1969) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నందువల్ల, మా పెళ్లైన వెంటనే నేను, నాగ్ పూర్ లో ఎం. ఏ చదవడానికి వెళ్లాను. అయితే పేరుకే నాగ్ పూర్ చదువు గాని, ఎక్కువ సమయం ఖమ్మం-కృష్ణా పురంలో గడిపేవాడిని. ఏదో విధంగా 1969-71 విద్యాసంవత్సరంలో చదువు పూర్తిచేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకొని ఇంటికొచ్చాను. వచ్చిన కొన్నాళ్లకే జులై 8, 1971 న వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మా పెద్ద అమ్మాయి ప్రేమ మాలిని (బుంటి) పుట్టింది. మా శ్రీమతి వాళ్ల రెండో అన్నయ్య డాక్టర్ వేణు మనోహరరావు అప్పట్లో వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మెడిసిన్ ఆఖరు సంవత్సరం చదువుతున్నందువల్ల, ఆయనకు అక్కడున్న ప్రముఖ వైద్యులందరూ పరిచయం వుండడం వల్ల, మా ఆవిడ ప్రసవానికి వరంగల్ ను ఎంపికచేసుకున్నాం.

మా శ్రీమతికి అప్పటికింకా పట్టుమని పదిహేడేళ్లు కూడా నిండలేదు. మా పెళ్లప్పుడు నాకు 21సంవత్సరాల లోపైతే, మా ఆవిడకు 15 ఏళ్లు నిండలేదు. ఇప్పుడు మా పెద్దమ్మాయి "మెరుగైన సమాజం కోసం" అంటూ నిరంతరం తెలుగు వార్తలు ప్రసారం చేస్తున్న టీవీ-9 లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నది. నేను బి. హెచ్. ఇ. ఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నాటి పరిచయస్తులైన మండపాక సత్యవాణి-భాస్కరరావు దంపతుల కుమారుడు విజయ గోపాల్ ను (అక్టోబర్ 19, 1994) వివాహమాడింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని "హెచ్.ఎం.ఆర్.ఐ" సంస్థలో పనిచేస్తున్నారు. బుంటి వాళ్లు హైదరాబాద్ శ్రీనగర్ కాలొనీలో, అదెకుంటున్నారు.

రెండో కూతురు కిన్నెర, పెద్దమ్మాయి పుట్టిన ఏడాదిన్నరకు పుట్టింది. అప్పట్లో ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ పాండు రంగారావు (ఎ. పి. రంగారావు) మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి రెండు పురుళ్లు పుట్టింట్లో పోసుకోవడం ఆనవాయితీ. పుట్టిల్లంటే సోదరుల ఇళ్లు కూడా కావచ్చు. మొదటి కాన్పుకు, వరంగల్ లో వున్న చిన్నన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు మా అత్తగారు-మామగారు. రెండో దానికి భద్రాచలం తీసుకెళ్లారు వాళ్ల పెద్ద కొడుకు దగ్గరకు. నవంబర్ 2, 1973 న మా రెండో కూతురు పుట్టింది. ఆ ఆవిడ పుట్టిన తేదీ కూడా అదే కావడంతో, సరిగ్గా 19 సంవత్సరాల వయస్సులో మా ఆవిడ రెండో కూతుర్ని కనింది. భద్రాచలం అనుకుని ప్రవహిస్తున్న "కిన్నెర సాని" నదిని జ్ఞప్తికి తెచ్చుకునేందుకు, మా మామగారు అయితరాజు రాంరావు-అత్తగారు రాధ గారి కోరిక మేరకు దాని పేరు "కిన్నెర" అని పెట్టాం. అది నాగ్ పూర్ సమీపంలోని రాంటేక్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్స్ పూర్తిచేసి, అప్పట్లో హైదరాబాద్ లోని హెచ్.. ఎల్ లో పనిచేస్తున్న కొణికి లక్ష్మీ సుందరి-శ్రీహరి రావు గార్ల కుమారుడైన వెంకట్ శ్రీ కిషన్ ను వివాహం చేసుకుంది (మే 8, 1997). ప్రస్తుతం వాళ్లిద్దరు అమెరికా పౌరులుగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరం షుగర్ లాండ్ లో వుంటున్నారు. అక్కడి పెట్రోలియం సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దాని పిల్లలే మనుమడు "యష్విన్", మనుమరాలు "మేథ". యష్విన్, మేథ హ్యూస్టన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూన్నారు.


తరువాత భాగం మరో సారి...

1 comment: