Thursday, June 6, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part ONE: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part ONE
వనం జ్వాలా నరసింహారావు

ఎక్కడనుంచి మొదలెట్టాలో సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు.....బుద్ధి తెలిసినప్పటినుంచి ప్రారంభిస్తాను. వ్యవసాయం, కరిణీకం వృత్తిగా, పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని వనం వారి కృష్ణా పురం అనే ఒక కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 న పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. ఆరవ తరగతి నుంచి ఖమ్మంలో విద్యాభ్యాసం కొనసాగినప్పటికీ, తరచుగా గ్రామానికి వెళ్లొస్తుండేవాడిని.

మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. చిన్నతనంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లొచ్చిన తరువాత, ఇంటికి రాగానే మేం పాఠశాలకు వేసుకెళ్లిన దుస్తులు విడిపించేవారు మా పెద్దలు. స్కూల్లో మైల పడిపోయామని వాళ్ల భావన. స్నానం చేసిన తరువాతే శుద్ధి ఐనట్లు పరిగణలోకి తీసుకునేవారు. మా బావి నీరు ఉప్పు నీరు. మంచినీటిగా తాగడానికి ఉపయోగపడదు. మా జీతగాడు వెంకులు ప్రతిరోజు వాళ్లింటి బావి నుంచి ఒక రెండు బిందెల మంచి నీళ్లు పట్టుకొచ్చేవాడు. అందులో మా అమ్మ కొద్దిగా చల్ల (మజ్జిగ) చుక్క వేసేది. అలా చేయడంతో ఆ నీళ్లు మజ్జిగతో సమానమని ఆమె నమ్మకం. ఇంట్లో వంట మడి కట్టుకుని చేసేవారు. వంట చేయడానికి ఒక అయ్యగారుండేది.  మామిడి కాయ వూరగాయలు కూడా మడితోనే పెట్టేవారు మా అమ్మ. రోజువారీ ఉపయోగానికి కొంత మోతాదులో బయటుంచుకునేవాళ్లం. అవి ఐపోతే, మళ్లీ మడి కట్టుకునైనా తీసేవారు, లేదా, పిల్లల్లో ఒకళ్లని "బరివాత" (వంటి మీద బట్టలేమీ లేకుండా) తీయించేవారు. అలా చేయడం మాకెంతో ఇష్టం కూడా. మా వూరు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. అత్యధిక సంఖ్యలో గిరిజనులున్న జిల్లా మాది. అత్యధికంగా షెడ్యూల్డ్ ప్రాంతం వున్న జిల్లా కూడా మాదే. దేశంలో ప్రసిద్ధికెక్కిన భద్రాచల రామాలయం మా జిల్లాలోనే దండకారణ్యంలో వుంది. రామాలయం కట్టించిన కంచర్ల గోపన్న-భక్త రామదాసు మా సమీప గ్రామం నేలకొండపల్లి వాస్తవ్యుడు. అది మా మేనమాముండే వూరు. నేలకొండపల్లిలో ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా ఇప్పటికీ పిలుస్తున్నారు. మా రెవెన్యూ గ్రామమైన ముత్తారంలో కూడా పురాతన రామాలయం వుంది. ఆ దేవాలయానికి కూడా చాలా చారిత్రక ప్రాముఖ్యత వుంది. ఆ వివరాలు మరో సందర్భంలో రాస్తాను. 

బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, ఆ బాల్యంలో నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ, కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామ పెద్దలతోనూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పొరుగూర్లో వున్న పెదనాన్నగారితో ఆయన మెలిగిన విధానం-తర తరాల వైరం మరిచిపోయేందుకు అందించిన స్నేహ హస్తం-స్నేహ ధర్మం తప్పిన ఆయనపై నాన్న తిరుగుబాటు, సాధించిన తిరుగులేని విజయం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని, నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మపేట, ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్న చెప్తే తెలుసుకున్నాను. కొన్ని స్వయంగా చూసాను. నా చిన్నతనంలో నాన్న గుర్రం స్వారీ చేస్తూ, తెల్లటి కమీజు ధరించి, ధోవతి కట్టి బయటకు వెళ్లడంవెళ్తున్నప్పుడు గ్రామ వీధుల్లో అరుగులమీద కూచున్న వారందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం బాగా జ్ఞాపకం వుంది. ఆయన కమీజుకు పెట్టుకున్న బంగారపు గుండీలు కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత కాలంలో సైకిల్ పై వెళ్లేవారు కొన్నాళ్లు. ఆయన అమ్మపేట గ్రామం పట్వారీ.


         నా చిన్నప్పటి ఆటపాటలింకా మదిలో మెదులుతూనే వున్నాయి. మా ఇంటికి ఎదురుగా మా వూరి "పటేల్" గారిల్లుండేది. ఆయన పేరు తుల్లూరి రామయ్య. మా వూరి పెత్తనమంతా చాలావరకు ఆయనదే. ఆయన మొదటి భార్య తమ్ముడు, కూతురు భర్త బయన నరసింహారావు మా వూరి పోస్ట్ మాస్టర్. ఆయనే నాడు ఇల్లు వదిలి బయటకు రాడు సాధారణంగా. మా వూళ్లోని ఇతర పెద్ద మనుషులలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వారు పర్చూరి వీరభద్రయ్య, బత్తుల సత్యనారాయణ, బత్తుల సురేందర్, చాగంటి వారు, నీరు కొండవారు, పక్క శివారు గ్రామం కోదండరామపురంలోని వాడపల్లి రాజేశ్వర రావు గారు...తదితరులు. ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, మా నాన్న, ఎదురింటి పటేల్ రామయ్య, కొంచెం దూరంలో వున్న బత్తుల సత్యనారాయణ మా ఇంటి బయట వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వూళ్లో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే అదే సమయంలో ఆ కార్యక్రమం కూడా జరిగేది. నేను, పటేల్ కొడుకు వెంకట్ రావు కూడా మా తండ్రులను అనుకరిస్తూ, వేప పుల్లతో పళ్లు తోముకుండేవాళ్లం. గ్రామాల్లో పంచాయతీ తీర్పులు అమోఘంగా వుండేవి. అన్నీ పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. న్యాయస్థానాలలో మాదిరిగా "అపీల్" లేదు. ఒక సారి పెద్ద మనుషులు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో ఒకరిద్దరు కూడా వుండేవారు.

          వీళ్లందరిలోకి నాకు అనుబంధం ఎక్కువగా మా ఇంటి ఎదురుగా వుండే "బయన" వారి కుటుంబంతోనే వుండేది. ఆ ఇంటిని "బయమోరి ఇల్లు" అని వూరంతా పిలిచే వాళ్లం. పటేల్ కొడుకు వెంకట్ రావు నా క్లాస్ మేట్. నా వయస్సే. మేమిద్దరం, మాతో పాటు తాతోరి వెంకటేశ్వ్రర్లు, పురుషోత్తం రావు, మల్లెల నరసయ్య....ఇలా కొంతమందిమి కలిసిమెలిసి ఆడుకునేవాళ్లం. మరో క్లాస్ మేట్ చట్టు వెంకయ్యతో కలిసి సమీపంలోని అడవికి పోయి "తుమ్మ బంక" తెచ్చుకునే వాళ్లం. మా అక్కయ్య రాధమ్మకు బయన నర్సయ్య భార్య మధురమ్మతో స్నేహం. మధురమ్మ చెల్లెలు (వెంకట్ రావుకు కూడా చెల్లెలే) "బేబి", నేను, వెంకట్ రావు కలిసి "అచ్చన గిల్లలు", "వాన గుంటలు" ఆడేవాళ్లం. సాయంత్రాలు కొఠాయివైపుకు వెళ్ళి "గోలీలు", "బలిగుడు-చెడు గుడు" (కబడ్డీ), "బెచ్చాలు", "పత్తాలు", "జిల్ల గోనె", "దస్తీ ఆట". "తొక్కుడు బిళ్ల" ఆడేవాళ్లం. మధురమ్మ, మా అక్కయ్య కలిసి "పచ్చీసు" ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం.  

మధ్య మధ్య మా వూరి పట్వారీ (అసల్దారు కాదు...గుమాస్తా), మాకు సమీప బంధువు కొండపల్లి సుందరయ్య తాత గారి మనుమలు, మనుమ రాళ్లు (కూతుళ్ల పిల్లలు) తాతగారి ఇంటికి శెలవులకు వస్తుండేవారు. మేమంతా కలిసి ఆడుకునే వాళ్లం. ఆయన పెద్ద కూతురు సుగుణమ్మది గంగారం గ్రామం. రెండో కూతురు మధురమ్మ, మూడో కూతురు లక్ష్మీబాయిలది బలపాల. మధురమ్మను మా పెద మేనమామ, లక్ష్మీబాయిని మా రెండో మేనమామ వివాహం చేసుకున్నారు. నా వయసున్న ఆడపిల్ల (అత్త కూతురు) సీతా మహాలక్ష్మి సుగుణమ్మ కూతురు కాగా, మధురమ్మ కొడుకు ప్రభాకర్, సవతి కొడుకు మోహన్ రావులు నా వయసున్న వారే. లక్ష్మీబాయి కూతురు రాజ్యం నా కంటే చిన్నది కాని మాతో పాటే ఆడుకునేది. రాజ్యం చెల్లెలిని మా తమ్ముడు వివాహమాడాడు. సుగుణమ్మత్తయ్య కూతురు సీతతోను, లక్ష్మీబాయత్తయ్య కూతురు రాజ్యంతోను, తుల్లూరి రామయ్య కూతురు బేబితోను ఎక్కువగా "అచ్చన గిల్లలు" అడేవాడిని చిన్నతనంలో. ఓడిపోయిన వారికి "పులుసు పోయడం" అని పందెం వుండేది.  బలే సరదా ఐన ఆట అది. మా పెద తమ్ముడు వెంకట రమణ కూడా మాతో కలిసేవాడు. వాడికీ, నాకు వయసులో మూడేళ్ల తేడానే. సుందరయ్య గారిని మా నాన్న "కంస మామా" అని సంబోధించేవాడు. చిన్నప్పుడు పొలాలకు పోవడం అలవాటే. అదే విధంగా మా పక్క వూళ్లో-కమలాపురంలో వుండే వనం నర్సింగరావు కూడా మధ్య మధ్య మా వూరికి రావడమో, లేక మేం అక్కడకు పోవడమో జరుగుతుండేది. నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామం భార్గవ కూడా మా చిన్న తనంలో ఆటపాటల్లో మాతో కలిసేవాడు.


మా అక్కయ్య రాధను మా గ్రామం సమీపంలో, ఆరేడు కిలోమీటర్ల దూరంలో వున్న నాచేపల్లి గ్రామ వాస్తవ్యులైన ముదిగొండ చలపతిరావు అలియాస్ సహదేవరావుకు ఇచ్చి వివాహం చేశారు. చలపతి రావును మా అమ్మమ్మ (అమ్మ పెంపకపు తల్లి) గారు పెంచుకున్నారు. వారికి సంతానం కలగకపోతే, ఒక ఆడపిల్లను (మా అమ్మ), ఒక మగ పిల్లవాడిని (మా బావ-మామయ్య) దత్తత తెచ్చుకున్నారు. మా అక్కయ్య వివాహం ఆ రోజుల్లో (1955 ప్రాంతంలో) ఐదు రోజులు వైభవోపేతంగా జరిపించారు మా నాన్న గారు. హరి కథలు, బుర్ర కథలు కూడా ఏర్పాటు చేసారు. శెలవుల్లో అమ్మమ్మగారి గ్రామం నాచేపల్లి వెళ్లే వాళ్లం. మా తాత గారు పరమ రామ భక్తుడు. ఉదయాన్నే లేచి, అలా నడుచుకుంటూ వెళ్ళి, కిలోమీటర్ దూరంలో వాళ్ల గ్రామంలో వున్న రామాలయాన్ని సందర్శించి వచ్చేవాడు. అది నిత్య కృత్యం. స్నానం చేసిన తరువాత కనీసం నాలుగైదు గంటలన్నా పూజ చేసేవాడు. ఇంట్లో "సాల గ్రామం" వుండేది. మేం శెలవుల్లో వెళ్లినప్పుడు మాకు భారత, భాగవత, రామాయణంలోని అనేక గాధలను కథలు-కథలుగా మలిచి చెప్పేవాడు. ప్రతి ఏటా ఆ వూరి రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే వారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతూనే వుంది. దాదాపు ప్రతి పండుగకు మా అక్కా-బావలను మేం మా వూరు తీసుకొచ్చే వాళ్లం మా చిన్నతనంలో. అందులో ప్రధానమైంది "బ్రతుకమ్మ" లేదా "బతుకమ్మ" పండుగ.

9 comments:

  1. interesting..plz continue

    ReplyDelete
  2. ఆత్మకథ నల్లేరుమీద బండినడకగా సాగుతోంది ఆపక అలాగే కొనసాగించండి!

    ReplyDelete
  3. Naraparaju Narasinga Rao: ఈ మడి ఆచారాల వల్ల..వెంకయ్యను వెంకులు అని .నాగయ్యను నాగులు ఎని పిలవటం వల్ల మనలను ఇప్పటి సమాజం వేరు చేసిందేమో అని నా భావన..అప్పుడు గ్రామ కరణం వీధిలో వెళుతుంటే గౌరవంకొద్దీ తప్పుకొనే వారు ..కానీ ప్రస్తుతం చాలా మంది విశ్లేషకులు అది గౌరవం కాదు భయం అని అందుకె అలా ప్రవర్తించారని అప్పుడప్పుదూ టి.వి చర్చలలో అంటున్నారు ...కొంత మద్మి

    ReplyDelete
  4. Ravindranath Muthevi

    జ్వాలా గారూ !
    మీకంటే నాలుగు సంవత్సరాల రెండు నెలలు చిన్నవాణ్ణి నేను. మీది ఖమ్మం జిల్లా. మాది గుంటూరు జిల్లా తెనాలి. అయినా మీ బాల్యంలోని ఆటలూ- అనుభవాలూ, మా ప్రాంతపు ఆటలూ, వినోదాలూ ఒకే విధంగా ఉండడం విశేషం. 'కొఠాయి' అంటే కోటా ? మేము వామన గుంటలు (లోతు తక్కువ గుంటలు) అని పిలిచే ఆటనే మీరు 'వాన గుంటలు' అన్నట్లున్నారు? 'జిల్ల గోనె' ఆట ఏమిటో కొంచెం వివరిస్తారా ? ఆటల్లో ఓడినవాళ్లకు పులుసు పోయడాన్ని ప్రస్తావించి నన్ను కూడా నా బాల్యపు స్మృతి సంద్రం లోకి నెట్టేశారు మీరు.మీ శైలి చక్కగా ఉంది. అయితే మీరు వివరించిన బాంధవ్యాలు మాత్రం ఒక్కసారి చదివితే అ౦తుచిక్కేవిగా లేవు.మీ గత స్మృతుల నెమరువేత మున్ముందు చదువరులందరికీ విజ్ఞానదాయకం కాగలదని విశ్వసిస్తూ ----------- మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.

    ReplyDelete
  5. Mythili Abbaraju: డాక్టర్ ని చూసి పేషెంట్ లు ఇంకా ఎందుకు లేచి నిలుచుంటున్నారు?

    ReplyDelete
  6. Naraparaju Narasinga Rao: మీరన్నది నిజమే మేడం కానీ కొంత మంది వ్యక్తులు అలా అనుకోకపోవటం వల్ల వాళ్ళు ఇలాంతి వాళ్ళను విలన్ గా చిత్రీకరిస్తున్నారు

    ReplyDelete
  7. DrGvijayaramarao Ex MP: karanam demands the respect otherwise irrespective of the reason he punishes ruthlessly where as doctor by vitue of rendering service without his knowledge draws the respect

    ReplyDelete
  8. Naraparaju Narasinga Rao: అన్ని గ్రామాలలో అందరూ అలా లేరని గుర్తించాలి..ప్రజల మనస్సు దోచుకొన్న వారు వున్నరు..
    ప్రజలకు తమ స్వంత ఆస్తిని దానం చేసిన వారు వున్నారు..

    ReplyDelete
  9. Sampath Kumar: What was stated by DrGVijayarama Rao is more suitable and even a bit more expanded into the other connected behavioral issues.

    ReplyDelete