Monday, June 10, 2013

నానమ్మ వనం కనకమ్మగారి నుంచి మనుమరాలు కనక్ వనం వరకు-Part TWO: వనం జ్వాలా నరసింహారావు

నానమ్మ వనం కనకమ్మగారి నుంచి
మనుమరాలు కనక్ వనం వరకు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు

ఇద్దరు ఆడపిల్లలు పుట్టింతర్వాత ఇక ఆగుదామనుకున్నాం. పాతకాలంలా కాకుండా, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనడం మానేస్తున్న రోజులవి. కొంచెం ఆలోచనలో పడ్డాం. ఎటూ నిర్ణయించుకోలేని వయసు మాది. బుంటి పుట్టిన కొద్ది రోజులకే నాకు ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్ గా ఉద్యోగం వచ్చింది. అంతకు కొద్దిరోజుల క్రితమే ఎం. ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పాసయ్యాను. ఉద్యోగం-పిల్లలు అంటే, సంసార సాగరం ఈదడం మొదలయిందన్న మాట. మాకు ఆస్తిపాస్తులు బాగానే వున్నప్పటికీ, అప్పట్లో మూడు-నాలుగేండ్లు వర్షాభావం వల్ల వరి పంటలు సరిగ్గా పండలేదు. మనలాంటి వాళ్లకు కొంత వెసులుబాటుగా వున్నా, ఒక విధంగా కరవు-కాటకం రోజులనవచ్చు. నాకొచ్చే జీతం నెలకు 230 రూపాయలే. అందులోనే ఇల్లెందుకు రాను-పోను చార్జీలు కూడా భరించాలి. మూడు నెలల్లోనే నా అభ్యర్థనను మన్నించి అప్పటి జిల్లా విద్యా శాఖాధికారి శ్రీమతి షహజానా బేగం నన్ను ఖమ్మం శాంతినగర్ హైస్కూల్ కు మార్చింది అదే పోస్టులో. ఆమె ప్రోద్బలంతో 1973-1974 బాచ్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం "బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్" పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ లో చేరాను. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అవిడకు పెళ్లిలో మా నాన్నగారు ఆభరణంగా ఇచ్చిన బంగారపు గొలుసును 1200 రూపాయలకు బాంక్ లో కుదువ పెట్టి, ఆ డబ్బుతో, చదువుకున్నాను. చేస్తున్న లైబ్రేరియన్ ఉద్యోగానికి శెలవు పెట్టాను. కొంత శెలవు జీతం కూడా వచ్చేది. మొత్తం మీద యూనివర్సిటీ సెకండ్ రాంక్ సాధించి లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ తెచ్చుకున్నాను. మా నాన్నగారు ఆ తర్వాత బాంక్ నుంచి గొలుసును విడిపించి మాకిచ్చారు. డిగ్రీ పరీక్షలు రాయడానికి ముందే బి.హెచ్.ఇ.ఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉద్యోగం దొరికింది.

సరిగ్గా ఆ సమయంలోనే, అబ్బాయికొరకు ఆగాలా, ఆపరేషన్ చేయించుకోవాలా అని తటపటాయిస్తుండగానే, ఆదిత్య పుట్టడానికి రంగం సిద్ధమయింది. ఇక మా చేతులో లేదు. మనసులో వున్న కోరికను భగవంతుడు అలా తీర్చాడు. మొదటి రెండు పురుళ్లు పుట్టింటిలో జరిగాయి కాబట్టి, ఇది, మా నాన్న-అమ్మల ఆధ్వర్యంలో, ఆప్యాయతల-అనురాగాల మధ్య, పుట్టింట్లో ఎంత గారాబంగా, అనురాగంగా జరిగిందో, అలానే జరిగింది. ఖర్చంతా వాళ్లదే. నాన్న-అమ్మ అప్పట్లో ఖమ్మంలో వుంటున్నారు. ఖమ్మంలో అదే రోజుల్లో డాక్టర్ వైవి. రామారావు-ఆయన సతీమణి డాక్టర్ ఆంధ్ర జ్యోతి మా ఇంటికి సమీపంలో కొత్తగా ఆసుపత్రి కట్టించారు. ప్రారంభం అయిన నాడే, మా ఆవిడ ఆదిత్యను కనిందక్కడ. ఆ ఆసుపత్రిలో అయిన మొదటి కాన్పు కూడా అదే. నాకింకా గుర్తుంది ఆరోజు. మా నాన్న సాయంత్రం (డిసెంబర్ 24, 1975) నాలుగున్నర గంటల ప్రాంతంలో మామిళ్లగూడెంలోని ఇంటికొచ్చి, ఆదిత్య పుట్టిన సంగతి చెప్పాడు. వాడి తరంలో మా ఇంట్లో పెద్దవాడే కాకుండా, వాడే మా నాన్నకు పెద్ద మనుమడు. వాడి బారసాల అంగరంగ వైభోగంగా జరిపించారు మా నాన్న-అమ్మ. అంతకు ముందు కూడా బుంటి-కిన్నెర బారసాలలను అలానే జరిపించారు. ఆదిత్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివి, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, "టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ముంబై)" లో హ్యూమన్ రిసోర్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి, ప్రస్తుతం "గూగుల్" సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మానవ వనరుల శాఖలోని ఒక అంతర్జాతీయ విభాగానికి, అదిపతి హోదాలో,ఉన్నత స్థాయికి చెందిన ఉద్యోగం అది. అమెరికా శాన్ ఫ్రాన్ సిస్కో లో వుంటుండే ఆదిత్య ఉద్యోగరీత్యా బదిలీ అయి సింగపూర్ వెళ్లాడు. భార్య పారుల్ (వివాహం ఆగస్ట్ 20, 2008న జరిగింది) కూడా హెచ్.ఆర్ నిపుణురాలిగా కేడెన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదక్కడే. ఆదిత్య కొడుకే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న "అన్ష్".

మా అబ్బాయికి ఆదిత్య కృష్ణ రాయ్ అని పేరు పెట్టడానికి ఒకటికంటే ఎక్కువే కారణాలున్నాయి. ఆ రోజుల్లో ఆ పేరున్న వాళ్లు అరుదు. అదొక రకంగా అప్పట్లో కొత్త పేరు. మా నాన్నగారికి మా పూర్వీకులైన కృష్ణ రాయలుగారి పేరు పెట్టాలని కోరికుండేది. మా ఆవిడకు "ఆదిత్య" అన్న పేరు పెట్టాలని కోరిక. నా ఆలోచన వేరే విధంగా వుండేదప్పట్లో. నేను మొదటి నుంచీ కమ్యూనిస్ట్ అభిమానిని. కమ్యూనిస్ట్ ఉద్యమం ఎక్కడ జరిగినా-ఎందుకు జరిగినా, ఆసక్తిగా పరిణామాలను గమనిస్తుండే వాడిని. అప్పట్లో ఇండొనేషియాకు "సుకర్ణో" అనే బలవంతుడు అధ్యక్షుడుగా వుండే వాడు. వాడిని ప్రపంచమంతా ఒక విధంగా అభిమానించే దా రోజుల్లో. తనను తానే "బంగ్కర్ణో" గా అభివర్ణించుకునే వాడు అతడు. అంటే "తిరుగులేని నాయకుడు" అని అర్థమట. అతడి నియంతృత్వానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన విద్యార్థి ఉద్యమం కమ్యూనిస్ట్ యువ నాయకుడు "ఆదిత్య" (అయిదిత్) నేతృత్వంలో సాగింది కొన్నాళ్లు. అతి కర్కశంగా దాన్ని అణచివేసింది సుకర్ణో ప్రభుత్వం. అయిదిత్ ను ఏమీ చేయలేకపోయారని, అతడెప్పటికైనా వచ్చి తమను కాపాడుతారని సహచర విద్యార్థులు అప్పట్లో భావించేవారు. "ఇండొనేషియన్ అప్ హీవెల్" అనే పుస్తకంలో ఈ విషయాలన్నీ చాలా వివరంగా దొరుకుతాయి. ఇండొనేషియాకు, భారతదేశానికి అవినాభావ సంబంధముండేది. వాళ్ల పేర్లు చాలా వరకు భారతీయుల పేర్ల లాగానే వుంటాయి. ఆ అయిదిత్ స్ఫూర్తితోనే నేను నాకు కొడుకు పుటితే, అతడి పేరు పెట్టుకుందామనుకునే వాడిని. అలా మా అబ్బాయి పేరు అందరం కలిపి పెట్టాం-"ఆదిత్య కృష్ణ రాయలు" అని. ఎలా మారిందో కాని వాడిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చేర్పించేటప్పుడు, అది "ఆదిత్య కృష్ణ రాయ్" అయిపోయింది.


అసలింతకీ అన్నీ చెప్పి, బుంటి పేరు గురించి చెప్పలేదు కదా ! చెప్పకూడదనుకున్నాను-కాని చెప్తున్నాను. ఎందుకో అప్పట్లో హేమమాలిని సినిమాలంటే ఇష్టం కావడంతో, కొంచెం మార్చి, "ప్రేమ మాలిని" అని పెట్టాం. అదేమో ఇప్పుడు "ప్రేమ" అని మాత్రమే చెప్పుకుంటుంది. రెండు "నంది బహుమతులను గెల్చుకున్న" ప్రేమ-టీవీ 9 (ప్రజా పక్షం) అంటే అందరికీ తెలుస్తుంది. ఇక "బుంటి" అని పిలవడానికి కూడా కారణముంది. నాకు "ఉడ్ హౌజ్" నవలంటే ఇష్టం. "ఉడ్ హౌజ్" కు "బుంటి" అంటే ఇష్టం. అది కాకుండా అప్పట్లో "ద లాస్ట్ లెటర్" అనే సినిమా వచ్చింది. "ఆఖ్రీ ఖత్" అనుకుంటా. అందులో చిన్న పిల్ల కారెక్టర్ "బంటి". మొత్తం మీద కొంచెం మార్చి ముద్దుగా దాన్ని అందరం "బుంటి" అని పిలిచే వాళ్లం.

నవంబర్ 24, 2009 న పాపాయి పుట్టి నందువల్ల, హిందువుల ఆచారం ప్రకారం పదకొండు రోజుల వరకు అంటే డిసెంబర్ 4, 2009 వరకు "పురుడు"గా భావిస్తారు. ఆ పదకొండు రోజులు పూజా-పునస్కారాలకు దూరంగా వుండాలి. పదకొండో రోజున పురిటి స్నానం చేసిన తర్వాత, కొన్ని శాస్త్రోక్తమైన కార్యక్రమాలు-వేడుకలు చేసుకోవడం కూడా ఆచారంలో భాగమే. బహుశా ఇలా పదకొండు రోజులు, అన్ని పనులకు దూరంగా వుండడం కూడా మన పూర్వీకులు ఆలోచించే చేసుంటారు. ప్రసవించిన స్త్రీని శుచిగా-శుభ్రంగా, వుంచడానికి ఉద్దేశించిందై వుండవచ్చు. ఎవరు పడితే వాళ్లు ఆమె దగ్గరకు పోకుండా చేసిన ఒక ఏర్పాటు కూడా కావచ్చు.

ఏదేమైనా పారుల్ వాళ్ల తల్లి-తండ్రులు, ఆదిత్య పదకొండో రోజున, దూరంగా హ్యూస్టన్ లో వున్న మా శ్రీమతి సలహా-సంప్రదింపులతో చేయాల్సిన పనులన్నీ చేశారు. ఉదయాన్నే పారుల్ (ఆదిత్య కూడా) పురిటి స్నానం చేసింది (తల స్నానం). అంతకంటే మొదలే, వాళ్ల అమ్మ గారు పాపాయికి స్నానం చేయించి పీట మీద తడితోనే పడుకోబెట్టారు. నీళ్ల తడి వుండగానే పాపాయి బొడ్డు మీద బంగారపు గాజునుంచి, నీళ్లు చల్లి చేతుల్లోకి తీసుకుని తుడవాలి. ఆ తర్వాత పాపాయికి సరైన దుస్తులు ధరింపచేయాలి. దుస్తులేసిన తర్వాత తిరిగి ఆ బంగారపు గాజును మరో మారు పాపాయి మీదుంచాలి.

ఈ తతంగం అంతా ముగిసాక (తల్లికి) నలుగు స్నానం చేయించి, బట్టలు మార్చుకున్న తర్వాత, పాపాయి దగ్గరకు తీసుకొస్తారు తల్లి-తండ్రులు. ఊయలలో నిద్ర పుచ్చే ముందర, పాపాయికి కొత్త దుస్తులేసి, తల్లితో బొట్టు పెట్టించి, అమ్మమ్మ మొలతాడు కడుతుంది. తల్లి మంచం మీద కాసేపుంచాలి పాపాయిని. మంచం నాలుగు కోళ్ల వైపున, కాళ్ల వైపున పొంగలి పెట్టాలి. వంశాభి వృద్ధి జరగాలని దీవించి, పాపాయిని ఎత్తుకెళ్లి ఊయలలో పడుకోబెట్టాలి. ఇవన్నీ శాస్త్రోక్తంగా చేశారు మా పారుల్-ఆమె తల్లి తండ్రులు. పురుడు అయిపోయింది కాబట్టి పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లి, శుద్ధి చేయాలి.


తరువాత భాగం మరో సారి...

1 comment:

  1. Manohar Rao Gade: A sort of inspiration to every body to recollect and write the memories and important incidents in the life.

    ReplyDelete