Saturday, June 1, 2013

నా పాఠశాల విద్యాభ్యాసం: వనం జ్వాలా నరసింహారావు

నా పాఠశాల విద్యాభ్యాసం
వనం జ్వాలా నరసింహారావు

        నేను పుట్టింది ఆగస్ట్ 8, 1948 (సర్వధారి నామ సంవత్సర, శ్రావణ శుద్ధ చవితి, ఉత్తరా ఫల్గుణీ నక్షత్రం, సింహ రాశి, ఆదివారం)న. తెలంగాణ సాయుధ పోరాటం నేపధ్యంలో, కాందిశీకులుగా వున్న కారణాన, పుట్టింది ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా జిల్లా, గండ్రాయిలో నైనా.....పెరిగింది మాత్రం మా వూరైన వనం వారి కృష్ణా పురంలోనే. ఐదో తరగతి వరకూ బాల్యం అంతా ఆ వూళ్లోనే.

నాకు గుర్తున్నంతవరకు, నా మూడో ఏట, నా చదువు ప్రారంభమైంది. మొదట, మాకు సమీప బంధువైన వనం ఎర్ర శేషయ్య గారి "కానీక బడి" లో చేర్పించారు నన్ను. ఉదయాన్నే బడికి పంపేవారు. అందరికంటే బడికి ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద "శ్రీ" అని శేషయ్య గారు రాసేవారు. తరువాత వచ్చిన వారి చేయిపైన "ఒక చుక్క" పెట్టేవారు. ఇలా ఒకరి తరువాత మరొకరు వస్తుంటే వాళ్ల చేతులపైన పెట్టే చుక్కల సంఖ్య పెరిగేది. "శ్రీ" పెట్టించు కోవడం కోసం పరుగెత్తుకుంటూ ముందుగా బడికి చేరుకునే వాళ్ళం. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో గ్రామాలలో కానీక బడులుండేవి.

ఆ బడిలోనే "ఓనమాలు" (, , , , , ...), "వంట్లు" (1,2,3,4,5...), "ఎక్కాలు" (ఒకాట్ల ఒకటి, ఒక రెండు రెండు, ఒక మూడు మూడు....), "కూడికలు-తీసివేతలు" (1+1=2, 2+2=4, 4+3=7.....1-1=0, 2-1=1…), "తెలుగు వారాలు" (ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని), "తెలుగు మాసాలు" (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము), "తెలుగు సంవత్సరాలు" (ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్యక, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను,  స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోథి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోథి, విశ్వావసు, పరాభవ,  ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదిచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్ముఖి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ) లాంటివి నేర్పారు. నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పించారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. "పెద్ద బాల శిక్ష" లోని వివిధాంశాలను కూడా కొంత నేర్చుకున్నదక్కడే. "విశ్వక్సేనుడు", "జంబీర బీజం", "మందార దామం" లాంటి కఠిన పదాలను ఎలా పలకాలో నేర్చేవారు శేషయ్య గారు. శేషయ్య గారి మొదటి భార్య కుమారుడు వనం రాందాస్ రావు గారు కూడా ఉపాధ్యాయుడే. ఆయన హిందీ మాస్టారు. ఆయన దగ్గర ఒకటి-రెండు హిందీ ముక్కలు కూడా నేర్చుకున్నట్లు గుర్తు. అలా....ఒక ఏడాది గడిచి పోయింది.

ఆ తరువాత స్థానికంగా మా గ్రామంలో వున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు నాన్న గారు. ఆ పాఠశాల అప్పట్లో వూళ్లోని కొఠాయి దగ్గర ఒక పూరి పాకలో వుండేది. సాధారణంగా ఐదేళ్ల వయస్సు నిండిన తరువాతే మొదటి తరగతిలో చేర్పించాలి. నాకేమో అప్పటికింకా నాలుగేళ్లే! అందుకోసం పుట్టిన తేదీని మార్పించారు నాన్న గారు. పాఠశాల రికార్డులలో నా పుట్టిన తేదీ జులై 1, 1947 గా నమోదైంది. ఐనప్పటికీ, నేను 1962 లో హెచ్.ఎస్.సీ (పదకొండవ తరగతి) పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది వయస్సు తక్కువైతే, "ఏజ్ అండ్ హెల్త్ మెడికల్ సర్టిఫికేట్" తీసుకోవాల్సి వచ్చింది. 1966 మార్చ్ లో నేను డిగ్రీ పరీక్షలు రాసేటప్పటికి నా వాస్తవ వయస్సు కేవలం 17 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. నేను మా వూరి ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు అందులో మొదట్లో ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. ఆయన పేరు కేశిరాజు సత్యనారాయణ రావు గారు. కొద్ది కాలానికి దత్తయ్య గారనే మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. సత్యనారాయణ రావు గారిని "పాత పంతులు గారు" అని, దత్తయ్య గారిని "కొత్త పంతులు గారు" అని మా గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిద్దరినీ సంబోధించే వారు. ఆ దత్తయ్య గారే నేను ఖమ్మం రికాబ్-బజార్ ఉన్నత పాఠశాలలో చేరినప్పుడు అక్కడ కూడా పనిచేశారు.

నాకు ఆరేళ్ల వయసొచ్చే సరికి, మా గ్రామంలో కొత్త పాఠశాల భవనం తయారైంది. వూరి బయట "పైలు పెంట" అనే స్థలంలో చిన్న పాఠశాల భవనం కట్టారు. నాకు గుర్తున్నంతవరకు, ఆ భవనాన్ని అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ భట్ సమక్షంలో, అప్పట్లో జిల్లా-రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది (బహుశా 1954 లో కావచ్చు). మా నాన్న గారు వనం శ్రీనివాస రావు గారు అప్పట్లో పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు. ఇప్పటికీ ఆ నాటి ప్రశంసా పత్రం పాఠశాల గోడకు వేలాడుతూనే వుంది. పాఠశాల ఆ భవనంలోకి మారిన తరువాత మరో ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి గారు చేరారు. ఆయన మా గ్రామానికి చెందిన అమ్మాయిని దరిమిలా వివాహమాడారు. చాలా కాలంపాటు మా వూళ్లోనే పని చేశారు. మరి కొంతకాలానికి తెలుగు మాస్టారు అయ్యదేవర రామచంద్రరావు గారు కూడా చేరారు. ఆయన గారు తరువాత నేను రికాబ్-బజార్ పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడ కూడా పని చేశారు. పాత పంతులు గారి తమ్ముడు శ్రీనివాస రావు నా క్లాస్ మేట్. నాకు గుర్తున్నంతవరకు, కారణాలేవైనా, పాఠశాలలో పని చేస్తుండే ఉపాధ్యాయుల మధ్య అంత సఖ్యత వుండకపోయేది. అప్పట్లో మేం పెన్నులు ఉపయోగించక పోయేది. మొదట్లో పలకా-బలపం, తరువాత పెన్సిల్-రబ్బర్, మరో రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి-అందులో ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే వాళ్లం. నా తరగతిలోనే చదివిన చట్టు వెంకయ్య ఉపాధ్యాయుడుగా రిటైర్ అయ్యాడు. మల్లెల నరసయ్య, ఏటుకూరి నారాయణలు కూడా నా క్లాస్ మేట్సే. ప్రస్తుతం ఏటుకూరి నారాయణ మా వూళ్లో వున్న నా వరి పొలాన్ని నా పక్షాన సాగు చేస్తున్నాడు. ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదువుకుని, తరువాత అక్కడ పై తరగతులు ఇంకా ప్రారంభించనందున ఖమ్మం రికాబ్-బజార్ పాఠశాలలో చేరాను.

రికాబ్-బజార్ పాఠశాల ఖమ్మం మామిళ్లగూడెంలోని మా ఇంటికి అతి సమీపంలో వుండేది అప్పట్లో. ఇప్పుడు పెవిలియన్ గ్రౌండ్స్ దగ్గరికి మారింది. అక్కడే ఆరవ తరగతి నుంచి హెచ్.ఎస్.సీ వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను. మా ఇంటికి, పాఠశాలకు మధ్య, ఇంటి పక్కనే ఒక (మురికి) కాలువ పారుతుండేది. వర్షాకాలంలో (కాలువ పొంగి పొర్లుతుండడం వల్ల) ఒక్కో సారి ఇంటి నుంచి పాఠశాల వెళ్లడం కొంచెం కష్టమయ్యేది కూడా. నా క్లాస్ మేట్స్ గా చదువుకున్న వారి పేర్లు కొంతమందివి ఇంకా గుర్తున్నాయి. జూపూడి హనుమత్ ప్రసాద్, జూపూడి హనుమంతరావు, ఎల్. వి. ఎస్. ఆర్. శర్మ, ఎం. వి. కె. హెచ్. ప్రసాద్కె.వి.డి.పి శేషగిరి రావు, వనం వరదా రావు అలియాస్ గోవిందరావుఅబ్దుల్ రహమాన్, సైదుర్ రహమాన్, షుకూర్, చీనా, ధర్మా, జాన్ మీరా, గుర్రం వారు (పేరు గుర్తుకు రావడం లేదు), బూర్లె వారు (పేరు గుర్తుకు రావడం లేదు), దోసపాటి పుల్లయ్య, ఏడునూతుల ప్రభాకర్, విజయబాబు, రామ బ్రహ్మా చారి, బాగవతుల కృష్ణ.....ఇలా కొంత మంది పేర్లు గుర్తుకొస్తున్నాయి. భండారు శ్రీనివాస రావు, బహుశా తొమ్మిదవ తరగతిలో వున్నప్పుడు మాతో పాటు రికాబ్-బజార్ హైస్కూల్ లో చేరినట్లు గుర్తు. అన్నట్లు...బండారు బాబు కూడా నా క్లాస్ మేటే. వాడి తమ్ముడు ఉపేందర్ ఒక గుండాలాగా వ్యవహరించేవాడు. వాడంటే భయం వేసేది కూడా. వాడి నుంచి కాపాడుకునేందుకు శర్మను వెంట తెచ్చుకునే వాళ్లం.

జూపూడి ప్రసాద్ తరువాతి కాలంలో నాకు తోడల్లుడైనాడు. మా ఇంటికి అతి సమీపంలో, స్కూల్ కు ఆవలి వైపున రంగుభట్ల యజ్ఞ నారాయణ గారింట్లో, ప్రసాద్ చిన్నతనంలో, వాడి కుటుంబం అద్దెకుండేవారు. వాళ్ళకు పెట్రోల్, కిరోసిన్, ఎరువుల వ్యాపారాలుండేవి. ఖమ్మంలో ధనవంతులుగా పేరున్న కొద్దిమందిలో వాడి కుటుంబం కూడా ఒకటి. వాడి తల్లిదండ్రులు, ఒక్కడే కొడుకైనందున అతి గారాబంగా పెంచుకునే వారు. బయటకెక్కడికీ పోనిచ్చేవారు కాదు. ఒక్క మాఇంటికి మాత్రం రానిచ్చేవారు. అలానే వారింటికి రానిచ్చే వాడి స్నేహితుడిని నేనొక్కడినే! పాఠశాల "ఇంటర్వెల్" సమయంలో, ఆ పది నిమిషాలు గడపడానికైనా, మధ్యాహ్నం లంచ్ టైమప్పుడైనా, ఒక్కోసారి మాఇంటికి వాడో-లేదా-వాడింటికి నేనో వెళ్లే వాళ్లం. ఇక మరో మంచి స్నేహితుడు శర్మ. వాడికి "నా" అన్న వారెవరూ లేరు. వాడి స్వగ్రామమైన "వేంట్రప్రగడ" (కృష్ణా జిల్లా) లో ఒక బామ్మ వుండేది. ఖమ్మంలో (వరుసకు) వాడి మేనత్తగారింట్లో వుండి చదువుకునే వాడు. బహుశా వాడు పదవ తరగతిలో వున్నప్పుడనుకుంటా....వాడి మామయ్యతో వచ్చిన తగాదా కారణంగా, ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఆ సమయంలో మా అమ్మ, ప్రసాద్ అమ్మ వాడిని మాతో పాటే వుండి చదువుకొమ్మన్నారు. కొంతకాలం అలానే వున్నాడు. బామ్మ ప్రోద్బలంతో వాడు అత్తయ్య-మామయ్యలతో రాజీపడి హెచ్.ఎస్.సీ పూర్తయ్యేంతవరకు వాళ్లింట్లోనే వుండి చదువుకున్నాడు. పియుసి కి వచ్చేసరికి ఆ ఇల్లు వదిలి "వారాలు" చేసుకుంటూ చదువుకున్నాడు. ఏ రోజునైనా వారం దొరకకపోతే మా ఇంట్లో కాని, ప్రసాద్ ఇంట్లో కాని భోజనం చేసేవాడు.

శర్మ, నేను, తరువాతి కాలంలో వృత్తి రీత్యా-ఉద్యోగం రీత్యా వేర్వేరు జాగాలలో వున్నప్పటికీ మధ్య-మధ్య కలవడమో, ఉత్తరాలు రాసుకోవడమో చేసే వాళ్లం. వాడు పియుసి తరువాత చదువు మానేశాడు. బెజవాడ వెళ్లి కొన్నాళ్లు, మద్రాస్ వెళ్ళి కొన్నాళ్లు ఉద్యోగంలో చేరాడు. నేను హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడు (1964-1966) అక్కడ కొచ్చి మాతో పాటే వుండేవాడు. మా నాన్నగారు నాకు పంపించే పైకంతోనే ఇద్దరం సర్దుబాటు చేసుకునే వాళ్లం. సరిపోకపోతే, వాడు చిల్లర-మల్లర ఉద్యోగాలు చేసేవాడు. చివరకు తద్దినాల బ్రాహ్మణుడిగా, భోక్తగా కూడా జీవనం వెళ్లదీశాడు. చిక్కడపల్లి "బ్రాహ్మణుల అడ్డ" లో పొద్దున్నే వెళ్లి కూర్చుని, ఆ రోజుకు ఉపాధి కుదుర్చుకునేవాడు. తరువాత మళ్ళీ విజయవాడ వెళ్ళి పెళ్లి చేసుకుని, ఒక హోటెల్ నడుపుకుంటూ స్థిరపడిపోయాడు. ఓ పదేళ్ల క్రితం చనిపోయాడు పాపం! వాడు కొన్నాళ్లు గయలో ఒక ఆయుర్వేదాశ్రమంలో పని చేశాడు. అక్కడి నుంచి 22-1-1966 తేదీతో నాకు రాసిన ఒక ఉత్తరాన్ని ఇంకా పదిలంగా బధ్రపరుచుకున్నాను. అందులో మా స్నేహితులకు సంబంధించిన ఒక పేరాను వాడి మాటల్లోనే యధాతధంగా ఇక్కడ రాస్తున్నాను.

          ".....నిన్ను, మన స్నేహితులందరినీ, ఏదో ఒక సందర్భంలో తలుస్తూనే వుంటా. పది రోజుల క్రితం, అన్వేషణ అనే వార పత్రిక తిరగేస్తుంటే, భండారు శ్రీనివాస రావు రాసిన ఒక వ్యాసం నా కంట పడింది. రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను. అలా...మన చిన్ననాటి జ్ఞాపకాలు, పాత రికాబ్-బజార్ హైస్కూల్, మామిళ్లగూడెం మన ఇల్లు, పక్కనే వున్న మురికి కాలువ, మనం భోజనం చేసే మైసూర్ కేఫ్, ’భోజనం తయార్’ బోర్డ్, ’చలిగా వున్నది-చలి చలి వేస్తున్నది’ అని కవిత రాసిన మన స్నేహితుడు, మన నరసింగరావు, భండారు శ్రీనివాస రావు, బాల మౌళి, నోములవారు, గుర్రం వారు, బూర్లె వారు, దోసపాటి మొదలైన స్నేహితులు, సైదుర్ రహమాన్, అబ్దుల్ రహమాన్, షుకూర్, ఎస్. సి. హాస్టల్ స్నేహితులు, ’గొట్టం పాపయ్య, పానుగంటి పిచ్చయ్య’ అంటూ వుండే కొండలరావు మాస్టారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లని కసురుకునే వెంకటరామిరెడ్డి సార్, ’వనజ భవుండు నిన్నొసట రాసిన...’అంటూ చెప్పే తెలుగు మాస్టారు అయ్యదేవర రామచంద్ర రావు గారు, బాగా కొట్టుకుంటూ చదువు చెప్పే హిందీ మాస్టారు చిన్ని రామారావు గారు, సైన్స్ సార్ వీరభద్రం గారు, అవధాని మాస్టారు, లెక్కల రసూల్ సార్, నాటకాలు వేయించే సత్యం సార్-సీతారామయ్య గారు, సెల్ఫ్ సర్వీస్ డే, మన స్కూల్ వంటి కన్ను చప్రాసి ముబారక్ అలీ, స్కూల్ పక్క జిలేబీ అమ్మే తాత....ఇలా అందరూ (ఇంకా జూపూడి ప్రసాద్, ఎం.వి.కె.హెచ్. ప్రసాద్...) గుర్తుకొస్తున్నారు. ఇంకా చాలా విషయాలున్నాయి కాని సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తాను.

శర్మ రాసిన ఉత్తరం మరో మారు చదివిన నాకు, సినిమా రీళ్లలాగా మా స్కూల్ విషయాలు కొన్ని గుర్తుకు వచ్చాయి. ఆరవ తరగతిలో నన్ను చేర్పించిన మర్నాడు నాన్న గారు ఆ ఏడాదికి కావాల్సిన పుస్తకాలు కొన్నారు. అన్ని పుస్తకాలు చూడగానే, ఇన్ని చదవాల్నా అని ఏడుపొచ్చింది. సరే...కొన్నాళ్లకు అలవాటై పోయింది. మాకు చరిత్ర-భూగోళం సబ్జెక్ట్ బోధించే కొండలరావు సార్ చాలా స్ట్రిక్ట్. ఈనాడు చెప్పిన పాఠాన్ని మర్నాడు అప్ప చెప్పమనేవాడు. చెప్పని విద్యార్థులను తీవ్రంగా దండించేవాడు. చేయిపై "పేను బెత్తం" తో కొట్టడంతో సహా, ఒక్కోసారి "కోదండం" కూడా వేయించేవాడు. ఆయన మనసు మాత్రం కడు మెత్తన. రాజ్ పుట్స్ గురించి పాఠం చెప్తూ, వాళ్లు తమ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారని అనేవారు. మరో మాస్టారు తెలుగు బోధించే డి. సీతారామయ్య గారు. ఆయన గారు అహర్నిశలూ పచ్చి పోకచెక్కలు తింటుండేవారు. ఆయనను అందరూ "పోకచెక్కల పరంధామయ్య" అని పిలిచేవారు. ఆయనే మాతో నాటకాలు వేయించే వారు. వాటిల్లో ఒకటి నాకింకా గుర్తుంది. అది, "గయోపాఖ్యానం" అనే పౌరాణిక నాటకం. అందులో శర్మ శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే, నేను అర్జునుడి పాత్ర పోషించాను. మా ఇద్దరి (శ్రీకృష్ణుడు-అర్జునుడు) మధ్య యుద్ధం అనివార్యం ఐనప్పుడు శర్మ నన్ను సంబోధిస్తూ..."చెలిమి యొనర్చినారమటు చిన్నతనంబున నుండి..." అన్న పద్యం పాడేవాడు. నేనేమో "నిటలాక్షుండిపుడెత్తి వచ్చిన రానీ..." అనే పద్యాన్ని చదివేవాడిని. ఆ రెండు పద్యాలు ఇంకా గుర్తున్నాయి. ఆ డ్రామా హిట్ ఐంది కూడా.

          మరో మాస్టారు రాజయ్య గారు. ఆయన హిందీ బోధించేవాడు. ఒక్కోసారి చరిత్ర-భూగోళం కూడా చెప్పేవాడు. ఆయన ప్రతిరోజు ఒకే రకమైన లాల్చీ, ధోవతి ధరించేవాడు. ఆయనకు ఒకే డ్రెస్ వుందా అన్న అనుమానం వచ్చేది. మరో హిందీ మాస్టారు చిన్ని రామారావు గారు చక్కగా బోధించేవారు. ఇక రసూల్ సార్ సంగతి సరే సరి. ఆయన బోధించని సబ్జెక్ట్ లేదు. ఆయన చదువుకుంది కేవలం హెచ్.ఎస్.సీ వరకు మాత్రమే. ఎప్పుడూ షేర్వాణి ధరించేవాడు. లెక్కలు బోధిస్తుంటే అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుండేది. ఆయనే మా ఇంగ్లీష్ సార్ కూడా. ఎప్పుడు హెడ్ మాస్టారు శెలవుపై వెళ్లినా ఆయనే ఇన్ ఛార్జ్ గా వుండేవాడు. ఆయన గారి దగ్గర నేను ట్యూషన్ కూడా వెళ్లేవాడిని. ఆయన కుమారుడే సయీద్ రహమాన్. ఎప్పుడూ అతడికి అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులొచ్చేవి. కాకపోతే హెచ్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలలో ఫెయిలయ్యాడు. అలానే అబ్దుల్ రహమాన్ కూడా ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకున్నా పబ్లిక్ పరీక్షలలో మాత్రం ఫెయిలే! రసూల్ సార్, ఆయన కొడుకు సయీద్, అబ్దుల్ రహమాన్ ముస్లింలైనా, చక్కటి తెలుగు రాసేవారు. అక్షరాలు పొంకంగా, చక్కగా తీర్చి దిద్దినట్లుండేవి. ఇక సైన్స్ మాస్టారు వీరభద్రం సార్ కు ఎప్పుడూ ముక్కుమీద కోపమే. ఆయన నవ్వగా చూడాలని మాకుండేది. ఆ కోరిక ఒకే ఒక్కసారి నెరవేరింది. ఒక పర్యాయం లెక్కల సార్ రాకపోతే ఆయన ఆ క్లాస్ తీసుకుంటున్నాడు. బ్లాక్ బోర్డ్ మీద గీసి సరళ రేఖ అంటే ఏంటో, వక్ర రేఖ అంటే ఏంటో వివరిస్తున్నాడు. వక్ర రేఖను గీసి అదేంటో చెప్పమని స్టూడెంట్స్ ను ప్రశ్నించాడు. అందరి దగ్గరి నుంచి వక్ర రేఖ అన్న సమాధానం వచ్చినప్పటికీ, శర్మ మాత్రం "సార్, ఎద్దు మూత్రం" అన్నాడు. వెంటనే కసుక్కున నవ్వాడు సార్. (ఎద్దు మూత్రం పోసినప్పుడు వక్ర రేఖ మాదిరి వుంటుందని దానర్థం అంటూ విడమర్చాడు శర్మ!). అందరిలోకి తెలివైన సార్ వెంకటరామిరెడ్డి గారు. ఆయన ఎంతో సరళంగా లెక్కల క్లాస్ తీసుకునేవాడు. కాకపోతే బూతు మాటలు ఆయన సొంతం. ఎందుకో నన్ను, శర్మ లాంటి ఒకరిద్దరిని అనక పోయేవాడు కాని "లం...కొడక" లాంటి పదజాలాన్ని కూడా ఉపయోగించేవాడు. అందరిలోకి చాలా చక్కగా, ఆంగ్లాన్ని మాతృభాషంత సులభంగా బోధించే మాస్టారు డి. వెంకటేశ్వర్లు సార్. ఆయన అర్వపల్లి సత్రం పక్కనున్న ఇంట్లో వుండేవారు. "కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్" బ్రహ్మాండంగా చెప్పేవాడు. బహుశా ఇవ్వాళ ఇంగ్లీష్ లో మేం అంతో-ఇంతో మంచిగా రాయగలగడానికి కారణం ఆయన పుణ్యమే! ఇక మా క్లాస్ లో వున్న చీనా, ధర్మ, నవాబ్, జాన్ మీరా లాంటి వారికి ఏ సబ్జెక్ట్ అర్థం కాకపోయేది. వారంతా పబ్లిక్ పరీక్షలలో ఫెయిలై, ఫారెస్ట్ గార్డులుగా, మెకానిక్ లుగా, శనక్కాయలమ్మే వారిగా, చిన్న-చిన్న జీవనాధారం పనులు చేసే వారిగా స్థిరపడిపోయారు

        మాది రికాబ్-బజార్ పాఠశాల నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే హెచ్.ఎస్.సి రెండో బాచ్. మా కంటే ఒకే ఒక బాచ్ మా సీనియర్స్. అందువల్ల పెద్ద తేడా లేకుండా కలిసి మెలిసి వుండేవాళ్లం. మా సీనియర్స్ లో కొందరి పేర్లు నాకింకా గుర్తున్నాయి. అయితరాజు మనోహర్ రావు, శ్రీపతి, అయితరాజు జగన్మోహాన రావు, పద్మనాభం.... పేర్లు గుర్తున్నాయి. మొదటి ఇద్దరు డాక్టర్లయ్యారు. జగన్మోహన్ రావు ఇంజనీర్ అయ్యాడు. పద్మనాభం డిగ్రీ చదువుతున్నప్పుడు చనిపోయాడు. మనోహర్ రావు చెల్లెలు విజయలక్ష్మిని నేను వివాహం చేసుకున్నాను. జగన్మోహన్ రావు కూడా మా అవిడకు కజిన్ అవుతాడు. హెచ్.ఎస్.సి మొదటి బాచ్ హాజరైన వారిలో సుమారు 40% మంది పాసయ్యారు కాని, రెండవ బాచ్ కు చెందిన మాలో కేవలం  5 మంది మాత్రమే పాసయ్యాం. సరిగ్గా వంద మంది పరీక్ష రాస్తే పాసైంది ఐదుగురే! మా స్కూల్లో ఉర్దూ సెక్షన్లు కూడా వుండేవి. మా బాచ్ లో ఆ సెక్షన్ నుంచి ఒక్కడు కూడా పాసవలేదు. నాకు, మరో ముగ్గురి కి (హనుమంతరావు, రామబ్రహ్మా చారి, శర్మ) సెకండ్ క్లాస్ రాగ మిగిలిన ఒకడు థర్డ్ క్లాస్ లో పాసయ్యాడు. ఫస్ట్ క్లాస్ ఎవరికీ రాలేదు. నేను ఫస్ట్ క్లాస్ జస్ట్ మిస్. కాకపోతే, స్కూల్ ఫస్ట్ వచ్చా అనుకుంటా. ఆ సంవత్సరం పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లు మా స్కూల్ నుంచి ప్రారంభమయ్యాయి. 1-100 నంబర్లు మా స్కూలు విద్యార్థులవే! నాకు గుర్తున్నంతవరకు: భండారు శ్రీనివాస రావు నంబర్ 7, హనుమంతరావుది 8, నాది 10, టి. రామబ్రహ్మాచారిది 13, హనుమత్ ప్రసాద్ ది 11. మా పాఠశాలలో ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా ముబారక్-అలీ అనే ఒంటి కన్ను చప్రాసికి విద్యార్థులందరూ భయపడేవారు. అతడెప్పుడూ ఉర్దూ మాట్లాడుతుండేవాడు. ముబారక్-అలీతో ఉర్దూలో మాట్లాడగలిగే వ్యక్తి మాలో శర్మ ఒక్కడే. అందుకే వాడంటే ముబారక్ కు చాలా ఇష్టం.

భండారు శ్రీనివాస రావు పదవ తరగతిలో మా పాఠశాలలో చేరాడు. మా ఇద్దరి సెక్షన్లు ఒకటి కాకపోయినా స్కూల్లో తరచుగ కలుస్తుండేవాళ్లం. మా ఇద్దరికి ఆ రోజుల్లో ఒక కామన్ ప్లాట్ ఫామ్ వుండేది. దాని పేరే "బాపూజి బాల సమాజ్". శ్రీనివాస రావు అన్న పర్వతాల రావు గారు అప్పట్లో ఖమ్మం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారిగా పని చేసేవారు. ఆయన ప్రోద్భలంతో-ప్రోత్సాహంతో "బాపూజి బాల సమాజ్" స్థాపించడం జరిగింది. దాని ద్వారా చిన్న పిల్లలను అందరినీ ఒక చోట చేర్చి చిన్న-చిన్న సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసే వాళ్లం. పెద్ద ఎత్తున కూడా ఒకటి-రెండు సందర్భాలలో జరిపినట్లు గుర్తు. ఒక సారి, ఆ ఏడాది కార్యక్రమాల నిర్వహణకు, చందాలు పోగు చేసేందుకు తిరిగాం. ఆ ఏడాది చందా ఎక్కువగా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించింది నాగుల వంచ ధొరవారుగా పిలువబడే ఉపేందర్ రెడ్డి గారు. మేం ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు జరిగిన సంభాషణ కూడా నాకు గుర్తుందింకా. మేం పదవ తరగతి చదువుతుండగా, మా కంటే సీనియర్ కందిబండ రామ్మోహన్ రావు అలియాస్ జగన్మోహన్ రావు పాఠశాల విద్యార్థి సంఘం ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీకి దిగాడు. మరో వర్గం చీనా నాయకత్వంలో బరిలోకి దిగింది. నేను, భండారు శ్రీనివాస రావు కలిసి "లిల్లీ పుట్స్ పార్టీ" పేరుతో పోటీకి దిగాం. శ్రీనివాస రావు కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు. ఇరువర్గాల వారు మా వల్ల ఓటమి పాలవుతామేమోనని భయపడి, మమ్మల్ని బెదిరించారు. ఐనప్పటికీ, మేం పోటీలోనే వున్నాం. ఓడి పోయాం-అది వేరే మాట! తరువాత కాలంలో శ్రీనివాస రావు నాకు బంధువయ్యాడు. మా అవిడ ఆయన మేన కోడలు. భారత ప్రభుత్వ దూర దర్శన్ న్యూస్ ఎడిటర్ గా పదవీ విరమణ చేసిన శ్రీనివాస రావు ఇప్పటికీ చాలా యాక్టివ్ గా, టెలివిజన్ న్యూస్ అనలిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాడు.

ఖమ్మంలో చదువుకొనేటప్పుడు, మా అమ్మ-నాన్న, తమ్ముళ్లు, చెల్లెళ్లు మా వూళ్లోనే వుండేవారు. శెలవులకు మా వూరికి వెళ్లొస్తుండేవాడిని. ఖమ్మంలో, మా ఇంట్లోనే వనం రాందాస్ గారుండేవారు. ఆయన టీచర్ గా పనిచేస్తుండేవాడు. భోజనం నేను వాళ్లింట్లో చేస్తుండేవాడిని. బహుశా నేను పదవ తరగతిలో వుండగా అనుకుంటా, మా కుటుంబం కొంతకాలం ఖమ్మంలో, కొంత కాలం గ్రామంలో వుండే విధంగా అటు-ఇటు తిరుగుతుండేవారు. అలా నా బాల్యం ఖమ్మంలో, మా వూళ్లో గడిచిపోయింది.

చదువు విషయాలు కాకుండా...బాల్యానికి చెందిన ఇతర విషయాలు మరోసారి....  
       

6 comments:

  1. నేను 1962 లో హెచ్.ఎస్.సీ (పదకొండవ తరగతి) పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది వయస్సు తక్కువైతే, "ఏజ్ అండ్ హెల్త్ మెడికల్ సర్టిఫికేట్" తీసుకోవాల్సి వచ్చింది.అందుకోసం పాఠశాల రికార్డులలో నా పుట్టిన తేదీ జులై 2,1947 గా మార్పించారు మా నాన్న గారు.ఆ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో మా పాఠశాల నుంచే హల్ల్టికెట్లు జారీ చేసినందున మా నెంబర్లు 1 నుంచి 100 వరకు ఇచ్చారు.పాసైనవారు నేను (8),జ్వాలా (10),రామబ్రహ్మా చారి(13) మరి ఇద్దరు.బహుశ ,ఇప్పుడు (ఎప్పటికీ)ఈ నెంబర్లు జారీ చేసే అవకాశం ఉండదు.

    చిన్న జ్ఞాపకం

    రికాబ్-బజార్ పాఠశాల ఖమ్మం రైల్వే గేటుకు దగ్గరిలో ఉండేది.రోజూ మేము
    రైల్వే పట్టాలు దాటి రావలసి వచ్చేది.తిరిగి ఇంటికి వెళ్ళే ముందు,ఒక్కొక్కసారి
    రైలు వస్తుందనగా రైల్వే గేటు వేసే వారు.రైలు వచ్చేలోపు పట్టాలపైన 5,10 పైసల నాణేలు పెట్టే వాళ్ళం.రైలు వెళ్ళిన తరువాత అప్పచ్చుల్లాగా అయినవాటిని తీసుకొని సంబరపడే వాళ్ళం.చిన్ననాటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు, అనుభవాలు మన మనసులొ ఇప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా ముద్రలు వేస్తాయి; ఎన్నెన్నో సందర్భాలలో అవి మనకు గుర్తుకువచ్చి, మనల్ని మళ్ళీ బాల్యంలోకి తీసుకువెళ్తాయి.చిన్ననాటి తీపి గుర్తులను వివరించిన నా ప్రియమైన స్నేహితుడు జ్వాలాకు శుభాకాంక్షలు.
    1.రామ బ్రహ్మ చారి,K.V.D.P.శేషగిరి రావు ,శర్మ నాకు గుర్తున్నారు.
    2.daddy sweet sixty.DAT వీడియో చూసాను.చాలా బాగుంది.
    3.Vennela https://www.youtube.com/watch?v=bIpTYWkN4f0 చూసాను.
    4.జ్వాలా నాగపూర్ నుండి తరచుగా రాజకీయ విశ్లేషణలు నాకు ఉత్తరాల్లో రాస్తుండే వాడు.
    5. జ్వాలా మ్యూసింగ్స్ ద్వారా తన అనుభవాలు,విశ్లేషణలు రాయటం బాగుంది.
    6.view http://raojh.blogspot.in/

    జూపూడి హనుమంత రావు

    ReplyDelete
  2. మీ పాఠశాల విద్యాభ్యాససంగతులు పూసగుచ్చినట్లు చెప్పారు మీది మంచి జ్ణాపకశక్తి గుర్తుకు తెచ్చుకొని రాయగలిగారు అభినందనలు మళ్ళీ మళ్ళీ!నేనూ రాయాలి రేపు ఉదయం 4 గంటలకు అమెరికాలో గృహప్రవేశం అయిపోగానే మొదలు పెట్టాలి డెబ్భయిలలో పడుతున్నాను నాకు జ్ణాపకశక్తి తక్కువ!అయినా చూద్దాం ఎలా వస్తుందో !

    ReplyDelete
  3. Turlapati Sambasivarao: Nice memory.excellent narration

    ReplyDelete
  4. Kautoori Durgaprasad: " Bala Narasimham " is very interesting Congrats

    ReplyDelete
  5. Srinivasrao Bhandaru: స్వీయ అనుభవాల్లో ఆనాటి పరిస్థితులు, స్తితిగతులు, ప్రజల జీవన విధానాలను కూడా ఈవిధంగా పేర్కొంటూ పోతే ఆ రచనకు శాశ్వితత్వం సిద్దిస్తుంది.

    ReplyDelete
  6. Pavan Kondapalli: Adbhutamina gyapakalu,antamandiperlu maree chinnappati vtshayaalukooda savivarangagurtupettukovatam chalagoppa vishayam eegyapakaalu anubhandalu inka inka konasaginchagalagatam bahusa mee taruvaata taram varake nadichindemo,hatsoff sir.

    ReplyDelete