Wednesday, September 17, 2014

ఐదారు దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో జీవన విధానం:వనం జ్వాలా నరసింహారావు

ఐదారు దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో జీవన విధానం
వనం జ్వాలా నరసింహారావు

          పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 న పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, ఇంటి బయట వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. వూళ్లో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే, ఆ కార్యక్రమం కూడా మా వూరి పెద్దల సమక్షంలో, అదే సమయంలో అక్కడే జరిగేది. ఆ రోజుల్లో, గ్రామాల్లో పంచాయతీ తీర్పులు పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. వారు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, ఒకరిద్దరు దళితులు కూడా వుండేవారు.

          బాల్యంలో ఎక్కువగా "అచ్చన గిల్లలు", "వాన గుంటలు" ఆడేవాళ్లం. సాయంత్రాలు "గోలీలు", "బలిగుడు-చెడు గుడు" (కబడ్డీ), "బెచ్చాలు", "పత్తాలు", "జిల్ల గోనె", "దస్తీ ఆట". "తొక్కుడు బిళ్ల" ఆడేవాళ్లం. ఇంట్లో "పచ్చీసు" ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం. మా చిన్నతనంలో మాకు ప్రధానమైంది "బ్రతుకమ్మ" లేదా "బతుకమ్మ" పండుగ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే సంబరమే! తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లం. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. దసరా పండుగ రోజుల్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి మా చిన్నతనంలో "రోలు-రోకలి" అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. ముక్కోటి ఏకాదశి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది.

మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు", రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. ధాన్యం కొలవడానికి "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" వుండేవి. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది. అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు.


చిన్నతనంలో ప్రతి ఇంట్లో ఇంకా తెలతెలవారుతుండగానే, పొద్దున్నే లేవడం, విశాలమైన ఇంటి వాకిలి శుభ్రం చేయడం, ఇంటి ముందర కలాపి జల్లడం జరిగేది. వాకిలి శుభ్రం చేయడానికి పొడగాటి కందికట్టె చీపురు (పొలికట్టె) ఉపయోగించేవారు. కలాపి జల్లే నీళ్లలో పశువుల పేడను కలిపేవారు. ఆ తతంగమంతా దాదాపు గంట సేపు జరిగేది. అలానే, ఉదయాన్నే కొందరు "జొన్న తొక్కు" వంపడానికి వచ్చే వారు. బదులుగా "చల్ల" పోయించుకు పోయేవారు. వారొచ్చే వేళ కల్లా, ఇంటి వెనుక వంట ఇంటి పక్కన "చల్లచిలికేవారు. ఒక గుంజకు "కవ్వం" కట్టి తాడుతో పెరుగు చిలికి చల్ల చేసేవారు. పెద్ద బానెడు చల్ల, అందులో పెద్ద "వెన్న ముద్ద", చల్లలో చాలా భాగం మునిగి పోయి తయారయ్యేది. ఎండాకాలంలో మేం ఉదయాన్నుంచే చల్ల ముంచుకుని తాగే వాళ్లం. వెన్న పూస కూడా తినే వాళ్లం. వెన్న పూస నుంచి "నెయ్యి" తయారు చేసేవారు. ఇటీవలి కాలంలో నేను చల్ల చిలకడం చూడలేదు…..వెన్న మునగడం కూడా చూడలేదు.

నా చిన్నతనంలో మా వూళ్లో, ఆ మాటకొస్తే జిల్లా కేంద్రం ఖమ్మంలో మేముండే మామిళ్లగూడెంలో విద్యుత్ సరఫరా లేదు. కిరోసిన్ దీపాల వెలుగులోనే వుండేవాళ్లం. 1961 ప్రాంతంలో....విద్యుత్ స్థంబాలు పాతారు. అంతవరకూ, పెట్రోమాక్స్ లైట్లే వీధి దీపాలు. సాయంత్రం కాగానే, చీకటి పడటానికి కొంచెం ముందర, మున్సిపాలిటీ వాళ్లొచ్చి స్తంభాలకు వీధి దీపాలు తగిలించి పోయేవారు. ఇప్పటి లాగా ఆ రోజుల్లో ఫ్లెష్‌ ఔట్ మరుగుదొడ్లుండేవి కావు. సఫాయివాడు (స్కావెంజర్) ప్రతి రోజు వచ్చి శుభ్రం చేసేవాడు. వాడికి, నెలకు అప్పట్లో ఐదు రూపాయలిచ్చినట్లు గుర్తు.

వంటా-వార్పూ అంతా కట్టెల పొయ్యిల మీదే. స్నానానికి నీళ్లు కాగ పెట్టడం కూడా కందికట్టె నిప్పుల మీదే. ఇక ఇంట్లో వుంది "ఓపెన్ బాత్ రూమే"! స్నానాల గదికి పైకప్పు కూడా లేదుపనివాడు బావిలోంచి నీళ్లు తోడి పోస్తుంటే అలా...ఒక గంట సేపు స్నానం చేసే వాళ్లం. వారానికోసారి తలంట్లుండేవి (తల మీద స్నానం). దాని కొరకు ప్రత్యేకంగా పని వాళ్లుండే వారు. ఇంటి అవసరాలకు కావాల్సిన "ఇసురు రాయి" తో పిండి (శనగ, బియ్యం, జొన్న) విసరడానికి, రోట్లో కారం-పసుపు దంచడానికి, దోస వరుగులు-మామిడి వరుగులు కోసి ఎండ పెట్టడానికి, మొక్క జొన్నలు వలవడానికి, అలాంటి పనులనేకం చేయించడానికి కూడా పనివాళ్లు వుండే వారు. వారికి సరిపడా కూలిచ్చేవారు. పంటలు చేతి కొచ్చిన రోజుల్లో అలాంటి వారికి కొంత బోనస్ కూడా ఇచ్చేవారు నాన్న గారు.

చిన్నతనంలో ప్రయాణ చేయడానికి కచ్చడం బండి వుండేది. సైజు కొంత చిన్నగా వుంటుంది. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం (దాన్ని "చక్కి" అని పిలిచే వాళ్లం) వేయాలి. ముందర బండి తోలేవాడు కూచోవడానికి "తొట్టి" వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వాళ్లం. ఎక్కువలో-ఎక్కువ ముగ్గురు-నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటిని అందంగా అలంకరించేవాళ్లం. ముఖాలకు పొన్న కుచ్చులు”, “ముట్టె తాళ్లు”, మెడకు మువ్వలు-గంటలు”, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి "కాణీ" వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వాళ్లం) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి టంగు వారుఅలంకరించేవాళ్లం. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో "చండ్రకోల" వుండేది. అది తోలుతో చేసేవాళ్లు. ఎద్దులు బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల చప్పిడి, మువ్వల సందడి, టంగు వారు కదలడం....చూడడానికి బలే సరదాగా వుండేది.

ఇంటి పక్కనే వున్న వడ్రంగి "కొలిమి" లో ఇనుప కడ్డీలను పెట్టి కాల్చడం, వాటిని సమ్మెట పోటుతో కొట్టడం, కొలిమిలో నిప్పు ఆరిపోకుండా ఉపయోగించే "తిత్తులను" వూదడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి వుండడం చూసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. అక్కడ వ్యవసాయ పనిముట్లయిన "అరకలు", "నాగళ్లు", "బురద నాగళ్లు", "దంతెలు", "బండి రోజాలు"....లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. ఆ పనితనానికి ఆశ్చర్యపోయే వాళ్లం. బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి "ఇరుసు" తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది. తొలకరి వర్షాలు పడుతుండగానే వ్యవసాయ పనులు మొదలయ్యేవి. ఆ పనుల్లో మొదటి కార్యక్రమం వ్యవసాయ పనిముట్లను బాగు చేయించుకుని దున్నడానికి సిద్ధంగా వుండడమే.

జిల్లా కేంద్రం ఖమ్మం వెళ్లాలంటే మార్గమధ్యంలో వున్న "మునేరు" దాటాలి. ఏటి దగ్గర కూర్చుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పలహారమో, చద్ది అన్నమో (మామిడికాయ వూరకాయ కలుపుకుని) తింటుంటే బలే మజా వచ్చేది. తిన్నంత తిని, కడుపు నిండా ఆ ఏటి నీళ్లే తాగే వాళ్లం. నేను ఖమ్మం లో చదువుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి మా వూరు గుండా మొదట్లో మట్టి రోడ్డు, తరువాత మెటల్ రోడ్డు, మరి కొంత కాలానికి డాంబర్ రోడ్డు వేశారు. ప్రస్తుతం డబుల్ రోడ్డు వేస్తున్నారు.

ఏబై-అరవై ఏళ్ల కింద గ్రామాలలో నెలకొన్న కొన్ని పరిస్థితులను మననం చేసుకుంటుంటే, ఇప్పటికీ-అప్పటికీ వున్న తేడా కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు, నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" (వంట్లో బాగా లేక పోతే-జ్వరం లాంటిది వస్తే) చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు, ఆయుర్వేదం వారు, పాము-తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు....ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. మా వూళ్లో ఇంతమంది లేరు కాని, అల్లోపతి వైద్యం నేర్చుకున్న ఒక డాక్టర్, ఆయుర్వేదం వైద్యం తెలిసిన మరో డాక్టర్ వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. ఇద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు ఎంజా, మలేరియా-చలి జ్వరం) .పీ.సీ టాబ్లెట్లు ఇచ్చేవారు. ఒక సీసాలో తయారు చేసిన "రంగు నీళ్లు" కూడా ఇచ్చేవారు. తగ్గితే తగ్గినట్లు, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో. వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే వాళ్లు. ఖమ్మంలో కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు.


          ఒక్కసారి చిన్నతనం రోజులు, ఇప్పటి రోజులు తలచుకుని పోల్చి చూసుకుంటే, ఎంత అభివృద్ధి చెందామో అర్థమవుతుంది. మా వూరికి ఇప్పుడు విద్యుత్ సరఫరా వుంది. ఖమ్మం నుంచి రావడానికి-పోవడానికి చక్కటి డబుల్ రోడ్ డాంబర్ రహదారి వుంది. దానిపై అన్ని వేళలా తిరగడానికి ప్రభుత్వ బస్సులున్నాయి. 24 గంటలు అందుబాటులో 108 అంబులెన్స్ వుంది. సాగర్ నీళ్లు వచ్చి గ్రామంలోని మూడొంతుల భూమి సస్యశ్యామలం అయింది. ఒకనాడు ఒకరిద్దరు క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే వున్న ఖమ్మంలో వందలాది మంది అయ్యారిప్పుడు. మా వూళ్లో ఒక పెట్రోల్ బంక్ కూడా వచ్చిందిప్పుడు. కనీసం పది మందికన్నా కార్లు, ఏబై వరకు ఇతర వాహనాలు వున్నాయి. ఫోన్ లేని ఇల్లు, మొబైల్ వాడని వ్యక్తి మా వూళ్లో కనిపించవు. మార్గ మద్యంలో వున్న ఏరు మీద వంతెన కట్టుతున్నారు. ఖమ్మం పోయే దారిలో ఖమ్మం సమీపంలో ఏటిపైన మరో వంతెన కట్తున్నారు. నడకతో కొన్నాళ్లు, సైకిల్ పైన కొన్నాళ్లు, ఎడ్ల బండిపైన కొన్నాళ్లు, ప్రయివేట్ బస్సుపైన కొన్నాళ్లు, స్కూటర్ మీద ప్రయాణం చేసి కొన్నాళ్లు ఖమ్మం-మా వూరి మధ్యన తిరిగిన మేం, ఇప్పుడు సరాసరి హైదరాబాద్ నుంచి ఉదయం బయల్దేరి కారులో మా వూరికి వెళ్లి, కొన్ని గంటలక్కడ గడిపి, రాత్రి కల్లా హైదరాబాద్ చేరుకో గలుగుతున్నాం. ఎడ్ల బండిలో ప్రయాణం చేసిన నేను విమానాలలో తిరుగుతున్నాను. ఆర్.ఎం.పి డాక్టర్ చికిత్సకే పరిమితమైన మేం ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ వైద్యం చేయించుకుంటున్నాం. పలకా-బలపం పట్టిన నేను కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నాను. ఇంత అభివృద్ధి జరిగినా ఇంకా జరగాల్సిందెంతో వుంది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల లాగా ఖమ్మం కూడా నిర్లక్ష్యానికి గురైందే. బహుశా రాబోయే రోజుల్లో తెలంగాణ దృక్ఫధంతో అభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం. End

1 comment:

  1. Chaalaa nostalgic ga feel avuthunna....
    chinnathanam , baalyam , koumaaram gurthu chesaru. Yavvanam antha Hyderabad lo tharavatha idigo ee desam lo vachi paddam...
    meekante sarigga 3 nelale pedda nenu..
    gurthu chesukuntunte bhale vundi...
    mallee malle chadive mee anubhoothi nenuu ponduthunna.
    dhanyavaadaalu.

    ReplyDelete