Friday, September 19, 2014

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా? స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా?
స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?

కారణాలేవైనా, కేబుల్‌ ఆపరేటర్లు, కొన్ని ఛానళ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుని, ఆ ఛానళ్ల ప్రసారాలను గత కొద్ది కాలంగా నిలుపుదల చేశారు. అలా చేసే హక్కు తమకుందని వారి వాదన. మీడియాపై ప్రభుత్వపరంగా ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఛానళ్ల ప్రసారాల నిలుపుదల నిర్ణయం పూర్తిగా కేబుల్ ఆపరేటర్లదేనని ప్రభుత్వం అంటున్నది. అది వాస్తవం కాదని మీడియాకు చెందిన కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, కొందరు ఆందోళన చేయడం, ముఖ్యమంత్రి, సభాపతి వరంగల్ పర్యటనలో వున్నప్పుడు ప్లకార్డుల ప్రదర్శన చేయడం, ముఖ్యమంత్రి ఒక సభలో పాల్గొంటూ పరోక్షంగా స్పందించడం తెల్సిందే. ముఖ్యమంత్రి స్పందనలో విపరీతార్థాలు లాగే ప్రయత్నం జరిగింది దరిమిలా. అన్నీ కాకపోయినా ఒకటి రెండు పత్రికలు ముఖ్యమంత్రి మాటలను బాహాటంగానే వక్రీకరించడం, తమ భావ స్వేచ్ఛకు ఆయన మాటలు ప్రతిబంధకాలుగా చిత్రించడం జరిగింది. సాధారణంగా పత్రికా స్వేచ్ఛ గురించి అంతగా పట్టించుకోని ప్రెస్ కౌన్సిల్ ఈ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులోనే స్పందించి, ఒక త్రి సభ్య సంఘాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి అన్న మాటలు పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగించేవిగా వున్నాయా? లేదా? అన్న విషయంలో విచారణ  చేయమని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా, తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ సంస్కృతీ-సంప్రదాయాలకు వ్యతిరేకంగా, తెలంగాణ భాషకు-యాసకు వ్యతిరేకంగా....ఒక్క మాటలో చెప్పాలంటే అసలు పూర్తిగా తెలంగాణాకే వ్యతిరేకంగా పనిగట్టుకుని వార్తలు రాసేవారిని మాత్రం ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఆయన వాడిన పదజాలం కూడా అలాంటి వారి విషయంలోనే. స్వేచ్ఛ పేరుతో, ఆ ముసుగులో, లక్ష్మణ రేఖలు దాటొచ్చా?

అసలింతకీ అమల్లో వున్నాయని అందరూ భావిస్తున్నవి, "ఆంక్షలా"? "లక్ష్మణ రేఖలా"? "స్వీయ నియంత్రణలా"? "మార్గదర్శకాలా"? ఎవరికి వారే తమ ప్రయోజనాలకు అనుగుణంగా-అనుకూలంగా మలుచుకుంటున్న "ముసుగులా"?. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో మీడియా నిర్వహించాల్సిన పాత్ర గురించి, వారి బృహత్తర బాధ్యత గురించి, పరాయి వారు తమపై ఆంక్షలు విధించే బదులు వారే స్వయం సంయమనం పాటించే అంశం గురించి, రాజ్యాంగ బద్ధంగా మీడియా వారికున్న స్వాతంత్ర్యం గురించీ చర్చ నిరంతరం కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తప్పొప్పులను విమర్శించే హక్కు మీడియాకుందంటూనే, ఆ హక్కుకు "హద్దులుండాలి" అని అనడం సబబే మో కాని, ఆ హద్దులకు "ఎల్లలు" ఎవరు-ఎలా గీయాలనే విషయంలోనే పేచీ వస్తున్నది. ఈ నేపధ్యంలో, "మీడియాకు లక్ష్మణ రేఖ" అన్న అంశంపై నిరంతరం చర్చ జరుగుతూనే వుంది. "వార్తలకు, వ్యాఖ్యలకు" తేడా లేకుండా పత్రికలు ప్రచురించడం వల్ల, పాఠకులు అయోమయానికి గురై, వ్యాఖ్యలనే వార్తలనుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

ఇటీవలి కాలంలో, మీడియా వ్యవహరించే తీరులో, ఊహించని ధోరణులు-విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విజ్ఞులు, మేధావులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పాత్రికేయ నాయకులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. సమాజంపై ఈ మార్పు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని కూడా వారి అభిప్రాయం. అలా అభిప్రాయ పడుతున్న వారి పరోక్ష సూచనే "లక్ష్మణ రేఖలు" అన్న సిద్ధాంతానికి మార్గం చూపాయి. అయితే, లక్ష్మణ రేఖ అంటే, నియంత్రణ కాదని-కాకూడదని, మీడియా కూడా ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థల వలెనే, ప్రజలకు "జవాబుదారీగా-బాధ్యతాయుతంగా-పారదర్శకంగా" పనిచేసేందుకు దోహద పడేది మాత్రమేనని సర్ది చెప్పుకున్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాలన్నీ మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ, అడపాదడపా ఆంక్షలు విధించకుండా వుండడం జరగదు. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు.

ఒక్క విషయం మాత్రం వాస్తవం అనక తప్పదేమో. ఇటీవల కాలంలో, సామాజిక ప్రయోజనాలను కాపాడవలసిన మీడియా, ఆ పని చేస్తూనే, అది అనుకూలించనప్పుడు, కార్పొరేట్ గొంతును మాత్రమే వినిపిస్తున్నదని సర్వత్రా చర్చనీయాంశమైంది. మీడియా మొత్తం అలా, అన్ని వేళలా చేస్తున్నదని చెప్పలేం కాని, దాని ధోరణిలో సరికొత్త నిర్వచనాలు, సరికొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యతలు చోటు చేసుకోవడం మాత్రం కాదనలేం. ఎలెక్ట్రానిక్ మీడియా ప్రభావిత పాత్రికేయ రంగంలోని కొంత భాగం, తన విశ్వసనీయతను కోల్పోతున్నదనడానికి పలు ఉదాహరణలు దొరుకుతాయనవచ్చు. ఈ ధోరణికి తోడు, ఎలెక్ట్రానిక్ మీడియాలో నెల కొన్న పోటీ, మీడియా విశ్వసనీయతకు సవాలుగా మారింది. సంక్లిష్టమైన సామాజిక ప్రయోజనం కలిగే అంశాలను తగ్గించి ప్రసారం చేయడం, పైపై మెరుగులకు అనవసర ప్రాధాన్యతను ఇవ్వడం, సంచలన వార్తల కొరకు పరుగులు తీయడం, ఆ వార్తలను తమ ఛానల్ కంటే ముందుగా ఇతరులు ప్రసారం చేస్తారేమోనన్న ఆందోళనతో దృఢ పరచుకోకుండానే "బ్రేక్" చేయడం తరచుగా జరగడంతో మీడియా విశ్వసనీయత కోల్పోయేందుకు దారితీస్తున్నది. అలాంటప్పుడు, స్వయం సంయమానికి మించిన లక్ష్మణ రేఖలు కాని, ఆంక్షలు కాని, నియంత్రణలు కాని ఎంతవరకు ఆ విశ్వసనీయతను కాపాడ కలుగుతాయి?

భారత రాజ్యాంగంలో, "ఎగ్జిక్యూటివ్-జుడీషియరీ-లెజిస్లేచర్" వ్యవస్థలు ఎటువంటి కట్టుబాట్లకు, అదుపులు-అన్వయాలకు లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలో స్పష్టంగా వివరించబడింది. అయినా, అప్పుడప్పుడూ, ఆయా వ్యవస్థలను అత్యున్నత స్థాయిలో అజమాయిషీ చేసేవారి "యాక్టివిజం" వల్ల, అనుకోకుండానే అనర్థాలు కలగడం, వాటి పర్యవసానాలు పౌరుల మీద ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిన విషయమే. కాకపోతే, రాజ్యాంగ బద్ధమైన ఆ వ్యవస్థలు తమ తప్పులను దరిమిలా సరిదిద్దుకోవడం కూడా జరిగింది. పోనీ పునఃపరిశీలన చేయడం జరిగింది. ఉదాహరణకు, పౌర హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పును తీసుకోవచ్చు. దాదాపు 35 సంవత్సరాల క్రితం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ-ఎగ్జిక్యూటివ్" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని అలనాటి సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు తీర్పిచ్చారు. అయితే, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, తిరిగి అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం, ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. "ఫోర్త్ ఎస్టేట్" గా పిలవబడే మీడియా విషయంలో రాజ్యాంగపరంగా "అదుపులు-అన్వయాలకు" వీలు  కలిగించలేదు. అందుకే రాజ్యాంగంలో పొందుపరచిన పౌరుల "భావ ప్రకటనా స్వేచ్ఛ" అనే ప్రాధమిక హక్కును, స్వీయ నియంత్రణ లాంటి "అదుపులు-అన్వయాలకు" (Self Imposed Checks and Balances) లోబడి ఉపయోగించుకుంటే బాగుంటుందేమో.


వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పౌరుల భద్రత, వైద్య పరమైన విషయాలు, నీతి వర్తన లాంటి అంశాల్లో గందరగోళం సృష్టించే పరిస్థితులకు  వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ దారితీయకూడదు. ఒక పౌరుడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, మరో తోటి పౌరుడి స్వేచ్ఛకు భంగం కలిగించ కూడదు. ఏ విధంగానైతే బహుళ ప్రయోజనాలకు ఒక వ్యక్తి స్వేచ్ఛ భంగం కలిగించ రాదో, అలానే, మీడియా స్వేచ్ఛ కూడా వుంటే మంచిదేమో. ఆ ప్రయోజనాలేంటో, ఆ పరిమితులేంటో నిర్ణయించుకోవాల్సింది విశ్వసనీయత కాపాడుకోవాల్సిన మీడియానే.

2 comments:

  1. can you certify that namaste telanganaa is not crossing such limits???

    ReplyDelete
  2. I did not name any paper or media for your information please!

    ReplyDelete