Saturday, September 20, 2014

ఐదారు దశాబ్దాల క్రితం నాటి విద్యాభ్యాసం కబుర్లు:వనం జ్వాలా నరసింహారావు

ఐదారు దశాబ్దాల క్రితం నాటి విద్యాభ్యాసం కబుర్లు
వనం జ్వాలా నరసింహారావు

        నేను పుట్టింది ఆగస్ట్ 8, 1948 . ఐదో తరగతి వరకూ బాల్యం అంతా మా వూరు లోనే. నా మూడో ఏట, చదువు ప్రారంభమైంది. మొదట, సమీప బంధువైన వనం ఎర్ర శేషయ్య గారి "కానీక బడి" లో చేర్పించారు నన్ను. ఉదయాన్నే బడికి పంపేవారు. అందరికంటే బడికి ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద "శ్రీ" అని శేషయ్య గారు రాసేవారు. తరువాత వచ్చిన వారి చేయిపైన "ఒక చుక్క" పెట్టేవారు. ఇలా ఒకరి తరువాత మరొకరు వస్తుంటే వాళ్ల చేతులపైన పెట్టే చుక్కల సంఖ్య పెరిగేది. "శ్రీ" పెట్టించు కోవడం కోసం పరుగెత్తుకుంటూ ముందుగా బడికి చేరుకునే వాళ్ళం. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో గ్రామాలలో కానీక బడులుండేవి. ఆ బడిలోనే "ఓనమాలు" (, , , , , ...), "వంట్లు" (1,2,3,4,5...), "ఎక్కాలు" (ఒకాట్ల ఒకటి, ఒక రెండు రెండు, ఒక మూడు మూడు....), "కూడికలు-తీసివేతలు" (1+1=2, 2+2=4, 4+3=7.....1-1=0, 2-1=1…), "తెలుగు వారాలు" (ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని), "తెలుగు మాసాలు" (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము), "తెలుగు సంవత్సరాలు" (ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్యక, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను,  స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోథి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోథి, విశ్వావసు, పరాభవ,  ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదిచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్ముఖి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ) లాంటివి నేర్పారు. నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పించారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. అలా....ఒక ఏడాది గడిచి పోయింది.

ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆ పాఠశాల అప్పట్లో ఒక పూరి పాకలో వుండేది. సాధారణంగా ఐదేళ్ల వయస్సు నిండిన తరువాతే మొదటి తరగతిలో చేర్పించాలి. నాకేమో అప్పటికింకా నాలుగేళ్లే! అందుకోసం పుట్టిన తేదీని మార్పించారు నాన్న గారు. నేను మా వూరి ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు అందులో మొదట్లో ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. కొద్ది కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిద్దరినీ "పాత పంతులు గారు" అని, "కొత్త పంతులు గారు" సంబోధించే వారు. అప్పట్లో మేం పెన్నులు ఉపయోగించక పోయేది. మొదట్లో పలకా-బలపం, తరువాత పెన్సిల్-రబ్బర్, మరో రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి-అందులో ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే వాళ్లం. ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదువుకుని, తరువాత అక్కడ పై తరగతులు ఇంకా ప్రారంభించనందున ఖమ్మం రికాబ్-బజార్ పాఠశాలలో చేరాను. రికాబ్-బజార్ పాఠశాల ఖమ్మం మామిళ్లగూడెంలోని మా ఇంటికి అతి సమీపంలో వుండేది అప్పట్లో. అక్కడే ఆరవ తరగతి నుంచి హెచ్.ఎస్.సీ వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను.

హెచ్.ఎస్.సీ పరీక్షల్లో హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసవడమే కాకుండా లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాను. ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో చేరాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది. ఆ విషయాలలోకి పోయే ముందర ఒక్క సారి ఖమ్మం కళాశాల ఆవిర్భావం గురించి కొంత రాస్తే బాగుంటుందేమో!

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావించారట. అది తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు ముందర శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఇటీవలే గెంటాల నారాయణరావు గారి విగ్రహాన్ని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు.

కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. కాలేజీ మైదానం పక్కనున్న షెడ్డుల్లో మా క్లాస్ జరిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి. నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో (రచయిత గుర్తుకు రావడం లేదు) "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. తెలుగు మనుచరిత్రలోని ఒక పద్యం ఇంకా గుర్తుంది. "అటజనికాంచె భూమిసురు డంబరచుంబి, శిర స్సర జ్ఝరీ పటల, ముహుర్ముహు ర్లుఠ, దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల, పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌, కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌". ఇక జనరల్ స్టడీస్ క్లాసులు ఎంతో ఆహ్లాదకరంగా వుండేవి. వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు అధ్యాపకులు. లెక్కల సార్ సబ్జెక్ట్ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు బోధించేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.

పి.యు.సి లో చేరిన తరువాత చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఆసక్తి పెరగ సాగింది. కళాశాల రాజకీయాలపై-కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ-లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అండ దండలుండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కాగా, మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా సాగుతుండేవి. కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు. కళాశాల రాజకీయాలకు మరో కేంద్రం మామిళ్ల గూడెం లోని మా ఇల్లు.

          ఇంతకు ముందే చెప్పినట్లు నా పి.యు.సి చదువు పాడు కావడానికి మరో కారణం క్రికెట్ ఆట. కాలేజీలో చేరడంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టాను. "మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్" ఆధ్వర్యంలో మా బజారులోని ఒక ఖాళీ స్థలంలో ఆడడంతో పాటు, కాలేజీ మైదానంలో కళాశాల జట్టుకు ఆడడం కూడా చేసేవాడిని. లెక్చరర్ల మద్దతు కూడా బాగా లభించేది. విద్యార్థులతో సమానంగా వాళ్లు కూడా ఆటలో పాల్గొనేవారు. మా ఇంట్లో కూచుని క్యారం బోర్డు ఆడడమో, ఉదయం-సాయంత్రం క్రికెట్ ఆడడమో నిత్య కృత్యమై పోయింది. తీరిక దొరికినప్పుడు ఇంట్లో గదిలో కూడా, ఆ కాస్త స్థలంలో క్రికెట్ ఆడుతుంటే పక్క పోర్షన్ లో వుండే ఇంగ్లీష్ లెక్చరర్ కె. వై. ఎల్. నరసింహారావు గారు తరచుగ మందలించేవారు. పి.యు.సి చదువుతున్నప్పుడు, హెచ్.ఎస్.సీ చివరి రోజుల్లో కొనుక్కున్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో లెక్చరర్లు కూడా సైకిల్ మీదనే కాలేజీకి వెళ్తుండేవారు. కొందరైతే నడిచే వెళ్లేవారు. స్కూటర్లు, కార్లు లేనే లేవు.

పి.యు.సి పరీక్షలొచ్చాయి. అందరి లాగే రాసాను. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. చాలామంది ఫెయిలయ్యారు. ఒకరిద్దరు తప్ప ఇంజనీరింగులో-మెడిసిన్ లో సీట్లు తెచ్చుకున్నవారు లేరనే అనాలి.

ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.

          డిగ్రీలో ఎప్పటిలాగే చదువు, క్రికెట్, రాజకీయాలు కొనసాగాయి. డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే నేను ఖమ్మంలో చదివాను. మరుసటి ఏడాది హైదరాబాద్ వెళ్లిపోయాను. 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత ఏబై సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఆ నాడు వచ్చిన నేను, ఇక్కడే స్థిరపడి పోతానని అప్పట్లో భావించలేదు.


No comments:

Post a Comment