Saturday, November 12, 2016

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-5 : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం-5
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (13-11-2016)

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-" సుందరీ ! మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు."శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.


మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో తంతు జరిపిస్తారు.

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, తర్వాత సప్తపది వుంటుంది. 

No comments:

Post a Comment