Monday, November 14, 2016

వాలిని సంహరించిన రామచంద్రుడు ....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 18 వ భాగం - కిష్కింద కాండ:వనం జ్వాలా నరసింహా రావు

వాలిని సంహరించిన రామచంద్రుడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
18 వ భాగం - కిష్కింద కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (14-11-2016)

రామలక్ష్మణులు ఇద్దరూ ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో విహరించడాన్ని గమనించిన సుగ్రీవుడు భయపడుతున్న సందర్భంలో, హ్లాదిని వృత్తంలో ఒక పద్యం రాశారీవిధంగా కవి:
హ్లాదిని: కనుఁ గొనినంతనె క్ష్మావరసుతుల౯(న్)
వనచరవర్యులు వారని వెరచేఁ
జనిరి వనాటని శాంతము సుఖదం
బును నగునాశ్రమము౯(న్) వడిఁ దరియన్ - 75
తాత్పర్యం: సుగ్రీవుడే కాకుండా, ఇతర వానరులు కూడా, రామ లక్ష్మణులను చూసి ఎవరో వాలి పంపగా తమను చంపేందుకు వచ్చారని భావించి, భయాతిశయంతో, వారు తలదాచుకుంటున్న మతంగాశ్రమ గుహ దగ్గరకు పోయారు. 
ఛందస్సు: హ్లాదినికి "న" "జ" "జ" "న" "గ" గణాలు, ఎనిమిదో ఇంట యతి వుంటాయి.
శ్రీరాముడిని ఆశ్రయించిన సుగ్రీవుడు, ఆయన సూచన మేరకు, తొలిసారి వాలిమీదకు యుద్ధానికి పోయి, ఓటమి పాలై నాడు. వారిరువిరిలో ఎవరి వాలియో-ఎవరు సుగ్రీవుడో పోల్చుకోలేని రాముడు తన బాణాన్ని సంధించలేదప్పుడు. వారిద్దరిలో సుగ్రీవుడిని పోల్చుకునేందుకు లక్ష్మణుడిచ్చిన మాలను ధరించి, మరోసారి వాలిని యుద్ధానికి పిలిచాడు. రణానికి పిలిచేందుకు చేసిన సింహనాదాన్ని విన్న వాలి, సహించలేని కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి పోతున్న వాలిని తార అడ్డుకుంటుంది. తాను వాలి మేలు కోరి చెప్పిన మాట విని, సుగ్రీవుడితో స్నేహం చేసుకోవాలని సలహా ఇస్తుంది. అయినా ఆ మాటలు లెక్క చేయకుండా వాలి యుద్ధానికి వెళ్లాడు. ఆ సందర్భంలో కవి మత్తకోకిలం వృత్తంలో ఒక పద్యం రాశారీవిధంగా:
మత్తకోకిలము: ఆలకింపుము ప్రాణవల్లభ యాగ్రహంబును మానుమీ
కేలి నొడ్డుచు విన్నవించెదఁ గీర్తి యుక్తముఁ బథ్యము౯(న్)
మేలు గాదు విరోధ మూన నమేయవిక్రముతోడ దం
భోళిసాధనతేజుతో రఘు ముఖ్యుతోడ శమింపుమీ -76
తాత్పర్యం: ప్రాణేశ్వరా! నా మాట విను. కోపం వదులు. చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. ఇది నీకు కీర్తి కరం కాదు. మేలు కూడా కాదు. అపరిమితమైన పరాక్రమం, ఇంద్రుడితో సమానమైన తేజస్సుగల, రామచంద్రమూర్తితో విరోధం మానుకో. శాంతించు. 
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి  ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
తార ఎన్ని హిత వాక్యములు చెప్పినా వినని వాలి, తనదైన శైలిలో, సమాధానం చెప్పి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి పోయాడు. ధర్మమందు విశేష ప్రీతి గల శ్రీరాముడు నిష్కారణంగా తననెందుకు చంపుతాడని అంటాడు తారతో. వాలి సుగ్రీవుల మధ్య ద్వితీయ యుద్ధం జరుగుతుంది. వాలితో తలపడిన సుగ్రీవుడు, గతంలో మాదిరిగానే, అతడి చేతిలో దెబ్బతిని, సహాయం కొరకు ఎదురు చూడసాగాడు. తన శరణాగతుడు పడుతున్న బాధను సహించని రాముడు వాలిపై బాణం వదులుతాడు. దాని తాకిడికి నేల కూలాడు వాలి. మరణావస్థలో వున్న వాలి శ్రీరాముడిని దూషించాడు. తార మాట విననందుకు చింతించాడు. శ్రీరాముడు వాలికి సమాధానం చెప్పాడు. ధర్మ రక్షణలో భాగంగానే వాలిని సంహరించాల్సిన అవసరం కలిగిందంటాడు. ధర్మ శాస్త్రంలోని విషయాలను వివరించాడు వాలికి. సమాధానపడిన వాలి తనను క్షమించమని వేడుకున్నాడు. తన కుమారుడు అంగదుడిని రాముడికి అప్పగించాడు. వాలి మరణ వార్త విన్న తార కిష్కింధ నుంచి అక్కడికి చేరుకుని విలపిస్తుంది. శోకిస్తున్న తారను హనుమంతుడు ఓదారుస్తాడు. అంగదుడికి నీతి వాక్యాలను బోధించి మరణించిన వాలికై దుఃఖించింది తార. దుఃఖిస్తూ తార ఎన్నో విషయాలను తలచుకుంటుంది. అస్తమించిన సూర్యుని కాంతి ఎలా మేరు పర్వతాన్ని వదలదో, అలాగే, వాలి మరణించినా రాజ్యలక్ష్మి అతడిని విడనాడకున్నదని అనుకుంటూ, తాను వాలిని యుద్ధానికి పోవద్దని వారించిన విషయాన్ని కవి మత్తకోకిలం వృత్తంలో వర్ణించారిలా:


మత్తకోకిలము:
అక్కటా హిత మెంత చెప్పిన నాలకింపకపోయి తే
నొక్కిచెప్పియు నడ్డగింప ని ను౯(న్) సమర్థను గానుగా
దిక్కుమాలిన దాననైతిని దేవ! నే సుతుతోడ, న
న్నొక్కట౯(న్) నినుఁ గూడి వల్లభ యుజ్జగించెను లక్ష్మియున్-77
తాత్ప్రర్యం: అయ్యా! నీకు మేలనుకున్న విషయాన్ని, నేను, ఎంత చెప్పినా వినలేదు కదా! అంతకంటే నొక్కి చెప్పి, పోవద్దని అడ్డగించే సామర్థ్యం నాకు లేదా యె! పర్యవసానంగా, నేను-నా కొడుకు, దిక్కులేని వారిమైపోయాం. నువ్వు నన్ను వదిలినట్లే, మాంగల్య లక్ష్మి కూడా నన్నొదిలింది.
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి  ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
చనిపోయిన వాలికొరకు సుగ్రీవుడు దుఃఖించాడు. ఆయన మరణానికి తానే కారణమని చింతిస్తాడు. ఆ సందర్భంలో, శ్రీరాముడితో, నిట్టూర్పు విడుస్తూ సుగ్రీవుడన్న మాటలను రెండు మత్తకోకిలం వృత్తాల్లో వర్ణించారు వాసు దాస కవి ఈ విధంగా:
మత్తకోకిలము: ఈవు పల్కినబాస దీరె న రేంద్ర చంద్రమ యీకపి
క్ష్మావిభుత్వము నాకు నబ్బెను గాని రాజ్యసుఖంబుల౯(న్)
జీవితంబునఁ గల్గునాశ న శించె నన్ను క్షమింపుమా
భూవరా! మన నొల్ల నిం కిటఁ బోదు నన్నకుఁ దోడుగన్ -78

మత్తకోకిలము: అన్నఁ జంపి సురాధిపత్యము నైనఁ బొందఁ గఁ గోర ము
నున్నయట్టుల ఋశ్యమూకత టోర్వి నుందు స్వవృత్తిమై
నిన్నుఁ జంప యథేఛ్చ మేగుము నీ వ టన్న మహాత్ముప
ల్కన్నెరిం దగునట్టివానికిఁ గ్రౌర్య మిట్టిది నా కగున్ - 79
తాత్ప్రర్యం:
రాజోత్తమా! నువ్వు అన్న మాట చెల్లించుకున్నావు. వానర రాజ్యం నాకు లభించింది. అయినా, రాజ్య సుఖాలపై కాని, ప్రాణాలపై కాని ఆశ నశించింది. నేనిచ్చిన మాట చెల్లించలేను. నన్ను క్షమించు. నాకు జీవించాలని లేదు. నా అన్నతో పాటే నేను కూడా చనిపోతాను. అన్నను చంపటం వల్ల, ఇంద్రత్వం లభించినా, అవసరం లేదు. మునుపటి వలనే, ఋశ్యమూక పర్వత శిఖరం మీద కాయకూరలు దిని జీవిస్తాను. దుఃఖంతో కూడిన రాజ్యం కంటే, శోక రహితమైన ఏకాంత వాసం సుఖంగా వుంటుంది. "తమ్ముడా! నేను నిన్ను చంపను-నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లు" అని ఆ నీతిపరుడంటే, నేనేమో, అలాంటి వాడిని చంపించి, ఘోర కార్యం చేసిన క్రూరుడనైనాను. 
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి  ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
వాలికి దహన సంస్కారాలు జరిగిన పిమ్మట, హనుమంతుడి కోరిక మేరకు, శ్రీరాముడు సుగ్రీవుడి పట్టాభిషేకానికి అనుమతినిచ్చాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడితో ప్రస్రవణగిరి గుహ చేరుకుంటాడు. సీతాన్వేషణకు సుగ్రీవుడు సమయం అతిక్రమించినందున రాముడు విచారపడడం, లక్ష్మణుడు కోపగించు కోవడం జరుగుతుంది. తొలుత తార, తర్వాత సుగ్రీవుడు లక్ష్మణుడిని సమాధాన పరుస్తారు. సుగ్రీవుడు వానర సేనలను సీతాన్వేషణకు సిద్ధ పరిచానని రాముడికి తెలియచేస్తాడు. నలు దిక్కులకు వానర సేనలను పంపుతాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుకు హనుమ దాదులను పొమ్మంటాడు. కార్య భారాన్ని హనుమంతుడిపైన పెట్టాడు సుగ్రీవుడు. శ్రీరాముడు తన ముద్రికను కూడా హనుమంతుడికి ఇచ్చాడు. సీతాన్వేషణలో భాగంగా, జటాయువు సోదరుడు సంపాతిని అంగ దాదులు చూడడం, ఆయన వీరితో సంభాషించడం జరుగుతుంది. సంపాతి ద్వారా రావణుడి ఉనికి తెలుసుకుంటారు వానరులు. సీతా వృత్తాంతాన్ని జాంబవంతుడితో చెప్పాడు సంపాతి. వానరులంతా సముద్రతీరాన్ని చేరుకుంటారు. సముద్రాన్ని లంఘించడానికి, హనుమంతుడిని ప్రోత్సహించాడు జాంబవంతుడు. హనుమ దాదులు మహేంద్రాద్రిని ఎక్కుతారు. అక్కడితో కిష్కింధ కాండ అయిపోతుంది.  
కిష్కింధ కాండాంత పద్యాలలో ఒకటి వనమయూరం వృత్తంలో, ఇంకొకటి కాంతి వృత్తంలో రాశారు కవి. ఇంతకు పూర్వం కాండలలో వలెనే, ఇందులో కూడా భగవంతుడిని స్తుతిస్తూనే, కిష్కింధ కాండలో మొత్తం పద్యాలెన్ని వున్నాయో వివరించారు కవి. ఆ రెండు పద్యాలు:

వనమయూరము: స్నిగ్ధజనపాలనవి శిష్టసుచరిత్రా!
ముగ్దతరజీవిచయ మోహపరితప్తా!
దుగ్ధనిధివాస బుధ తోషణవిదగ్ధా!
దిగ్ధసరసీజసమ దృగ్దర రమేశా! -80

కాంతి: భామా భయదా కృపాళువరా
భూమీరుహచారి పుంగవహా
రామైకశిలాపు రాశ్రయణా
సోమాననబింబ సోమనుతా - 81
తాత్పర్యం: మిత్రులను రక్షించే శిష్ట గొప్ప నడవడి గల వాడని, అజ్ఞానులైన ప్రాణుల అజ్ఞానానికి పరితాపం చెందేవాడని, పాల సముద్రంలో నివసించే వాడని, పండితులను సంతోష పరచటంలో నేర్పరని, పూచిన కమలాలతో సమానమైన కళ్లున్న వాడని, లక్ష్మీపతీ అంటూ సంబోధించు తూ భగవంతుడిని ప్రార్థించారు కవి. కింది వృత్తంలోని "భామా భయ" అనే అక్షరాలు, సాంఖ్య శాస్త్రం ప్రకారం 1454 తో సమానమని, కిష్కింధ కాండలోని పద్యాల సంఖ్యను  ఈ వృత్తంలో తెలిపే విధంగా రాశారు కవి. 
ఛందస్సు: వనమయూరం వృత్తానికి "భ" "జ" "స" "న" "గగ" గణాలు, తొమ్మిదో ఇంట యతి. కాంతి వృత్తానికి "భ" "జ" "భ" "గ" లు గణాలు, ఏడవ స్థానంలో యతి.

No comments:

Post a Comment