Sunday, November 27, 2016

లంఖినిని చావు దెబ్బ తీసిన హనుమ ...ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 20 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

లంఖినిని చావు దెబ్బ తీసిన హనుమ
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
20 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (28-11-2016)

లంకలో ప్రాకారం చేరి తిరిగి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. వానర సైన్యం లంకలోకెలా రాగలదని యోచించాడు. రామ లక్ష్మణుల బల పరాక్రమాలను బేరీజు వేసుకుని, ధైర్యం తెచ్చుకుంటాడు. లంకా నగరంలో ప్రవేశిస్తున్న హనుమంతుడిని అడ్డుకున్న లంకాధి దేవత లంకిణిని, తన ఎడమ చేతి పిడికిలితో పొడిచాడు హనుమంతుడు. తనను రక్షించమని వేడుకున్న లంకిణి, లంకా నాశనానికి సమయం వచ్చిందని అంటుంది. లంకలో తిరగమంటుంది. లంకలో ప్రవేశించి, సంచరిస్తున్న హనుమంతుడు, వర్ణనాతీతమైన రావణుడి అంతఃపురాన్ని చూసినప్పుడు దాన్ని వర్ణిస్తూ "వంశస్థము" వృత్తంలో రాశారీ పద్యాన్ని కవి:

వంశస్థము:              సహేమరత్నోజ్జ్వల చక్రవాళమున్
                        మహార్హముక్తామణి మండి తాంతము౯(న్)
                        మహా సితాభ్రాగురు మంజుగంధమై
                        రహించురక్షోధిపు రాణివాసమున్ -85

తాత్పర్యం:     బంగారం, ఇతర రత్నాలతో ప్రకాశిస్తున్న ప్రాకారంతో, విలువైన ముత్యాలు-రత్నాలతో అలంకరించబడిన లోగిలితో, అగరు చెక్కల కమ్మని వాసనలతో కూడి వున్న రావణుడి అంతఃపురాన్ని చూశాడు హనుమంతుడు.

ఛందస్సు:      వంశస్థము వృత్తానికి "జ" "త" "జ" "ర" "గ" గణాలు, ఎనిమిదింట యతి వుంటాయి.
రావణుడి అంతఃపురాన్ని బయట నుంచే చూసిన హనుమంతుడు, ఆ తర్వాత, లోనికి ప్రవేశించాడు. ఆకాశం మధ్యలో, సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో, హనుమంతుడు చూసిన చంద్రుడిని వర్ణించడానికి, వాసు దాస కవి లయగ్రాహి, చారుమతి వృత్తాల్లో రెండు పద్యాలను ఈ విధంగా రాశారు:

లయగ్రాహి:    అంత హనుమంతుడు న భోంతరమునఁ గనియె
                వింత లగు వెన్నెలల కాంతులు వెలుంగన్
                గాంత మగుమంద వృష కాంతునిగతిన్ మలయు
                చంతట జగంబున ని తాంతరుచి మీరన్
                స్వాంతములు హాయి గొన సంతసమున్ జలధి
                కాంతుఁ డు తరంగముల గంతు లిడు నట్లా
                శాంతముల నంటునటు లెంతయును జేయునుడు
                కాంతు జనసంచయదు రంతదురితాంతు౯(న్) -86

చారుమతి:     ఏకాంతి పొల్చునొ మ హీస్థలి మందరస్థ మై
                యేకాంతి సంజ రహి యించి నదీశ్వరస్థ మై
                యేకాంతియొప్పు సర సీద్ధసరోరుహస్థ మై
                యాకాంతి యప్డు పొలు పారె నిశాకరస్థమై - 87

తాత్పర్యం:    
హనుమంతుడు చూసిన ఆనాటి చంద్రుడు, వినోదకరమైన వెన్నెల కాంతులను విరజిమ్ముతూ, అందమైన ఎడ్ల గుంపులో ఆబోతులా తిరుగుతూ, ప్రపంచమంతా తన చల్లటి కాంతిని వ్యాపింప చేస్తూ,           జనాల మనస్సుల్లో సుఖపడ్తున్నామన్న ఆలోచన కలుగ చేస్తూ, ఉప్పొంగిన సముద్రుడి నృత్యాన్ని తలపిస్తూ, ఆబాలగోపాలానికి దుఃఖ నాశనం చేస్తున్నట్లున్నాడు. భూమ్మీదున్న మందర పర్వతపు కాంతి, సాయం సమయంలో సముద్రంలో వున్న కాంతి, సరస్సులందలి తామర పూల కాంతిని పోలిన కాంతే చంద్రుడిలో వుందప్పుడు.


ఛందస్సు:      లయగ్రాహికి భ---------గణాలుంటాయి. ప్రాస యతే కాని-యతి లేదు. ఇది సమ వృత్తాల్లో చేరింది కాదు-మాలికా వృత్తాల్లో చేరింది.
చంద్ర వర్ణనను కొనసాగిస్తూ, వాసు దాసు గారు, మరో పద్యాన్ని వంశస్థము వృత్తంలో రాశారీవిధంగా:

వంశస్థము:    వినష్టశీతోదక బిందుపంకుఁ డు౯(న్)
                ఘనగ్రహగ్రాహవి నష్టపంకుఁ డు౯(న్)
                వినోదలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకుఁ డు౯(న్)
                వినిద్రరుగ్యుక్తిఁ జనె౯(న్) శశాంకుడు౯(న్) -88
తాత్పర్యం:     నశించిన మంచు బిందువుల మాలిన్యం కల వాడును, తన కాంతితో బృహస్పతి లాంటి పెద్ద గ్రహాల           కాంతిని కప్పిన వాడును, ఆశ్చర్యకరమైన కాంతికి ఆశ్రయమై-నిర్మలమైన అంకము కలవాడై, విశేష           కాంతితో చంద్రుడున్నాడు.
ఛందస్సు:      వంశస్థము వృత్తానికి "జ" "త" "జ" "ర" "గ" గణాలు, ఎనిమిదింట యతి వుంటాయి.

త్రయోదశి నాటి ప్ర దోష కాలంలో ప్రకాశిస్తున్న చంద్రుడి కాంతికి పటాపంచలైన చీకటిలో, కమ్మని వీణా నాదాల మధ్య, లంకలోని రాక్షస స్త్రీలను చూశాడు హనుమంతుడు. ఆయన అలా చూసిన స్త్రీల మధ్య సీతాదేవి వుందేమోనని వెతుకుతాడు. వారి ముఖ నేత్రాలను పరికించి చూసి వారంతా దేవతా స్త్రీలా? రాక్షస స్త్రీలా అని పరీక్ష చేశాడు. తాను చూస్తున్న స్త్రీలలో సీతా దేవేనని భావించడానికి అర్హతలున్న వ్యక్తిని చూడలేక పోయినందుకు బాధ పడిన సందర్భాన్ని దోదకము వృత్తంలో రాశారు కవి ఇలా:

దోదకము:     సీతను రాముని శ్రీతరలాక్షిన్
                వాతతనూజుడు పట్టనమందున్
                భీతిల కారసి వేదిజ లేమిన్
                జాత మహావ్యథ సంకటమందెన్ -89

తాత్పర్యం:     శ్రీరామచంద్రమూర్తి భార్యైన సీతా దేవి కొరకు, భయపడకుండా, అన్ని రహస్య ప్రదేశాలలో, వెతికినప్పటికీ, కనపడక పోవడంతో, హనుమంతుడు ఎంతగానో దిగులు చెందాడు.

ఛందస్సు:      దోదకము నకు మూడు "భ" గణాలు, రెండు గురువులు, ఏడింట యతి స్థానముంటుంది. 

No comments:

Post a Comment