Monday, November 28, 2016

చరిత్ర చెక్కిన ఆయుధం కాస్ట్రో : వనం జ్వాలా నరసింహారావు ....ఆంధ్రజ్యోతి దినపత్రిక (29-11-2016)

చరిత్ర చెక్కిన ఆయుధం కాస్ట్రో
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (29-11-2016)

అగ్రరాజ్యమైన అమెరికా దేశాన్ని అర్ధ శతాబ్దం పాటు గడగడ లాడించి, ఆ దేశాధ్యక్షులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కాస్ట్రో, తన 90 వ ఏట మరణించారు. ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమనేత, ఒక కమ్యూనిస్ట్ యోధుడు, అలనాటి ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు, ఫిడల్ కాస్ట్రో మరణం, ఆ దేశవాసులకే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన లక్షలాది అభిమానులకు, ముఖ్యంగా ఆయనను అందరికన్నా ఎక్కువగా అభిమానించే అనేకమంది భారతీయులకు దుఃఖం కలిగించే వార్త. కాస్ట్రో జీవనయానమే ఒక ఉద్యమం...ఎందరికో స్ఫూర్తి దాయకం.

2006 లో శస్త్ర చికిత్స జరిగిన తరువాత, క్షీణించిన ఆరోగ్యం కారణాన, క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఫిడల్ కాస్ట్రో స్థానంలో ఆయన సోదరుడు రావుల్ కాస్ట్రో పార్టీ-పాలనా బాధ్యతలను చేపట్టాడు. దరిమిలా, ఫిబ్రవరి 19, 2008 న దేశాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన కాస్ట్రో స్థానంలో 15 మంది సభ్యులతో, రావుల్ కాస్ట్రో నాయకత్వాన పోలిట్ బ్యూరో ఏర్పాటైంది. అధికారాన్ని వదిలినప్పటికీ, క్యూబన్ రాజకీయాలలో, కాస్ట్రో గళం మాత్రం చివరిదాకా వినిపించిందనాలి. కాస్ట్రోను ప్రేమించినా-ద్వేషించినా, ఆయన లేని దేశంలో జీవించడాన్ని ఊహించలేరు చాలామంది క్యూబన్ పౌరులు. అహర్నిశలూ, క్యూబాలో సామ్యవాదం కొనసాగేలా తన శాయశక్తులా కృషి చేసి, ఆ వ్యవస్థను బలహీన పరిచేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని నిర్దాక్షిణ్యంగా కాస్ట్రో అణచి వేయడమే దానికి కారణం!

కాస్ట్రో, తన 30 వ ఏట, విజయ గర్వంతో, హవానాలో అడుగిడినప్పుడు, అప్పటి వరకు పాలించిన బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన "హీరో" గా స్వాగతం పలికారు క్యూబన్లు. అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే, అమెరికన్ల ఆధీనంలో వుంటూ వస్తున్న ఆస్తులను-భూములను ప్రభుత్వం జప్తు చేసి తన అధీనంలోకి తెచ్చుకోవడంతో, అమెరికా దేశంలో ప్రజాభిప్రాయం కాస్ట్రోకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన కాస్ట్రో, తన వ్యతిరేక దారులను ఉక్కుపిడికిలితో అణచివేశాడు. ఎప్పుడైతే తన ప్రభుత్వం మద్దతుకోసం కాస్ట్రో సోవియట్ యూనియన్ వైపు దృష్టి సారించాడో, స్నేహ హస్తం సారించాడో, అప్పుడే, ప్రపంచ పశ్చిమ భూభాగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. ఆ పరిణామంతో ఖంగుతిన్న అమెరికాను, కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేయాలన్న ఆలోచనలో పడవేసింది. 1961 లో, 1962 లో, ఆ తరువాత మధ్య-మధ్య తమ దేశంపై అమెరికా చేసిన దాడులను, యుద్ధ వ్యూహంలో ఆరితేరిన కాస్ట్రో, తనకు అనుకూలంగా మలచుకున్నాడు. తన సహజమైన విప్లవాత్మక ధోరణిలో, అమెరికా దేశాన్ని క్యూబన్ల దృష్టిలో శత్రువుగా చిత్రించి చూపి, క్యూబన్ల రక్షకుడుగా నిలిచాడు కాస్ట్రో. కమ్యూనిజాన్ని కౌగలించుకుని, అమెరికా వ్యతిరేకతను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ, రెండింటినీ తాను అధికారంలో కొనసాగేటట్లు మలచుకున్నాడు.

కాస్ట్రో ఆగస్ట్ 13, 1926 న క్యూబాలో జన్మించాడు. చిన్న తనంనుంచే విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న కాస్ట్రో పదమూడేళ్ల వయస్సులోనే, తండ్రి వ్యవసాయ క్షేత్రంలో, సమ్మెను నిర్వహించాడు. తల్లిదండ్రులిరువురూ నిరక్షరాస్యులైనప్పటికీ, ఫిడల్‍ను బోర్డింగ్ పాఠశాలకు పంపారు. ఫిడల్ కాస్ట్రో తెలివైన-చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పాఠశాల ఉత్తమ క్రీడాకారుడుగా బహుమతి పొందాడు కూడా. చదువు పూర్తైన తరువాత హవానాలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించాడు. నిరంతరం బీద-పేదల కేసులే వాదించడానికి ఒప్పుకోవడం వలన ఆర్థికంగా ఎదగలేక పోయాడు. ఈ నేపధ్యంలో క్యూబాలో నెలకొన్న ఆర్థిక అసమానతలను అర్థం చేసుకో సాగాడు. దేశాన్ని నియంత్రిస్తున్న అమెరికన్ వ్యాపార వేత్తల ఐశ్వర్యాన్ని, అంతస్తును అసహ్యించుకో సాగాడు. తిరుగుబాటు భావాలు పెరగ సాగాయి.

21 సంవత్సరాల వయస్సులో, 1947 లో, క్యూబన్ పీపుల్స్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు కాస్ట్రో. అవినీతికి, అన్యాయానికి, బీదరికానికి, నిరుద్యోగానికి, చాలీ-చాలని జీతభత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆ పార్టీ భావాలు ఆయనకు నచ్చాయి. ఐదేళ్ల లోనే, 1952 లో, ఆ పార్టీ పక్షాన ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. సహజంగా మంచి వాగ్ధాటి కలిగిన కాస్ట్రోకు పార్టీలోని యువకుల మద్దతు బాగా లభించింది. క్యూబన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్న తరుణంలో, జనరల్ ఫల్జెన్సియో బటిస్టా, సైన్యం తోడ్పాటుతో, అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని ఎన్నికలు జరగకుండా ఆపాడు. ఇక లాభం లేదనుకున్న కాస్ట్రో విప్లవం ద్వారానే క్యూబన్ ప్రజలకు విముక్తి లభిస్తుందని భావించాడు. 1953 లో 123 మంది స్త్రీ-పురుష విప్లవకారుల సహాయంతో, సైన్యం నివసించే మోంకాడా ప్రాంతంపై దాడి చేశాడు. బటిస్టాను పదవీచ్యుతుడిని చేయాలన్న వ్యూహం అప్పటికి బెడిసికొట్టింది. కాస్ట్రో అరెస్టు అయ్యాడు. అదృష్టవశాత్తు, కాస్ట్రోను వురితీయకుండా దగ్గర లోని పౌర జైలుకు పంపారు. జైలులో కూడా మరణానికి చేరువైన సందర్భాలున్నాయి. ఆపాటికే చోటుచేసుకున్న ప్రపంచ వ్యాప్త ప్రజాభిప్రాయ నేపధ్యంలో కాస్ట్రోను చంపించే ప్రయత్నం మానుకున్నాడు బటిస్టా. ముద్దాయిగా తనను విచారణ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకున్న కాస్ట్రో, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరవు పెట్టాడు. ఆయన ఆనాడిచ్చిన ఉపన్యాసాన్ని తరువాత "హిస్టరీ విల్ అబ్సాల్వ్ మి" అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. కాస్ట్రోకు పదిహేనేళ్ల కారాగార శిక్ష విధించబడింది. పుస్తకం, విచారణ, జైలు శిక్ష లాంటివి క్యూబన్ల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో కాస్ట్రోను హీరో చేశాయి. క్యూబన్ పౌరుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపధ్యంలో, రెండేళ్ల జైలు శిక్షను మాత్రమే అనుభవించిన కాస్ట్రోను ప్రభుత్వం విడుదల చేసింది. క్యూబా నుంచి మెక్సికోకు వెళ్లిన కాస్ట్రో, బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసేందుకు వ్యూహం పన్న సాగాడు.

యుద్ధ సామాగ్రిని సరిపోయినంత మోతాదులో సమకూర్చుకున్న అనంతరం, ఎనభై మంది విప్లవకారులతో కలిసి కాస్ట్రో, చి గువేరా, జాన్ ఆల్మీడా 1956 లో క్యూబాలోకి ప్రవేశించారు. మోంకాడా సైనిక స్థావరాల మీద దాడి చేసిన తేదీకి గుర్తుగా, ఈ బృందాన్ని "జులై 26 ఉద్యమం" గా పిలవ సాగారు. సియారా పర్వత శ్రేణిలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధం కొనసాగించాలని ఆ బృందం ఎత్తుగడ వేసుకుంది. పర్వతాల దగ్గరకు చేరుకునే లోపునే ప్రభుత్వ సేనలు వారిపై దాడి చేశాయి. సియారాకు చేరుకునే సరికి కేవలం పదహారు మంది మాత్రమే మిగిలారు. వారి వద్ద వున్న ఆయుధాలు మొత్తం కలిపి పన్నెండే! తరువాత కొన్ని నెలల పాటు సమీపంలోని-చుట్టుపక్కల సైనిక స్థావరాలపై దాడి చేసి కాస్ట్రో బృందం తమ ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంది. వారున్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వాధీనంలోకి తెచ్చుకున్న వెంటనే అక్కడి పేద రైతులకు భూమిని పంచారు. ఆ రైతుల మద్దతు వారికి పూర్తిగా లభించింది. కాస్ట్రో జాడ చెప్పమని పలువురిని హింసించ సాగారు. బటిస్టా ప్రభుత్వం చేయిస్తున్న అరాచకాలకు నిరసనగా ప్రజల మద్దతు కాస్ట్రోకు పెరగ సాగింది. 1958 లో నలబై ఐదు సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వానికి రాసిన లేఖలో "జులై 26 ఉద్యమం" కు మద్దతు తెలిపాయి.


ప్రభుత్వ సేనలపైన దెబ్బ మీద దెబ్బ తీసుకుంటూ ముందుకు సాగింది "జులై 26 ఉద్యమం". 1958 వేసవికాలంలో వేయి మందికి పైగా బటిస్టా సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగింది. బటిస్టా సేనల మాదిరి కాకుండా, తమకు పట్టుబడిన ప్రభుత్వ సైనికులను గౌరవంగా చూడడం చేసేది "జులై 26 ఉద్యమం" బృందం. యుద్దంలో అనుకూలంగా లేని ప్రతిసారి బటిస్టా సేనలు కాస్ట్రో సేనలకు లొంగిపోవడానికి ఇది దోహదపడింది. క్రమేపీ సేనలు మొత్తం గొరిల్లాలతో కలవడం ప్రారంభమైంది. అమెరికా బటిస్టా ప్రభుత్వానికి మద్దతుగా అధునాతన ఆయుధాలను సరఫరా చేసింది. గొరిల్లాల ముందర అవి వాడడం తెలియని ప్రభుత్వ సేనలు అపజయం దిశగానే పోసాగారు. మార్చ్ 1958 లో బటిస్టా సేనల విఫలం చూసిన అమెరికా, ఆ దేశంలో ఎన్నికలు జరిపించమని సూచించింది. ఆ సూచనను పాటించి ఎన్నికలు జరపడం జరిగింది కాని, ఓటర్లు ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరించారు. ఎదురు దాడిలో బటిస్టాను ఓడించగలనన్న నమ్మకంతో కాస్ట్రో గొరిల్లాలు ప్రధాన నగరాల వైపుగా కదల సాగారు. అమెరికాను సంప్రదించిన బటిస్టా, దేశం వదిలి పారిపోవడానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన కొందరు సైనిక జనరల్స్ మిలిటరీ పాలన తేవాలని చేసిన ప్రయత్నాలను కాస్ట్రో తిప్పికొట్టాడు. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా, దేశ వ్యాప్త కార్మిక-కర్షక-సకల జనుల సమ్మెకు పిలుపిచ్చాడు. పెద్ద సంఖ్యలో ఆ పిలుపుకు లభించిన స్పందనను గమనించిన మిలిటరీ వెనక్కు తగ్గింది. జనవరి 9, 1959 న కాస్ట్రో విజయ పథంవైపు దూసుకుంటూ, హవానా నగరం చేరుకుని క్యూబా నూతన నాయకుడుగా ప్రజల ముందుకొచ్చాడు.

కాస్ట్రో పాలన అమెరికాకు రుచించలేదు. క్యూబాలోని అమెరికన్ ఆస్తులను, టెలిఫోన్ కంపెనీని జాతీయం చేయడమే దీనికి కారణం. అమెరికా పట్ల తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శించేవాడు కాస్ట్రో. తన దేశంలో పండిన చక్కెరను కొనడానికి అమెరికా అంగీకరించక పోవడంతో, సోవియట్ యూనియన్‍తోను, ఇతర తూర్పు యూరోప్ దేశాలతోను చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా నిరాకరించిన ఆయుధ సామాగ్రిని, సాంకేతిక నిపుణులను, మెషినరీని ఇవ్వడానికి కూడా సోవియట్ యూనియన్ అంగీకరించింది. నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ కోపంతో కాస్ట్రోకి పాఠం చెపుదామనుకున్నాడు కాని, అది బెడసి కొట్టి, కాస్ట్రోను సోవియట్ యూనియన్‌కు మరింత చేరువ చేసింది. క్యూబా సోవియట్ యూనియన్ సైనిక స్థావరం అవుతుందేమోనన్న భయం కలగ సాగింది ఐసెన్హోవర్‍కు. క్యూబా వెలుపల గొరిల్లా సేనలను తయారు చేసి కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేసే ప్రణాళిక సిద్ధం చేసింది అమెరికన్ ప్రభుత్వం. ఆయనను కనీసం ఇరవై పర్యాయాలన్నా మట్టుబెట్టే ప్రయత్నం చేసింది సిఐఏ. 1961 లో ఐసెన్హోవర్ స్థానంలో వచ్చిన జాన్.ఎఫ్.కెన్నెడీ మెడకు చుట్టుకుంది క్యూబన్ వ్యవహారం. కాస్ట్రోను తుదముట్టించడానికి కెన్నెడీ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

సోవియట్ యూనియన్ మరోవైపు తన క్యూబా మద్దతును ద్విగుణీకృతం చేసింది. అణుయుద్ధం జరిగే ప్రమాదం దిశగా అమెరికా-సోవియట్ యూనియన్ కదల సాగాయి. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు మొదలయ్యాయి. రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ తన కోపాన్ని కెన్నెడీకి వరుస వుత్తరాల ద్వారా వ్యక్త పరిచాడు. క్యూబాపైన దాడికి దిగబోమని అమెరికా హామీ ఇస్తే, తాము తమ మిస్సైల్స్ ను ఉపసంహరించుకుంటామని కృశ్చేవ్ అన్నాడు. కెన్నెడీ ఆ ప్రతిపాదనకు అంగీకరించడంతో అప్పటికి అణు యుద్ధ ప్రమాదం తప్పింది. అమెరికా-సోవియట్ యూనియన్ల మధ్య అణుయుద్ధ ప్రమాదం సంభవించాల్సిన ఏకైక సన్నివేశం "క్యూబన్ మిస్సైల్ సంక్షోభం" ఆ విధంగా అప్పటికి సమసి పోయింది. ఇక అక్కడినుంచి ప్రచ్చన్న యుద్ధం మొదలైంది.


జులై 31, 2006 న తన రాజకీయ బాధ్యతలను తమ్ముడు రావుల్‍కు బదలాయించాడు కాస్ట్రో. ఫిబ్రవరి 19, 2008 న తానిక భవిష్యత్‍లో దేశాధ్యక్షుడుగా కాని, సైనికాధికారిగా కాని వుండబోనని ప్రకటించాడు. ఆ విధంగా, 1959 చారిత్రాత్మక విప్లవం అనంతరం, మొట్టమొదటి సారి, క్యూబాలో నాయకత్వ మార్పిడి జరిగింది. "క్యూబాలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఆచరణలో కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, పదిలపరచుకుంటూ, బధ్రపరుచుకుంటూ, త్రికరణ శుద్ధిగా కొనసాగించడానికి, క్యూబా దేశం సామ్రాజ్యవాదం వైపు మొగ్గు చూపకుండా వుండేందుకు నా పదవిని ఉపయోగించుకుంటాను" అని, ఆ సందర్భంగా ప్రతిజ్ఞ చేశాడు రావుల్. ప్రపంచ విప్లవ చరిత్రలో మరో అంకం ముగిసింది.

1 comment:

  1. ఇంతపెద్దవ్యాసం చదివేందుకు సమయం లేదు. వీలువెంబడి తప్పక చదువుతాను.

    . . . ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమనేత, ఒక కమ్యూనిస్ట్ యోధుడు, అలనాటి ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు, ఫిడల్ కాస్ట్రో . . .

    ఆయన కమ్యూసిష్టు. కాని ఆయన కుటుంబానిదే అధికారం. దానిని మనం కుటుంబపాలన అనాలి అంటే అక్షేపణ వస్తుంది. అలాగే మన సోకాల్డ్ గాంధీలదీ కుటుంబపాలన అనకూడదట. ఎందుకని అనకూడదూ అంటే‌ వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే చెబుతారు ప్రజాకోసం తాము మాత్రమే గొప్పగొప్ప త్యాగాలు చేసామని. ఆట్టే మాట్టాడితే తామే దేశాన్ని నిర్మించి నడిపించి అసలు హక్కుదారులం ఐపోయామని. జనానికి నమ్మినా నమ్మకపోయినా నోరెత్తేందుకు మాత్రం వీలుండదు దాదాపుగా - కనీసం ఆ పాలకుల ప్రభనడుస్తున్నంత కాలమూ.

    . . . కాస్ట్రోను ప్రేమించినా-ద్వేషించినా, ఆయన లేని దేశంలో జీవించడాన్ని ఊహించలేరు చాలామంది క్యూబన్ పౌరులు. . . .

    ఒకప్పుడు ఇందిరాగాంధీని అభిమానించినా ద్వేషించినా కూడా ఆవిడలేని భారతదేశాన్ని ఊహించుకోవటం‌ కష్టమే అన్న భావన ఉండేది. ఇప్పుడు? ఆవిడమీ తలచుకొనే వారు అటు కాంగీల అగ్రకుటుంబం - అదీ అంత నమ్మకంగా చెప్పలేను, ఇటు మన మేతావులు -వాళ్ళకు ఆవిడ వ్యాసాలకు పనికివచ్చే ముడిసరుకు ఇంకాను. మరెవరూ లేరు.

    . . . కాస్ట్రో, తన వ్యతిరేక దారులను ఉక్కుపిడికిలితో అణచివేశాడు. . . .
    ఈ పని అధికారంలో ఉన్నవారంతా చేసేదే -ముఖ్యంగా కమ్యూనిష్టులు - కాని వారు చేసేది ప్రజలకోసం అని ప్రపంచం‌ నమ్మి తీరాలని వారంటారు. ఇతరులుచేస్తే అది హింస. వారు చేస్తే అది ప్రజావిప్లవం కదా మరి.

    . . . . ప్రపంచ విప్లవ చరిత్రలో మరో అంకం ముగిసింది. . . .

    ఏ‌ ప్రపంచచరిత్ర? పిల్లల పాఠ్యగ్రంథాల కెక్కేదా? మంచిది. కొన్నాళ్ళకీ చరిత్రలన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఎవ్వరికీ గుర్తుండవు. ప్రజలకు స్థిరమైన మంచి చేసిన వాళ్ళని మరింత ఎక్కువకాలం‌ నిలువనిస్తుంది ఆచరిత్ర తన పుటల్లో - ఒక రాముడి చరిత్రలాంటిది శాశ్వతమే ఐనది. కాని ఈరోజున ఎవరో కొంతప్రభవెలిగించి మాది చరిత్రలో సుస్థిరస్థానమూ ఒక అంకానికి మేం కర్తలమూ అనుకుంటే కాలం నవ్వుకుంటుంది.

    ఇంకా అనేక ఆణిముత్యాలున్నాయేమో ఈ‌పెద్ద వ్యాసంలో ఆనక పరిశీలనగా చదువుతాను.

    ReplyDelete