Monday, December 19, 2016

అశోక వాటిక ధ్వంసం చేసిన హనుమాన్ ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 23 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

అశోక వాటిక ధ్వంసం చేసిన హనుమాన్
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
23 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (19-12-2016)

మరలిపోడానికి సీత అనుమతి తీసుకున్న హనుమంతుడు, కార్య శేషం గురించి ఆలోచన చేశాడు. అశోక వనాన్ని పాడుచేశాడు మొదట. హనుమంతుడి వృత్తాంతాన్ని తెలుసుకున్న రావణాసురుడు ఆయన పైకి కింకరులను పంపాడు. హనుమంతుడి జయ ఘోష ఆరంభమవుతుంది. ప్రాసాదాన్ని విరగదన్నడం , కింకరులను చంపడం జరుగుతుంది. చైత్య పాలకులను, జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను హనుమంతుడు చంపుతాడు. సేనానాయకులను కూడా చంపిన తరువాత, అక్ష కుమారుడిని పంపుతాడు రావణుడు. అతడిని కూడా చంపుతాడు హనుమంతుడు. మహావీరుడైన తన కుమారుడు అక్ష కుమారుడిని ఒక సామాన్య కోతి చంపిందని తెలుసుకున్న రావణాసురుడు కోపంతో ఊగిపోతాడు. రావణుడు తన మరో కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పొమ్మని అంటూ, అతడి ధైర్య సాహసాలను పొగుడుతాడు. ఆ సందర్భంలో వాసు దాస కవి రాసిన పద్యాలు "మత్తకోకిలము" "తరలము" వృత్తాలలో వున్నాయి.

మత్తకోకిలము:
          ఈ వె యస్త్ర విదగ్రగణ్యుఁ డ వీవె సర్వ సుపర్వదై
        త్యావళీ వ్యసనప్రదాతవు ఖ్యాతమెల్ల జగంబులన్
        దావకీన భుజాబలంబు, విధాతఁ గొల్చి మహాస్త్రముల్
        నీవు పొందితి, నీ చరిత్రలు నిర్జరాళికి స్పష్టముల్ - 106

మత్తకోకిలము:
          యోజనం బొనరింపఁ దోఁ పని యుక్తి యొక్కడు లేదు నీ
        కాజికేళి నసాధ్య మౌ పని యైన నేదియు లేదుగా
        యా జగత్త్రయి నీదు దర్ప మ హీనని స్తులి తా స్త్ర సం
        యోజితాద్భుత శక్తి యెవ్వరొ కో యెరుంగరు పుత్రకా! -107

తరలము:
          తపము పేర్మిఁ బరాక్రమంబున దారుణాస్త్రబలంబునన్
        విపుల శక్తిని మాదృశుండవు నీకు గెల్పు రణంబులో
        నెపుడు నిశ్చిత మౌ టెరుంగుట నేను జింతఁ దొరంగి ధీ
        నిపుణ! యెప్పుడు హాయి నుండుదు నేఁ టి మాట యిదేటికిన్-108

మత్తకోకిలము:
          సేన యంతయు వానరేంద్రుని చే హతం బయి పోకమున్
        వాని నస్త్రవిదగ్రగణ్య! జ వంబుమైఁ బరిమార్పుమీ
        వానిఁ దాఁ కఁ గఁ బోవు ముందుగ  వాని శక్తి స్వశక్తియున్
        మానసంబునఁ జక్కఁ జూడు ప్ర మాదముం బడఁ బోకుమీ-109

మత్తకోకిలము:
          సేన కావఁ గ లేదు ని న్నని సిద్ధమియ్యది, సేన లె
        న్నైనఁ దాఁ కినద్రుంచు వాఁ డు, మ హాబలోపమ వేగు వై
        శ్వానరాభుని డాయఁ బోకుము వజ్రమున్ ధరియించి యొం
        డేని ముష్టి రణంబు సేయఁ గ నేని మర్దిత శాత్రవా - 110

మత్తకోకిలము:
          ఇంతయుం దలపోయుమీ మరి యేది యుక్తమొ చూడుమీ
        యంత నింతను బోఁ డు వాఁ డు మహాస్త్రముల్ స్మరియింపుమీ,
        స్వాంతమున్ నిజదృష్టియున్ శర పాత మొక్కటిగాఁ గ దు
        ర్దాంతశక్తి రణంబు సేయుము తాల్మి, నీకు జయం బగున్-111


తాత్పర్యం:     ఇంద్రజిత్తు అస్త్ర-శస్త్ర విద్యలలో ప్రధముడనీ, సమస్త దేవదానవులకు శోకం కలిగించిన వాడనీ, భుజబలంలో ఎల్ల లోకాలలో ప్రసిద్ధికెక్కినవాడనీ, బ్రహ్మదేవుడి దగ్గరనుంచి మహాస్త్రాలు సంపాదించిన వాడనీ, వాడు చేసిన ఘనకార్యాలు దేవతలందరి కీ తెలుసని అంటాడు రావణాసురుడు ఇంద్రజిత్తుతో. అలా రావణుడు తన కొడుకు ఇంద్రజిత్తును పొగడ్తల మాటలతో ప్రేరేపించుతాడు. "నువ్వు ఆలోచిస్తే నీకు తోచని ఉపాయమేదీ లేదు. యుద్ధంలో నీకు సాధ్యం కానిదేదీ లేదు. ముల్లోకాలలో నీ బలం, అస్త్ర-శస్త్ర విద్యా పాండిత్యం తెలియని వారెవరూ లేరు. గొప్పతనంలో, పరాక్రమంలో, భయంకర అస్త్ర-శస్త్ర బలంలో, శక్తిలో నా అంతటివాడవు నీవు. యుద్ధంలో నీకెప్పుడూ జయం నిశ్చయం అన్న ధైర్యంతో, నేనెప్పుడూ నిర్విచారంగా వుంటున్నాను. అన్నింటికీ ఇంద్రజిత్తు వున్నాడులే...నాకు ఎవరివల్లా భయం లేదు, అని సర్వవేళల అనుకుంటున్న నాకు నేడూ అంతేకదా!" అని అంటాడు రావణాసురుడు. "వాడిని చంపడం ఆలశ్యమైన కొద్దీ మన సైన్యం నాశనమౌతోంది. మన సేన పూర్తిగా నాశనంకాక ముందే వాడిని అస్త్ర-శస్త్రాలతో చంపు. మామూలు బాణాలతో సమయం వృధా చేయవద్దు. మీ ఇరువురి శక్తి-యుక్తులు జాగ్రత్తగా పరిశీలించు. ఇరువురు యోధులు యుద్ధం చేస్తుంటే సైనికులు వచ్చి రక్షిస్తుంటారు. కాకపోతే, సైనికులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఈ వానరుడు, తటాలున నీ మీదకు దూకితే సైనికులు ఏమీ చేయలేరు. కావున నీవు సేనలను నమ్మి యుద్ధం చేయడం వ్యర్థం. ఎంతమంది సైనికులనైనా వాడు చంపగలడు. నువ్వు వజ్రం ధరించి వాడిమీదకు యుద్ధానికి పోవద్దు. వాడు వాయువు వలె నాలుగు వైపుల తిరుగుతుంటాడు. ఏ మూలనో దూరి నిన్ను కొట్టవచ్చు. కదలని వస్తువును వజ్రం కొట్టగలదు కాని, కదిలే దానిని ఎలా కొట్టగలుగుతుంది? కాబట్టి శస్త్రాలను నమ్ముకోవద్దు. వాడు అగ్నివంటి వాడు కనుక ముష్టితో కొట్టడం కుదరదేమో. వాడు పడిన చోటల్లా భస్మం చేస్తాడు. అగ్నిహోత్రుడిని ముష్టి యుద్ధం ఏమీ చేయలేదు కాబట్టి  ఆ ప్రయత్నం చేయకు. నేను చెప్పిన దంతా ఆలోచించు. ఏది యుక్తమో అదే చేయి. అల్ప యత్నంతో వాడు సాధ్యపడడు. బ్రహ్మాస్త్రాల లాంటి మహాస్త్రాలను స్మరించుకో. మనస్సు-దృష్టి-బాణం ఏక కాలంలో, ఏక ప్రదేశంలో పడే విధంగా యుద్ధం చేయి. తొందరపడకుండా, నిబ్బరంగా, మనస్సు కలత లేక యుద్ధం చేస్తే జయం కలుగుతుంది" అని అంటాడు రావణుడు.

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి. తరలముకు "న, , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. తరలము లోని మొదటి రెండు   లఘువులను గురువుగా మారుస్తే మత్తకోకిలము అవుతుంది. అలానే మత్తకోకిలము లోని గురువును లఘువులుగా మారుస్తే తరలము అవుతుంది.


రావణుడి ప్రేరణతో, ఆయన ఆజ్ఞానుసారం, ఇంద్రజిత్తు హనుమంతుడి మీదకు యుద్ధానికి పోతాడు. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు బందీ అవుతాడు. బందీగా వున్న హనుమంతుడిని రాక్షసులు తాళ్లతో కట్టి రావణాసురుడి దగ్గరకు తీసుకుపోతారు. 

No comments:

Post a Comment