Friday, December 23, 2016

స్టాలిన్ జోస్యం నిజమైంది! .....వనం జ్వాలా నరసింహారావు

స్టాలిన్ జోస్యం నిజమైంది!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (24-12-2016)

భారత పాకిస్తాన్ దేశాల మధ్య డిసెంబర్ 3, 1971 న ప్రారంభమైన యుద్ధం దరిమిలా, పాకిస్తాన్ ఓటమిపాలై, భారత్ కు దాసోహమని అనడంతో, పాకిస్తాన్ లోని తూర్పు ప్రాంతం విడిపోయి బంగ్లాదేశ్ గా ఆవిర్భవించి 45 సంవత్సరాలవుతోంది. పాకిస్తాన్ సైన్యాధికారి జనరల్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తన నేతృత్వంలో యుద్ధం చేస్తున్న 93,000 మంది సేనతో భారత జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు లొంగి పోయారు. ఆ రోజును ప్రతి ఏటా విజయ్ దివస్ గా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపధ్యంలో...

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి  అనుకూలమైనవి కావని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టాలని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఐదు ఏళ్ల క్రితం మాస్కో వెళ్లిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో చెప్పాడు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్  తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్. భారత ప్రతినిధి బృందం ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించింది.   

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి అరవై ఐదు ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలోభారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

            కమ్యూనిస్ట్ పార్టీకి-పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను  పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.


మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి

            చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్‍ఘోష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి  అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్‍కై-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

స్టాలిన్ పాఠాలను కమ్యూనిస్టులు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది ప్రశ్నార్థకమే. ఆ తర్వాత కొంతకాలానికి కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఫలితంగా ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన నాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. అలాంటప్పుడు స్టాలిన్ విప్లవ పాఠాలను భారత కమ్యూనిస్టులు గుర్తుంచుకుంటారా? ఏమో?


No comments:

Post a Comment