Thursday, December 1, 2016

స్వప్న సాకారం : పొత్తూరి వెంకటేశ్వరరావు

స్వప్న సాకారం

పొత్తూరి వెంకటేశ్వరరావు

("ఇదీ సుపరిపాలన" పేరుతో నేను రాసిన వ్యాసాల సంకలనానికి సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వ్రరరావు గారు రాసిన పరిచయ వాక్యాలు...జ్వాలా)

కనుచూపుమేరలో....
తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పైరు పొలాలు. కోటి ఎకరాలకు కొత్తగా పారుతున్న నీరు. గలగలపారే పంట కాలువలు. పల్లెపల్లెలో పంట సిరులు. పండ్ల తోటలు. కూరగాయల మడులు. సమృద్ధిగా పాడి. కోళ్ల ఫారాలు. బాటల పక్కన ఏపుగా పెరిగిన నీడనిచ్చే చెట్లు. నాలుగేసి వరుసల రహదారులు.


ఎన్నెన్నో పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు. పేదలు పిల్లలను చదివించడం భారమనే ప్రసక్తి లేకుండా "కేజీ-టు-పీజీ" ఉచిత విద్య. 


రూపురేఖలు మారి విశ్వనగరంగా రూపొందిన భాగ్యనగరం. వాహనరద్దీని తగ్గించే ఫ్లయి ఓవర్లు. సమ్మర్ధం ఎక్కువగా ఉన్న నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా జాతీయ రహదారులను కలిపే, పీ. వీ. నరసింహారావు ఫ్లయి ఓవరును పోలిన, ఆకాశ మార్గాలు (స్కై వేలు). చుట్టూ గగన తలంలోకి చొచ్చుకుపోతున్నట్లున్న బహుళ అంతస్తుల మహాభవనాలు వెలసి, పరిశుభ్రజలంతో నిండిన హుస్సేన్‍సాగర్. అద్దంలా మెరిసే, విశాలమైన రోడ్లు. నగరంలో పూర్వవైభవాన్ని పునరిద్దరించుకొన్న తటాకాలు, ఉద్యానాలు.


ముప్ఫది ఒక్క జిల్లాలతో పౌరుల ఇంటి ముంగిటికి వచ్చిన పరిపాలన యంత్రాంగం. పని చేసి పెట్టడానికి అధికారులు పైసలడిగే రోజులు పోయి చకచకా పనులు జరిగిపోయే నూతన వాతావరణం.


ఇది బంగారు తెలంగాణ, సుందర తెలంగాణ. నవ్యశోభను సంతరించుకొన్న తెలుగు ఆణెం తెలంగాణ. (ఆణెం అంటే దేశం.)


ఇప్పుడు మీరు చదువుతున్న "ఇదీ సుపరిపాలన" గ్రంథం ఆవిష్కరిస్తున్న దృశ్యం ఇది. ఆవిష్కరణ మొదలైంది. పూర్తిగా దృగ్గోచరం కావడానికి వ్యవధిపడుతుంది. అందుకే "కనుచూపుమేరలో...." అనటం. గ్రంథకర్త శ్రీ వనం జ్వాలా నరసింహారావుగారు (మిత్రులు పిలుచుకొనే పేరు జ్వాలా.) తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలూ, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావుగారు 2014 లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి చేస్తున్న ప్రకటనలూ క్రమంగా కార్యరూపం ధరిస్తుండటానికి అక్షరీకరణ. గ్రంథం చిత్రిస్తున్న పటం ఒకప్పుడు కలేగాని ఇప్పుడు కాదు. సాకారమవుతున్న శుభ స్వప్నం. 


జ్వాలాగారు చేయి తిరిగిన రచయిత. తెలుగు పత్రికలు చదివే ఎవరికైనా తెలిసిన పేరు. దాదాపు అన్ని తెలుగు పత్రికలలోను ఆయన వ్యాసాలు వస్తుంటాయి. ఆయన వ్యాసరచయితే కాదు, బహు గ్రంథకర్త. ఇంగ్లీషులోనూ తెలుగులోనూ సమాన ప్రతిభతో రాయటం, పరిపాలనను గురించిన విశేష పరిజ్ఞానంతో రాయటం రచయితగా ఆయన ప్రత్యేకతలు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావు గారి కార్యాలయంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‍గా (సీ.పీ.ఆర్.ఓ.) పనిచేస్తుండటం ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చాలా దగ్గరనుంచి గమనించే అవకాశాన్ని కలిగించింది. ఇంతకు పూర్వం ఆయన డాక్టర్ మర్రి చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్దనూ పని చేసారు. ముఖ్యమంత్రుల వద్ద ప్రజాసంబంధాల అధికారిగా పని చేసిన అనుభవంతోపాటు ఆయనకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థలో అధ్యాపనం చేసిన అనుభవం కూడా ఉంది. అక్కడ ఎందరో ఉన్నతాధికారులతో కలసి పని చేయటం, పరిపాలనలో వివిధ రంగాలకు చెందినవారికి తరగతులను నిర్వహించటం, పరిపాలన గురించీ, దేశ, రాష్ట్ర స్థితిగతులను గురించీ ఆయనకు సమగ్ర అవగాహన కలగటానికి దోహదం చేసాయి. అందువల్లనే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రచించిన వ్యాసాలకు ఒక సాధికారత ఉంది, ప్రామాణికత ఉంది. వ్యాస రచనలో ఆయన చేసే వ్యాఖ్యానాలలో, సూచనలలో పరిణతా, విజ్ఞతా ఉంటాయి. అందుకే దాదాపు అన్ని పత్రికలు ఆయన వ్యాసాలను ప్రచురిస్తాయి. ఆషామాషీగా రాస్తే పత్రికలు ఆమోదించవు. 


తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి జ్వాలాగారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అవకాశం కలిగింది. ఉద్యమకాలంలో ప్రత్యేక రాష్ట్రవాదిగా ప్రజల ఆకాంక్షలు ఆయనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు తెలుసు. కే. సీ. ఆర్. గారు ఏ సందర్భంలో ఏమి మాట్లాడారో తెలుసు. ముఖ్యమంత్రిగారి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటం వల్ల ఆయన ఆలోచనలు, అంతర్యాల అవగాహన ఉంది.

"ఇదీ సుపరిపాన" పేరుతో జ్వాలాగారు వెలువరిస్తున్న ఈ గ్రంథంలో రాష్ట్రావతరణ మొదలు 2016 నవంబర్ 1 వ తేదీవరకు వివిధ తెలుగు దినపత్రికలలో ఆయన రాసిన 50 వ్యాసాలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం చేసే ఉద్దేశంతో గాక, తెలంగాణ పట్ల అభిమానంతో, కే. సీ. ఆర్. గారి సామర్ధ్యం పట్ల విశ్వాసంతో రాసిన ఈ వ్యాసాలలో అతిశయోక్తులు లేవు, ఆశాభావమే ఉంది. అనుచిత ప్రశంసలు లేవు. ముఖ్యమంత్రిపై వచ్చిన విమర్శలకు ఖండనలు ఉన్నాయి. 


టీ. ఆర్. ఎస్. ఎన్నికల ప్రణాళికలో ఏమేమి వాగ్దానాలు చేసిందో అవి ఎంతవరకు అమలయ్యాయో జ్వాలాగారి వ్యాసాలు తెలియచేస్తున్నాయి. హేతుబద్ధమైన వాదనలను వినిపిస్తున్నాయి. అనాక్షేపణీయమైన గణాంకాలను అందిస్తున్నాయి. ఒక విధంగా తెలంగాణ గురించి మాట్లాడదలచిన, చర్చించదలచిన ఎవరికైనా, విమర్శకులతో సహా, ఇది ఉపయోగపడే గ్రంథం. తెలంగాణలో కోటి ఎకరాలకు ఎలా నీరు అందించాలనుకొంటున్నారో వివరిస్తూ 2016 మార్చ్ 31 న ముఖమంత్రి కే. సీ. ఆర్. అసెంబ్లీలో చేసిన సుదీర్ఘ ప్రసంగం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. తెలంగాణలో నీటి వనరులు, హైదరాబాద్ నగరాభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న విద్యాసౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ అవుతున్న పరిపాలన, హరితహారం పేరిట చెట్లను పెంచే కార్యక్రమం మొదలైనవే గాక ఇతర పరిణామాలపై కూడా జ్వాలాగారి వ్యాసాలు ఇందులో ఉన్నాయి.


ఇవిగాక జ్వాలాగారు వ్యక్తిగతంగా సమకాలీన పరిణామలపై స్పందించి రాసిన వ్యాసాలూ గ్రంథాన్ని మరింత పఠనీయం చేస్తున్నాయి. బ్రాహ్మణులను పనిగట్టుకొని "బాపనోడు" లాంటి పదాలతో తక్కువచేసి మాట్లాడే వాళ్లను గురించీ, వాళ్లు రాసే ధోరణి గురించీ కూడా జ్వాలాగారు ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసే స్పందన ఉంది. తమ కులాన్ని విమర్శిస్తే సాధారణంగా ఏ కులంవారూ ఊరుకోరు. బ్రాహ్మణులు మాత్రం విమర్శకు సమాధానం ఇవ్వరు. లోలోపల కుమిలిపోవటమేగాని బయటకు ఒక్క మాటకూడా మాట్లాడరు. అదేమని అడగరు. బ్రాహ్మణులు బలహీనవర్గమనటానికి ఇదొక్క నిదర్శనం చాలు. జ్వాలాగారు బ్రాహ్మణ సమాజం అలా మౌనం పాటించటాన్ని ఒప్పుకోరు. ఒక కులాన్ని తిట్టిపోయటం, లేదా అన్యాయంగా విమర్శించటం తగదని వాదిస్తారు. నాకు తెలిసినంతలో పుట్టుకతో బ్రాహ్మణుడైన ఏ జర్నలిస్టూ, ఏ రచయితా జ్వాలాగారి వలె స్పందించలేదు. జ్వాలాగారి ధైర్యానికి, నిబద్దతకూ, చిత్తశుద్ధికీ జోహార్లు చెప్పవలసిందే. కే.సీ.ఆర్. గారి ప్రభుత్వం బ్రాహ్మణులకు అందిస్తున్న సహాయం జ్వాలాగారి ఒక వ్యాసానికి వస్తువు. 


జ్వాలాగారి గ్రంథంలో ఇంకా చాలా ఆకర్షణలు ఉన్నాయి. చండీయాగం గురించి ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడే సమాచారం, క్రీమీ లేయర్ అంటే ఏమిటి? విద్యుత్తూ, రైళ్లూ లేని కాలంలో తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండేది? నాటి తెలంగాణలో భూస్వాముల దోపిడీ విధానం, పదకొండు వేల చెరువులు ఉన్నప్పటి హైదరాబాద్ నగరం, ఖమ్మం జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చింది? తెలంగాణ సాంస్కృతిక వికాసానికి చిహ్నంగా హైదరాబాద్‍లో వెలిసే కళాభారతి ప్రాంగణం, మొదలైన ఎన్నో ఆసక్తికర విశేషాలు జ్వాలాగారి వ్యాసాలలో తటస్థపడతాయి.

    "ఇదీ సుపరిపాలన" తెలంగాణ భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించటమేగాక తెలంగాణ కొత్తపాతలను గురించి నిజాయితీగా తెలియచెప్పే గ్రంథం. సమాచారం కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవలసిన పని లేకుండా ఈ గ్రంథంలోకి తొంగి చూస్తే చాలుననిపించే "రిఫరెన్స్" పుస్తకంగా కూడా ఉపయోగపడే ఇంత విలువైన రచన చేసినందుకు వనం జ్వాలా నరసింహారావుగారికి అభినందనలు.

-పొత్తూరి వెంకటేశ్వరరావు
9848140095

1 comment:

  1. పొత్తూరి వారి కలం నుంచి అభినందనలు పొందిన మీరు అభినందనీయులు

    ReplyDelete