Saturday, December 3, 2016

పాత్రికేయ విశ్లేషకుడి మనోగతం : ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

పాత్రికేయ విశ్లేషకుడి మనోగతం 
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

"ఇదీ సుపరిపాలన" పేరుతో నేను రాసిన వ్యాసాల సంకలనానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సీనియర్ పాత్రికేయులు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు రాసిన పరిచయ వాక్యాలు...జ్వాలా

ఈ పుస్తకానికి ఒక చిన్న వ్యాఖ్య రాయమని మిత్రులు జ్వాలా నరసింహా రావు గారు కోరినప్పుడు ఏమనాలో తెలియక సరేనన్నాను. జ్వాలా గారు వయసులోనూ, అనుభవంలోనూ నాకంటే చాలా పెద్ద వారు. అయినప్పటికీ ఆయన నన్ను మిత్రుడిగానే పరిగణిస్తారు, అలాగే ప్రవర్తిస్తారు. అందుకే నా అభిప్రాయం అడిగి ఉంటారు. పుస్తకంలోని వ్యాసాలన్నీ ఎప్పటికప్పుడు చదివినవే. వివిధ  పత్రికల్లో అచ్చయినవే. అయినప్పటికీ మరోసారి చూసినప్పుడు అవి సందర్భానుసార సమర్థింపులాగా కాకుండా తెలంగాణా వర్తమాన వ్యవహారాలకు కు, తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణ ప్రణాళికకు అద్దం పట్టి, అర్థం చేయించే ప్రయత్నంగా కనిపించాయి. ఇవి జ్వాలా కేవలం ముఖ్యమంత్రి కార్యాలయ ప్రచారకర్తగా రాసినవి కాదు. ముఖ్యమంతి కార్యాలయ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి అయినప్పటికీ ఆయన తన ఆత్మను జోడించి విశ్లేషించినట్టుగా కనిపించాయి. ఇవి పూర్తిగా ఈ  ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఒక తెలంగాణా పాత్రికేయ విశ్లేషకుడి మనోగతం లా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతివ్యాసంలో తన వ్యక్తిగత, సామాజిక,  రాజకీయ అభిప్రాయాలను జోడించారు. తన అభిప్రాయాలతో ఆ విశ్లేషణకు బలం చేకూర్చారు. ప్రభుత్వంలో ఉండే చాలా మందికి ఇటువంటి (వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాల మేరకు విశ్లేషించే) అవకాశం, స్వేచ్ఛ ఉండదు. కానీ జ్వాలా ఒకవైపు తానూ ఈ ప్రభుత్వ ప్రచార ప్రతినిధిగా విషయాలను విశ్లేషిస్తూనే మరోవైపు తన సామాజిక, రాజకీయ అభిప్రాయాలను కూడా అంతే స్వతంత్రంగా వ్యక్తపరచగలిగారు. ఆయన చిన్న జిల్లాలపైన , బ్రాహ్మణులపైన క్రీమీలేయర్ పైన,  ఎమర్జెన్సీ ని తలపిస్తున్న రోజులు పేరుతో న్యాయ వ్యవస్థమీద రాసిన వ్యాసాలుగానీ, తాను పుట్టిపెరిగిన ఖమ్మం జ్ఞాపకాలు గానీ, హైదరాబాద్ అనుభవాలుగానీ, ఐలయ్య పై వ్యక్తం చేసిన ఆగ్రహావేశాలు గానీ ఆయన వ్యక్తిగత సామాజిక అభిప్రాయాలు, ఆక్రోషాలే తప్ప ప్రభుత్వ అభిప్రాయాలు కాదు. అయితే అభివృద్ధి పథకాలు, ప్రణాళికలు వాటిమీద ఆయన అంచనాలు కూడా ఇందులో ఉన్నాయి. 


జ్వాలా నరసింహారావు రాసిన అంశాల్లో రెండు అభిప్రాయాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి ఈ ప్రభుత్వం మీద, నాయకత్వం మీద ఉన్న అచంచల విశ్వాసం. రెండోది తన సామాజిక, రాజకీయ అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పడం.  నిజానికి ఈ రెండూ కష్టమైన, సంక్లిష్టమైన, వివాదస్పదమైన అంశాలే! ముఖ్యంగా తెలంగాణా లో నెలకొని ఉన్న ప్రస్తుత సందర్భంలో ఇటువంటి రచనలు కత్తిమీది సాము లాంటిది. దాన్ని అత్యంత చాకచక్యంగా చేయగలిగారు జ్వాల. తెలంగాణా ఏర్పడ్డ తరువాత ఇక్కడి ప్రభుత్వానికి బలమైన రాజకీయ నాయకత్వం దొరికింది కానీ అంతే బలమైన మేధో సమర్ధన లభించలేదు. ఇది ఒక లోపం. నిజానికి కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి, విభజన సమస్యలను, ఉద్యోగుల పంపిణీని, ఉమ్మడి సంస్థలు, కోర్టుల విభజన విషయంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే మేధో సారధ్యం లేకుండా పోయింది. అదంతా ప్రభుతానికి సంబంధించిన తలనొప్పిగా మారిపోయింది. దీనికి ఇక్కడి రాజకీయ పరిస్థితులే కారణం అయ్యాయి. మేధావులే తెలంగాణా సాధన ఉద్యమంలో ముందువరసలో నడవడం దీనికి ఒక కారణం. ఇక్కడి మేధావులు అప్పటికే ఉద్యమంలో పరిపూర్ణ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కేవలం రాష్ర సాధన కు మాత్రమే కాదు, నూతన రాష్ట్ర పునర్నిర్మాణం పట్ల కూడా వారికి తమవైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ వారంతా ఎన్నికలు, పార్లమెంటరీ రాజకీయాలు, పరిపాలనా వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల సందర్బంగా వీరంతా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో లేరు. కొందరు ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉన్నారు. సహజంగానే ఇప్పుడు వారంతా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తమ తమ రాజకీయ అభిప్రాయాలతో విమర్శనాత్మకంగా ఉన్నారు. మీడియా కూడా అంతే! స్వాభావికంగా పత్రికలు కూడా తెలంగాణా ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలు, విధానాల పట్ల విమర్శలు దాదాపు మొదటి ఏడాది కాలంలో విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఇప్పుడూ తెస్తున్నాయి.  ప్రభుత్వాన్ని నిలదీయడమంటే ప్రజల పక్షం ఉండడం అన్నది వారి భావన.   అటువంటి తరుణంలో తెలంగాణా ప్రభుత్వం తరపున, ప్రభుత్వంలో ఉంది విశ్వసనీయమైన విశ్లేషణ చేయడం చాలా కష్టమైన పని. దానిని చిత్తశుద్ధితో చేసాడు జ్వాలా. నిజానికి విమర్శ చాలా సులువైన పని. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను నిలదీసినంత సులభంగా పాలక పక్షాన్ని సమర్థించడం సాధ్యం కాదు. అది నిజమని తెలిసినా, నిజమని నలుగురికీ నచ్చచెప్పడం తేలికయిన పనికాదు. పాలక వర్గాన్ని నిలదీయడమే ప్రగతిశీల ఆలోచన అని భావించే తెలుగు జర్నలిజం కూడా దానిని అంతగా ఆమోదించదు కూడా. కానీ జ్వాలా ఇది సుపరిపాలన అని నిస్సంకోచంగా చెప్పగలిగాడు. 

రెండోది తెలంగాణా సమాజం అస్తిత్వాలను అదిమి పట్టుకుని గెలిచిన సమాజం.  కులం, మతం, అధికారం వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు, భావాలు వెతికిన సమాజం. అటువంటి సమాజంలో తన అభిప్రాయాలను నిలబెట్టుకోవాలనే మొండితనం కూడా జ్వాలా రచనల్లో కనిపిస్తుంది. ఆయన సమాజంలో 'మాలోడు, గొల్లోడు, సాకలోడు' అన్నట్టు గానే 'బాపనోడు' అనడాన్ని ఆక్షేపించినా, యాగాలను సమర్థించి, అవన్నీ జనహిత కార్యక్రమాలుగా చెప్పినా, సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక వ్యవస్థలను గుర్తు చేసుకుని పరవశించినా అవన్నీ అతనిలోని మొండి తనం వల్లే సాధ్యం. ఉద్యోగం కోసం లౌక్యంతో రాయడం జ్వాలాకు చేతకాదు కాబట్టే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రచురించ గలిగాడు. ఈ పుస్తకం లోని వ్యాసాల్లో  ఒక వ్యక్తిగా జ్వాల తనను ఎలా  అర్థం చేసుకోవాలో , తాను ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో చెప్పగలిగాడు. అందులో ఆయన కృతకృత్యులయ్యారు. ఒక పాత్రికేయుడైనా, రచయిత అయినా చేయాల్సింది తాను నమ్మిన,  చెప్పదలచుకున్న విషయాలను స్పష్టంగా, గట్టిగా చెప్పడమే! ఆ పని జ్వాలా చేశారు.! అభినందనలు!!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
9494480888

No comments:

Post a Comment