Sunday, June 18, 2017

మేలు చేసేవారికి మేలు చేయాలన్నదే సనాతన ధర్మం .....ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

మేలు చేసేవారికి మేలు చేయాలన్నదే సనాతన ధర్మం
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (19-06-2017)

            ఇక్ష్వాకు వంశ గౌరవం కోరే సముద్రుడు, రామకార్యార్ధమై వెళ్తున్న హనుమంతుడికి ఏవిధంగా సాయపడగలనా అని ఆలోచిస్తాడు. తాను రామకార్యం చేయలేక పోయినా, చేసే మహానుభావులకైనా తోడ్పడాలిగదా! అని భావిస్తాడు. ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు. ఇక్ష్వాకు వంశీయుడైన సగర చక్రవర్తి ద్వారా తాను వృధ్ధి చెందిన విషయాన్ని గుర్తుచేసుకున్టాడు. పరాక్రమించి పోతున్న ఆంజనేయుడికి కష్టం కలుగకుండా చూడడమే మేలనుకుంటాడు. ఫుండరీకాక్షుడైన రామచంద్రుడి దూతకు సహాయం చేయకపోతే, సముద్రుడికి దయ-బుధ్ధి, లేదనుకుంటారనీ, లోక నిందకు గురవుతాననీ భయపడ్తాడు. భగవత్ కార్యానికి తోడ్పడే శక్తి వుండికూడా అలా చేయకపోతే అపకీర్తి పాలవుతానని ఆందోళన చెందుతాడు. హనుమంతుడికి ఒకింత బడలిక తీర్చే ఉద్దేశ్యంతో, ఆతర్వాత తక్కిన ప్రయాణం సులభంగా చేయకలుగుతాడన్న ఆశయంతో, తనలో దాగివున్న మైనాక పర్వతాన్ని ఆపని కొరకు పురమాయిస్తాడు సముద్రుడు. మైనాకుడు మేనకకు కొడుకు...హిమవంతుడికి జన్మించాడు....పార్వతికి తోబుట్టువు.

            "నీకొక వార్త చెప్తా విను" అని బంగారు శిఖరాల మైనాకుడితో అంటాడు సముద్రుడు. పాతాళం నుండి భూలోకానికి రాకుండా రాక్షసులను అడ్డుకునేందుకు, మైనాక పర్వతాన్ని ఉక్కు గుండులాగ వుంచాడింద్రుడనీ, ఏప్రక్కకైనా పక్షిలాగా ఎగిరిపోయే సామర్ధ్యం మైనాకుడికుందనీ గుర్తు చేసాడు సముద్రుడు.

            "శ్రీరామచంద్రమూర్తి కార్యార్ధిగా అనితరసాధ్యమైన పని చేయడానికై ఆకాశమార్గాన పోతున్నాడు హనుమంతుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు నాకు పూజ్యులు. స్నేహం వల్ల, సౌమ్య భావంవల్ల, నీవు నాకొక సహాయం చెయ్యాలి. చేయాల్సిన పని సకాలంలో చేయకపోతే దుష్టుడని సత్పురుషులు కోప్పడుతారు. కాబట్టే సహాయం చేయాలి. హనుమంతుడు మనకు అతిథి, పూజ్యుడు. నీవు నీటిలోనుండి లేచి, ఆయనకు ఎదురేగి, బడలిక తీరేటట్లు నీనెత్తిన ధరించు. నీవిట్లా చేస్తే, ఆయనకు కొంత బడలిక తీరుతుంది. తక్కిన సముద్రాన్ని సులభంగా దాటిపోగలడు. రామచంద్రుడి మంచి నడవడి, భార్యా వియోగం, లంకకు వెళ్లే ఆంజనేయుడి శ్రమ ఆలోచించి సంతోషంగా నీటినుండి బయటకురా" అంటాడు మైనాకుడితో. (ఈసంభాషణ సారాంశం: భగవత్ కార్యం చేసే ఆసక్తి వుండికూడా చేయలేనివాడు, చేస్తున్న వారిని ప్రేరేపించి, వారితో కార్యాన్ని విజయవంతంగా చేయించాలనీ, అతిథిని వేరే విధంగా సత్కరించ లేనివారు మంచి మాటలతోనూ, కూర్చోడానికి ఆసనం ఇవ్వడం ద్వారానూ, దాహానికి మంచి నీళ్లు ఇవ్వడం ద్వారానూ ఆదరించాలని అర్థం).

            సముద్రుడి మాటలకు స్పందించాడు మైనాకుడు. మేఘాలను చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడిలాగా, నీటిని రెండు భాగాలు చేసి పైకొచ్చాడు. శతసూర్యకాంతితో  తనదారికి అడ్డంగా నిల్చిన మైనాకుడిని గమనించి, హుంకరించి, ఆకాశమార్గంలోనే ఢీకొన్నాడు హనుమంతుడు. హనుమ దెబ్బకు, విలపిస్తూ, శోషిల్లి పడిపోయాడు మైనాకుడు. పిడుగుపాటులాగా తగిలిన హనుమంతుడి దెబ్బకు కొంత దూరం వరకూ కొట్టుకు పోయిన మైనాకుడు, లోలోన మటుకు సంతోషించాడు. ఆయన బలాన్ని తెలుసుకున్నందుకు పొంగిపొయాడు. ప్రీతిగా హనుమంతుడితో ఇలా అన్నాడు:

            "వాయునందనా! ఎలాంటి అసాధ్యమైన పనికి పూనుకున్నావయ్యా! నీశక్తిని పొగడ ఎవరితరం? నీబలం, వేగం చూసి మెచ్చుకున్నాను. నాబంగారు శిఖరం మీద నీశ్రమ తగ్గేంత వరకు నిలిచి, ఆతర్వాత నీ ఇష్టమొచ్చినట్లు పో. నీమీద నాకు ప్రేమ కలగటానికి కారణం, మేలు చేసేవారికి, మేలు చేయాలన్న సనాతన ధర్మమే సుమా. సముద్రుడు నీమేలు కోరి నన్నెంచుకున్నాడు. దానికి కారణముంది. రఘువంశంలో పుట్టిన సగరుడనే రాజు వల్ల వృధ్ధి చెంది సాగరుడన్న పేరుతెచ్చుకున్నాడు సముద్రుడు. ఆవంశంలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తి కార్యార్ధివై పోతున్న నీకు సహాయపడాలని భావించాడు. నీకు సాయపడితే వారికి చేసినట్లేకదా! సాగరుడు కృతజ్ఞుడన్న గౌరవం పొందగోరి నన్ను పిల్చి నీగురించి చెప్పి, నాకు నిన్ను చూపాడు. రామకార్య ధురంధరుడవగుటచే పుణ్యాత్ముడైన నీవు నూరు యోజనాల సముద్రాన్ని దాటే ప్రయత్నంలో వున్నావనీ, నిన్ను నాశిఖరంపై కొంత సేపుంచుకొని, నీసేద తీర్చితే, మిగిలిన ప్రయాణం కష్టం లేకుండా చేస్తావనీ, సముద్రాన్ని దాటగలవనీ నాతో సముద్రుడన్నాడు." 


            "వాయునందనా, ఆయన ప్రేమతో చెప్పినందువల్ల నీకొరకై నేనొచ్చాను. నీవిక్కడ కాసేపాగి, ఫలాలు, కందమూలాలు తిని, అలసట తీరేవరకు విశ్రాంతి తీసుకో. తర్వాత మిగిలిన దూరాన్ని వేగంగా, సులభంగా, పోవచ్చు. కొత్తవారైనా సత్పురుషులకు ప్రేమతో పూజించి కైంకర్యాలు చేస్తే మంచిదని పెద్దలంటారు. అతిథి గుణవంతుడైతే కొత్త, పాత అన్న మీమాంస చేయకూడదు. అదలావుండగా నేను నిన్ను పూజించడానికి మరో కారణముంది. మహాత్ముడూ, బలమ్లో భయంకరుడూ అయిన వాయుదేవుడికి నీవు కొడుకువి. నీయోగ్యత నాకు తెలిసినా, తెలియక పోయినా, నీ తండ్రి యోగ్యతవల్ల, నేనునిన్ను పూజించ దల్చాను. అట్టి మహానుభావుడి కొడుకైన నీవు మాకు అతిథివి కాబట్టి నేనిచ్చే అతిథి సత్కారాలు స్వీకరించు. ఎట్టివాడైనా అతిథి పూజ్యుడే కద! వారిలో సజ్జనుడు మరీ పూజ్యుడు. సద్వంశ ప్రసూతుడు మరీ-మరీ పూజ్యుడు. ఈమూడు నీలో వున్నందువల్ల నాకునీవు పూజ్యుడవు. ధర్మం ఇట్టిదని తెలియక పోయినా, తెల్సుకోదల్చిన వారికీ, ధర్మం చక్కగా తెలిసిన వారికీ అతిథి పూజ్యుడే. అలాంటప్పుడు నీవంటి సాధుపురుషుడు పూజ్యుడని చెప్పాల్సిన పనేలేదు. మన ఇరువురి సంబంధం ఇదేకాదు. నేనూ నీకు కావాల్సినవాడినే. కొత్తవాడిని కాను. నీవు వాయువేగ, మనోవేగాలతో పోగలవు. నిన్ను నేను పూజిస్తే వాయుదేవుడిని పూజించినంత" అని మైనాకుడు హనుమంతుడితో విన్నవిస్తాడు.

"నేను నిన్ను పూజించటానికి ఇంకో కారణం కూడా వుంది. ఫూర్వకాలంలో కొండలకు రెక్కలుండేవి. వాటి సహాయంతో వేగంగా ఆకాశంలో సంచరించేవి. అప్పుడవి తమ తలల మీద పడతవేమోనని మునులు, దేవతలు భయపడేవారు. ఇది విన్న ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరుకుతూ, నారెక్కలు కూడా నరికేందుకు వచ్చాడు. నీ తండ్రి వాయుదేవుడప్పుడు నన్ను చిమ్ముకుంటూ వచ్చి సముద్రంలో పడేసాడు. అందుచేత నేను రెక్కల అందం చెడిపోకుండా వున్నాను. దీనికి మీతండ్రి వాత్సల్యమే కారణం సుమా! అందుకే నీతండ్రీ నాకు పూజ్యుడే. నిన్నూ అందుకే గౌరవిస్తాను. నాస్నేహాన్ని వృధా కానీయకుండా నీవూ నన్ను అలరించాలి. నేనుచేసే సత్కారాన్ని స్వీకరించి అలసట తీర్చుకుని, నన్నూ, సముద్రుడిని సంతోషపర్చు" అని అన్న మైనాకుడికి తనదైన శైలిలో జవాబిచ్చాడు హనుమంతుడు.

          "పర్వతోత్తమా, నీవు చేసే సత్కారాలు అంగీకరించినట్లే. అన్న రసంకన్న ఆదరణ రసం మేలు. నీ మంచి మాటలచేతనే సపర్యలు అంగీకరించినట్లయింది. ఆఫలం నీకు దక్కింది కూడా. నేను సంతోషించాను. నేనిక్కడ ఆగకూడదు. కార్యం, కాలం నన్ను తొందరపెట్తున్నాయి. చేయాల్సిన పని చాలా వుంది. చీకటి పడిపోతున్నది. ఇంకా ఆలస్యమైతే చేయవలసిన పనికి తగినంత పొద్దులేదు. నేను ఎక్కడా ఆగననీ, రామబాణంలా వెళ్లి వస్తాననీ, పని చక్కబెట్టుకొస్తాననీ వానరులతో ప్రతిజ్ఞ కూడా చేసాను. నన్నాపవద్దు...కోప్పడవద్దు మిత్రమా!"అన్నాడు. 

No comments:

Post a Comment