Sunday, June 4, 2017

భక్త ప్రపన్నులకు సీతారాములిద్దరూ సేవ్యులే ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

భక్త ప్రపన్నులకు సీతారాములిద్దరూ సేవ్యులే
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (05-06-2017)

మంత్ర మాత్రుక అయిన గాయత్రీ మంత్ర దివ్య విన్యాసం ఆద్యంతాలూ నింపుకున్న ఇంపైన కాండ సుందరకాండ. కాండ "" కారంతో మొదలై, "" కారంతోనే ముగుస్తుంది. "తరువాత రావణాసుర" అనే పద్యంతో వాసుదాసుగారి సుందరకాండ మొదలవుతుంది. శిష్యుడున్న చోటు వెతికే ఆచార్య స్వరూపం ఇందులో విశదీకరించడం జరిగింది. భగవదనుజ్ఞ లేకుండాఎవరు కూడా ఆచార్యత్వం నెరపలేరన్న విషయం కూడా ఇందులో స్పష్టం చేయడం జరిగింది. అదే విధంగా దూత అనేవాడు, తన స్వామి చెప్పిన మాటలను తెలియచేయడంతో పాటు, శత్రువులు నిరోధించినప్పటికీ, ఎదుర్కొని, విజయవంతంగా తిరిగొచ్చి తాను చేసిన పనులను నివేదించగలవాడై వుండాలనే వ్యంగార్థాన్ని ఇది ధ్వనిస్తుంది. ఇందులో గురు లక్షణాలూ చెప్పబడ్డాయి. హనుమంతుడికి భగవదనుజ్ఞ వుందనడానికి గుర్తు, శ్రీరాముడు ఆయనకిచ్చిన తన ముద్రికే!

"శ్రుతి, స్మృతి, సదాచారం, స్వప్రియం, శీలం" అనేవి ధర్మ నిర్ణయానికి ప్రామాణికాలు. రావణుడి అంతఃపురంలో ఎందరో స్త్రీలను చూసినప్పటికీ హనుమంతుడి మనస్సు చలించదు. లంకాదహనం, అక్షకుమారాది వధ, గురుచారణ మార్గంలో జరిగినవని అనడంలో అర్థం: దూత కృత్యం ధర్మ మార్గానికి అవిరోధంగా చేయడమే! హనుమంతుడికి రామాజ్ఞ వుంది. అది రామాజ్ఞ కాబట్టి వేదానుశాసనమే! ఇలా ఎన్ని రకాలుగానో, హనుమంతుడిలో పరిపూర్ణమైన ఆచార్య లక్షణాలు కలవన్న విషయం తెలియచేస్తూ, అట్టివాడికే శిష్యాన్వేషణ ఫలిస్తుందన్న సంగతి చెప్పడం జరిగింది. సుందరకాండలో శిష్య లక్షణమూ చెప్పడం జరిగింది. శిష్యుడి ప్రధమ లక్షణం "సీత" లాగా వుండడమే!

జాంబవంతుడి ప్రేరణతో వానరులతో కూడి హనుమంతుడు మహేంద్ర పర్వతాన్ని ఎక్కుతాడు. అక్కడినుండి లంకకు వెళ్లాలన్నదే ఆయన సంకల్పం. దానిని కార్యరూపంలోకి తేవడానికి సిద్ధపడ్డాడు హనుమంతుడు. రామదూత, శత్రుసంహారకుడైన హనుమంతుడు, రావణుడు అపహరించిన సీతాదేవిని లంకలో వెతికేందుకు ఆకాశ మార్గాన అక్కడకు ప్రయాణమవుతాడు. రావణ నీత అయిన సీతను అన్వేషించేందుకు సిద్ధపడుతున్నాడప్పుడు. సీతాదేవిలాంటి పతివ్రతా శిరోమణి పాద దర్శనం కలిగినా తాను కృతకృత్యుడైనట్లేనని ఆంజనేయుడి భావన. దీనివలన సీతా మహాత్మ్యం, హనుమంతుడి భక్తి, వినయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. భక్త ప్రపన్నులకు సీతారాములిద్దరూ సేవ్యులే కదా!

హనుమంతుడు తాను పయనించాల్సిన మార్గాన్ని ఒక సారి తేరిపార చూశాడు. తల, మెడ నిక్కపొడిచి, మదించిన కోడెనాగు లాగున్న హనుమంతుడు అత్యంత సుందరాకారుడిలాగా కనిపించాడప్పుడు. కాలంలో, దేశంలో, ఎవ్వరికీ సాధ్యపడని ఘనకార్యం చేయాలన్న తలంపు హనుమంతుడి మనస్సులో కలిగింది. వానరశ్రేష్టుడైన హనుమంతుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ముందుకూ, వెనుకకూ తిరుగుతాడు. పక్షులను బెదిరించాడు. జంతువులను అదిలించాడు. రొమ్ము, నుదురుతో తాకుతూ చెట్లను పడేశాడు. కొండను వూగేట్లు చేశాడు. విజృంభించిన సింహం మాదిరి సంచరించాడు.

నలుపు, తెలుపు కలబోసిన వర్ణ చిత్రంలాగా, ఆకుపచ్చతో సహా వివిధ రంగులతో వృద్ధి చెందిన లోహాదులతోనూ, కాంతిమంతమైన ఆభరణాలతోనూ, అలంకరణ చేసుకున్న యక్షులు, కిన్నరులు, దేవతలు, దేవతాస్త్రీల గుంపులతోనూ, మనోహరమై, మదించిన గజసమూహాలు ఎళ్లవేళలా సంచరించే మహేంద్ర పర్వతంపైన హనుమంతుడు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రకాశించాడు.         

సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మకు, ఇతర దేవతలకు అణకువతో నమస్కరించి ప్రయాణానికి సన్నాహమవుతాడు హనుమంతుడు. సూర్యుడు ఆయనకు విద్యా గురువైనందున తొలుత నమస్కరిస్తాడు. రాక్షసులతో యుద్ధానికి పోతున్నాడు కాబట్టి రాక్షస విరోధి ఇంద్రుడికి ఆ తర్వాత నమస్కరిస్తాడు. బలం, వేగం కలగాలని తండ్రి వాయుదేవుడికి నమస్కరిస్తాడు. బ్రహ్మాస్త్రాల బాధ కలగకుండా వుండాలని బ్రహ్మదేవుడికి ప్రార్థనా పూర్వకంగా నమస్కరిస్తాడు. దీనర్థం కార్యారంభంలో గురువుకూ, ఇష్టదేవతకూ, విధిగా నమస్కరించాలని భావన. పురుషకారాన్ని ప్రార్థిస్తూ, పెద్దలకు నమస్కరిస్తూ, అలా అందరం చేయాలని మనకు నేర్పుతున్నాడు హనుమంతుడు.


గురుదేవతలతో పాటు ప్రత్యక్షదేవతైన తండ్రికి నమస్కరించాలని భావించి దక్షిణ ముఖంగా వున్న హనుమంతుడు తూర్పు తిరిగి ఆ పని చేస్తాడు. సుభ కార్యాలన్నీ తూర్పు, ఉత్తరం తిరిగి మాత్రమె చేయాలనీ, అశుభ కార్యం దక్షిణ ముఖమై చేయాలనీ దీనర్థం. నిద్రలో తలగడకు ఉత్తరం నిషిద్ధం కాగా దక్షిణం ప్రశస్తం.

ఈ విధంగా హనుమంతుడు రామకార్యం సాధించదలచి సముద్రాన్ని దాటేందుకు నిశ్చయించు కుంటాడు. వానరులందరూ చూస్తుండగా పౌర్ణమి నాటి సముద్రం లాగా అంతు లేనంతగా తన దేహాన్ని పెంచాడు.

మితిమీరిన శరీరంతో, సముద్రాన్ని దాటుతున్నానన్న గర్వంతో, హనుమంతుడు రెండు చేతులతో, కాళ్లతో పర్వతాన్ని ఊగించాడు. కదలని ఆ పర్వతం హనుమంతుడి బలానికి చెదిరింది. ఉగిసలాటకు పర్వతం మీదున్న చెట్ల పూలు కొండ మీద రాలడంతో పర్వతం పూలకొండ మాదిరిగా అందంగా కనిపించింది. సువాసనలు వెదజల్లాయక్కడ. కపినాయకుడి పీడనకు గురైన ఆ పర్వతం మదించిన మత్తగజం కన్నీళ్లు (మదం) కారుస్తున్నట్లుగా కనిపించింది. గడ-గడ లాడుతున్న ఆ కొండ మధ్యలోని పొరల చాటునుండి బయటపడ్డ వెండి బంగారాలు ఒకటి తర్వాత మరొకటి కనిపించ సాగాయి. మండే అగ్నిహోత్ర జ్వాలలు పొగలు కక్కినట్లే ఆ పర్వతం కూడా పెద్ద పెద్ద బండలను బయట పడేసింది.

గడ-గడ వణకుతున్న ఆ కొండ గుహల్లోకి అడవి మృగాలు కలవరపడి ఏడ్చిన ధ్వనులు భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసాయి. పర్వత చరియల్లోనూ, చుట్టుపక్కల ప్రదేశాలలోనూ, తిరుగాడే పాములు పడగలు విప్పి, కాటేస్తే అగ్నితో సమానమైన ఆ విషప్రభావానికి రాతిగుండ్లు వేయితునకలై ఎగిరిపడ్డాయి. ఆ పర్వతంలోని ఔషధులు కూడా అణచలేక పోయే మోతాదులో వుందా పాముల క్రూరమైన విషం. ఆ కొండ ఎక్కడ బద్దలవుతుందో అన్న భయంతో అక్కడ వుంటున్న వారు, తాగుతున్న మద్యాన్ని మధ్యలోనే వదలి, ఎక్కడి వస్తువులు అక్కడే పడేసి, హడావిడిగా పరుగెత్తారు. హారాలు, కంకణాలు, భుజకీర్తులు, కాలి అందెలు, పూదండలు, కదియాలతో సహా, శరీరం మీద వున్నవి తప్ప మిగిలినవన్నీ వదిలేసి పోయారు.

తమ ఆడువారు తోడురాగా, మత్తులో వున్న వీరందరూ, వళ్ళు మరచి ఆకాశానికి ఎగిరారు. స్త్రీలు ఆకాశ వీదిలో తమ ప్రియులతో కలసి, పరాచకాలాడుతూ, నవ్వుతూ, శరీరాలు మరచి, అక్కడ జరుగుతున్న భయానక దృశ్యానికి అబ్బురపడుతూ, కార్యసాధకుడైన హనుమంతుడిని చూసారు. శ్రేష్ఠులైన విద్యాధరులు గుంపులు-గుంపులుగా ఆకాశంలో నిలుచుని, ఆ క్షణంలో పర్వతమున్న భంగిమను చూసారు ఆశ్చర్యంగా.


            ఆంజనేయుడు రామకార్యార్థమై, వానరార్థమై, పర్వతాకారంలో అసాధ్యమైన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు పోయే ప్రయత్నంలో ఉన్నాడని సిద్ధులు, చారణులు, విద్యాధరాలకు చెప్పారు. సీతకై సముద్రాన్ని దాటడం కేవలం రాముడికొరకే కాదు....వానరుల ప్రాణ రక్షణ చేయడం కూడా వుంది. దేహాన్ని అమితంగా పెంచిన హనుమంతుడు ఒక్కసారిగా వళ్ళు విదిలించి, వెంట్రుకలు రాల్చి, వర్షాకాల మేఘం లాగా దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జిస్తాడు. గరత్మంతుడు పామును విదిలించినట్లు తన తోకను విదిలించాడు. హనుమంతుడి తోక గరత్మంతుడు పట్టుకున్న పాములాగా ఆయన వీపుమీద మెరుస్తున్నదప్పుడు. End

No comments:

Post a Comment