Monday, June 26, 2017

అణిమాది సిద్దులున్నహనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

అణిమాది సిద్దులున్నహనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (26-06-2017)

హనుమంతుడు మైనాకుడి చేతిలో చేయి కలిపి, నవ్వు ముఖంతో పోయివస్తానని సెలవుతీసుకొని, మరింత వేగంగా, మరింత పైకెగిరి, సముద్ర మైనాకుల ఆశీర్వాదం పొందాడు. హనుమంతుడి రెండవ ఈ అసాధ్య కార్యం చూసిన దేవతలు ఆయన్ను పొగిడారు. మొదటి అసాధ్య కార్యం సముద్రం దాటడమైతే, రెండవది కొండ అడ్డు వచ్చినా ఛేదించుకొనిపోడం.

            మైనాకుడు చేసిన స్నేహపూర్వక కార్యాన్ని చూసి, ఆకాశం పైనుంచి ఈ సన్నివేశాన్నంతా చూస్తూ నిల్చున్న దేవతలు, ఆయన్ను పొగిడారు. ఇంద్రుడు మైనాకుడిని చూసి, ఇక తనవల్ల అతడికి భయంలేకుండా వరమిచ్చానన్నాడు. సంకోచంలేకుండా లోకంలో సుఖపడమనీ మనస్సునందైనా భయపడవద్దనీ చెప్పాడు ఇంద్రుడు.

            "హనుమంతుడు నిండు ధైర్యంతో పోతున్నప్పటికీ, ఇతడెట్లా నూరుయోజనాల సముద్రం దాటగలడన్న భయంతో, మా గుండెలు కొట్టుకున్నాయి. అట్లా రామకార్యం కొరకు దూతగా పోతున్న హనుమంతుడిని సరైన సమయంలో ఆదరించావు....నిన్ను మెచ్చాను స్నేహితుడా" అని అన్నాడు మైనాకుడితో ఇంద్రుడు.


            ఈ ప్రకారం దేవేంద్రుడు తనతో అనడంతో వరంపొందిన మైనాకుడు భయం విడిచి సంతోషించాడు. హనుమంతుడు తన ప్రయాణం కొనసాగించాడు. (భగవత్ సేవకులకు దేవతలు సహాయపడ్తారని దీనివల్ల తెలుస్తోంది. శ్రేయస్కరమైన కార్యాలకు విఘ్నాలు ఎక్కువ. సంసారాన్ని తరించాలని ఆత్మావలోకనపరుడై యోగాభ్యాసం చేసే వ్యక్తిని చూసి, ఇతడు చెడిపోతున్నాడనే భయంతో, ప్రేమతోనే, అతడి బంధువులు తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తారు. కారణం ప్రేమతో అయినప్పటికీ విఘ్నం, విఘ్నమే. కావున ఇట్టివారిని లక్ష్యం చేయకూడదు. మంచి మాటలతోనే వారికి సమాధానం చెప్పి వెనుకంజ వేయక కృషి కొనసాగించాలి. అదే నిష్ఠ.)

          ఒంటరిగా సాహసించి పోతున్న హనుమంతుడు రావణుడిని ఎలాగెల్చి రాగలడని, దేవతలు, ఋషులు, సిధ్ధులు అనుకుంటారు. ఎలా సముద్రాన్ని దాటగలడన్న సందేహంతో, ఆయన బలాన్ని తెలుసుకోదల్చారు వారు. ఆ ఆలోచనతో, సూర్యకాంతిగల నాగమాత "సురస"ను సందేహ నివృత్తి కొరకు ఉపయోగించ దల్చారు. దైత్య స్త్రీగా పోయి వేగంగా సముద్రాన్ని దాటుతున్న హనుమంతుడికి అడ్డుపడి, ముహూర్తకాలం పాటు ఆలస్యం చేయమని సురసను కోరుతారు. దారికి అడ్డుపడే సమయంలో కోరలు, ఆకాశాన్నంటే నోరు, ఎర్రనిచూపులు, ఎదుటివారిని చంపే మిడిగ్రుడ్లు, ఆమెకుండాలని సూచిస్తారు. తెలివిగా ఆమెను దాటిపోతాడో, లేక, ఆమెకు చిక్కి, పోలేక ఆగిపోతాడో చూద్దామనుకుంటారు.

            సరేనని అంగీకరించిన సురస, ఇంతకు ముందెప్పుడూ ప్రాణికోటి వినని, కనని, భయంకరమైన పెద్ద వికార రూపాన్ని ధరించి ఆకాశంలో తిరుగుతూ, ఆంజనేయుడికడ్డుపడి, ఎదురునిల్చి, "ఎటుబోతున్నావు" అని ప్రశ్నిస్తుంది. "దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు. నన్ను దాటి నీవెక్కడకు పోలేవు. నానోట్లో చొరపడు. నిన్నుమింగుతా. నువ్వేం మాట్లాడినా నేనువినను" అంటుంది సురస. ఈమె సహజ రాక్షసి కాదు, నన్ను పరీక్షించ వచ్చింది, నిజంగా నన్ను తినాలని వుంటే తనే నన్ను నోట్లో వేసుకోవచ్చుకదా! అనుకొని, ఆమెతో విరోధానికి పోకుండా, రెండు చేతులెత్తి జోడించి, నమస్కరించి, తాను వెళ్తున్న పనిని వివరిస్తాడు హనుమంతుడు.

            "దేవీ! శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో అరణ్యంలో తిరుగుతుండగా, రాక్షసులందు ద్వేష బుధ్ధిగల శ్రీరాముడు లేని సమయంలో, ఆయన భార్య సీతాదేవిని రావణుడు అపహరించాడు. ఆ పతివ్రతను నేను చూడడానికి పోతున్నాను. ఇది శ్రీరాముడి ఆజ్ఞ. నీవున్న దేశం కూడా ఆయనదే. నీవుకూడా ఆయన పనిచేయాల్సినదానివే. నువ్వు చేయాల్సిందల్లా నన్ను క్షేమంగా పోనీయడమే. ఆ సహాయం చాలు. అది వీలుకాదంటే, జానకీదేవిని చూసొచ్చి, ఆమె క్షేమ సమాచరం రాముడికి తెలిపిన తర్వాత నీనోట్లో ప్రవేశిస్తాను" అని తాను వెళ్లే కార్యక్రమం గురించి తెలియచేస్తాడు సురసకు. హనుమంతుడి మాటలు తాను నమ్మననీ, తనకు చిక్కి ఆతడు ప్రాణాలతో తప్పించుకుని పోలేడనీ, అదితనకీయబడ్డ వరమనీ అంటూ సురస హనుమను అడ్డుకుంటుంది. అలా అంటూ నోరు తెర్చుకొని నిలబడ్తుంది. తన్ను మింగగల నోరు ఆమెకు లేదని తన దేహాన్ని పది ఆమడల నిడివిగా పెంచుతాడు హనుమంతుడు. సురస తన నోటిని ఇరవై ఆమడల నిడివిగా చేస్తుంది. హనుమంతుడు ముప్పై ఆమడలకు పెంచుతాడు. ఇలా ఇరువురూ పెన్చుకుంటూ పోతుంటారు. ఎప్పుడైతే సురస తన నోటిని నూరు ఆమడలకు పెన్చుతుందో, బుధ్ధిమంతుడైన హనుమంతుడు తక్షణమే తన దేహాన్ని చిన్నదిగా చేసాడు. (హనుమంతుడికి అణిమాది సిధ్ధులున్నాయనడానికి ఇదొక ఉదాహరణ)

అతి వేగంతో, సమర్ధతతో, హనుమంతుడు బొటన వేలంత రూపంలో, చటుక్కున సురస నోట్లో చొరబడి, అంతే వేగంతో, ఆమె నోరుమూసేలోపల, బయటపడి, ఆకాశంలో నిల్చి ఆమెకోరిక తీర్చానంటాడు. "తల్లీ దాక్షాయణీ! నీవు కోరినట్లే నీనోట్లో ప్రవేశించాను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరాన్నీ నిజం చేసాను. నన్ను దయతల్చి నా నమస్కారాన్ని అంగీకరించు. సంతోషంతో నేను సీతను వెదికేందుకు పోతాను. నేను తలపెట్టిన కార్యం సఫలం కావాలని కూడా నీ మనస్సులో అనుకొ" అని హనుమంతుడు చెప్పాడు. రాహువు నోట్లోకెళ్లి బయటకు వచ్చిన చంద్రుడిలాగున్న హనుమంతుడిని చూసి, సంతోషించిన సురస తన నిజస్వరూపాన్ని ధరిస్తుంది. సుఖంగా పోయిరమ్మని దీవిస్తుంది. పనులన్నీ శ్రమ లేకుండా జరిగిపోతాయనీ, శ్రీరాముడి భార్యను ఆయన వద్దకు చేర్చమనీ చెప్పి ఆ నాగమాత వెళ్లిపోతుంది. దేవతలు, ఇతరులు, ఆంజనేయుడు విజయవంతంగా చేసిన ఈ మూడో పనిని కూడా చూసి, "మేలు-మేలు" అని మెచ్చుకుంటారు. (ముముక్షువైన యోగినీ, భాగవతులనీ, దేవతలు పరీక్షిందేకు, విఘ్నాలు కల్పిస్తారు. వీటిని భక్తితోనే తప్పించుకుని పోవాలి హనుమంతుడులాగా అనేది అంతర ధ్వని)


No comments:

Post a Comment