Tuesday, October 3, 2017

వ్యాపారం చేయడమే నేరమా? :వనం జ్వాలానరసింహా రావు

వ్యాపారం చేయడమే నేరమా?
వనం జ్వాలానరసింహా రావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (04-10-2017)

         ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగరవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద ఉభయరాష్ట్రాలలోని వైశ్యులు సహజంగానే తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలియచేశారు. వారికి మద్దతుగా పరిపూర్ణానందస్వామి లాంటి వారు సహితం బాహాటంగానే మాట్లాడమే కాకుండా ఆ పుస్తకంలోని అంశాలు మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. ఎలెక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో తాను రాసిన అంశాలను సరైన రీతిలో, శాస్త్రీయంగా సమర్ధించలేని పుస్తక రచయిత మొత్తం చర్చను పక్కదారి పట్టించడం, అర్థంపర్థం లేని వాదన లేవదీయడం గమనించినవారికి ఆ రచయితకు ప్రాచుర్యం పొందాలనే జిజ్ఞాస తప్ప, విషయాన్ని కూలంకషంగా పదిమందికి తెలియచెప్పాలనే భావన వున్నట్లు గోచరించలేదు. అసలాయన రాసిన ఇతర పుస్తకాలు కాని, వ్యాసాలు కానీ, ఎవరిమీదో ఒకరి మీద గుడ్డకాల్చి పడేసే వ్యవహారమే తప్ప మేదావిత్వంతో కూడుకున్నవి కానే కావు.

         వైశ్యులు సామాజిక స్మగ్లర్లు (అంటే తెలుగులో దొంగరవాణాదారులు) అని అనడం వెనుక ఉద్దేశం బహుశా వ్యాపారం చేసేవాళ్ళంతా దొంగరవాణా చేసేవారు అనీ, దొంగలనీ అర్థం కావచ్చు. ఒకనాడు (ఇప్పటికీ చాలా చోట్ల) కేవలం వైశ్యులే సాధారణంగా వ్యాపారం చేసేవారు. అయితే చాలామంది వైశ్యులు చేసే వ్యాపారం ఆ రోజుల్లో, బహుశా ఇప్పటికీ, సమాజానికి నిత్యం దైనందిన జీవనానికి అవసరమైన చిల్లరదుకాణం వ్యాపారమే! ప్రతిగ్రామంలో వుండే ఒకటో-రెండో కోమటి కుటుంబాలు ఆ గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా చిల్లర దుకాణం వ్యాపారం చేసేవారు. నెలంతా గ్రామస్తులకు కావలసిన సరకులు అప్పుగానో, నగదుగానో ఇచ్చేవారు. అదొక సామాజిక ఆవశ్యకత. వాళ్లే అలా చేయకపోతే గ్రామస్తుల పరిస్థితి ఎలా వుండేదో ఉహించడం కూడా కష్టమే. ఇందులో దొంగ రవాణాకు ఆస్కారం ఎక్కడ వుందో ఆ రచయితే విడమర్చి తెలియచెప్పాలి.

క్రమేపీ రోజులు మారాయి.....కాలానుగుణంగా ఒక్క కోమట్లే కాకుండా చిల్లరదుకాణాలను నడపడానికి వీరూ-వారూ అనే తేడా లేకుండా అన్ని కులాల వాళ్లూ ముందుకు రాసాగారు. ఈ రోజుల్లో గ్రామాలకు పోతే మనకు కనిపించని వ్యాపారం వుండదు. ఒక్క కిరాణా దుకాణాలే కాకుండా, టీ-దుకాణాల దగ్గరనుంచి మద్యం అమ్మే దుకాణాలదాకా, హోటళ్లు నడపడం దగ్గరనుంచి ఎరువుల అమ్మకం దాకా, పాలమ్మడం దగ్గరనుంచి పూలు-కూరగాయలు అమ్మడం దాకా, కంట్రాక్టు పనుల దగ్గర నుంచి రాజకీయ వ్యాపారం దాకా ......ఇదీ-అదీ అనే తేడా లేకుండా అన్ని రకాల కులాలు వారి-వారికి తోచిన వ్యాపారం వారి-వారి స్థాయిని పట్టి చేస్తూనే వున్నారు. గొల్లలు గొర్రెల వ్యాపారం, బెస్తలు చేపల వ్యాపారం, చేనేతవారు గుడ్డల వ్యాపారం, దాసరివారి సరకులమ్మే వ్యాపారం, వ్యవసాయదారులు కూరలమ్మే వ్యాపారం, మేదరవాళ్ళు బట్టలు కుట్టే వ్యాపారం, గౌడులు కల్లు-సారా వ్యాపారం....చెప్పుకుంటూ పోతే వైశ్యులతో సహా అందరూ, అన్ని కులాల వాళ్లూ ఎదో ఒక వ్యాపారం చేస్తూనే వున్నారు. వైశ్యులు సామాజిక స్మగ్లర్లయితే ఈ కులాలవారదరూ కూడా అలాగేనా? ఆ రచయిత ఒక్క సారి పునరాలోచన చేస్తే మంచిదేమో!

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఒక కొత్తరకమైన ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఆవిర్భవించడం జరిగింది. వీరంతా కేవలం కోమట్లే కాదు....అన్ని కులాలవారున్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సమసమాజం ఏర్పాటుకోసం స్వాతంత్ర్యానంతరం అనేక రకాల చట్టాలు వచ్చాయి. రాజ్యాంగం కూడా సెక్యులర్-ప్రజాస్వామిక వ్యవస్థ దిశగా అనేక ప్రకరణలను పొందుపరిచింది. జవహర్లాల్ నెహ్రూ కాలంనుంచి మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం మొదలవడంతో కులాలకు-మతాలకు అతీతంగా ఒక ఆధునిక వ్యాపారరంగ వర్గం ఆవిర్భవించింది. అనాదిగా, వంశపారంపర్యంగా ఆచరిస్తూ వస్తున్న వృత్తులకు స్వస్తి పలికి వ్యాపారాన్నే వృత్తిగా చేపట్టిన వారనేకమంది వున్నారు. 1991 సంవత్సరంలో ఆర్ధిక సరళీకరణ విధానాలు రూపుదిద్దుకోవడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రకరకాల వ్యాపారాలు ప్రారంభించడానికి తలుపులు తెరుచుకున్నాయి. వాస్తవానికి అంతకు ముందే ప్రముఖ యాజమాన్య శిక్షణా సంస్థలైన ఐఐఎమ్ లాంటివి పెద్దమొత్తంలో ఎంబీయేలను తయారు చేయడంతో వారంతా ఉద్యోగరీత్యా, వ్యక్తిగతంగా వ్యాపారవేత్తలు కాసాగారు. ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడంతో నైపుణ్యం వున్న ప్రతివాడూ వ్యాపారం చేయసాగాడు. క్రమేపీ మన దేశ వ్యాపారవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకోవడం మొదలైంది. అలా తెచ్చుకున్నవారిలో కోమట్లే కాకుండా అన్ని కులాల వారున్నారు. కోమట్లను అన్నట్లే వీరందరినీ సామాజిక స్మగర్లని అందామా? ఆ రచయితే చెప్పాలి సమాధానం.

కాకపోతే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవడంలో, అంగీకరించడంలో తప్పు అని కానీ, సిగ్గుపడాల్సిన అవసరం కానీ లేదు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు సామాజిక వ్యవస్థ తీరుతెన్నులు ఆర్ధిక స్థితిగతులపై ఆధారపడివుంటాయి. అలనాటి ఆర్ధిక వ్యవస్థలో సామాజికంగా ఒక వర్గంవారు-లేదా-ఒక కులంవారు వ్యాపారంగంలో కేంద్రీకరించడం సహజంగా జరిగిన పరిణామం. వ్యక్తిగత సంపద పెరగడానికి, తద్వారా దేశ సంపద పెరగడానికి వారే కారణభూతులు. అలనాటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చాతుర్వర్ణ వ్యవస్థలో వైశ్యులకు వ్యాపారలావాదేవీలు అప్పగించడం జరిగింది. అదేదో అన్నింటికన్నా గౌరవప్రదమైన వ్యాపకమని కాదుకాని, అలా జరగడం ఒక సామాజిక అవసరంగా జరిగింది అప్పట్లో. అలాగే బ్రాహ్మణుల విషయానికొస్తేవారిని సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి ఉపయోగించుకుంది అలనాటి వ్యవస్థ.


ఆధునిక నవ-భారతదేశంలో కులాలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఎలా రూపాంతరం చెందాయి అనే విషయం ప్రధానాంశంగా, నందన్ నీలేకని ఉపోద్ఘాతంతో, ప్రఖ్యాత పాత్రికేయుడు హరీష్ దామోదరన్ రాసిన “ఇండియాస్ న్యూ కాపిటలిస్ట్స్” అనే ఆంగ్ల పుస్తకంలో, కోమట్లతో సహా అనేక కులాలు ఎలా వ్యాపార రంగంలోకి దిగి, పెద్దపెద్ద సంస్థలను స్థాపించి, కోట్లకు పడగలెత్తారో వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. కోమట్లను సామాజిక స్మగ్లర్లగా అభివర్ణించిన మహాశయులు ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివితే మన దేశ వ్యాపార రంగం అభివృద్ధి గురించి అవగతమౌతుంది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో గణనీయమైన మార్పులు వ్యాపార రంగంలో ఎలా చోటుచేసుకున్నాయో కూడా ఇది చదివితే అర్థం అవుతుంది. జౌళి, చక్కర, ఇనుము, ఉక్కు, రసాయానాలు, ప్లాస్టికులు, ఫార్మా, ఆటోమొబైల్స్, ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.....ఇలా వివిధ రంగాలలో ఈ కులం-ఆ కులం అనే తేడా లేకుండా వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. ఇవేవీ గమనించకుందా, పరిగణలోకి తీసుకోకుండా ఒక్క వైశ్యులే వ్యాపారం చేశారనీ, వారు సామాజిక స్మగ్లర్లనీ నింద వేయడం భావ్యం కాదు. పార్సీలు, గుజరాతీ బనియాలు, జైనులు, మార్వాడీలు, సింధీలు, చెట్టియార్లు, ఖోజాలు, బోహరాలు లాంటి వైశ్యా కులాలు ఒకప్పుడు వ్యాపారవేత్తలే.... కాదనలేం. కాలక్రమేణా, కొత్త వ్యాపార వర్గాల్లో యాదవులు, కమ్మవారు, రెడ్డివారు, రాజులు, వెలమలు, నాయుడ్లు, గౌండర్లు, నాడార్లు, మరాఠాలు, హిందూ-సిఖ్ జాట్లు.....ఇలా అందరూ చేరారు. వీరితో పాటు బ్రాహ్మణ, క్షత్రియ, కాయస్థ లాంటి మిగతావారు కూడా వ్యాపారులయ్యారు.

ఒక్కో కులానికి చెందినవారు ఎలా వ్యాపార రంగంలో అంచెలంచలుగా ఎదిగారో సోదాహరణంగా వివరిస్తూ హరీష్ దామోదరన్ ఆసక్తికరమైన విషయాలెన్నో రాశారు. 1965 సంవత్సరపు మొనాపలీ విచారణ కమీషన్ రూపొందించిన 75 ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో కేవలం రెండు మాత్రమే ఖత్రీలకు చెందగా, ఐదు మాత్రమె బ్రాహ్మణులకు చెందివున్నాయి. తదనంతర పరిణామాలలో వారు కూడా గణనీయమైన వృద్ధి సాధించారు. ఇన్ఫోసిస్ సంస్థ అలా వచ్చిందే!

కమ్మ కులానికి, రెడ్డి కులానికి, రాజుల కులానికి, వెలమ కులానికి చెందినవారు వ్యాపార రంగంలో ఎవరూ ఉహించని విజయాలు సాధించారు. దీని వెనుక వున్న కారణాలను వివరిస్తూ, దామోదరన్, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల పుణ్యమా అని, కమ్మ కులానికి చెందిన వ్యవసాయదారులు పంటలు సమృద్ధిగా పండించుకుని అలా వచ్చిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించారని రాశాడు. వరి పంట, మిరప పంట, పసుపు పంట, కాటన్ పంట, పొగాకు పంటల్లో లాభాలెక్కువగా వచ్చాయి. కొందరు ధాన్యం వ్యాపారం చేస్తే, మరికొందరు పొగాకు వ్యాపారం చేశారు. వీరెవరూ వ్యాపారంలో స్మగ్లింగ్ చేయలేదే! అలాగే సినిమారంగంలో మరికొందరు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసారు. లాభాలు గడించారు. మరికొందరు పరిశ్రమలు స్థాపించారు. ఉదాహరణకు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ, ఉయ్యూరు సహకార చక్కర కర్మాగారం, కేసీపీ, ఆంధ్రా సుగర్స్, సర్వారాయ నూలు మిల్లు లాంటివి వున్నాయి. అలాగే రెడ్డివారు మైనింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టారు. సినిమారంగంలో కూడా దిగారు. కాంట్రాక్టులు కూడా చేశారు. ప్రాజెక్టులు కట్టారు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సత్యం కంప్యూటర్స్ గురించి అందరికీ తెలిసిందే. దానిని స్థాపించిన వ్యక్తి రాజుల కులానికి చెందిన వారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు వెలమలు దూసుకు పోతున్నారు కదా!


ఇవ్వాళ వ్యాపారం చేయని కులం ఏదీ లేదు. వ్యాపారం చేసిన కోమట్లు స్మగ్లర్లయితే అందరినీ స్మగ్లర్లుగానే ఆ రచయిత భావిస్తున్నాడా? దీనికి ఆయన వద్ద సమాధానం వుందని నేనుకోను. 

1 comment:

  1. ఈరోజున అనేకానేక కులాలు ఉపకులాలుగా హిందూసమాజం అనిచెప్పబడే సమాజవ్యవస్థ బహుధా చీలిపోయి ఉంది. ఐలయ్య పుస్తకాన్ని కొన్నివర్గాలు విమర్శించటంతో ఆయన్ను సమర్థించటం కోసం ముందుకు దూకుతున్నాయి మరికొన్ని కుల/వర్గాలు. ఇలా జరుగుతుందన్న ఆలోచనలేని వారు కాధు ఐలయ్య గారు. ఆయనకు కావలసినది విమర్శలేకుండా పుస్తకం ఆమోదం పొందినా దొరుకుతుంది -- విమర్శ / ప్రతివిమర్శల మధ్య గందరగోళం చెలరేగినా దొరుకుతుంది! అదే ఆయన తర్కం తన విజయానికి. మీరు పుస్తకంలో విషయం తర్కబధ్ధమా అని అడగటం వలన ఉపయోగం ఏమీ లేదు. ఉదాహరణకు వనం వారు బ్రాహ్మణులు కాబట్టి ఆటోమేటిగ్గా అగ్రకులాహంకారంతోనే ఐలయ్య గారి వంటి మేథావి మీద విమర్శలు చేస్తున్నారూ - ఈ వనం వారిని వెంటనే అరెష్టుచేసి ప్రాసిక్యూట్ చేయాలీ అని కొన్ని వర్గాలు ధర్నాలూ ఊరేగింపులూ వగైరాలతో ఆందోళనకు పూనుకోవచ్చును. సహజంగా మనదేశవాళీ మేతావివర్గపు ఎర్రకళ్ళజోళ్ళకు మీరొక భయంకరమైన హిందూ ఉగ్రవాదిగా కనిపిస్తారు. ప్రభుత్వాలకు కావలసినది నేటి ప్రజల మద్దతూ రేపటి ఓట్ల సంఖ్యామానమూ కాబట్టి ఆందోళనకారులు విజయం సాధించినా ఏమీ ఆశ్చర్యం ఉందదు. పరిస్గ్థితి ఇంతభయంకరమా అని ఎవరైనా అంటే వారి అమాయకత్వానికి జాలిపడవలసిందేను. ఇప్పుడు చెప్పండి తర్కం అంటే ఏమిటి? అది ఎవరికి కావాలి? ఎందుకు కావాలి? ఆ తర్కం అనే దాన్ని ఎవరు ప్రస్తావించగలరు? ఎలా ప్రస్తావించగలరు? ఎవరైనా ఈ దేశంలో అవకాశవాదానికి కట్టుబడుతున్నారా తర్కవితర్కాలకా? (నేరుగా మీ పేరునే ఉదాహరణలో వాడినందుకు మన్నించండి. కాని పరిస్థితులు అలాంటివి)

    ReplyDelete