Friday, November 3, 2017

వారసత్వస్వామ్యంగా ప్రజాస్వామ్యం : వనం జ్వాలా నరసింహారావు

వారసత్వస్వామ్యంగా ప్రజాస్వామ్యం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (04-11-2017)
నెహ్రూ-గాంధి కుటుంబ వారసుడిగా ఆరో తరం నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మళ్లీ అదికారంలోకి రావడం అంటూ జరిగితే, భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధి, తల్లి సోనియా గాంధి ఆశీస్సులతో, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధమైంది. ఇక ఆయనే కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని అధికారిక నాయకుడు అవుతాడు. వందిమాగధులకు ఇక మీద “దేశ్ కీ నేతా రాహుల్” నినాదం అనివార్యం.

విదేశీయుడైన అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడై తే...... మరో విదేశీ, ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, రెండు దశాబ్దాల క్రితం చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీని, ప్రక్షాలణచేసి, పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన పీవీ నరసింహారావు 1996 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలవడంతో, సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు ధ్వజం ఎత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకులు చేసిన "అభ్యర్థన" మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత ఇరవై ఏళ్లకు పైగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే, "ఏక వ్యక్తి అభిప్రాయమే" చివరకు "ఏకాభిప్రాయం" గా అవుతోంది.

నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల, ప్రతికూల శక్తుల-వ్యక్తుల, మధ్య జరిగిన-జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ నూటా నలబై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రతిసారీ నెహ్రూ-గాంధి కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయం జగమెరిగిన సత్యం. దాని వల్ల దేశానికి, పార్టీకి మేలు జరిగితే జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై కూడా వుండొచ్చు. కాకపొతే ఆ క్రమంలోనే వారి నాయకత్వం మినహా గత్యంతరం లేని పరిస్థితులు నెలకొని ఇప్పటికీ కొనసాగుతోంది. భవిష్యత్‍లో కూడా అలానే జరగదన్న నమ్మకం లేదు. ఎదురుతిరిగినవారిని మోతీలాల్ నెహ్రూ దగ్గర్నుంచి, ఆ వారసత్వ పరంపరలోని అందరూ, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని తమ వారిని ప్రోత్సహించడమో, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం.

రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మోతీలాల్ నెహ్రూ, కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, నెహ్రూను వ్యతిరేకించిన, వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్యలను ఎదగకుండా చేశారు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీకి తరచుగ ఎదురుతిరుగుతూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం జగమెరిగిన సత్యం. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, దేవుడు మేలు చేస్తే, నాలుగో తరం కూడా ఎన్నడో-అన్నడు ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న ఆ కుటుంబం వారే ఐదారు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలకు పైగా  కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు.


నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. మొరార్జీ దేశాయ్‍తో సహా, "సంప్రదాయ వాదులందరినీ" బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల, వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది ఇందిరా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్‌-ఏఐసీసీ () తెర పైకొచ్చింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధీని వారసుడిని చేసింది.

రాజీవ్ గాంధి నాయకత్వంలో, 1984 సార్వత్రిక ఎన్నికల్లో, పార్టీ భారీ మెజారిటీ సాధించి, 1985 లో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991 లో రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో, పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు. పీవీ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా అంతర్జాతీయ మన్ననలందుకోవడం సోనియాకు మింగుడు పడలేదు. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేసారు పీవీ. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా?

కాంగ్రెస్ బాటలోనే భారత దేశంలోని చాలా రాజకీయ పార్టీలు వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలుగా మారాయి. వీటి అధినాయకులు తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని పార్టీ నాయకత్వంలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను, ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించేదిగానూ మారే ప్రమాదం పొంచి వుంది.


ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే, తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, చాలా వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. వర్తమాన చరిత్రకారులెందరో దీన్ని ధృవీకరించారు. తన తదనంతరం కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట పెద్ద కొడుకు సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆయన హత్యకు గురైంతర్వాత, కొంత విరామం తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగింది కాదా? ఏమో! 

1 comment:

  1. ఈ వారసత్వరాజకీయప్రజాస్వామ్యంలో రేపోమాపో ఉభయచంద్రుల కుటుంబాలూ పెత్తందార్లుగా వస్తారండి.

    ReplyDelete