Sunday, November 12, 2017

రామలక్ష్మణుల కార్యం నెరవేరిందని సంతోషపడిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రామలక్ష్మణుల కార్యం నెరవేరిందని సంతోషపడిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (13-11-2017)

నాలుగు విధాలుగా రాముడు బాధపడ్తున్నాడని నిర్ధారించుకున్నాడు హనుమంతుడు. రామచంద్రుడు  కామంతో దుఃఖ పాడడం లేదు. సీతమీద ఆయన తన మనస్సు నిలిపాడు. ఆమె ఈయనపై మనస్సు నిలిపింది. కాబట్టి వీరిమనసులు ఎక్కడ న్యాయంగా వుండాలో, అక్కడే వున్నాయి. దేహాలు మాత్రం వేరుగా వున్నాయి. మనస్సులు ఏకంగా వున్నాయి. అందుకే వీరిద్దరూ బ్రతకగలిగారు. అదే కాకపోతే ఇద్దరూ మరణించేవారే! (ఇదే జీవాత్మ-పరమాత్మ సంబంధమని అర్థం చేసుకోవాలి)

హనుమంతుడు శ్రీరాముడి గురించి అనుకుంటూ: "సీతతో ఆయన సరస-సల్లాపాలాడి వుండకపోవచ్చు, సంభోగించకుండవచ్చు కానీ, కళ్లనైనా చూడక ఇన్నిరోజులు విడిచి పెట్టి ఎలా బ్రతికున్నాడు? బ్రతికుండటమే కాదు, చింత అయినా లేదే? బాధపడడంలేదే? ఆయనెంతటి అసాధ్యమైన కార్యం చేశాడు!"

"ఆయుష్హు తన స్వాధీనంలో వుండదు కనుక బ్రతికుండవచ్చు. చింతపడి శుష్కించడంలేదే? ఏమాత్రం ప్రీతికలవారు పోయినా, ఏడుపొస్తుందే! అట్లాంటిది సీతలాంటి దాన్ని పోగొట్టుకున్నా దుఃఖం లేదే? నిద్ర చాలించలేదే! ఆహారం మానలేదే? పడుకున్నాడుకదా! వియోగానికి చేయాల్సిన పనేంచేశాడు? ఆయన నడవడి ఎంత ఆశ్చర్యం కలిగిస్తున్నది? ఏమీ ఆయన ఇంద్రియ జయం! ఋశ్యమూకంలో సీతకై ఏడుస్తుంటే చూసి, అయ్యో, ఇంతటి ధీరోదాత్తుడు, మహానుభావుడు ఒక ఆడదానికొరకు ఇట్లా ఏడుస్తున్నాడెందుకు? అనుకున్నానే! ఎంత కామదాసుడు. ఏవిధంగా ఇంద్రియాలకు లోబడుతున్నాడని అనుకున్నానుకాని, సీతను చూసిన తర్వాత, రాముడు పాషాణ హృదయుడనే చెప్పాల్సి వస్తున్నది."

ఇంకా ఇలా అనుకుంటాడు: "రాముడు భూకాంతుడు కనుక బ్రతికాడు. సీతాదేవిని విడవడంవలన కలగాల్సినంత దుఃఖమే కలిగితే బ్రతికుండే వాడా? ఆత్మహత్య చేసుకోనక్కరలేదు. నిజంగా దుఃఖమే కలిగితే ప్రాణాలు వాటంతటవే శరీరాన్ని విడిచిపోయేవే. అలాంటప్పుడు సీత ప్రాణమెందుకు పోలేదు? ఆమెకు దుఃఖం లేకనా? సీత పరతంత్ర. భర్త ఆజ్ఞ లేకుండా మరాణించలేదు. దేహమే ఆమెది, ప్రాణం రాముడి సొత్తే. ఆమె పోగొట్టుకోలేదు. పోతాయన్నా బిగపట్టుకోవాలి. రాముడు స్వతంత్రుడు. దేహాన్ని వదలాల్సి వుండాలి. కానీ చేయలేదే? అదే అసాధ్య కార్యం"

జితేంద్రియుడని ప్రసిధ్ధి చెందిన హనుమంతుడు కూడా రామచంద్రమూర్తి సీతాదేవిని విడిచి వుండడం చెడుపని అనుకుంటున్నాడు. "ఎంతటి చెడ్డ పనిచేసాడాయన. ఈమెను విడిచి క్షణకాలమైనా వుండకూడదే? అలాంటిది సీతాదేవి కోరగానే మాయా మృగం కొరకు ఆమెను విడిచి ఎందుకు పోవాలి? సీత అంటే ఆడది. చపలత స్త్రీ స్వభావం. తన కోరికవల్ల కలిగే మేలు-కీడుల గురించిన ఆలోచన వారికుండకపోవచ్చు. పోనీ కోరిక తీర్చదల్చుకుంటే, లక్ష్మణుడిని పంపవచ్చుకదా. అలా చేయకుండా, దానికొరకు పోయి సీతనింత కష్టపెడ్తున్నాడే? రాముడు రమణీయమైన ఆకారమున్నవాడే కాని లోపల తెలివితేటలున్నవాడుకాడు. అక్కడ రాముడు ఏడ్వడం చూసి, ఆయన నిజమైన, నిండారు ప్రేమున్నవాడని తలిచాను. కాని ఇక్కడ ఈమె దుస్థితి చూసిన నాకు ఆయన దయలేనివాడని తోస్తుంది. ప్రణయవిద్యలో ఆయనకు "ఓనమాలు" కూడా రావు కనుక, ప్రణయమంటే ఏమిటో తెలియక చేశాడేకాని తెలిసిచేసిన వ్యవహారం కాదు. ఎండను విడిచిన సూర్యుడివలె, సీతను విడిచి రాముడుండడం దుష్కరం. ఎండలేని సూర్యుడినెవరూ పూజించనట్లే, సీతలేకపోతే తాను అపూజ్యుడని రాముడికి తోచలేదుకదా! భూకాంతుడు కనుక, మృగం మీద కాంక్షతో సీతను విడిచినట్లు, రాజ్యకాంక్షతో సీతనుపేక్షించాడు."

"అణచలేని పరాక్రమవంతుడైన రాముడు, విశాలమై, మత్తెక్కించే కళ్లున్న సీతను, ఇప్పుడు, ఇన్ని సంవత్సరాలు అనుభవించి, తటాలున వదిలి ఎలా వుండగలుగుతున్నాడు? బహుశా ఈమెకన్నులు ఆయనకు మత్తెక్కించలేదా? ఆయన హృదయం ఘుమ్దో, రాయో అయ్యుండాలి. జీవితేశ్వరైన సీత పోయిన తర్వాత నాకింకేమిపననుకొని, జీవుడు పోవాలనుకున్నా, పోనీయక బిగపట్టాడు. ఇది దుష్కరమేకదా! ఇంతటి అసాధ్యకార్యం సాధించిన రామచంద్రమూర్తి సామాన్యుడుకాడు. ఇదిచేయకలిగినవాడు ఎంతటి అసాధ్యమైన పనైనా చేయగలడు. లంకాప్రవేశం చేసి, సీతను చూసిన నేనే అసాధ్యకార్యం చేసానన్న గర్వంతో వున్నానే. కాని రాముడు చేసిన కార్యం ఎదుట నేనుచేసింది గొప్పకానేకాదు."

జానకీదేవిని చూసిన హనుమంతుడు ఇలా అనుకుంటూ, మాసిన చీరతో, స్నానంలేని ఒంటితో, నిద్రాహారాలు మాని, భర్తనే ధ్యానంచేస్తున్న పరమపతివ్రతను చూసే అదృష్టం తనకు కలిగిందికదా అని ఆనందిస్తాడు. వానరులందరూ బ్రతికినట్లేననీ, సుగ్రీవుడు కృతజ్ఞుడయినాడనీ, రామలక్ష్మణుల కార్యం నెరవేరిందికదా అని సంతోషపడ్తాడు. "రామచంద్రమూర్తి ఎంతగొప్పవాడోకదా! కాకుంటే ఇట్టి స్త్రీకి భర్తయ్యేవాడా! ఎంత జితేంద్రియుడు కాకపోతే ఈమెను విడిచి బ్రతుకుతాడా?" అని సంతోషంతో శ్రీరాముడి సామర్ధ్యాన్ని తనివితీరా పొగడుతాడు.

No comments:

Post a Comment