Monday, November 6, 2017

హనుమంతుడు చూసింది సీతాదేవినే! .....ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

హనుమంతుడు చూసింది సీతాదేవినే!
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (06-11-2017)
రావణాసురుడు ఎత్తుకునిపోతున్నప్పుడు, తామంతా చూసిన స్త్రీ ఈమె మాదిరే వుంది కాబట్టి, ఈమె సీతాదేవేనని తలచికూడా, ఒకరిని పోలిన మనిషి మరొకరు వుండవచ్చుకదానని తర్కించు కుంటాడు. ఖచ్చితంగా నిశ్చయించాలంటే, ఇతరప్రమాణాలను ఆధారంగా చేసుకోవాలని భావించి, చివరకు తన నిర్ణయం సరైనదేనని తీర్మానించుకుంటాడు హనుమంతుడు. శ్రీరామచంద్రమూర్తి జానకి సొమ్ములని వేటిని చూపించాడో, అలాంటివన్నీ, ఈమె సమీపంలో ఒకచెట్టు కొమ్మకు వ్రేలాడుతుండడం కనిపించాయి, మరోనిదర్శనంగా సీతాదేవి ఆభరణాలను, కోతుల ముందు పడవేసినతర్వాత, వారు వాటిని మూటగా కట్టి, రాముడొచ్చినప్పుడు అందచేసారు. ఎవరైనా తనను వెతుక్కుంటూ వస్తే, గుర్తించేందుకు ఆమే ఆపని చేసింది. ఈమె సీతేననటానికి అక్కడ కిష్కింధలో చూసిన ఆభరణాలలాంటివే ఇక్కడా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అక్కడ విడిచి మిగిలినవి గుర్తుపట్టెందుకు ఇక్కడ వేలాడకట్టిందని భావిస్తాడు.

చెట్ల మీది కొమ్మలకు వేలాడ కట్టిన సొమ్ములు సీతవే అనటానికి రూఢి ఏమిటి? మళ్లీ తన సందేహనివృత్తి చేసుకుంటాడు. నాణ్యపు కమ్మలు, పొగడలు, రత్నాలు, పగడాలు, వీటన్నిటితో ప్రకాశించే భూషణాలు, మురికిగా తయారై, నల్లబడి, ఎన్నాళ్లుగానో ధరించనందున ఆమె ఒంటి మీద గుర్తులుకూడా కనిపిస్తున్నాయి. అంటే, శ్రీరాముడు, సీత సొమ్ములివి అని వేటిని చూపించాడో, అవి ధరిస్తే ఎలాంటి గుర్తులు పడతాయో, అలాంటివే ఈమె ఒంటిమీదున్నాయి. ధరించనప్పుడు సొమ్ములు దాచిపెట్టెందుకు పెట్టెలు లేనందున, ఒంటిమీదే వుండడం వల్ల, దేహమంతా కాయలు కాచింది. సీతాదేవి పారేసినవి కాకుండా, తొందరగా తీసేయలేనివి ఒంటిమీదే వుంచుకున్నది. రామచంద్రమూర్తి వానరులిచ్చిన నగలేకాకుండా, ఇంకొన్ని ఆమె ఒంటిమీదే వున్నాయని చెప్పాడు. ఆసొమ్ములిక్కడున్నాయి. అక్కడ చూసిన నగలిక్కడ లేవు....ఇక్కడున్నవక్కడ లేవు. అక్కడ ఎడమభాగానివి వుంటే, ఇక్కడ కుడివైపువి వున్నాయి. సందేహంలేదనుకుంటాడు హనుమంతుడు.

ఇంకా సందేహ నివృత్తికి కారణాలు వెతుకుతాడు. ఆమెనెత్తుకుని పోతున్నప్పుడు ఆకాశంలోనుంచి విసిరిన సొమ్ములమూటను కట్టిన ఉత్తరీయపు కొంగు ఏపచ్చని వన్నెదో, అలాంటిదే ఇప్పుడామె ఒంటిమీదున్నదని నిర్ధారించుకుంటాడు. కాకపోతే ఎంతోకాలంగా వుతకనందున, రంగుమాసిపోయినా, వన్నె తరగలేదు. ఈమె సీతే అనడానికి మరోకారణం చెప్పుకుంటాడు హనుమంతుడు. ఈమె శ్రీరామచంద్రుడి హృదయేశ్వరి సీతాదేవి. సీతాదేవి  హృదయేశ్వరుడు శ్రీరామచంద్రుడు. ఇరువురు ఏకాభిప్రాయం కలవారే. ఆమె "ఔనన్నది" ఈయన కాదనడు. ఈయన ఔనన్నది ఆమె కాదనదు. ఆమె రామాభిమతానుసారిణి. సీతానుగ్రహం వస్తే రాముడి అనుగ్రహం వచ్చినట్లే అనుకుంటాడు. రాముడి హృదయేశ్వరి, రాణి, అయినందున, దూరదేశంలో మగడిని విడిచి వున్నప్పటికీ, ఆయన హృదయాన్ని మటుకు వదలకుండా నిలిచే వుంది. ఆయన హృదయాన్నెడబాయకుండా వుంది. సాముద్రికశాస్త్రం ప్రకారం రాముడికెలాంటి అవయవ సౌష్టవముందో, అట్టి వాడికి ఎలాంటి అవయవ సౌష్టవం కల భార్య వుండాల్నో, అలాంటి లక్షణాలన్నీ ఈమెలో వుండడం మరో నిదర్శనంగా భావిస్తాడు. (హనుమంతుడు సాముద్రిక శాస్త్రవేత్తగా దర్శనమిస్తాడు ఇక్కడ. రాముడిలో ఏ అవయవ సౌష్టవం కలదో అలాంటివానికి ఎలాంటి అవయవ సంపుగలది భార్యగా వుండాలో, ఆ అవయవ సౌష్టవం ఇక్కడ సీతమ్మలో కనిపిస్తున్నది. కాబట్టి ఆ రామయ్యకు ఈ సీతమ్మే భార్య అయి వుండాలి. అలాగే ఈ సీతమ్మకు మా రామయ్యే భర్త అయి వుండితీరాలి అని నిర్ధారించుకుంటాడు హనుమంతుడు)


అది అలా వుంచితే, ఆమె రాముడి భార్యేననడానికి మరి కొన్ని ప్రధాన కారణాలను వివరించుకుంటాడు హనుమంతుడు తనకు తానే. శ్రీరాముడెవరికొరకు దయ, అక్రూరత్వం, నివారించలేని శోకం, కామం బాధిస్తుంటే పరితపిస్తున్నాడో, ఆమె, ఈమేనని నిర్ధారించుకుంటాడు. శ్రీరామచంద్రమూర్తి భార్య కొరకై శోకించడానికి నాలుగు కారణాలున్నాయి. పురుషుడిలో సగం భార్య. స్త్రీలో సగం భర్త. భార్యా-భర్తల సంబంధం జన్మాంతరాలలోనూ తప్పదు. అలాగే పాపపుణ్యాలలో ఉభయులూ సమభాగులే!

ఆకారణాలు:
·       పురుషుడైనవాడు, ధన-ప్రాణమిచ్చైనా భార్యను రక్షించాలని ధర్మశాస్త్రం చెపుతుంటే, క్షత్రియుడనైకూడా సీతను కాపాడలేకపోతినికదా అనే "సర్వభూతదయ" రాముడిలో వుంది.
·       తాను రక్షించలేని స్త్రీ అన్యస్త్రీ కాదు. తాను రక్షిస్తానని నమ్మి, ఆ  భారం తనమీద వేసి, వేరే రక్షణకోరక, సర్వసౌఖ్యాలు వదిలి, కష్టాలు పడుతూ, తనవెంట వచ్చింది. అలాంటామెకు ఎట్టి కష్టాలు రాకుండా కాపాడవలసి వుండగా, అలాచేయకుండా, కష్టాలు పడుతుంటే, సహించి వూరుకున్న తనెంతటి క్రూరుడనన్న భావన.
·       తన్ను నమ్మి వచ్చిన సీత బానిసా? కాదు. రక్తబందువా? కాదు. తనదేహంలో సగభాగం. తన కుడిభాగాన్ని ఎట్లా రక్షించుకోవాల్నో, అట్లానే ఎడమభాగాన్ని కూడా రక్షించుకోవాలికదా! అయినా చేయలేకపోయానే ..... తనదేహాన్నే కాపాడుకోలేనివాడేమి క్షత్రియుడు?
·       తను భర్త-పతి, అని అన్నంతవరకు, పరస్పరానురాగం వున్నా, లేకున్నా, భరించి, పాలించవలసిన న్యాయం తనకుంది. సీత ఒప్పులకుప్ప, సద్గుణరాశి, ప్రియురాలు, ప్రేమగలది. ఆమె సాన్నిధ్యమాత్రంలోనే తనకు కష్టాలు లేకుండా చేస్తుందే! కనీసం ఆమెతో మాట్లాడే వీలుకూడా లేదే! ఈవియోగాన్నెట్లు సహించాలనే విరహ-మదన తాపం.

No comments:

Post a Comment