Thursday, November 16, 2017

ఆర్థికంలో అగ్రగామి : వనం జ్వాలా నరసింహారావు

ఆర్థికంలో అగ్రగామి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-11-2017)
           ప్రముఖ ఆంగ్లవార్తా పక్షపత్రిక ఇండియాటుడే ప్రకటించిన తాజా దేశవ్యాప్త రాంకింగ్స్ లో, తెలంగాణ రాష్ట్రానికి, ఆర్థికాభివృద్ధిలో మొదటి స్థానం ఇచ్చింది. అలా ఆ పత్రిక నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యం ఏ మాత్రం లేదనాలి. వాస్తవానికి ఆర్ధిక రంగంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సాధిస్తున్న ఫలితాలు దేశవ్యాప్త మన్నలను అందుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన జూన్ 2014 నుండి, ఆర్థికాభివృద్ధి అంచలంచలుగా, ఏటేటా, వృద్ధి చెందుతూ వస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రెండు ఆర్ధిక సంవత్సరాల (2012-14) స్థూల రాష్ట్ర స్వీయోత్పాదన (జీఎస్డీపీ) సగటు వృద్ధి కేవలం 4.2% మాత్రమే వుండగా, తదనంతరం, రాష్ట్రం ఏర్పాటైన మూడేళ్లలో (2014-17) అది 9.5% చేరుకుంది. ఇది గణనీయమైన ఆర్థికాభివృద్ధిగా పలువురు ఆర్ధిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

          రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం సాధించిన 4.2% సగటు వార్షిక వృద్ధి, 6% వున్న జాతీయ సగటు కంటే తక్కువ కాగా, తదనంతరం మూడేళ్లలో సాధించిన 9.5 % వృద్ధి జాతీయ సగటు వృద్ధి 7.4%. కంటే చాలా ఎక్కువ. 2014-17 మధ్యకాలంలో జీఎస్డీపీ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో రాంకుల పరంగా చూస్తే ఆరో స్థానంలో నిలిచింది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో, రెండంకెల 10.1 % జీఎస్డీపీ వృద్ధి సాధించడం రాష్ట్రానికే గర్వకారణం. సేవారంగంలో, ఉత్పాదక రంగంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించడమే తెలంగాణ అధిక ఆర్ధికాభివృద్ధికి ప్రధాన కారణం అని ఆర్థిక నిపుణులంటున్నారు.

          తలసరి ఆదాయపరంగా కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించింది తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం ఏర్పాటైన తరువాత మూడేళ్ల (2014-17) కాలంలో, జాతీయ వార్షిక సగటు 9.3 % తలసరి ఆదాయ రేటు కంటే ఎక్కువగా 11.5% తలసరి ఆదాయ రేటు సాధించింది తెలంగాణ రాష్ట్రం. 2013-14 నాటి రు. 1,12,162 తలసరి ఆదాయం కంటే అధికంగా, 2016-17 లో రు. 1,55,162 ల తలసరి ఆదాయానికి రాష్ట్రం చేరుకుంది. అఖిల భారత తలసరి ఆదాయం ఇదేకాలంలో రు. 1,03,219 మాత్రమే వుండడమంటే, దానితో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆడాయానికంటే రు. 52,393 ఎక్కువ. తలసరి ఆదాయ పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటి పదిరాష్ట్రాలలో ఒకటవుతుంది.

          దీనికి తోడుగా, స్వీయ పన్నుల రాబడిలో 2015-16 తో పోల్చి చూస్తే, 2016-17 లో 21.10% వృద్ధి సాధించి, మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుండి అగ్రభాగాన నిలిచింది. 2015-16 లో రాబడి రు. 39,975 కోట్లు కాగా, 2016-17 లో రు. 48,408 కోట్లకు చేరుకుంది. అదే విధంగా గత ఏడాది మొదటి ఏడు నెలలతో పోల్చి చూస్తే ఈ ఏడాది స్వీయ పన్నుల రాబడిలో (రు. 27,082 కోట్ల నుండి రు. 31,285 కోట్లకు) 17.5% వృద్ధి వుంది. అదే కాలంలో, మొత్తం రాష్ట్ర స్వీయ రెవెన్యూ వృద్ధి ఇప్పటికి (రు. 28,587 కోట్ల నుండి రు. 34,473 కోట్లకు) 20.58% నికి చేరుకుంది.

           గణనీయమైన ఈ ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణం, జూన్ 2, 2014 న రాష్ట్ర ఆవిర్భావం తరువాత, ప్రభుత్వం చేపట్టి అమలుపరుస్తున్న పలు అభివృద్ధి-సంక్షేమ-ప్రజోపకరమైన కార్యక్రమాలే. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే, రాష్ట్ర ప్రభుత్వం, దాని సారధి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అధిగమించిన ప్రధాన సమస్య, అప్పటిదాకా పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ తీవ్ర సంక్షోభానికి గురిచేస్తున్న, విద్యుత్ కొరత-విద్యుత్ కోతలు. ఈ దిశగా రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికున్న 6,574  మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి అదనంగా మొదటి రెండేళ్ల కాలంలోనే మరో 4,190 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. దరిమిలా ఆ సామర్థ్యం 14555 మెగావాట్లకు చేరుకుంది. అదనంగా మరో 13752 మెగావాట్ల ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. వీటన్నిటి కారణంగా పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వ్యవసాయ రంగానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయం-ప్రయోగాత్మక అమలు కూడా జరిగింది. దీనికొరకు రాష్ట్ర బడ్జెట్ లొ రు. 5384 కోట్లు కేటాయిస్తామని సీఎం శాసనసభలో చెప్పారు.


ఆర్థికాభివృద్ధికి మరో ప్రధాన కారణం “ఏక గవాక్ష టీఎస్ ఐపాస్” పరిశ్రమల అనుమతి చట్టం. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అవసరమైన పారిశ్రామిక అనుమతులను స్వీయ-సర్టిఫికేట్ ఆధారంగా మంజూరు చేయడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడ్తున్నది. నిరంతర విద్యుత్ సరఫరాకు తోడు “టీఎస్ ఐపాస్” విధానం త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతున్నది. ఫలితంగా సుమారు రు. 1,11,688 కోట్ల పెట్టుబడితో, దాదాపు 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందడానికి వీలుగా, 5,289 పరిశ్రమల స్థాపనకు అనుమతులివ్వడం జరిగింది. వీటిలో 3,477 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించి, పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ “టీఎస్ ఐపాస్” చట్టం మన్నలను పొందుతున్నది. దీంతో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం, మరింత ఆర్థికాభివృద్ధి జరిగే వీలు కలుగుతుంది. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” లోతెలంగాణకు దేశంలో ప్రధమ స్థానం వచ్చింది. దీనికి ముఖ్య కారణం, రాష్ట్రం అవలంభిస్తున్న పెట్టుబడి స్నేహపూర్వక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనా విధానాలు అనాలి.

ఆర్ధిక విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం పరిణితి కనబరచడం స్పష్ఠంగా కనిపిస్తున్నది. ఉత్పాదకరంగానికి ప్రాధాన్యం ఇస్తున్న విషయం విదితమే. అనుత్పాదక రంగమైన పేదప్రజల సంక్షేమం మీద కూడా గణనీయంగా వ్యయం చేస్తున్నది. బీద-సాద-దళిత-మైనారిటీ-గిరిజన ప్రజల సంక్షేమానికి కట్టుబడి వున్న ఈ ప్రభుత్వం ప్రతి పనీ కేవలం లాభాల ఆర్జన దృష్టితో చేయదు కదా! వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాలు కూడా దీర్ఘకాలిక భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని విశ్లేషిస్తే ఉత్పాదక సంబంధిత కార్యక్రమాలే అనాలి! అలాగే భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కూడా భవిష్యత్ లో ఆర్థికాభివృద్ధికి దోహదపడేవే. ఎక్కడైతే భూ సంబంధిత రికార్డులు వివాదరహితంగా-సమగ్రంగా వుంటాయో అక్కడ, 2% ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్ధికరంగ నిపుణులు, మేథావులు అభిప్రాయ పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర మెరుగైన ఆర్ధిక పరిపుష్టికి మూడు ప్రధాన అంశాలు పేర్కొనవచ్చు. ఒకటి, ఆర్ధిక వివేచన-జ్ఞానం; రెండు, విత్త విధానంలో ప్రాజ్ఞత; మూడు, రుణ సేకరణలో సడలింపు విధానం. విత్త విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానిదే నిర్ణయం...రాష్ట్రాలు ఆ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే తప్ప విరుద్ధంగా వుండే అవకాశం లేదు. కొన్ని విషయాల్లో పరస్పరం ఆధారపడాల్సి వుంటుంది. “ఎఫ్ఆర్బీఎం” ప్రవేశ పెట్టిన తరువాత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అదనంగా, 3% నుండి 3.5% శాతం “ఎఫ్ఆర్బీఎం”  పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మూడేళ్ల నిరంతర ఆర్థికాభివృద్ధి వల్ల ఇది సాధ్యపడింది. కేంద్ర నుండి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంటుంది. ఉదయ్ పథకంలో చేరి, డిస్కాంలను బలోపేతం చేసి, వాటి మీద వున్న ఆర్ధిక భారాన్ని తొలగించింది ప్రభుత్వం. అవి తీర్చాల్సిన రు. 8923 కోట్ల అప్పు తన మీద వేసుకుంది.

బాండ్లను తెలంగాణ రాష్ట్రం అమ్మకానికి పెట్టినప్పుడు, రాత్రికి-రాత్రే అవి అమ్ముడుపోయాయి. అది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి నిదర్శనం. ఎప్పుడైతే విద్యుత్ కోతలు తొలగించి, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడం చేసిందో, అప్పుడే పరిశ్రమలకు ప్రభుత్వం మీద గురి కుదిరింది. అలా అది ఆర్థికాభివృద్ధికి సహాయపడింది. మార్కెట్లో రూపాయి చలామణీ అవుతున్న పద్ధతిని పట్టి ఆర్థికాభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఉదాహరణకు బ్రహ్మాండమైన వర్షపాతం నమోదుకావడంతో తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. తెలంగాణ నుండి నాలుగు రాష్ట్రాలు ఆ ధాన్యాన్ని కొన్నాయి. చిన్న-చిన్న మిల్లర్లు కూడా లాభపడ్డారు. ఇది రూపాయీ చలామణీకి ఒక ఉదాహరణ.

45,000 చెరువుల పునరుద్ధరణ, రు. 25,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పలు భారీ-మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రణాళిక-అమలు, తద్వారా మత్య్స సంపద పెరగడానికి వీలు, మిషన్ భగీరథ లాంటి పథకాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డాయి. వ్యవసాయ రంగానికి అనుబంధంగా వున్న అనేక రంగాల అభివృద్ధికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గొర్రెల పెంపకం. నాలుగు లక్షల గొల్ల-కురుమ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను 75% సబ్సిడీపై పంచే కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది భవిష్యత్ లో. రు. 25,000 కోట్ల సంపదతో దేశంలోనే ధనవంతులుగా మారనున్నారు మన రాష్ట్ర గొల్ల-కురుమలు. ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేవే.

అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా, సంక్షేమం కూడా వుండాలి. అణగారిన వర్గాల అభివృద్ధితోనే అసలు-సిసలైన అభివృద్ధి సాధ్యమని సీఎం పదే-పదే అంటుంటారు. సంఘటిత అభివృద్ధితోనే బహుళార్థ ఫలితాలు సాధించడంతో పాటు, అణగారిన వర్గాల వారికి ఆర్థికంగా పలు అవకాశాలు దక్కడం, తద్వారా, వారికి సాధికారత లభించి అభివృద్ధిలో భాగాస్వాములవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుండి ఈ దిశగా ప్రభుత్వం చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిబద్ధతకు నిదర్సనం. అది రెండు పడక గదుల ఇల్లు విషయమే కావచ్చు, ఆసరా పించన్లే కావచ్చు, కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకమే కావచ్చు,  ఇంకేదైనా కావచ్చు...అన్నీ అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేసి, వారికి సాదికారతనిచ్చేవే.


రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొదటి ఏడాది పాలనంతా కష్టాలతో-ఇబ్బందులతో గడిచిందే. ఏం చెయ్యాలో- ఎలా ముందుకు పోవాలో అనే ఆలోచనతోనే గడిచింది. అయినా, అనేక అభివృద్ధి-సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ గతంలో ఎప్పుడూ రాష్ట్రంగా-ఈ విధంగా లేదు. మొదటి రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జూన్ 2, 2014 నా రాష్ట్రం ఏర్పాటయింది. ఒక్కొక్క అడుగేసుకుంటూ, ప్రారంభించిన ప్రస్తానం అనతికాలంలోనే పతాక స్థాయికి చేరుకొని ఆర్థికంగా పటిష్టమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. దేశంలో ఎక్కడా అమలుకాని అనేక కార్యక్రమాల రూపకల్పనకు-అమలుకు నాంది పలికింది. భవిష్యత్ లో మరింత ఆర్థికాభివృద్ధి సాధించడం తధ్యం.  

No comments:

Post a Comment