Sunday, November 26, 2017

రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అన్న వాల్మీకి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అన్న వాల్మీకి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-11-2017)
సీతాదేవి వృత్తాంతమంతా ఏకమై, అనన్యమై, భగవత్ ప్రాప్తి ఎప్పుడా-ఎప్పుడా అని ఎదురు చూస్తుండే పరమభక్తురాలి-ప్రపన్నురాలి చరిత్రే! అందుకే రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అంటాడు వాల్మీకి.

లంకలో స్త్రీలు నాలుగు రకాలు. ఈ లోకంలోనూ ఇలాంటి నాలుగు తెగల (రకాల) మనుష్యులే కనపడ్తారు. వారు:

పాపంలో పుట్టి, పాపంలో పెరిగి ఇంద్రియమే పరమార్ధమని నమ్మి పరలోక చింత లేనివారు.

ఉత్తమ వంశంలో పుట్టికూడా, స్వధర్మాన్ని వీడి, కామానికి దాసులై, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డవారు.

ఉత్తమ జన్మెత్తినప్పటికీ, సంసార సుఖంలో పడి, కామంలో ఇరుక్కుపోయి, దారీ-తెన్నూ లేక, సంసారం నుండి తప్పించుకొనే మార్గం కానరాక, రక్షించే నాధుడు లేక పరితపించే వారు.

ఏదో చిన్న పాపం చేసి, సంసారంలో పడ్డామనుకుంటూ, నిర్వేదంతో, దీన్నుండి తప్పించే వాడు భగవంతుడే తప్ప, వేరేవాడులేడని విశ్వసించి, తక్కిన ఉపాయాలన్నీ వదిలి, పరమ భక్తినీ-ప్రపత్తినీ ఆశ్రయించే వారు.

సీతాదేవి తాను చెరనుండి తప్పించుకోవటమే కాకుండా, తన లాగా   దుఃఖిస్తున్న దేవ, గంధర్వ, నాగ మొదలైన జాతుల స్త్రీలను కూడా విడిపించింది. నాలుగోరకంవారు (పైనచెప్పిన) తాము తరించి ఇతరులను తరింపచేస్తారు. సీతాచర్య నేర్పేదిదే! ఇతర ఉపాయాలను వెతక్కుండా, దేహాభిమానం, స్వాతంత్ర్యం వదిలి, స్వరక్షణాభారం భగవంతుడిమీద వేసి, "అనన్యార్హశేషత్వం, అనన్యశరణత్వం, అనన్యభోగత్వం" అనే అకారత్రయ సంపూర్తిని కలిగి, సంసారంలో వుండే తరించేటందుకు "ప్రపత్తితోనో, పరమభక్తితోనో" సాయుజ్యాన్ని పొందవచ్చని, సీతాదేవి చరిత్ర వలన తెలుసుకోవచ్చు. అంటే, భగవత్ప్రాప్తి కోరేవాడు, ఆయన అనుగ్రహం కొరకు సీతాదేవిలాగా, భగవన్నామాన్ని వుచ్చరిస్తూ, స్వధర్మాన్ని వదలకుండా వుండడం తప్ప వేరే మార్గం లేదు. సీతాదేవి ప్రతిదినమూ సంధ్యవారుస్తున్నదని చెప్పటమంటే, పరమభక్తుడైనా, ప్రపన్నుడైనా, జ్ఞాని అయినా, యావజ్జీవం నిత్యకర్మలు వదలరాదని అర్థంసీతాదేవి చర్య వలన మనం నేర్చుకున్న విషయాలను, ఆచరణలో పెట్టితే, జన్మాతరంలోనే ముక్తి లభిస్తుందనడంలో సందేహం లేదు.)


సుందరి సీతాదేవి, భువనైక సుందరుడైన శ్రీరాముని మాత్రమే చూడాలనుకుంటూ, ఎల్లవేళల మనస్సంతా ఆయన పైనేవుంచి, రాక్షస స్త్రీలను చూడనైనా చూడదు. ఫూలు, పళ్లు, మేడలు, మిద్దెలు, ఏవీ చూడదు. చూడదంటే కళ్లుమూసుకుని వుందని అర్థంకాదు. వాటివిషయమేదీ మనస్సులోకిరానీయదు. రాక్షసులు పెట్టే బాధలను లక్ష్యపెట్టేదికాదు. ప్రియమైన వాటిమీద మనస్సు పోనీయదు. ప్రియాలు, అప్రియాలు, రెండూ వదిలింది

(సీతాదేవి శ్రీరాముడినొక్కడినే చూడాలనుకుంటుంది. అంటే, ఇది, "ఏకాగ్రభక్తి, ఏకభక్తి, అనన్యత్వాన్ని" గురించి చెప్పటమే. అలానే, భక్తుడు దేవతలెందరున్నా, తన ఇష్ట దైవాన్నే నమ్మి, "ఏకభక్తి, ఏకాగ్రభక్తి" కలవాడై వుంటాడు. అలానే భక్తులు, ప్రపన్నులు, తమ కెన్ని కష్టాలొచ్చినా, విశ్వాసం వదలకుండా, భగవంతుడు రక్షించేదాకా, తమ "భక్తి-ప్రపత్తులే" తమకు రక్ష అని భావిస్తారు. పతివ్రతలు తన భర్తకంటే ధనవంతులు, విద్యావంతులు, రూపవంతులు, బలవంతులు, లోకంలో ఎందరున్నా, భర్తకంటే అధముల్లాగానే ఎంచుతుందికాని, వారిని ప్రేమించదు)

శ్రేష్టమైన ఆభరణాలెన్ని వున్నా, పతివ్రతకు మిక్కిలి శ్రేష్టమైన భూషణం, భర్తతో వుండడమే. భర్త అనే ఆ "భూషణం" దగ్గర లేకపోతే, ఆమె ఎంత గొప్పదైనా ప్రకాశించదు. వరభూశణాల కంటే  పరమ భూషణం భర్తేనట! మానవులకు భూషణాలు “భూరిమయాంగద తారహారాలు కావు. వాగ్బూషణమే సుభూషణం. భూషణాలు నశించేవే! అలాగే ఎన్ని విద్యలు నేర్చినా భగవద్భక్తి లేకపోతే అన్నీ వ్యర్ధాలే! భగవద్భక్తి  లేని పండితుడు చాకలి మూట మోసే గాడిద వంటివాడే! మర్యాదగా, జ్ఞాన భారాన్ని మోస్తున్న గార్దభం అని ఈసడించబడతారు. తుమ్మెదలలా నల్లని వెంట్రుకకొనలున్నది, తామరరేకుల్లాంటి కనులున్నది, సాముద్రిక లక్షణాలనుబట్టి ఎంతోసుఖపడాల్సింది, మధుర కంఠస్వరం కలదైన సీత కూడా దిగులు పాలైతే, జితేంద్రియుడననీ, ద్వంద్వాతీతుడననీ, గర్వమున్న తనకుకూడా, తన ఇష్టంలేకుండా దుఃఖం కలుగుతున్నదేంటా? అనుకుంటాడు హనుమంతుడు. (రామాంజనేయులిద్దరూ విజితేంద్రియులే, నిర్ద్వందులే. ఇరువురూ సీతాదేవికై దుఃఖిస్తున్నవారే. పామరత్వం కాదు కారణం. ఇతరుల దుఃఖం తన దుఃఖమనుకునే "దయ" దీనికి కారణం. బ్రహ్మచారీ, జ్ఞానీ, యోగీ, విరాగీ, కోతీ, అయిన హనుమంతుడికే, సీతాదేవితో ఇంతకు ముందెట్టి సంబంధం లేకపోయినా, దుఃఖమేస్తున్నదంటే, తనలో సగభాగమైన సీతకొరకు, శ్రీరాముడెందుకు దిగులుపడడు?)

భూదేవిలాంటి ఓర్పు, కమలాల లాంటి కళ్లు కలిగి, రామలక్ష్మణుల రక్షణలో సుఖపడాల్సిన సీత, భయంకర రాక్షస స్త్రీల బెదిరింపుల మధ్య, ఒకచెట్టు మొదట్లో ఈవిధంగా వుండడమేంటనుకుంటాడు హనుమంతుడు. భగవంతుడు దయతప్పి ప్రతికూలిస్తే ఆయనకేదసాధ్యం అని తలుస్తాడు. (రాముడు, లక్ష్మణుడు, భగవంతుడు: ఇది అనంత, గరుడ, విశ్వక్సేనాది నిత్య భాగవతులకు (నిత్యసూరిగణం) ఉపలక్షణం. చెట్టుమొదట్లో దుఃఖించడమంటే చెట్టు దేహమనీ, మొదలు హృదయమనీ, దేహానికి మూల స్థానమైన హృదయంలో ఈవిధంగా దుఃఖిస్తున్నదనీ అర్థం. ఇది భగవత్సంకల్పం)

మంచుసోకి, కాంతిహీనమైన తామరపూలలాగా దుఃఖం మీద, దుఃఖం వస్తుంటే, పరితపిస్తున్న సీత, చక్రవాకాన్ని వదిలిన చక్రవాకిలా కనిపించింది హనుమంతుడికి. (శరదృతువులో కళ-కళలాడే తామరపువ్వు కాంతి మంచుపడగానే క్షీణిస్తుంది. అలానే పన్నెండేళ్లు అయోధ్యలో సమస్త సౌఖ్యాలనుభవించిన సీత ఇప్పుడు కష్టాలు పడ్తున్నది. వసంతం రాగానే తామరపువ్వు యదావిధిగా కాంతివంతమయినట్లే, సీతకుకూడా త్వరలోనే దుఃఖం పోతుందని అర్థం. చక్రవాకానికి రాత్రివేళ భర్త వియోగం కలిగినా, ఉదయం కాగానే కలుసుకుంటానన్న ఆశవుంటుంది. అంతే ఈమె కూడా. ఆపదలు ఎప్పుడూ వుండవు. మంచికాలం వస్తుంది....భర్త తనను కలుసుకుంటాడన్న ఆశతో జీవిస్తూ, ప్రస్తుతం దుఃఖ పడుతోంది సీత.)

పూలబరువుతో అశోకవృక్షాల కొమ్మలు సువాసనలు వెదజల్లగా, వసంతకాలపు చంద్రుడి మనోహర కాంతులు విజృంభించగా, ఈమె విరహాగ్నిని మరింత ప్రజ్వరిల్ల చేసి బాధపెడ్తున్నాయని తనలో అనుకుంటూ, రాక్షసులింకా మేలుకునే వున్నారు కాబట్టి, చెట్టు మీదనే వుండిపోయాడు హనుమంతుడు. (సీతాదేవిని అశోకవృక్షం కింద వుంచడానికి ప్రత్యేక కారణం ఏదైనా వుందా? దీన్నే "సీతాశోకవృక్షన్యాయం" అని అంటారు. ఏ చెట్టుకింద వుంచినా, అక్కడెందుకున్చారన్న ప్రశ్న కలుగుతుంది. ఈమె వున్నచెట్టు సమీపంలోనే రావణుడి మేడ వుంది కాబట్టి, రావణుడు దాంట్లోనే వుంచాలనుకున్నా, సీత నిరాకరించి, సమీపంలో వున్న అశోకచెట్టు కిందకు చేరింది. చేరి అక్కడే కూర్చుంది. అదేకారణం).

No comments:

Post a Comment