Monday, May 7, 2018

వాల్మీకి రామాయణమనేది ఒక "కలశార్ణవం" ...... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-7: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-7
వాల్మీకి రామాయణమనేది ఒక "కలశార్ణవం"
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (06-05-2018)
పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. అలాంటప్పుడు, ఆయన భగవంతుడే అయితే, తనకు జరగాల్సిన పట్టాభిషేకం ఆఖరు క్షణంలో విఘ్నమైనప్పుడు సీతతో "... చెలియ యువరాజు నన్నిప్డ చేయురేడు" (... "ధ్రువ మద్యైవ మాం రాజా, యౌవరాజ్యే భీషేక్ష్యతి") అని ఎందుకు చెప్పాడన్న సందేహం కలగొచ్చు. వాల్మీకి ఆ సందర్భంలో రాసిన శ్లోకార్థాన్ని పరిశీలించడానికి ముందు, అదే విషయం ప్రస్తావిస్తూ, అంతకు పూర్వం జాగ్రత్తగా చెప్పిన రామ వాక్యాలను అర్థం చేసుకోవాలి. శ్లోకంలో బాహ్యార్థం స్పష్టంగా తెలుస్తూనే వుంది. అంతరార్థంలో రాముడు చెప్పిందేంటి? తన పట్టాభిషేకం గురించి తల్లి-తండ్రి ఆలోచిస్తున్నారని అంటాడు. ఇది వాస్తవం. ఏమని ఆలోచిస్తున్నది-పట్టాభిషేకం చేయాలనా? వద్దనా?- అనేది విశదపర్చచలేదు. అలానే మిగతా సందర్భాలలో చెప్పిన రామ వాక్యాలన్నీ పరిశీలించుకుంటూ పోతే-అర్థం చేసుకుంటూ పోతే ఆయన అవతార ప్రయోజనం గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు సీతతో అన్న " .. నా యర్థవృద్ధికై తొందరపెట్టు బతిని.." అన్న రామ వాక్యాలనే తీసుకోవచ్చు. అర్థ వృద్ధి అంటే లోకాభిప్రాయం ప్రకారం "పట్టాభిషేకం-ధన వృద్ధి". అయితే రాముడి అభిప్రాయం వేరు. "నా ప్రయోజనం గురించి" అంటే, తాను రావణవధాది కార్యాలు చేసే ప్రయోజనం గురించి అని అర్థం. ఇదే అర్థాన్ని వచ్చేటట్లు శ్రీరాముడు మునులతో కూడా అంటాడు తన మనస్సులో మాటగా.

రాముడి మనస్సులో వున్న అర్థం రావణవధాదికమే. సర్వసముడగు భగవంతుడని పేరుపొందిన రాముడు, తల్లిదండ్రులమీద ద్వేష బుద్ధిగలవాడు ఎలా అవుతాడు? కాడు. కాబట్టి వారిపై నున్న సదభిప్రాయంతోనే ఒకచోట "సభ యెట్టిదో దూత యట్టివాడ" ని చెప్ప బడింది ఆయన మాటలుగా సీతకు. ఆయన అవతార ప్రయోజనం నెరవేరాలంటే, పట్టాభిషేకం చేసుకుని రాజుగా అయోధ్యలో వుండకూడదు. అరణ్యాలకు పోవాలి. ఆ పని జరగాలంటే పట్టాభిషేకం విఘ్న కారి. కాబట్టి జరగబోయేదేంటటే, "... చెలియ యువరాజు నన్నిప్డ చేయురేడు" (... "ధ్రువ మద్యైవ మాం రాజా, యౌవరాజ్యే భీషేక్ష్యతి"). దానర్థం "రాజు ఇప్పుడు నన్ను యువరాజు చేయడు" అని.

వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి. 


సుందర కాండలో సీతాదేవి హనుమంతుడిని ప్రశ్నించిన వాక్యాలు ఇంకో ఉదాహరణ. "కౌసల్యయు సుమిత్ర కపివరా! భరతుండు, కుశలులే? .. భరతుండు.. యక్షౌహిణీసేన నంపునయ్య?" అని అడుగుతుంది సీత హనుమంతుడిని. ఎక్కడి పంప? ఎక్కడి పంచవటి? ఎక్కడి అయోధ్య? ఎక్కడి క్షేమ సమాచారం? ఎక్కడి సేన రావడం? ఈ సందేహాలన్నీ పాఠకులకు కలగొచ్చు. అయితే ఉత్తర కాండ చదివినవారికి, భాతృవత్సలుడైన భరతుడు, దూతలద్వారా శ్రీరామాదుల సమాచారాన్నంతా, వారు పంచవటి విడిచి పోయిందనక తెలుసుకుంటుండేవాడని స్పష్టంగా తెలుస్తుంది.


వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. ఉదాహరణకు, సుందర కాండలోని "తతో రావణ నీతాయాః సీతాయా..." (తరువాత రావణాసుర, వరనీత ధరాత్మజాత...") అన్న శ్లోకానికి ఆచార్య పరమైన అర్థం ధ్వని. అలానే మరో శ్లోకంలో గురువు ఎలాంటివాడై వుండాలో ఆ లక్షణాలను వివరించబడింది. ఇలాంటి అర్థ బాహుళ్యం గల శ్లోకాలు వందల కొద్దీ వున్నాయి.

శ్రీ రామాయణ అంతరార్థాన్ని పెద్దలు ఇలా చెప్పుకుంటారు: భగవంతుడు ఒక్కడే పురుషుడు. తక్కిన దంతా స్త్రీ మయం అన్న నియమం ప్రకారం, సీతే జీవుడు. ఆ జీవుడు భగవంతుడిని ఆశ్రయించి వున్నంతవరకు ఎలాంటి ఆపదా కలగదు. కర్మవశాన దుర్భుద్ధితో, మాయా మయమైన ప్రకృతి పదార్థాల (మాయ జింక) మీద ఆసక్తి కలిగితే, మోక్ష సాధనానికి విరుద్ధమైన అలాంటి బుద్ధి మళ్లీ పుట్టకుండా చేయడానికి భగవద్వియోగం కలుగుతుంది. వెంటనే దేహ ప్రాప్తి (లంక) కలుగుతుంది. అందులోని రావణ-కుంభకర్ణులు అహంకార-మమకారాలు. ఏకాక్షి ప్రభృతులు ఇంద్రియాలు. అనుభవంతో బుద్ధిమంతులు కావల్సినవారు, వాటికి చిక్కి అవస్థ పడుతున్నప్పుడు, జీవుడికి వివేకం కలిగి-పరితపించడం ప్రారంభించి, తన మీద భగవంతుడికి దయ కలుగుతోందా-తన దగ్గరకు చేర్చుకుంటాడా, అని విలపిస్తారు (సీతా విలాపం). తనను ఆశ్రయించిన జీవుడు ఇలా అజ్ఞానం వల్ల కష్ట దశలో పడిపోయెగదా అని అత్యంత దయాళుడైన భగవంతుడు బిడ్డకొరకు తండ్రి దుఃఖించినట్లు, జీవుడికంటే ఎక్కువగా పరితపిస్తాడు (రామ విలాపం). జీవుడికి ధైర్యం కలగడానికి, భగవంతుడికి తనపై అనురాగం వుందని చెప్పి భయపడ వద్దని తెలియచేయడానికి ఆచార్యుడిని (హనుమంతుడు) పంపుతాడు. ఆచార్యుడు అక్కడకు (లంకకు) పోయి అతడి చేష్టలన్నీ తెలుసుకొని, ధైర్యం చెప్పి, మరల భగవంతుడితో జీవుడు అనన్య భక్తుడనీ-ఆయనే దిక్కని నమ్మినాడనీ (నియత-యక్షత), కాబట్టి భగవంతుడే కాపాడాలనీ వేడుకుంటాడు. భగవంతుడు ప్రతిబంధకాలను అణచివేసి, చిత్తశుద్ధి పరీక్షించి (సీత అగ్ని ప్రవేశం) మరల తన దగ్గర చేర్చుకుంటాడు. దానర్థం: అనన్యాసక్తుడై, దృఢ నిశ్చయంతో, జీవుడు భగవంతుడిని సేవిస్తుంటే, అతడికి కావల్సిందంతా భగవంతుడే నెరవేరుస్తాడు. సుందర కాండ చదివేటప్పుడు పాఠకులు తమను సీత గాను, శ్రీరాముడిని భగవంతుడి గాను భావిస్తే ఈ అర్థం స్పష్టంగా తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment