Sunday, May 13, 2018

సీతాదేవికి శ్రీరామ ముద్రికనిచ్చిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవికి శ్రీరామ ముద్రికనిచ్చిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (14-05-2018)
జనకరాజు కూతురుసీతాదేవికి, తన మాటలమీద, ఇంకా సందేహం ఏమాత్రమైనా వుంటే, దాన్నీ పోగొట్టదల్చిన హనుమంతుడు, శ్రీరాముడి పేరు చెక్కిన ఉంగరాన్ని చూపిస్తాడు. దానిని దూతైన తనకు ఇచ్చిన రామచంద్రుడు, సీతకు ఇమ్మని చెప్పాడనీ, అది చూసిన ఆమెకు తనమీద నమ్మకం కుదురుతుందన్నాడనీ, అంటాడు హనుమంతుడు. ఆ ఉంగరాన్ని చూసిన సీతకు మనోవ్యాకులత కూడా తీరుతుందని రాముడు చెప్పినట్లు తెలియచేస్తాడు. హనుమంతుడిచ్చిన ఉంగరాన్ని సంతోషంగా తీసుకుంటుంది సీత. ఇదొక అద్భుతమైన ఉంగరం. ఇందులో మూడు మణులుంటాయి. అందులో ఒక మణిలో రాజైనవానికి పితృ-పితామహంగా వచ్చే సూర్యవంశపు శక్తిని ఆవహింప చేస్తారట. ఇది శ్రీరాముడి రాజ్యాధికార ముద్ర. దానిపై శ్రీరాముడి పేరు కూడా చెక్కబడి ఉందని పెద్దలంటారు. అలాంటి రాజ ముద్రను ఇవ్వడమంటే రాజ్యాన్నే ఇచ్చి వేయడమని అర్థంకద! సీతమ్మ కంటే రాజ్యం గొప్పది కాబోదు అని రాముడి భావన అనేది స్పష్టమవుతున్నది.

(సీతాదేవి సందేహం తీరిందనీ, శ్రధ్ధ కలిగిందనీ, నమ్మకం కల్గిన తర్వాతనే ఉంగరం ఇచ్చాడు హనుమంతుడు. దీన్ని బట్టి సంశయంతో వున్నవారికి, శ్రధ్ధలేని వారికి, "రామమంత్రం" ఉపదేశించ కూడదని అర్థం చేసుకోవాలి. అదే విధంగా శిష్యుడు ఇది చెప్పమని అడగకూడదు. గురువనుగ్రహించిందే స్వీకరించాలి. ఈ విధంగా "సీత-ఆంజనేయుల"  చర్య వలన "శిష్య లక్షణం, గురులక్షణం, ముముక్షుహిత చర్య, భగవత్ మంత్రప్రాప్తం" చెప్పడం జరిగింది).

తనభర్త శ్రీహస్తాన్ని అలరించే ఆ ఉంగరాన్ని చూసిన సీతకు తన మగడే ఎదురుగా వచ్చినంత సంతోషం కలిగింది. ఎర్రటి, తెల్లటి కళ్లున్న ఆమె ముఖం, రాహువు విడిచిన చంద్ర బింబంలా ప్రకాశిస్తూ కనిపించింది. (భర్త ఎడబాటు వల్ల కలిగిన దుఃఖమే రాహువు) ఆ ఉంగరాన్ని తాకుతూ అనుకుంటుంది సీత: "పాణిగ్రహ సమయంలో మొదటిసారి తన చేతిని రామచంద్రమూర్తి పట్టుకున్నప్పుడు, తనను తగిలిన ప్రధమాభరణం ఇదేకదా! తనకు ప్రణయకోపం వస్తే, శాంతింప చేయటానికి, భర్త తన గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంటే, తాకేదీ ఉంగరమేకదా! తనను కౌగలించుకున్నప్పుడు, వంటిమీదున్న ఆభరణాలన్నీ తీసేసినా, తీయందీ ఉంగరం కదా! ప్రణయకోపంలో ఇరువురికీ మాటలు లేనప్పుడు, మాట్లాడే నెపంతో, నేలమీద ఉంగరం పడేస్తే, తీసుకొమ్మని మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ ఉంగరమేకదా! అరణ్యాలకు పోతున్నప్పుడు, సర్వాభరణాలూ తీసేసినా, తనతో పాటు వెంట తెచ్చుకున్నదీ ఈ ఉంగరమేకదా!" ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తున్న సీతకు, సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు, భావనాతిశయ బలం వల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపించిందామెకు.

(భగవన్మూర్తి ధ్యాన-సోపాన మార్గాన్ని తెలుపుతున్న దీచర్య. ఇది శిష్యుడి ఉత్తర కార్యం. భగవన్మూర్తి ఇలా ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు అనిపించిందాకా భగవంతుడిని ఉపాసించాల్సిందే!)

లజ్జవతైన సీత, తన పతి క్షేమం, పతివార్త తెలిపిన ఆంజనేయుడిని, అభినందన పురస్సరంగా స్తోత్రం చేసింది. హనుమంతుదిని ప్రశంసించి శ్రీరామాదుల కుశలం అడిగిందిలా.

"నూరామడలున్న సముద్రాన్ని, ఆవుపాదమున్నంత గుంటను దాటినట్లు దాటి, ఒక్కడివే లంకలో ప్రవేశించిన వానరేశ్వరా! నీవే శూరుడవు, నీవే కార్యసాధకుడవు, నీవు మహా బుధ్ధిమంతుడవు. రావణుడంటే అందరికీ తొట్రుపాటే! కాని, నీవతనికి ఏమాత్రం భయపడవు. కాబట్టి నిన్ను అందరి కోతుల్లాంటి కోతివని నమ్మను. నా ప్రాణనాధుడైన, శ్రీరామచంద్రమూర్తికి పావనివి (ఆంజనేయుడు అనీ, పవిత్రుడు అనీ అర్ధాలు). నీవు దూతవు కాబట్టి, నీతోటి రహస్యాలు కూడ చెప్పొచ్చు. శ్రీరాముడు మామూలు పనులకే దూతను పరీక్ష చేసి పంపుతాడు. అలాంటప్పుడు నాదగ్గరకు పంపేటప్పుడు, విశేష పరాక్రమం కలవాడినే పంపుతాడు. దుర్బలుడిని పంపడు. నామగడికి నచ్చిన బంటువుకనుక నీకు రహస్య విషయాలు కూడా చెప్ప తగినవాడివి. (శూరుడు, కార్యసాధకుడు, మహాబుధ్ధిమంతుడు, అనేపదాలు, హనుమంతుడి జ్ఞాన-శక్తి-బలాలు తెలుపుతున్నాయి. ఇదే విషయం చెప్తూ, జాంబవంతుడు, హనుమంతుడిని రాముడంతటి వాడవని అంటాడు). ఇలా పొగడి శ్రీరామాదుల కుశలం అడుగుతుంది సీతాదేవి.

" తండ్రీ! సత్య ప్రతిజ్ఞ కల కౌసల్యా కుమారుడు, నా అదృష్టం కొద్దీ బాగున్నాడు కదా? అసమాన గుణవంతుడైన సుమిత్రా నందనుడు సుఖమా హితేంద్రా? కుశలంతో వున్న రాముడు, నాకొరకై ప్రళయకాలాగ్నిలా కోపించి, భూమినీ, సముద్రాన్నీ కాల్చలేదుకదా! వారు శూరులుకారా అంటే శూరులే! దేవతలనైనా యుద్ధంలో గెల్చే శక్తిగలవారే! నాపాప ఫలం వల్ల వాళ్లా ప్రయత్నం చేయలేదేమో! అన్నా ఆంజనేయా! నన్ను ఎడబాసానన్న తాపంతో రామచంద్రమూర్తి సంతాప పడడం లేదుకదా? నాకొరకై ఆయన దుఃఖపడడం లేదుకదా? నా విషయం అలా వుంచి, తనగురించీ, మున్ముందు అయోధ్యలో చేయాల్సిన పనుల గురించీ, మళ్లీ పెళ్లి చేసుకునే వ్యవహారం గురించి అయినా ఆలోచిస్తున్నాడా? లేక నన్ను గురించే, నాప్రియురాలికింత కష్టం కలిగిందే, ఎలా తప్పించాలీ కష్టం నుండి, అని చేయాల్సిన పని గురించి ఎన్నడైనా ఆలోచిస్తున్నాడా?" అని అడుగుతుంది.

(ఆంజనేయుడిని, "తండ్రీ, హితేంద్రా, అన్నా" అని సంబోధిస్తుంది. మగడు వదిలిన ఆడబిడ్డలు తమ దుఃఖాన్ని తండ్రితో చెప్పుకుంటారు. తనమేలుకోరేవారిలో శ్రేష్టుడని "హితేంద్రా" అని సంభోదిస్తుంది. రాముడిని “కౌసల్యా కుమారుడు " అని అనడంలో కూడా అర్థముంది. ఇది "నర్మోక్తి". దశరధ తనూజుడనదు. ఆయన బల-పరాక్రమ-శౌర్య సంపద లేదనీ, ఆడదానిలో వుండే గుణాలే వున్నాయని ఒక అర్థం. కౌసల్య కడుపున పుట్టి ఆమెను ఏం సంతోష పెట్టాడనీ, తన్నూ ఏం పెట్తాడనీ మరో అర్ధం. సుమిత్రా నందనుడని లక్ష్మణుడిని అంటుంది. దీనర్థం: రాముడు అడవికి వచ్చి తల్లిని దుఃఖ పెట్టాడనీ, లక్ష్మణుడు అడవికి అన్న వెంట వెళ్లి తల్లిని సంతోష పెట్టాడని భావన. "ప్రళయకాలాగ్నిలాగా", భూమినీ, సముద్రాన్నీ కాల్చడం అనే మాటలో కూడా నర్మోక్తి వుంది. అంతటి పనిచేయలేదనీ, అంతటి పనిచేసే శక్తిలేదనీ, వారిశక్తి ఆడదాన్ని చంపడానికీ, ముక్కు, చెవులు కోయటానికేననీ వ్యంగంగా అంటుంది).

"నన్నెడబాసిన కారణం వల్ల, శోకంలో మునిగిపోయి, తొట్రుపడి, చేయాల్సిన పనులన్నీ మరచిపోకుండా చేస్తున్నాడుకదా! నామీద ప్రేమ మునుపటిలాగానే వుందా? ఈ రాజకుమారుడు రాజధర్మాన్ననుసరించి, చేయాల్సిన మానవ ప్రయత్నాలన్నీ లోపం లేకుండా చేస్తున్నాడుకదా? స్నేహితులందు సామదానాలు, శత్రువులందు దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నాడు కదా? మిత్రులను సంపాదించుకుంటున్నాడు కదా? స్నేహితులతన్ని గౌరవిస్తున్నారా? దైవసహాయం కలిగే ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు కదా? పౌరుషాన్ని, దైవాన్ని నమ్ముకుని, మానవ ప్రయత్నం మానకుండా, రెండింటినీ ఆశ్రయించి వున్నాడుకదా? ఇన్ని పనులమధ్య ఎంతోదూరంలో వున్న నాగురించి ఎప్పుడైనా ఆలోచించే దయ వుందా? నన్నీ బాధనుండి తొలగించి రక్షిస్తాడన్న ఆశ వుందా?"

"ఆగర్భ శ్రీమంతుడు, పుట్టినప్పటినుండీ భోగ, భాగ్యాలు ప్రతిరోజూ అనుభవించినవాడు, దుఃఖం అంటే ఏంటో తెలుసుకునేందుకు కూడా అర్హతలేని వాడు, శ్రీరాముడు, అడవుల్లో తిరగడం వల్ల ఎంత మోతాదులో చిక్కిపోవాల్నో అంతే అయ్యాడా? లేక, నామీద మమతతో దుఃఖమెక్కువై బాగా చిక్కిపోయాడా? (ఈ విధంగా అడగడంలోనూ, నర్మగర్భం, వ్యతిరేక లక్షణం కనిపిస్తుంది. "శ్రీ" అంటే, విషమని కూడా అర్థముంది. అలానే "భోగి" అంటే పాము అని అర్ధం కూడా వుంది. అంటే, తల్లిగర్భంలో పడింది మొదలు విషం గల పాము తనకాటువలన ఇతరుల బాధ ఎట్లా తెలుసుకోలేదో, అట్లానే, తన ఉపేక్షవల్ల బాధపడ్తున్న సీతకై రాముడు దుఃఖ పడుతూ, చిక్కిపోయాడా? లేడా? అన్న అర్థం ఆమె అడగటమ్లో ధ్వనిస్తుంది).

1 comment: