Saturday, June 30, 2018

ఆత్మీయతకు మారు పేరు “ఆదిరాజు” : వనం జ్వాలా నరసింహారావు


ఆత్మీయతకు మారు పేరు “ఆదిరాజు”
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-06-2018)
“నాన్న గారు నిన్నరాత్రి 11.30 కు తుదిశ్వాస విడిచారు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు” అని ఆదిరాజు సత్యనారాయణరావు తన తండ్రి ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణవార్తను మెసేజ్ ద్వారా జూన్ నెల 15 ఉదయం నాకు తెలియచేసినప్పుడు, క్షణకాలం నిర్ఘాంతపోయాను. “జాతస్య మరణం ధృవం” ... "పుట్టిన ప్రతి జీవి చావక మానదు" అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా, ఆదిరాజు మరణ వార్తను జీర్ణించుకోవడం కష్టమైంది. సరే... ఆ తరువాత మామూలే. మా శ్రీమతితో కలిసి వాళ్ళింటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు గడిపి, ఆదిరాజు భౌతిక కాయానికి అంతిమ నివాళి సమర్పించి వచ్చాను. నేనక్కడ వున్నప్పుడే, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీనియర్ పాత్రికేయుడు అమర్, వేణుగోపాల్, పౌరహక్కుల నాయకుదు వరవర రావు, అమర్ తమ్ముడు అజయ్, స్నేహితుడు భండారు శ్రీనివాస రావు తదితరులున్నారు.

         ఆదిరాజు ఇంట్లో కూచున్నప్పుడు, ఆ తరువాతా ఆయన స్మృతులే పదే-పదే గుర్తుకు వచ్చాయి. వయసులో నాకంటే పదేళ్లు పెద్దైన ఆదిరాజు వెంకటేశ్వర రావుతో నాకు సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సన్నిహితమైన పరిచయం వుంది. మా ఇద్దరిదీ ఒక్కటే (ఖమ్మం) జిల్లా. దూరపు బంధుత్వం కూడా వుంది. పలువురు ఉమ్మడి స్నేహితులున్నారు. వాళ్లలో ఒకరైన డాక్టర్ అయితరాజు పాండు రంగారావు సరిగ్గా ఆదిరాజు మరణించడానికి రెండు నెలల క్రితం మరణించారు. నేను 1971 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, ఆదిరాజు స్వగ్రామం పండితాపురంకు సమీపంలో వున్న ఎల్లెందు జూనియర్ కళాశాలలో గ్రాడ్యుఏట్ లైబ్రేరియన్ గా నా మొట్టమొదటి ఉద్యోగంలో చేరిన కొత్తలో, శాశ్వత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు స్వర్గీయ భండారు పర్వతాలరావు ఒకానొక సందర్భంలో ఆదిరాజును మొదటిసారిగా పరిచయం చేశారు.

వాళ్లిద్దరూ కలిసి నన్ను అప్పటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు దగ్గరకు తీసుకుపోయి విషయం చెప్పగానే, నా అప్లికేషన్ మీద “తక్షణమే జూనియర్ లెక్చరర్ గా నియామకం చెయ్యాలి” అని విద్యాశాఖ డైరెక్టర్ (సుబ్బరాజు) ను ఆదేశిస్తూ సంతకం చేశారు. కాళ్ళకు చెప్పులు అరిగేట్లు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం చుట్టు తిరిగాను కాని ఆ ఉద్యోగం మాత్రం రాలేదు. సుబ్బరాజు ఎవరి మాట లెక్కచేసేవాడు కాదు. ఈ విషయాన్ని నేను, ఆదిరాజు చాలా సార్లు సరదాగా ముచ్చటించుకొనే వాళ్ళం. ఆ సందర్భంలోనే ఒక సారి ఆదిరాజు అప్పట్లో పనిచేస్తుండే ఆంధ్రజ్యోతి కార్యాలయం (సెక్రెటేరియట్ ఎదురుగా మొదటి అంతస్తులో) లొ కలిశాను. అప్పుడు కూడా నా ఉద్యోగ విషయంలోనే. నా ఎదురుగానే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుకు ఫోన్ చేసి నా సంగతి చెప్పారు. సహాయం చేయడానికి ఆదిరాజును మించిన వారెవరూ లేరనడానికి, ఆయన ఆత్మీయతకు ఇచి మచ్చు తునకలు మాత్రమే. 

         ఆ తరువాత మూడేళ్ళకు ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరుకున్న నాకు ఆదిరాజుతో సాన్నిహిత్యం పెరుక్కుంటూ పోయింది. అదే రోజుల్లో స్నేహితుడు-బంధువు భండారు శ్రీనివాస రావు ఆకాశవాణి విలేఖరిగా హైదరాబాద్ రావడం, మేం ముగ్గురం తరచూ కలవడం జరుగుతుండేది. ఎప్పుడూ సూటు-బూటు-టై, చేతి వేళ్ళ మధ్య సిగరెట్  విలాసంగా తిప్పుకుంటూ వుండే ఆదిరాజుతో ఒకసారి సచివాలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాం మేం ఇద్దరం. గేటువాడు క్షణకాలం ఆపాడు. అప్పటికింకా భండారుకు సచివాలయం పాస్ రాలేదనుకుంటా. నాకెలాగూ లేదు. ఆగ్రహోదగ్రుడైన ఆదిరాజును కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని గేటువాడు సలాం కొట్టి మరీ మా ముగ్గురిని లోపలి పంపాడు. ఇక సచివాలయంలోని ప్రెస్ రూమ్ (ఇప్పుడు ఎపీకి కేటాయించిన భవన సముదాయంలోని హెరిటేజ్ బిల్డింగ్) లోకి ఆదిరాజు ప్రవేశించగానే అదోరకమైన భూకంపం వచ్చినట్లుందేది అక్కడ. గల-గలా మాట్లాడుకుంటూ, సిగరెట్ ను అలవోకగా ఆస్వాదిస్తూ, అందరినీ పలకరిస్తూ, ఎవరూ చెప్పలేని వార్తలను పదిమందితో పంచుకుంటూ, ఆయనున్నంత సేపు అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేది. ఎప్పుడూ పదిమందిని కలుపుకు పోయే మనస్తత్వం ఆదిరాజుది.

         రాజ్ భవన్లో కుముద్ బెన్ జోషి గవర్నర్ గా, చంద్రమౌళి గవర్నర్ కార్యదర్శిగా వున్నప్పుడు, నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో (1986-90 మధ్య కాలంలో) రాజీవ్ గాంధీ మీద (గాంధీ టు గాంధీ) ఆదిరాజు పుస్తకం రాస్తుండేవాడు. అప్పుడు పుస్తకాంశానికి సంబంధించిన పలు విషయాలను మాతో చర్చించే వాడు. ఎలెక్ట్రానిక్ టైప్ రైటర్లు అందుబాటులోకి అప్పుడేవచ్చాయి. రాజ్ భవన్లో కూడా ఒకటి వుండేది. గవర్నర్ పీఏ గా పనిచేస్తుండే శేషాచార్యులు, కార్యదర్శి పీఎ అప్పారావు, ఆ టైప్ రైటర్ మీద గాంధీ టు గాంధీ పుస్తకానికి సంబంధించిన కొన్ని పేజీలు  టైప్ చేసేవారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీకి,  కార్యదర్శి చంద్రమౌళికి ఆదిరాజు అంటే  వాత్సల్యం. పుస్తకం పూర్తైన తరువాత, దానికి ఇండెక్స్ తయారుచేయడానికి గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న స్వర్గీయ సంజీవ్ కుమారుడు చక్రవర్తి సహాయ పడ్డాడు. గాంధీ టు గాంధీ పుస్తకం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి జైలు సింగ్ ఆవిష్కరించినప్పుడు, ఆ కార్యక్రమానికి ఆదిరాజు నన్ను, భండారు శ్రీనివాస రావును ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ నుండి ఢిల్లీ విమానంలో తీసుకెళ్ళాడు. పుస్తకావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అప్పట్లో అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి టీ అంజయ్య  కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ తరువాత ఆదిరాజు ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయంలో ఆయన్ను కలుసుకున్నారు. నాకు తెల్సినంతవరకు, ప్రధాని చేస్తానన్న ఆర్ధిక సహాయాన్ని సున్నితంగా తిరస్కరించారు ఆదిరాజు.

నేను, భండారు శ్రీనివాస రావు మొట్టమొదటి సారి విమాన ప్రయాణం చేయడం ఆదిరాజు చలవ వల్లే. టంగుటూరి అంజయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, మేం ఇద్దరం ఒక రాచకార్యం మీద “ఏపీ ఎక్స్ ప్రెస్” లో ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్లో బస. చేతిలో 24 గంటలూ వాహన సౌకర్యం. పోయిన పని మొదటి రోజే పూర్తికావడం జరిగింది. అప్పుడు ఆదిరాజు ఢిల్లీలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. అధికార-అనధికార-ప్రయివేట్-ప్రభుత్వ ఉన్నత వ్యక్తులతో అపారమైన పరిచయం వుండేది ఆయనకు. మొదటి సారి మేం ఢిల్లీ వెళ్ళడం వల్లా, ఆయనకక్కడ తెలియంది లేనందువల్ల, ముగ్గురం కలిసి (వరప్రసాద్ అనే ఇందిరాగాంధీ వ్యక్తిగత లాయర్ కూడా వుండేవాడు మా వెంట) సరదాగా గడిపాం. మా ఇద్దరినీ ఆ ఇద్దరు ఎంతోమందికి (ప్రధాని ఇందిరాగాంధీతో సహా) పరిచయం చేశారు. పదిహేను రోజుల తరువాత తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. “ఫ్లై నౌ, పే లేటర్” (ఇప్పుడు విమాన ప్రయాణం చేయి....ఆ తరువాత చార్జీ చెల్లించు) అనే పథకం ఏమన్నా వుందా అని సరదాగా ఆదిరాజును అడిగాం. ఎప్పటిలాగే సూటూ-బూటూ-సిగరెట్ చేతిలో తిప్పుకుంటున్న ఆదిరాజు తన వెంట బయల్దేరమన్నాడు. ఇద్దర్నీ “చౌబే” అనే వ్యాపార వేత్త దగ్గరకు తీసుకెళ్లాడు. మా ఇద్దరినీ ఆకాశం అంత ఎత్తున వున్న వ్యక్తుల్లాగా ఆయనకు పరిచయం చేశాడు ఆదిరాజు. మేం అత్యవసరంగా హైదరాబాద్ పోవాలన్నాడు. మరుక్షణమే మా చేతుల్లో హైదరాబాద్ కు రెండు విమానం టికెట్లు వచ్చాయి. అప్పట్లో చార్జ్ కేవలం రు. 650 మాత్రమే. మా ఆనందానికి హద్దుల్లేవు. అలా మొదటిసారి విమానంలో, మాతోపాటు ఆయన తన స్వంత ఖర్చుతో, ప్రయాణం చేసి హైదరాబాద్ కు చేరుకున్నాం.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కావడానికి తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్న రోజుల్లో, గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్న పాత్రికేయ మిత్రుడు పర్సా వెంకట్ నాకు ఆయన్ను పరిచయం చేశాడు. నా పరిచయాన్ని కొనసాగించుకుంటూనే, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కావడానికి ఎవరెవరి సహాయం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన నేను కూడా నా వంతుగా చేసినప్పుడు మదిలో ఆదిరాజు మెదిలాడు. అప్పుడు ఢిల్లీలో పాత్రికేయుడిగా మంచి పలుకుబడి సంపాదించుకున్న ఆదిరాజుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన్ను చెన్నారెడ్డి దగ్గరకు ఒక సాయింత్రం తీసుకెళ్ళాను. అయితే అంతకు ముందు దాదాపు పది-పన్నెండేళ్లగా వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. 1978-80 మధ్యకాలంలో మొదటి సారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఆయన మీద కాంగ్రెస్ అసంతృప్తి నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పుడు, ఆ వివరాలను ముందుగానే మీడియా ద్వారా బహిర్గతం చేసి, అగ్నికి ఆజ్యం పోసి, చెన్నారెడ్డికి కోపం కలిగించాడు ఆదిరాజు. ఇద్దరి మధ్యా తీవ్ర వివాదానికి దారితీయడం, ఒకరితో మరొకరు మాట్లాడుకొని పరిస్థితులకు దారితీయడం జరిగింది. ఆ నేపధ్యంలో ఒకరిని మరొకరు ఆహ్వానించారని (వాస్తవానికి ఎవరు-ఎవరినీ ఆహ్వానించలేదు) ఇద్దరికీ చెప్పి ఇద్దరినీ కలిపాను నేను.

ఆదిరాజును తన గదిలో చూడగానే చెన్నారెడ్డి “ ఏం ఆదిరాజూ....ఏం పని మీద వచ్చావు?” అని తన సహజ ధోరణిలో ప్రశ్నించాడు. “నాకు మీతో ఏం పని లేదు...మీరు రమ్మని అడిగితే వచ్చాను” అని కోపంగా జవాబిచ్చి, “డాక్టర్ సాబ్... ఐ యాం గోయింగ్...ఇఫ్ యు ఇన్వైట్ మీ అగైన్ అండ్ వాంట్ మీ టు కం, ఐ విల్ సీ” అంటూ కుర్చీ లోంచి దూకుడుగా లేచాడు. ఇద్దరికీ సర్ది చెప్పడం మా వంతైంది. చివరకు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. పదేళ్ళ క్రితంనాటి కోపాలు ఇద్దరూ మర్చిపోయి మాట్లాడుకున్నారు. చెన్నారెడ్డికి తన వంతు సహాయం చేస్తానని మాటిచ్చాడు. అన్నట్లుగానే ఢిల్లీలో అప్పట్లో అధిష్టాన వర్గానికి అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న హెచ్ కె ఎల్ భగత్ ను, నాటి కేంద్ర పరిశ్రమల మంత్రి జలగం వెంగళ్ రావును, పార్లమెంటు సభ్యుడు ద్రోణంరాజు సత్యనారాయణను సంప్రదించాడు ఆదిరాజు. ఎవరి ప్రయత్నం ఫలించిందో చెప్పలేం కాని, 1989 ఉత్తరార్థంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి స్థానంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తరువాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఆదిరాజు ఏ పత్రికలో పనిచేసినా, సమాచార భారతి లాంటి ఏజన్సీకి పనిచేసినా, స్వయంగా “రాజధాని” పేరుతో పత్రిక నడిపినా, వివిధ పత్రికలకు ఫ్రీ లాన్సర్ గా వ్యాసాలూ రాసినా, తనకంటూ ఒక విభిన్న-వైవిధ్యభరితమైన శైలి వుండేది. అలాగే ఆయన తెలుగు-ఆంగ్ల భాషల్లో రాసిన అనేకమైన పుస్తకాలు. ఎవరికీ తలవంచని, ఎవరికీ భయపడని మహనీయ పాత్రికేయుడు ఆదిరాజు. ఆయన బాటలో ఈ తరం పాత్రికేయులు నడిచి ఆయన అవలంభించిన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆదిరాజుకు నిజమైన నివాళి.

No comments:

Post a Comment