Saturday, June 23, 2018

విరాధుడిని చంపిన రామలక్ష్మణులు.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-14: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-14
విరాధుడిని చంపిన రామలక్ష్మణులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (24-06-2018) 
ఇలా శ్రీరామచంద్రమూర్తితో చెప్పిన లక్ష్మణుడు, రాక్షసుడివైపు తిరిగి, "ఓరీ నువ్వెవడివిరా...ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావురా?" అని చిరునవ్వుతో అడిగాడు. తన వనానికి వచ్చి తనెవ్వరని ఎందుకడుగుతున్నారనీ, ముందు వారెవరో చెప్పాలనీ, వారెక్కడికి పోతున్నారనీ, విరాధుడు జవాబుగా ప్రశ్నించాడు. దానికి శ్రీరామచంద్రుడు "ఓరీ వినరా! మేం ఇక్ష్వాకు వంశంలో పుట్తిన క్షత్రియులం. అడవిలో తిరుగుతున్నాం. నువ్వనుకున్నట్లు మేం పాపాత్ములం కాదు. నిర్దోషమైన నడవడి కలవారం. నువ్వెందుకు ఈ అడవిలో తిరుగుతున్నావు?" అని అడిగాడు. జవాబుగా విరాధుడు: "నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద నన్ను దనుజులందరూ విరాధుడు అని పిలుస్తారు. నేను తపస్సు చేసి శస్త్రంతో చావకుండా బ్రహ్మ నుండి వరం పొందా. నరకబడడం వల్ల, చీల్పబడడం వల్ల, చంపబడకుండా వరం పొందా. మీరు బతకాలనుకుంటే ఈ స్త్రీని నాకు వదిలి వెళ్లండి. ఈమెను నాకు వదిలితే మిమ్మ్లని చంపను" అని అన్నాడు.

విరాధుడు చెప్పిన మాటలకు కోపగించిన శ్రీరామచంద్రుడు, "ఓరీ! నీచ రాక్షసుడా! దుష్టుడా! నీ అంతట నువ్వే చావును వెతుక్కుంటూ వచ్చావు. నా ఎదురుగా నిలబడి మరల బతికిపోతావా?" అంటూ బాణం ఎక్కుపెట్టాడు. పదునైన బాణాలను రాక్షసుడిమీద వేశాడు. రాముడు ఏడు బాణాలను విరాధుడి రొమ్ము దూర్పోయే విధంగా వేయగా, అవి కొండ లాంటి వాడి దేహాన్ని చీల్చి, ఎర్ర్గా మారిపోయి, భూమిలోకి పోయాయి. బాణాల తాకిడి బాధను సహించలేని విరాధుడు జానకి నేలమీద వదిలి, శూలం తీసుకుని రామలక్ష్మణులను సమీపించాడు. రామలక్ష్మణులిరువురూ ఆ రాక్షసుడి మీద పదునైన బాణాలను వర్షంలాగా కురిపించారు. వారు వేసిన బాణాలను చూసిన విరాఢుడు, ఈ బాణాలు తననేమీ చేయలేవని నవ్వి, తన భయంకరమైన శరీరాన్ని పెంచాడు. దేహంలో నాటుకుని పోయిన బాణాలన్నీ నేలరాలాయి. శ్రీరామచంద్రమూర్తి మరి కొన్ని బాణాలను వేశాడు. శ్రీరామలక్ష్మణులు వేస్తున్న పదునైన అబణాలను చూసి రాక్షసుడు నవ్వాడు. వాళ్లూ వదలకుండా వీడిపై బాణాలు వేయసాగారు. వాటివల్ల బాగా బాధకలిగిన విరాధుడు, ప్రాణాలను బిగపట్టుకుని, రామలక్ష్మణులపై వజ్రసమానమైన శూలాన్ని విసిరాడు. మండుతూ వస్తున్న ఆశూలాన్ని చూసి శ్రీరాముడు దాన్ని రెండు బాణాలతో నరికాడు. భూమి కంపించే విధంగా అది నేలరాలింది. వాడి శూలం విరగగానే, రామలక్ష్మణులిద్దరూ వాడి మీద దూకారు. దూకి తమ కత్తులతో వాడిని కొట్టారు. అప్పుడా రాక్షసుడు వాళ్లిద్దరినీ ఎత్తుకుని ఆకాశంలో పరుగెత్తాడు. అడవి మధ్యలోకి వాళ్లను తీసుకుని వెళ్లి తమను చంపాలన్న వాడి కోరికను గ్రహించాడు శ్రీరాముడు. వాడు ఎక్కడికి తీసుకునిపోతే అక్కడికే పోదామనీ, అదే మన మార్గమనీ శ్రీరాముడు లక్ష్మణుడితో అన్నాడు.


          చంటి పిల్లను ఎత్తుకున్న విధంగా రామలక్ష్మణులను భుజాలమీద ఎత్తుకుని అడవిలో పోతున్న ఆ విధానం చూసిన సీతకు భయం కలిగింది. గట్తిగా , ఇలా జరిగిందికదా అని ఏడ్చింది. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది: "దానవోత్తముడా! నన్ను ఒంటరిగా విడిచి వారిద్దరినీ తీసుకొనిపోతే నన్ను ఇక్కడ పెద్ద పులులు, తోడేళ్లు, చిరుతపులులు మింగుతాయి. కాబట్టి వాళ్లను వదిలి నన్ను తీసుకొని పోయి చంపు. అలా అయితే వాళ్లు సుఖంగా జీవిస్తారు. వాళ్లు లేకుండా నేనున్నా చచ్చినదానితో సమానమే. కాబట్టి నీకు నమస్కారం చేస్తా....వాళ్లను విడిచి పెట్టు". సీత ఈ ఏడుపు మాటలు విన్న శ్రీరామలక్ష్మణులు రాక్షసుడిని చంపడానికి తొందరపడసాగారు. విరాధుడి కుడి భుజమందున్న లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని, ఎడమ భుజాన వున్న శ్రీరాముడు వాడి కుడిచేతిని నరికారు. విరాధుడు ఆయుఅధాలతో చచ్చ్హేవాడు కాదు. చేతులు లేనివాడయ్యాడు. కాబట్టి వాడిని మోచేతులతో, మోకాళ్లతో గుద్ది, పైకెత్తి కింద పడేశారు. కత్తులతో నరికినా, బాణాలతో గుచ్చినా, నేలమీద వేసి గుద్దినా, చావని ఆ కఠిన రాక్షసుడిని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో , వీడిని ఒక గుంట తీసి పూడుద్దామన్నాడు. ఇది విన్న విరాధుడు, రాముడితో, తాను ఆయన చేతిలో చచ్చిపోయాననీ, అజ్ఞానం వల్ల ఆయన ఎవరైందీ తెలుసుకోలేక పోయాననీ, అని తన శాప విషయాన్ని గురించి చెప్పాడు.

          విరాధుడిలా అన్నాడు: "కౌసల్యానందనా! కరుణాస్వరూప! శ్రీరామ్చంద్రా! తండ్రీ! మీరెవరో ఇప్పుడు తెలుసుకున్నా. శ్రీరాముడివి నీవు....అవతార మూర్తైన భవంతుడవని, సీతాదేవి లక్ష్మి అని తెలుసుకొంటిని. నేను పూర్వం తుంబురుడనే గంధర్వుడిని. రంభతో కూడి కామావేశాన మర్యాద తప్పి సంచరిస్తుంటే కుబేరుడు నన్ను రాక్షసుడివి కమ్మని శపించాడు. శాపం తొలగే ఉపాయం కూడా ఆయనే చెప్పాడు. దశరథ కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు నన్ను చంపుతాడో అప్పుడు నాకు రాక్షసత్వం పోతుందని, గంధర్వ రూపం వస్తుందని అన్నాడు. శ్రీరఘురామచంద్రమూర్తీ! నీ కరుణవల్ల భయంకరమైన శాప బాధ తొలగింది. మీ దర్శనం వల్ల కృతకృత్యుడనయ్యాను. స్వర్గానికి పోతాను. దయ చేసి ఆజ్ఞ ఇవ్వు. మీకు మేలు కలుగుగాక! ఈ దారిలో ఒకటిన్నర ఆమడ దూరం పోయాక అక్కడ సూర్యతేజుడైన శరభంగ మహర్షి వున్నాడు. ఆయన్ను మీరు దర్శించండి. మేలు కలుగుతుంది. నన్ను పూడ్చి వేయండి. ఆ తరువాత అక్కడికి పోండి శ్రీరామచంద్రమూర్తీ! లక్ష్మనా! ఏనుగును పూడ్చడానికి ఎంత గుంట తవ్వుతారో అంతది తవ్వండి" అన్నాడు. వెంటనే చనిపోయాడు.

శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విధంగా లక్ష్మణుడు విరాధుడిన దేహం పక్కనే వెంటనే ఒక గుంత తవ్వాడు. శ్రీరామలక్ష్మణులు కల్సి వాడి శరీరాన్ని ఆ గుంటలో వేశారు. ఇంకా ప్రాణంతో వున్న విరాధుడు, శ్రీరామలక్ష్మణులు బలవంతంగా గుంతలో పడేయగానే, భయంకరమైన ధ్వని చేస్తూ, దాంట్లో పొర్లాడు. వాడిని పిడికి పోటులతో చంపారు రామలక్ష్మణులు. ఊపిరితో పూడ్చరాదు కాబట్టి చంపి మరీ పూడ్చారు. శ్రీరామలక్ష్మణులు విరాధుడిని ఈ విధంగా చంపి, సంతోషించి, ఆ గోతిని పెఅద్ద రాయితో పూడ్చారు. ఇలా చేసి, దూరంగా వుంచిన వారి బాణాలను మరల తీసుకుని, సీతాదేవి దగ్గరకు పోయి, అడవిలో చంద్రడు సూర్యుడులాగా ప్రకాశించారు.

No comments:

Post a Comment