Saturday, June 9, 2018

బర్త్ ఆఫ్ బుంటి..ఎంఏ ఫలితాలు...లైబ్రేరియన్ గా ఉద్యోగ ప్రస్తానం.....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు: వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
బర్త్ ఆఫ్ బుంటి..ఎంఏ ఫలితాలు...లైబ్రేరియన్ గా ఉద్యోగ ప్రస్తానం
వనం జ్వాలా నరసింహారావు
నవంబర్ 1970 లొ నాగ్ పూర్ వెళ్ళిన తరువాత చదువుమీద దృష్టి మరలించాను. అప్పటికి ఫైనల్ ఇయర్ పరీక్షలకు కేవలం నాలుగు నెలలే సమయమున్నందున ఎక్కువ సమయం స్టడీస్ లోనే గడపాల్సి వచ్చింది. ఎక్కువ కాలం లైబ్రరీలోనే వుండేవాళ్ళం. అయినప్పటికీ, ఇంతకుముందే చెప్పినట్లు, నాకున్న హోంసిక్ వల్ల నవంబర్-మార్చ్ నెలల మధ్య మరో రెండు సార్లు ఖమ్మం వెళ్లి వచ్చాను. నేను నాగ్ పూర్ లో వున్నా, ఖమ్మంలో వున్నా మా ఆవిడ మాత్రం ఖమ్మం మామిళ్ళగూడెంలో వున్న మా ఇంట్లోనే అత్తగారి దగ్గరే ఎక్కువగా వుండేది. మా ఇంటికి అతి సమీపంలోనే మా ఆవిడ పుట్టిల్లు కూడా వుండడంతో ఆమె ఎప్పుడనుకుంటే అప్పుడు అక్కడి పోయి వస్తుండేది. తను అత్తగారి ఇంట్లో వున్నా, పుట్టింట్లోనే వున్న భావన కలిగేదనీ, తనను అంత ఆప్యాయంగా మా అమ్మ-ఆమె అత్తగారు చూసుకునేదనీ ఇప్పటికీ తను చెప్తుంటుంది. మాది అందరిలాగే ఉమ్మడి కుటుంబం. తనకన్నా పెద్ద-చిన్న ఆడపడుచులతో, మరదులతో కలిసి-మెలసి వుండాల్సి వచ్చినా తనకెప్పుడూ ఇబ్బంది కలగలేదని అనేది. యధావిధిగా మా ఇద్దరి మధ్య ఉత్తర-ప్రత్యుత్తరాల కమ్యూనికేషన్ నిరంతరాయం కొనసాగేది.

1971 మార్చ్ నెలలో పరీక్షలైపోయాయి. పాసవుతానన్న ధైర్యంతో నాగ్ పూర్ వదిలి ఖమ్మం చేరుకున్నాను. మళ్లీ ఒక్క సారి రిజల్ట్స్ వచ్చాక వెళ్లి వచ్చాను. నావరకు నేను ఖమ్మంలో స్నేహితులతో ఎక్కువ కాలం గడిపేవాడిని. గర్భిణీగా మా ఆవిడ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మా అమ్మే చూసుకునేది. వంటా-వార్పూ అంతా మా అమ్మే చూసుకునేది. జూన్ నెలలో లాంచనంగా జరిపించాల్సిన సీమంతం తరువాత, మా ఇంటి నుండి తన పుట్టింటికి, ఆ తరువాత ఒకటి-రెండు రోజులకు డెలివరీ నిమిత్తం వరంగల్ కు వాళ్ల అమ్మతో కలిసి వెళ్ళింది మా ఆవిడ. వరంగల్ లోనే, అప్పటికీ ఇంకా హౌజ్ సర్జన్ గా పనిచేస్తున్న మా బావగారు, డాక్టర్ మనోహర్ రావు వుండడం వల్ల, ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మను సంప్రదించారు. ఆమె కేవలం డాక్టర్ గానే కాకుండా కుటుంబపరంగా సన్నిహితురాలై, తన ఇంట్లోనే మేడ మీద ఒక పోర్షన్లో మా ఆవిడ వాళ్ళను వుండడానికి ఏర్పాటు చేసింది పెద్ద మనసుతో. ఒక పెద్ద ఆపరేషన్ అయిన ఏడాదికే డెలివరీ కాబోతున్నందువల్ల కొంచెం భయపడ్డా, డాక్టర్ గారింట్లోనే వుండడం చాలా ధైర్యాన్నించ్చింది వీళ్ళకు. ఎప్పటికప్పుడు అవసరమైన వైద్యపరమైన అన్ని శ్రద్ధలూ తీసుకుంటూ డెలివరీ రోజుకోరకు వేచి చూశారు. ఆ రోజున కూడా డాక్టర్ పద్మగారు స్వయానా తన కారు ఇచ్చి ఆసుపత్రికి పంపించి, వెంటనే తానూ వెళ్లి, సిజేరియన్ లాంటివేవీ లేకుండా నార్మల్ డెలివరీ చేయించారు. జులై నెల 8, 1971 న రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రసవించి, మా పెద్దమ్మాయి ప్రేమ మాలిని (బుంటి) కి జన్మనిచ్చింది. నేను అప్పుడు ఖమ్మంలోనే వున్నాను.


         డాక్టర్ పద్మగారి ఇద్దరు కూతుళ్లు రాణి, శోభ మా ఆవిడతో చాలా సరదాగా వుండేవాళ్ళు. దాదాపు వారిది ఇంచుమించు ఒకటే వయసు. రాణి భర్త, ఐపీఎస్ అధికారి గిరీష్ కుమార్, ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసారు. శోభ భర్త రాజేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. రాణి, శోభలు కూడా ఉన్నత ఉద్యోగాలు చేసారు. 85 ఏళ్ళు దాటిన డాక్టర్ పద్మగారిని ఇటీవలే ఆమె వుంటున్న దోమల్ గూడాలోని ఇంటికి వెళ్లి నమస్కారం చేసి వచ్చాం. ఇటీవల కాలం దాకా ఆమె తన కన్సల్టెన్సీ సేవలను కొనసాగించారు.

         మా ఆవిడ డెలివరీ అయిన రెండు-మూడు రోజులకు మా అమ్మా-నాన్నా వరంగల్ వెళ్లి తల్లీ-బిడ్డను చూసి వచ్చారు. నేను మూడోనాడు వెళ్లాను. ఆ నాటి నా వరంగల్ ప్రయాణం నా జీవితాన్ని ఒక మలుపుతిప్పిన అపురూపమైన ప్రయాణం. అప్పటికే ఎంఏ ఫలితాలోచ్చి పాసయ్యాను. అదొక శుభ వార్తైతే, అమ్మాయి పుట్టడం మరొక శుభ వార్త. ఆ సంతోషంతో వరంగల్ కు బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తితో గొప్ప పరిచయమైంది. నాకు బస్సులో సీటు దొరికింది...హాయిగా కూర్చున్నా....కాని ఒక నడివయసు మహిళ సీటు దొరక్క నిలబడి వుండడం, నేను లేచి ఆమెకు సీటిచ్చి నిలబడడం జరిగాయి. కొంతసేపటికి మొత్తం మీద ఆమె వెనుక సీట్లోనే నాకూ సీటు దొరికింది. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ముందు నేను ఫలానా అనీ, ఇటీవలే ఎంఏ పాసయ్యాననీ, ఇంకా ఉద్యోగం రాలేదనీ, మా ఆవిడ డెలివరీ అయినందున పుట్టిన అమ్మాయిని చూడడానికి వరంగల్ పోతున్నాననీ చెప్పాను. ఆమె వివరాలడిగాను. తన పేరు “షాజహానా బేగం” అనీ, తను ఖమ్మం జిల్లా విద్యాధికారి (డీఈఓ) ననీ, సొంత ఊరైన వరంగల్ పోతున్నాననీచెప్పింది. ఆశ్చర్య పోయాను. అంత పెద్ద అధికారి, వీలున్నా, అధికారిక వాహనం ఉపయోగించుకోకుండా బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ఆమెను అభినందించాను.

         సరదాగా మాటలు కొనసాగించిన మేడం “షాజహానా బేగం”, ఉద్యోగం లేకుండా పిల్లల్ని, భార్యను ఎలా పోషిస్తావని ప్రశ్నించింది. నా దగ్గర సమాధానం లేదన్నాను. వరంగల్ నుండి తిరిగొచ్చాక తనను కలవమంది. జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కు రాశామని, నేను కాల్ లెటర్ తెచ్చు కుంటే, ఇంటర్వ్యూకి హాజరవ వచ్చనీ, నాకు ఉద్యోగం రావడానికి తను సహాయ పడతాననీ చెప్పింది. ధన్యవాదాలు తెలియచేశాను అప్పటికి.

         వరంగల్ వెళ్లి మా ఆవిడను, మా అమ్మాయిని చూసి ఒకరోజుండి తిరుగు ప్రయాణమయ్యాను. ఖమ్మంలొ “షాజహానా బేగం” ను కలిశాను. ఆమె చెప్పినట్లే స్థానిక ఎమ్మెల్యే సిఫారసుతో, ఎంప్లాయ్మెంట్ శాఖలో ఉన్నతోద్యోగంలో వున్న పర్సా మోహన్ రావుగారి సహాయంతో,  ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాల్ లెటర్ సంపాదించాను. ఇంటర్వ్యూకి వెళ్లాను. జూనియర్ లెక్చరర్ ఉద్యోగం తాత్కాలికమనీ, పర్మనెంట్ ఉద్యోగమైన గ్రాడ్యుఏట్ లైబ్రేరియన్ పోస్ట్ ఇస్తున్నాననీ చెప్పింది జిల్లా విద్యాధికారి (డీఈఓ). ఎగిరి గంతేసినంత పనిచేసి ఆమెకు కృతజ్ఞతలు తెలియచేసాను. కాకపొతే ప్రస్తుతానికి ఆ ఉద్యోగం ఖమ్మానికి 30 కిలోమీటర్ల దూరాన వున్న ఎల్లెందు జూనియర్ కాలేజీలోననీ, మూడు నెలల్లో ఖమ్మం బదిలీ చేయిస్తాననీ వాగ్దానం చేసింది. ఆ తరువాత ఇదంతా జరగడానికి డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సంపత్ రావు, క్లార్క్ సీతారాంరావు సహాయం చేసారు.

         ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకుని ఎల్లెందు జూనియర్ కాలేజీలో రిపోర్ట్ చేసాను.  జీతం అక్షరాలా రెండువందల డబ్భై రూపాయలు.

No comments:

Post a Comment