Saturday, June 2, 2018

రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-11: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-11
రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (03-06-2018)
శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా-సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1,29,290 పదాలే కాకుండా, రుగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చు. యజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం, శ్రీరాముడు యజుర్వేది కావడమే.

యజుర్వేద సంహితా ప్రమాణం ఆధారంగా, రామాయణంలోని ఏడు కాండలంటే, సౌమ్యము, ప్రాజాపత్యము, వైశ్వదేవము, ఆగ్నేయము, ఆగ్నేయ బ్రాహ్మణము, సౌమ్య బ్రాహ్మణము, కామ్యకము. అదే విధంగా ప్రశ్నలు 44. అందులో మొదటి కాండలో 8, రెండులో 6, మూడులో 5, నాలుగులో 7, ఐదులో 7, ఆరులో 6, ఏడవ కాండలో 5 ప్రశ్నలున్నాయి. అనువాకాలు 651, పనసలు 2198, పదాలు 129290, అక్షరాలు 253868 వున్నాయి. ఈ విధంగా యజుర్వేదంలోని కాండల, ప్రశ్నల, అనువాకాల, పదాక్షరాల నిర్ణయం జరిగింది. శ్రీమద్రామాయణంలోని కాండలలో వేదాక్షరాలు ఎలా వున్నాయో పరిశీలించితే, బాల కాండ ప్రధమ సర్గ నుంచి ఐదో సర్గ వరకు రెండో శ్లోకం దాకా, నారదుడు ఉపదేశించిన విధానం రాసి, తర్వాతనే బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో కథా భాగం వుంది. బాల కాండ 5 సర్గ 3 వ శ్లోకం నుంచి, అయోధ్య కాండ 115 వ సర్గ వరకు యజుర్వేదం. అయోధ్య కాండ 116 వ సర్గ మొదలు, అరణ్య కాండ 74 వ సర్గ వరకు ఋగ్వేదం. అరణ్య కాండ 75 వ సర్గ మొదలు సుందరకాండ 48 వ సర్గ వరకు సామవేదం. సుందర కాండ 49 వ సర్గ మొదలు ఉత్తర కాండ 36 వ సర్గ వరకు అథర్వ వేదం. ఉత్తర కాండ 37వ సర్గ మొదలు చివర వరకు ఉపనిషత్తు-అంటే శాంతి. ఈ విధంగా 647 సర్గలలో 23635 శ్లోకాలు, 776794 అక్షరాలున్నాయి. అక్షరాల సంఖ్యలో కొంచెం తేడా రావడానికి కారణం వేదాలలో వర్ణముల పదాలు విశేషంగా వుండడం వల్ల ఇవి సరి చూసుకుంటే, వేద వర్ణాల లెక్కకు, రామాయణ వర్ణాల లెక్కకు సరిపోతాయి. రామాయణం వేదం కాబట్టే, నిరంతర అధ్యాయనపరుడైన వాల్మీకి, కొన్ని చోట్ల వేద పరిభాషా పదాలను, వేద సంజ్ఞలను ప్రయోగించాడు. ఈ సంకేతాలన్నింటినీ తెలుసుకోగలిగితే సందేహాలకు తావులేకుండా వాల్మీకి రామాయణ సారాన్ని గ్రహించగలుగుతారు.

రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం. "కాదినవాది సూత్రాల" ప్రకారం అక్షరాల కొచ్చే సంఖ్యలను బట్టి చూస్తే, రామాయణంలో కొన్ని చిత్రాలు కనిపిస్తాయి.
                 రా + మ = 2+5 =                              7
                 అవతార సంఖ్య                                   7
                 రామాయణ కాండ సంఖ్య                        7
                 యుద్ధం జరిగిన రోజుల సంఖ్య                   7
                 రామాయణ యుద్ధంలో ముఖ్యమైన పురుషుల సంఖ్య 7
(రామ, లక్ష్మణ, హనుమ, విభీషణ, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులు)    

          
పారాయణం చేసే వారికి ముఖ్యంగా నియమిత మైన సర్గల సంఖ్య 7. వ్యాహృతులు 7. ఇలా ఈ ఏడవ సంఖ్య మహిమ అద్భుతం. "శ్లోక శతై" అని వాల్మీకి చెప్పినట్లు, బాల కాండం మొదటి సర్గ మొదటి శ్లోకం (తప స్స్వాధ్యాయ...) లోని అక్షరాల కొచ్చే సంఖ్యలను కూడితే 100 వస్తుంది. ఈ 100 సంఖ్య ప్రథమ సర్గలోని శ్లోకాల సంఖ్య. రామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి "జయ" అని పేరు పెట్టాడు. "జయ" అంటే 18. భారతంలోని పర్వాలు 18. యుద్ధం జరిగింది 18 రోజులు. రణ శూరులు 18 మంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఇలా ఆలోచిస్తే, మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుంది.

సీతారాముల వియోగం గురించి, కలిసి వుండడం గురించి అయోధ్యా కాండలో చెప్ప బడింది. మిగిలిన కాండలలో కొంత కాలమన్నా వియోగం గురించి చెప్పబడింది. కాబట్టి "సీత, రామ" నామాల సంఖ్యలు కలిపితే (సీత=67 + రామ=52) 119 వస్తుంది. అయోధ్య కాండలో 119 సర్గలున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో వాల్మీకి రామాయణంలో నిక్షేపం చేశాడు.

శ్రీరాముడు సామాన్య ధర్మాలన్నీ ఎలా అనుష్టించింది, కష్ట కాలంలో ఎలా ప్రవర్తించింది, సుఖ కాలంలో ఎలా నడచుకుంది, ఎలాంటెలాంటి వారి మీద ఏ విధమైన అభిప్రాయంతో మెలిగేవాడనేదీ, వీటి కారణాలేంటి అన్న విషయాలన్నీ చర్చించాల్సినవే. రాముడి పైనా, ఆయన తమ్ములపైనా ఏక పత్నీవ్రతం విషయంలో కూడా విరుద్ధాభిప్రాయాలను వెలిబుచ్చిన వారున్నారు. అసలా మాటకొస్తే " దుష్టులు వెలిచవి (జారత్వం) మరగిన భ్రష్టులు లేరప్పురమున రాష్ట్రమునందున్" అని బాలకాండలో చెప్పినట్లు, దశరథుడు పాలించిన అయోధ్యలో ప్రతి మనుష్యుడు ఏక పత్నీవ్రతుడే. అలాంటప్పుడు రాముడు అనేక పత్నీకుడని ఎలా చెప్పారు? అలాంటి రాముడు వాల్మీకి వర్ణించిన శ్రీరాముడు మాత్రం కాడు. ఒక్క వాల్మీకే యథార్థ చరిత్రను వర్ణించాడు. మిగిలిన వారందరూ, రాముడి పరత్వాన్ని వర్ణించినవారే. ఇలానే వాలి వధ విషయంలో కూడా రాముడి గుణం దోషరహితమే. శ్రీరాముడు సంధ్యావందనం, దేవతార్చన, విగ్రహారాధన, వ్రతానుష్టానం లాంటి నిత్య కర్మలన్నీ శ్రద్ధగా చేసేవాడు.

“రామాయణ గ్రంథమేమో చాలా గొప్పది. రాసిన కవేమో బ్రహ్మర్షి. ఇందులోని మర్మాలేమో మెండుగా వున్నాయి. రాసిందేమో సంస్కృత భాషలో. చదివినా కొద్దీ విశేషాలు కనిపిస్తాయి. నేనా కించిజ్ఞుడను-చంచల చిత్తుడను-శక్తి హీనుడను. అందుకే దోషాలు దండిగా వుంటాయి. పాఠకులు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని దయతో చదివి నన్ను ధన్యుడిని చేయండి. భగవద్ధ్యానంలో ఆసక్తిగల భక్తులందరూ దీన్ని భగవంతుడికి నివేదించబడిన ప్రసాదంలా ఈ కృతిని భావించమని ప్రార్థన” అని అంటూ ఆంధ్రవాల్మీకి వాసుదాసు గారు చివరగా:

                 "తప్పైనను నొప్పైనను, దెప్పుచునో మెచ్చుకొనుచొ, దీనిన్ శ్రద్ధన్
                 దప్పక సకలము జదివెడు, నప్పుణ్యాత్ముల కొనర్తు సాష్టాంగనతుల్"
అని ముగిస్తారు. 

2 comments:

  1. I am thankful to this blog for assisting me. I added some specified clues which are really important for me to use them in my writing skill. Really helpful stuff made by this blog.เห็ด หลิน จื อ ยี่ห้อ ไหน ดี

    ReplyDelete
  2. 1,Why you ignored sugreeva and ang ada
    2,how you reached 25 for RAMA nama please kindly clarify

    ReplyDelete