Saturday, June 30, 2018

శరభంగాశ్రమంలో శ్రీరాముడికి కష్ఠాలు చెప్పి శరణు వేడిన మునీంద్రులు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-15:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-15
శరభంగాశ్రమంలో శ్రీరాముడికి కష్ఠాలు చెప్పి శరణు వేడిన మునీంద్రులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (01-07-2018)
భయంతో-శోకంతో ఖిన్నురాలై వున్న సీతాదేవిని ఓదార్చిన శ్రీరాముడు, తమ్ముడు లక్ష్మణిడితో శరభంగాశ్రమానికి పోవడానికి దారి బాగు చేయమని అంటాడు. అక్కడికి పోయి మహాత్ముడైన వాడిని, దేవ-గంధర్వులు, సిద్ధులు, గొప్ప ఋషులు స్తోత్రం చేసేవాడిని, విశేష బ్తహ్మ తేజస్సు గల శరభంగుండితో సంభాషిస్తున్న ఇంద్రుడిని చూశారు సీతారామలక్ష్మణులు. అప్పుడు లక్ష్మణుడితో శ్రీరాముడిలా అన్నాడు: "ప్రకాశిస్తున్న కాంతిగల ఇంద్రుడిని చూశవా? లక్ష్మణా నువ్విక్కడే సీత దగ్గర వుండు. ఆ ఇంద్రుడి వృత్తాంతం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకొని వస్తా" అని ముని ఆశ్రమానికి చేరబోయాడు. శ్రీరాముడు రావడం చూసిన ఇంద్రుడు, శరభంగుండితో రహస్యంగా, శ్రీరామచంద్రుడు తనను చూడడానికి వస్తున్నాడనీ, ఆయన్ను తానిప్పుడు చూడకూడదనీ అంటాడు. శ్రీరాముడు చేయాల్సిన అసాధ్య కార్యం, రావణాధికం ముందున్నదనీ, అది చేయనివ్వాలనీ, అది ఇతరులు చేయలేనిదనీ, దాంట్లో విజయం సాధించిన తరువాత-కీర్తి పొందిన తరువాత, తానే ఆయన్ను సమీపించి సంభాషిస్తాననీ చెప్పి ఇంద్రుడు రఠం ఎక్కి ఆకాశానికి పోయాడు. అలా ఇంద్రుడు పోగానే, వెనక్కు తిరిగి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులను కలిసి, వారితో సహా అగ్నిహోత్రంతో ప్రకాశిస్తున్న శరభంగ మహర్షిని భక్తితో సమీపించాడు. చేరి ఆయన పాదాలకు శిరస్సు వంచి మొక్కాడు. మొక్కి ముగ్గురూ నిలుచున్నారు. వారికి ఆసనానికి తగిన పీటలను అమర్చారు ముని. వారు కూర్చొనిన తరువాత, శ్రీరామచంద్రమూర్తి ఇంద్రుడు అక్కడకు రావడానికి కారణం ఏంటని శరభంగుండిని అడిగాడు. జవాబుగా శరభంగుండు ఇలా చెప్పాడు.

"రామచంద్ర దేవా! నేను తపస్సు చేసి క్షుద్రులు పొందలేని బ్రహ్మలోకాన్ని సంపాదించాను. అక్కడకు నన్ను పిలుచుకొని పోవడానికి ఇంద్రుడు ఇక్కడకు వచ్చాడు. ఆ బ్రహ్మలోకానికంటే కూడా ప్రియమై కోరాల్సిన నువ్వు అతిథిగా నా దగ్గరకు వస్తున్నావని తెలిసి, బ్రహ్మలోక ప్రాప్తికంటే కూడా నీ దర్శనం శ్రేష్ఠం కాబట్టి ఇంద్రుడితో పోవడానికి మనసొప్పలేదు. ఫలితంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక దేవతలు దర్శించే త్రిదివమునకు పోతాను. నేను తపస్సుతో సంపాదించినవన్నీ ఎప్పటికీ తరిగిపోనివి....పుణ్యలోకాలు కలిగిస్తాయి. నిన్ను దర్శించకుండా నేను బ్రహ్మలోకానికి పోతే ఎలా? స్వర్గలోకంలోని భోగస్థానాలను, బ్రహ్మలోకంలోని భోగస్థానాలను, సంపాదించడానికి నేను చేసిన పుణ్యమంతా నీకిస్తాను. గ్రహించు". అప్పుడు సకల శాస్త్రవేత్త అయిన శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: "మునీంద్రా! నీ పుణ్యాన్నంతా నేను తీసుకుంటా. మేముండడానికి నివాసయోగ్యమైన స్థలమేదో చెప్పు". జవాబుగా శరభంగుడిలా అన్నాడు: "మీరుండడానికి సరైన స్థలం సుతీక్ష్ణుడనే ముని చెప్తాడు. ఈ అడవిలోనే ఆయన వున్నాడు. రామచంద్రా! మీరు ఇక్కడనుండి తూర్పుగా పారుతున్న ఈ పుణ్యనదికి ఎదురెక్కి, పడమటగా పొండి. మధ్యలో పూల గుంపులు నదిలో కనిపిస్తాయి. అదే సరైన తోవ. రామచంద్రా! పోవద్దు. కాసేపుండు. శరీరాన్ని వదులుతా" అని అంటూనే తన శరీరాన్ని అగ్నిలో ప్రవేశింపచేశాడు. భస్మమైన శరభంగుడు మళ్లీ కుమారుడి రూపాన్ని దాల్చాడు. ఆ రూపంతో బయల్దేరి పోయి, పరబ్రహ్మ లోకంలో భగవన్మూర్తిని చూశాడు. ఆయన కూడా మునిని సుఖంగా వచ్చావా? అని అడిగాడు. సీతారామలక్ష్మణులు ముగ్గురూ ముని శక్తికి ఆశ్చర్యపడ్డారు.


శరభంగుడావిధంగా పరమపదం చేరగా, దివ్యతేజస్సుకల రామచంద్రమూర్తిని, అక్కడున్న ఋషులు కలిసి రక్షించమని వేడుకున్నారు. ఆత్మరక్షణ విషయంలో తాము సమర్థులం కామని, పరాధీనులమనీ, భగవంతుడొక్కడే ఆపద్భాంధవుడనీ భావించిన మునులు శరణాగత రక్షణే పరమ ధర్మమనే జ్ఞానం కల శ్రీరాముడిని రక్షించమని ఇలా వేడుకున్నారు."రఘువంశసత్తమా! పురుష రత్నమా! నీ అభిజాతత్వం శ్లాఘ్యమైంది. నిన్ను లోకులు పొగుడుతున్నారు. అరణ్యానికి రావడం వల్ల తండ్రి మీద భక్తి, భరతుడు అడిగినా ఒప్పుకోనందున సత్యవాక్కు మీద ప్రీతి, ధర్మం అంటే నిష్ఠ, నీలో సంపూర్ణంగా వున్నాయి. సీతావల్లభా! పరమాత్మ స్వరూపడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా శరణు కోరుతున్నాం. నిన్ను మేమొక విషయం యాచిస్తాం. రామచంద్రమూర్తీ! మేమొక విన్నపం చేయదల్చాం. కోపగించుకోవద్దు. మేం కార్యార్థులమై వచ్చినందున, నీకు తెలిసినా-తెలియకున్నా చెప్పుకోవాల్సిన విధి మాది. చెప్పుకోలేదన్న లోపం మాలో వుండకూదదు. ప్రజాపాలనే రాజులకు ముఖ్యకార్యం కాబట్టి, మా విన్నపాన్ని ఆలకించు. ఏ రాజైతే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రజలను పాలిస్తాడో, ఆ రాజు, శాశ్వత కీర్తిని సంపాదించి బ్రహ్మలోకానికి పోయి అక్కడ బ్రహ్మతో గౌరవం పొందుతాడు. తపస్సు చేస్తున్న తాము ఆకులలాలు తింటూ కూడా, తమ కష్ఠ ఫలమైన తపస్సులో నాలుగో భాగం రాజుకు ఇవ్వడానికి కారణం అతడు ప్రజలను రక్షించడానికే కదా?”.

దుష్ఠుల పెట్టే బాధల వల్ల దుఃఖపడుతూ, బాధపడుతున్న వారిని రక్షించే సామర్థ్యం కల శ్రీరామచంద్రమూర్తీ! యథార్థం చెప్తున్నాం. విను. ఈ వానప్రస్థ సమూహాల్లో బ్రాహ్మణులు చాలామంది వున్నారు. కొద్దిమంది క్షత్రియ, వైశ్యులు కూడా వున్నారు. వీరంతా గొప్ప తపో మహిమవల్ల కీర్తిపొంది నువ్వే దిక్కని నమ్మారు. క్షత్రియులు, వైశ్యులు కూడా స్వశక్తితో తమ్ము కాపడుకునే శక్తి కలవారు కాదు. దుష్టులైన రాక్షసులు పెట్టే బాధలు సహించలేకపోతున్నారు. ఇక నువ్వు ఉపేక్షించ కూడదు. మామీద ప్రేమతో మాకు అభయం ఇవ్వు. మాకు భయం లేకుండా చేయి. శ్రీరామచంద్రా! రాక్షస సమూహాల వల్ల హింసించబడ్డ మునుల దేహాల నుండి వెడలిన ఎముకలు దూరంగా పడి వున్నాయి, మా వెంట రా...చూపిస్తాం. మందాకినీ తీరంలో పంపానది ఒడ్డున, చిత్రకూట పర్వతం దగ్గర నివసిస్తున్న ఋషులను రాక్షసులు బాధించి చంపుతున్నారు. మృత్యువును లక్ష్యపెట్తక తపస్సు చేసే మాకెందుకు మరణభీతి అంటావేమో? మాకుగా మేం దుఃఖించడం లేదు. సంసారాన్ని వదలి అడవులకు వచ్చి తపస్సు చేసుకుంటున్న మునిజనులకు కలుగుతున్న అపకారాన్ని చూసి మేం సహించ లేకపోతున్నాం. కాబట్టి నువ్వు రక్షించాలి. అమోఘబలవంతుడివి కాబట్టి నిన్ను రక్షించమని శరణుజొచ్చాం. మేం రాక్షసుల చేతిలో చావకుండా నీ దయాగుణంతో ఆలోచించి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని కాపాడమని నిన్ను నిర్భందించం. నీ కళ్యాణగుణాలకు హాని రాకుండా కాపాడుకో. మేం అనన్యులం...కాబట్టే...నీ రక్షకత్వాన్ని కోరి, నువ్వెప్పుడు అవతరిస్తావా? ఎప్పుడు దర్శనమిస్తావా? ఎప్పుడు మమ్మల్ని కృతార్థులను చేసి రక్షిస్తావా? అను ఎదురుచూస్తున్నాం. నువ్వుతప్ప మాకు వేరే గతిలేదు. మా విషయంలో దయచూపాలా? వద్దా? అనే విషయం సీతాదేవిని అడిగి చూడు.

No comments:

Post a Comment