Saturday, May 25, 2019

రావణుడిని నిందించిన సీతాదేవి...శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-62 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని నిందించిన సీతాదేవి
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-62
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (26-05-2019)
         రావణుడిని నిందిస్తూ ఇలా అంటుంది సీత. “ఓరీ! రాక్షస వంశానికి వెదురుపొదకు కార్చిచ్చు లాంటి వాడా! ఆడదాన్ని, నన్ను, వంటరిగా వుండడం చూసి నువ్వీవిధంగా దొంగిలించి పరుగెత్తి పారిపోతున్నావే? నీకు కొంచెమైనా సిగ్గులేదా? నీ మాయ వల్లే కదా, అడవిలో మాయామృగం రూపంలో నా మనోవల్లభుడిని దూరంగా తీసుకుపోయింది? రాక్షస వంశం అనే అడవికి నువ్వే చిచ్చు పెట్టావు కదరా? నా మామ గారి స్నేహితుడైనందున నన్ను కాపాడడానికి వచ్చిన ముసలి గద్దతో యుద్ధం చేసి చంపావు. నీచ చరిత్రుడా! ఆహా! నువ్వెలాంటి శూరుడివిరా? ముసలి గద్దతోనే ఇంత పెద్ద యుద్ధం చేయాల్సి వస్తే, రామలక్ష్మణుల బారినపడితే నీగతి ఏమవుతుంది? యుద్ధంలో నిలబడి, ఇదిగో...రావణుడిని...యుద్ధానికి వచ్చాను...అని పేరు చెప్పుకునే పౌరుషం లేక, యుద్ధంలో నా భర్తను గెలవలేక, నన్ను దొంగిలించి పారిపోతున్నావే? పాపాత్ముడా! ఏమిరా నీ పౌరుషం? ఏమిరా నీ బలం?

         స్త్రీ చౌర్యం అనే నింద్యమైన నీచపు పని చేసి, ఇతరుల భార్యయైన ఆడదాన్ని దొంగిలించి, భయపడి, పరుగెత్తుతున్నావే .... మూర్ఖుడా! నీకు కొంచెమైనా సిగ్గులేదురా! ఛీ! శూరుడు కాకపోయినా శూరుడనే పేరుచెప్పుకునే ద్రోహచింతగల నిన్ను మగవారు చూసి నవ్వుతారు సుమా! నువ్వు శూరుడననీ, పెద్ద బలవంతుడననీ, వ్యర్థమైన మాటలు చెప్పావుకదా! పాపాత్ముడా! కాలమనేది వున్నంతదాకా నీకు అపకీర్తి కలిగించి, నీ వంశాన్ని నాశనం చేసే పని చేయడానికి పూనుకున్నావు. చీ! శూరుడిలాగా కొంచెం సేపు నిలుస్తే నీ శరీరంతో ఇలా పోగలవా? యాతనా శరీరంతో యమలోకానికే పోతావు. మృత్యుదేవత తరుముతున్నట్లు చావు-బతుకు తెలియకుండా పరుగెత్తుతున్నావే....నిన్నా రామరాజేమి చేయగలడు? ఏదీ, మగవాడివైతే క్షణం సేపు నిలువు....నీ పాపకార్యం అనుభవిస్తావు. ఆ రాజకుమారుల కళ్లకు నువ్వు కనిపిస్తే, నువ్వు, నీ సైన్యాలు ఒక్క ముహూర్త కాలమైనా బతకడం సాధ్యపడుతుందా? దుష్ట రాక్షసుడా!”

         “అడవిలో కార్చిచ్చు వ్యాపిస్తే పక్షులు దాన్ని సమీపించలేనట్లు, నువ్వు రామలక్ష్మణులు ప్రయోగించే బాణాలను కన్నెత్తి కూడా చూడలేవు. ఇక నువ్వు వాటిని ఖండించడం ఏమిటి? యుద్ధం చేయడం ఏమిటి? ఎందుకురా చెడిపోతావు? నేను చెప్తున్న మంచిమాటలు వినరా! నన్ను తిరిగి తీసుకునిపోయి రాముడికి అప్పగించు. అలా నామాట ప్రకారం చేయకపోతే, నన్ను నువ్వు అవమానించడం వల్ల కలిగిన కోపంతో, ఆవేశంగా యుద్ధం చేసి నీ దేహాన్ని రాబందులకు, నక్కలకు, గద్దలకు తృప్తితీరా తినడానికి విందుగా వేస్తాడు. ఏదో చెడు ఆలోచనతో నన్ను నువ్వు తీసుకుని పరుగెత్తి పారిపోతున్నావు. నామాట విను. ఎప్పటికైనా నీకోరిక నెరవేరేది కాదు. ఓరీ! మాయలమారీ! నా మగడిని, జయించడం సాధ్యపడని వాడిని, జగన్నాథ సమానుడిని, రాముడిని విడిచి శత్రువు స్వాధీనంలో దీర్ఘకాలం బతకలేను. నువ్వు ఇంద్రియ చపలత్వంతో నీకు మంచేదో, చెడేదో, తెలుసుకోలేక బుద్ధిహీనుడివై వున్నావు. ఎందుకంటావా? నువ్వు పాపాత్ముడివి. కాబట్టి నీకు మంచి మార్గం కనిపించదు”.


         “చావు సమీపిస్తుంటే మనిషికి మంచి వస్తువులు తినబుద్ధికాదు. పథ్యం చేయాలనిపిస్తుంది. చెడు పథ్యంలాగా అనిపిస్తుంది. ఇది సత్యం. నామాట అసత్యం కాదు. నిన్ను యముడు విందుకోసం తీసుకుపోతున్నాడు. ఇంత ఘోర పాపకార్యం కొంచెమైనా జంకు-గొంకు లేకుండా నిర్విచారంగా చేయడం వల్ల త్వరలోనే బంగారు చెట్లను చూస్తావు. యమలోకంలో నెత్తుటి ఏరులో, నిప్పుల ఏరులో ఈదుతావు. అసివ్రత వనంలో ఆటలాడుతావు. నమ్ము. యమపురంలోని బూరుగు చెట్లను చూస్తావు. పరస్త్రీలను కామించిన నీకు ఈ నరకబాధ తప్పదు. నీచపు నడవడికలవాడా! శ్రీరాముడిని మోసగించి నువ్వు విషం తాగినవాడిలాగా ప్రాణాలను నిలబెట్టుకుంటావా? అది నీకు సాధ్యమా? దయాహీనుడా! నీ జీవితకాలం ఈ రోజుతో ముగిసింది. లంకలోకి చేరితే శ్రీరాముడు నిన్నేమి చేస్తాడని అనుకుంటున్నావా? యమకింకరులు నీమెడకు పాశాలు తగిలించారు. కాబట్టి నీకు లంకలోనే కాదు, స్వర్గ పాతాళ లోకాల్లో ఎక్కడ ప్రవేశించినప్పటికీ నిన్ను రామచంద్రమూర్తి తప్పక చంపుతాడు”.

         “తమ్ముడు కూడా తోడు లేకుండా, ఒంటరిగా రాముడొక్కడే పద్నాలుగువేల మంది దుష్ట రాక్షసులను అల్పకాలంలో సంహరించాడు. అలాంటి గొప్ప అస్త్రాలను తెలిసినవాడు ఎంతటి పనైనా చేయగలదు. తన పెళ్లాన్ని దొంగిలించిన నీచజాతివాడివైన నిన్ని యుద్ధంలో ముక్కలు-ముక్కలుగా నరక్కుండా వుంటాడా?

         ఇలా రకరకాలుగా మాట్లాడుతూ, ఏడుస్తున్న సీత స్మృతితప్పి పడుతూ ఉన్నప్పటికీ, రావణుడు ఆమెను తీసుకు పోవడం ఆపలేదు.

No comments:

Post a Comment