Friday, May 31, 2019

ఇవిఎంల పరిణామక్రమం : వనం జ్వాలా నరసింహారావు


ఇవిఎంల పరిణామక్రమం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (31-05-2019)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు కొన్ని రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూంలలోని ఇవిఎంలను మారుస్తున్నట్టు కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశా యి. అది సాధ్యమేనా అనేది అసలు ప్రశ్న. భారత దేశంలో ఇవిఎంలను భారీ ఎత్తున రిగ్గింగ్ (మాస్ రిగ్గింగ్) చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ యంత్రాలు కంప్యూటర్‌కు గానీ ఇంటర్‌నెట్‌కు గానీ అనుసంధించనివి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు. ఆఫ్‌లైన్‌లో ఉంటాయి. అయితే ఇవిఎంలపై ప్రతిపక్షాలు అనవసర వివాదం చేయడంపట్ల నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిఎంగా పిలువబడే ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రం ఎలెక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయడానికి సహకరించే లేదా ఓటరు వేసిన ఓట్ల లెక్కింపు బాధ్యతలను తీసుకొనే ఒక యంత్రం.

ఒక ఇవిఎం రెండు యూనిట్లుగా ఒకటి కంట్రోల్ యూనిట్ రెండు ఓటు వేసే యూనిట్‌గా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇవిఎంకు చెందిన కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి వద్ద ఉంటే ఓటు వేసే యూనిట్ ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా ఓటింగ్ గదిలో ఉంటుంది. పోలింగ్ అధికారి ఓటరు ఐడెంటిటీని వెరిఫై చేయడానికి వీలుగా ఈ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ అధికారి బ్యాలట్ పేపరు జారీ చేయడానికి బదులు ఇవిఎంలోని బ్యాలట్ బటన్‌ను నొక్కుతారు. దీనివల్ల ఓటరు ఓటు వేయడానికి వీలవుతుంది. ఓటు వేసే మెషిన్ పైన అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. దాని పక్కనే ఒక నీలం బటన్ కూడా ఉంటుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు తాను ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పేరుకు పక్కనున్న బటన్‌ను నొక్కుతాడు.

ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బ్రెజిల్ , భారత్ , ఫిలిప్పీన్స్ లాంటి కొన్ని దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. భూటాన్, నేపాల్, నమీబియాలాంటి దేశాలు భారత్‌లో తయారైన ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అమెరికా సహా ప్రపంచంలో చాలా దేశాలు ఇవిఎంల వినియోగాన్ని నిషేధించాయి. అలాగే బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, పరాగ్వే, జపాన్‌లలో కూడా ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. అయితే ఇవిఎం టెక్నాలజీ వినియోగం అన్ని చోట్లా ఒకే మాదిరిగా లేదు. కొన్ని దేశాలు ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను పరీక్షించి వినియోగంలోకి తీసుకురాగా, మరి కొన్ని దేశాలు దాన్ని పరీక్షించాయి కాని ఆ తర్వాత వదిలేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ఇప్పటికీ పరీక్షలు కొనసాగిస్తూ ఉండడమో, భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు జరపాలని అనుకుంటూ ఉండడమో చేస్తున్నాయి. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, పరాగ్వే, జపాన్‌లలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను అమలు చేసి మధ్యలోనే వదిలేశారు. భూటాన్, బ్రిటన్, ఇటలీ, నార్వే, తజకిస్థాన్, ఆస్ట్రేలియా, నేపాల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, గ్వాటెమాలా, కోస్టారికా, ఈక్వెడార్, రష్యా, మంగోలియా, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిన్లాండ్, సోమాలియా (సోమాలి లాండ్) స్విట్జర్లాండ్ దేశాలలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను పరీక్షించారు గాని దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు.

ఎన్నికల్లో మూడు రకాల ఎలెక్ట్రానిక్ ఓటింగ్ ఆప్టికల్ స్కానింగ్ (ఒఎస్), డైరెక్ట్ రికార్డింగ్ (డిఆర్), ఓట్ ఓవర్ ఇంటర్నెట్ (విఒఐ) లను ఉపయోగిస్తున్నారు. అర్జెంటీనాలో 2004లో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను పరిమిత స్థాయిలో అమలు చేశారు. 2016లో అదనపు ఎన్నికల చట్టాన్ని ఆమోదించారు. 2017 లో జరిగిన జాతీయ స్థాయి ఎన్నికల కోసం అర్జెంటినా, దక్షిణ కొరియా నుంచి డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను కొనుగోలు చేసింది గాని భద్రతా కారణాల దృష్టా వాటిని ఉపయోగించ లేదు. 1996లో బ్రెజిల్ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను పరిమిత స్థాయిలో అమలు చేసింది. 2000 సంవత్సరంలో డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని దేశమంతటికీ విస్తరింపచేసింది. ఇప్పుడ జాతీయ స్థాయిలో అన్ని స్థాయిలలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ వినియోగం జరుగుతోంది.

2018లో పేపర్ బ్యాలట్లు, ఓటర్ వెరిఫబుల్ పేపర్ ట్రయల్ సిస్టమ్ (వివిప్యాట్)లను పూర్తిగా తొలగించడం జరిగింది. కెనడాలో జాతీయ స్థాయి ఎన్నికలు పూర్తిగా పేపర్ బ్యాలట్ ద్వారానే జరుగుతున్నాయి. కొన్ని మునిసిపాలిటీలు ఆప్టికల్ స్కాన్ డిఆర్‌వి ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తుండగా పరిమిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఓటింగ్ అందుబాటులో ఉంది. అయితే ఎలెక్ట్ట్రానిక్ ఓటింగ్ కేవలం మునిసిపల్ స్థాయిలోనే ఉపయోగించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఎప్పుడూ ఉపయోగించలేదు. 2005లో ఎస్టోనియా తొలిసారిగా స్థానిక స్థాయిలో ఇంటర్నెట్ ఓటింగ్‌ను అమలు చేసింది. ఆ తర్వాత 2007లో జాతీయ స్థాయికి దాన్ని విస్తరింపజేసింది. సంప్రదాయ పోలింగ్ కేంద్రాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి కాని ఏ ఎన్నికలోనైనా మొత్తం ఓట్లలో మూడింట ఒక వంతు ఓట్లు ఇంటర్నెట్ ద్వారా వేస్తారు.


విదేశాలలో నివసిస్తున్న ఎస్టోనియా పౌరులు కూడా ఇంటర్నెట్ ఓటింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. పెరూ దేశం 2013లో తొలిసారిగా ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అమలు చేసింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలలోనే దేశ వ్యాప్తంగా 14 శాతం ఓటర్లకు దాన్ని విస్తరింపజేసింది. పెరూలో టచ్ స్క్రీన్ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వెనిజులా 1998లో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను అమలు చేసింది. దేశ వ్యాప్తంగా టచ్ స్క్రీన్ ఓటింగ్ యంత్రాలను ఇందుకోసం ఉపయోగిస్తుండగా వాటికి ఓటర్ వెరిఫబుల్ పేపర్ ట్రయల్ (వివిప్యాట్)లను ముద్రించే సామర్థం కూడా ఉంది. ఓటు ఫలితాలను కూడా యంత్రాలను కేంద్ర ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించడానికి బదులు ఎలెక్ట్రానిక్ పద్ధతిలోనే పంపిస్తారు. అమెరికా ప్రతి రాష్ట్రంలోనూ ఆప్టికల్ స్కాన్ యంత్రాలను ఉపయోగిస్తుంది. అయితే కొన్నిసార్లు వీటిని ఆబ్సెంటీ బ్యాలట్ (పరోక్ష ఓటింగ్) కు మాత్రమే ఉపయోగిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రతి లోకల్ జోన్‌లోనూ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలు ఉండగా మరి కొన్ని రాష్ట్రాలు పేపర్ బ్యాలట్లు, ఓటింగ్ యంత్రాలను కలిపి ఉపయోగిస్తారు. ఇంటర్నెట్, ఇ మెయిల్ ఫ్యాక్స్ ద్వారా ఓటు వేయడం చాలా వరకు నిర్దేశిత మిలిటరీ సిబ్బందికి మాత్రమే పరిమితం.

అమెరికాలో ఇప్పటికీ పేపర్ బ్యాలట్ సిస్టమ్ ఎందుకు ఉందనే దానికి ప్రధాన కారణం భద్రతాపరమైన కారణమే. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలిస్తే పేపర్ బ్యాలట్‌ను ఉపయోగించడం సురక్షితమని అమెరికన్లు ఇప్పటికీ భావిస్తారు. చాలా రాష్ట్రాల్లో పేపర్ బ్యాలట్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణాలు భద్రత, ఓటర్ల ప్రాధాన్యతలే. ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌కు ఖర్చు ఎక్కువ కాబట్టి దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దశాబ్దాల పోలింగ్ విశ్లేషణల తర్వాత ఖచ్చితత్వంతో రూపొందించబడిన పేపర్ బ్యాలట్ విధానానికి బదులు ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌కు రాజకీయవేత్తలు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. అమెరికా విప్లవ యుద్ధం తర్వాత చాలా సంవత్సరాల క్రితమే అమెరికాలో ముద్రించబడిన బ్యాలట్ పత్రాలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు జనం బహిరంగంగా తమ ప్రాధాన్యతలను తెలియజేయడం ద్వారా ఓటు వేసేవారు.

అయితే 20వ శతాబ్దం దాకా కూడా అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో ప్రింటెడ్ బ్యాలట్‌లు అమల్లోకి రాలేదు. అమెరికాలో చాలా సంవత్సరాల క్రితమే ఓటింగ్ హక్కులలో మార్పులు వచ్చాయి గాని ఓటింగ్‌తో ముడిపడిన టెక్నాలజీ విషయంలో మాత్రం ఈ మార్పులు రాలేదు. అందువల్లనే 19వ శతాబ్దమంతా కూడా పేపర్ బ్యాలట్ పద్ధతే అమల్లో ఉండింది. ప్రస్తుతం అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రహస్య బ్యాలట్ విధానం ఉండగా, కొన్ని రాష్ట్రాల మాత్రం మెయిల్ బ్యాలట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతిలో బ్యాలట్ పత్రాన్ని ఓటరు ఇంటికి పంపిస్తారు. వాళ్లు తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థిపై గుర్తు వేసి పోస్టు ద్వారా పంపిస్తారు. ఓరేగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో అన్ని ఎన్నికలను మెయిల్ చేసే బ్యాలట్ ద్వారానే నిర్వహిస్తారు.

భారత దేశంలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ విధానం మొదటి నుంచి పురోగతిలో ఉన్న విధానంగా ఉంది. 1952లో జరిగిన స్వతంత్ర భారత దేశ తొలి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి విడిగా ఒక బ్యాలట్ బాక్స్‌ను ఉపయోగించేవారు. పదేళ్ల తర్వాత 1962లో ఒక నియోజకవర్గంలోని అభ్యర్థులందరికీ ఒకే ఉమ్మడి పేపర్ బ్యాలట్‌ను ప్రవేశపెట్టగా ఓటర్లు తమకు ఇష్టమైన అభ్యర్థిపై గుర్తు పెట్టేవారు. భారతదేశంలో తొలిసారిగా 1982లో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించడం జరిగింది. అయితే చాలా ఏళ్ల తర్వాత గాని వాటిని విస్తృతంగా అమల్లోకి తీసుకురాలేదు. 1999లో డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను పాక్షికంగా అమలు చేయగా, 2002లో జాతీయ స్థాయిలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయడం జరిగింది.

భారత దేశం బ్యాటరీ శక్తితో నడిచే పోర్టబుల్ పుష్ బటన్ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తోంది. బ్యాటరీ శక్తితో నడిచే ఓటరు వెరిఫబుల్ పేపర్ ట్రయల్ (వివిప్యాట్) హార్డ్‌వేర్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. 1999 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికలను, 2004 నుంచి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టారు. 2013లో దేశంలో వివిప్యాట్ కూడా జత చేశారు. ప్రధానంగా ప్రతి ఓటరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో చూపించడానికి వీలుగా ఒక స్లిప్‌ను ముద్రించే ప్రింటర్ ఇది. ఒకవేళ వివాదం తలెత్తితే ఓటింగ్ యంత్రం చూపించే ఫలితాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు అన్ని వివిప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని, ఇవిఎం ఓట్లతో సరిపోల్చి చూడాలని డిమాండ్ చేశాయి.

అయితే ఈ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు తోసిపుచ్చి ఎంపిక చేసిన ఐదు వివిప్యాట్‌లను మాత్రమే లెక్కించడానికి మాత్రమే అనుమతించాయి. బిజెపి, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి), బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), తెలుగుదేశం పార్టీ (టిడిపి), తదితర రాజకీయ పార్టీలు ప్రధానంగా తాము ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాల్లో మాత్రమే తమ వాదనను మార్చుకోవడం, ఇవిఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం జరుగుతోంది. అయితే చాలావరకు అవి నిరాధారమైనవని రుజువైనాయి. క్రమం గా ఇవిఎంలు మొరాయించడం లాంటి అనేక సమస్యల విషయం లో సమర్థించుకోలేకపోయినప్పటికీ కాలక్రమంలో ఇవిఎంలు తారుమారు చేయడానికి వీలులేనివని నిర్ధారణ అయింది. అయితే వివిప్యాట్‌లను ప్రవేశపెట్టడం సకాలంలో తనిఖీలను నిర్వహించడం సమస్యలున్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి నిరంతర మెరుగుదలల ద్వారా ఇవిఎంలలో తలెత్తే సమస్యలను భారత ఎన్నికల కమిషన్ పరిష్కరిస్తోంది.

No comments:

Post a Comment