Monday, September 9, 2019

మాంద్యం ముసురులో సంక్షేమ బడ్జెట్ : వనం జ్వాలా నరసింహారావు


మాంద్యం ముసురులో సంక్షేమ  బడ్జెట్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (10-09-2019)
దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న నేపధ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి, రు. 1,46,492 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో,  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శాసనసభలో ప్రవేశ పెట్టడం జరిగింది. రాష్ట్రంగా అవతరించిన ఐదేళ్లలోనే అత్యద్భుతమైన ప్రగతిని సాధించి, అనేకమైన వినూత్న ప్రజోపయోగ పథకాల అమలుతో యావత్ భారత దేశాన్ని ఆశ్చర్య పరిచి, నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి కూడా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆర్ధిక మాంద్యం తన ప్రభావాన్ని చూపడంతో, తెలంగాణ ప్రభుత్వం కొంత జాగరూకతతో 2019-20 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ను రూపొందించాల్సిన అవసరం ఏర్పడ్డప్పటికీ, ఏ ప్రాధాన్యతా రంగానికి కూడా నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

దురదృష్టవశాత్తు గడిచిన ఏడాదిన్నర కాలం నుండి దేశం తీవ్ర ఆర్ధిక మాంద్యానికి గురవుతూ వస్తున్నప్పటికీ, ఏటేటా తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టగలిగే పరిస్థితుల పెరుగుదల, స్థూల దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి.) సగటు వృద్ధిరేటు పెరుగుదల, క్రమంగా గణనీయంగా పెరుగుతూ వస్తున్న మూల ధన వ్యయం, మూల ధన వ్యయానికి బడ్జెటేతర నిధుల ఉపయోగం, సగటు ఆదాయ వృద్ధి రేటులో గత ఐదేళ్లగా గణనీయ వృద్ధి, అన్ని రంగాలలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా మాంద్యం ప్రభావాన్ని కొంతలో కొంత తట్టుకునే వీలు కలిగిందనాలి.   

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టుతూ “ప్రభుత్వం అవలంభిస్తున్నసమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ వల్ల; విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యల కారణంగా, అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం వల్ల; టిఎస్ ఐపాస్ లాంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం ఫలితంగా, పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేసే అవకాశం కలగడం వల్ల; కునారిల్లిపోయిన వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో వ్యవసాయ రంగం పునరుత్తేజం పొంది, పంట దిగుబడులు పెరగడం వల్ల; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం వల్ల; అన్ని ప్రధాన రంగాల్లో మూలధన వ్యయం పెరగడం లాంటి కారణాల వల్ల తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమయింది” అని అన్నారు.

ఇలా సుదీర్ఘంగా కొనసాగిన అభివృద్ధికి ప్రధాన కారణం ప్రభుత్వం అవలంభించిన పటిష్టమైన ఆర్ధిక క్రమ శిక్షణే. ఈ రకమైన ఆర్ధిక ప్రగతి వల్ల సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామ సీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగం, తదితర వర్గాలు భారీగా లాభపడ్డాయనేది, చాలామంది నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేసిందనేది వాస్తవం. కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పినట్లు ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల సమైక్య పాలనలోని జీవన విధ్వంసం లోంచి తెలంగాణ సమాజం తేరుకుని, కుదుటబడి, స్థిమితపడింది.

ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడి చేసిన వాస్తవాల ఆధారంగా, ప్రాతిపదికగా గమనిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో వృద్ధిరేటు నమోదైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగంలో అదనపు వృద్ధి సాధించి, ఐటి ఎగుమతుల విలువను గణనీయంగా పెంచుకోగలిగింది.  ఇది ఆయారంగాలలో రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి విస్పష్ట సంకేతం. అవినీతి రహిత పాలన అందించడం వల్ల, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆర్థిక ప్రగతి సాధ్యమైందనేది వాస్తవం.

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన ఫలితంగానే సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామ సీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగాలకు పునరుత్తేజం తీసుకురావడం కోసం ప్రభుత్వం తగిన ఆర్థిక ప్రేరణ అందించగలుగుతున్నదన్నారు సీఎం కేసీఆర్. నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయగలుగుతున్నది.  అత్యున్నత నాణ్యమైన విద్యాప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వందలాది గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించగలుగుతున్నారు. రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించుకోగలిగింది ప్రభుత్వం. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడం సాధ్యమైంది.


ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తున్నది. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను అనునిత్యం గమనిస్తూనే వున్నాం. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సీఎం వివరించినట్లు దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో, పరిస్థితి పూర్తి నిరాశాపూరితంగా ఉందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్న అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.

         వాహనాల అమ్మకాలు పడిపోయాయి. దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి, వ్యాట్ తగ్గిపోయింది. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కార్గో విమానాల ద్వారా జరిగే సరుకు రవాణాలో వృద్ధిరేటు తగ్గింది. సరుకు రవాణా చేసే రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగులలో వృద్ధిరేటు తగ్గింది. గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రూపాయి మారకం విలువ శరవేగంగా పతనమవుతున్నది. ఇవన్నీ సీఎం తన ప్రసంగంలో పేర్కొనడం గమనిం చాల్సిన విషయం.  

         దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడింది. కేసీఆర్ చెప్పినట్లు దేశంలో స్థూల ఆర్థిక విధానాలను శాసించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం తీసుకొచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్ప, మరో గత్యంతరం లేదు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వచ్చిందనీ, అనేక పరిమితులను దాటిపోలేమనీ, ఆ ప్రాతిపదికగా చుట్టూ అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్ర మేథోమధనం చేసి, అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి, నిర్థారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించిందనీ సీఎం అన్నారు.

ఏదేమైనా, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత నయంగా కనిపిస్తున్నదనీ; స్థిరమైన ఆర్థిక ప్రగతి, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుకోగలుగుతున్నదనీ; ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులకు లోబడి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అసునరించి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్డీపీ) లో 25 శాతం మించకుండా ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరిస్తున్నదనీ; భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించిందనీ ముఖ్యమం త్రి అన్నారు.

ఇలా సేకరించిన నిధులతో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యధాతథంగా కొనసాగుతుందని సభకు చెప్పారు సీఎం. అలాగే ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సహితం, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందన్నారు. రైతుబందు పథకం యథాతథంగా కొనసాగుతుందని, రైతు భీమా పథకాన్ని కూడా ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందని,  రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుందనీ, పేదలకు అందించే ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరు కిలోల బియ్యం లాంటి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానీయమని, సీఎం స్పష్టం స్పష్టం చేశారు. అదే విధంగా విద్యార్థులకు మంచి వసతి, భోజనం కల్పిస్తూ ఇంగ్లీషు మీడియం విద్య అందిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తుందనీ, గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన మిగతా హామీలను కూడా ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందనీ చెప్పారు ముఖ్యమంత్రి.

కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందనీ, ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయదలచుకోలేదని విస్పష్టంగా ప్రకటిస్తున్నానన్నారు సీఎం. స్థానిక సంస్థలకు నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన విధానం తీసుకొచ్చిందనీ, కేంద్ర ఆర్థిక సంఘం ఎన్ని నిధులిస్తే, అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున జమ చేసి, స్థానిక సంస్థలకు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుందనీ, ఈ రెండింటినీ కలిపి గ్రామ పంచాయతీలకు ప్రతీ నెలా 339 కోట్ల రూపాయలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, స్పష్టం చేసారు ముఖ్యమంత్రి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఎప్పటికప్పుడు తగిన ఆర్థిక సహకారం అందిస్తున్నదన్నారు.

ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవడానికి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవనీ, నిజానిజాలను స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా సభ ముందు, సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నామనీ, దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం కారణంగా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం అనీ, దీని కారణంగా అనేక ఒడిదొడుకులు ఎదురైన విషయం కూడా అంతే వాస్తవం అనీ, ఈ కఠిన వాస్తవాల ప్రాతిపదిక ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసిందనీ అన్నారు సీఎం.

ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి , ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి, ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు వుందని అన్నారు.  ఆదాయ వనరులను బట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటూ, సవరించుకుంటూ క్రియాశీలకంగా (డైనమిక్ గా) వ్యవహరిస్తుందని చెప్పారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరానికి, అంటే, 2014-2015 కు, బడ్జెట్ రూపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి రకమైన “క్లూ” లభించలేదు. 12 నెలల ఆదాయ-వ్యవ వివరాల అంచనాలు పూర్తిస్థాయిలో లేని నేపధ్యంలో ఆ తరువాతి సంవత్సరం అంటే 2015-16 బడ్జెట్ తయారుచేయాల్సి వచ్చింది. 2016-17 బడ్జెట్ రూపొందించుకునే సమయానికల్లా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ఆదాయ-వ్యయాలపై, ప్రభుత్వానికి ఒక సమగ్రమైన-సంపూర్ణమైన అవగాహన వచ్చింది. అది మూడో బడ్జెట్ అయినప్పటికీ, వాస్తవంగా ఆలోచిస్తే, అసలు-సిసలైన లెక్కల ఆధారంగా, తయారుచేసిన మొదటి బడ్జెట్ అనాలి. 2017-2018 లో రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ప్రేరణ కలిగించేదిగా, సందేశాత్మకంగా వుందని చెప్పాలి. ఇక 2018-19 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతకు ముందు 45 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా ప్రమాణీకరణం చేయవచ్చు, ఏ విధంగా స్థిరపర్చవచ్చు, ఏ విధంగా పటిష్టం చేసుకోవచ్చు అనే విషయాలు స్పష్టంగా కనిపించాయి.  

ఈ నేపధ్యంలో, ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ, అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజా సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా రైతులు, పేదల జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే చిత్తశుద్ధిని వెల్లడించారు ముఖ్యమంత్రి. ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వుండే రీతిలో ప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపు జరగడం అంటే, ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ప్రవేశ పెట్టిన ఆశాజనకమైన, వాస్తవిక బడ్జెట్ 2019-20 బడ్జెట్ అని చెప్పుకోవాలి. 

1 comment:

  1. ఇంత ఆర్థిక ఉపద్రవం ఉంటే కొత్త సచివాలయాలు శాసనసభ భవనాలు అవసరమా అధ్యక్షా

    ReplyDelete