Wednesday, May 6, 2020

రామాయణానికి ప్రేరకుడు నారదుడా? ... వనం జ్వాలా నరసింహారావు (80081 37012)


రామాయణానికి ప్రేరకుడు నారదుడా?  
వనం జ్వాలా నరసింహారావు (80081 37012)
ఆంధ్ర ప్రభ, చింతన (07-05-2020)
భగవద్విషయాన్ని బోధించే యోగ్యతున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించిన వాల్మీకి దగ్గరకు బ్రహ్మ ఆదేశానుసారం నారదుడొస్తాడు ఒకనాడు. వాల్మీకి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించాడిలా:

" తపమున స్వాధ్యాయంబున, నిపుణుని వాగ్విద్వరేణ్యు నిఖిల మునిజనా
  ధిపు  నారదుసంప్రశ్నము,  తపస్వి  వాల్మీకి  యిట్టు,  తమి గావించెన్ "

"తపమున స్వాధ్యాయంబున" అని అనడమంటే, ఆచార్యుడికుండాల్సిన గుణ సంపత్తిని తెలపడమే. "వాగ్విద్వరేణ్యుడు" అంటే, కేవలం వేదమే కాకుండా అర్థ జ్ఞానం కూడా నారదుడికి ఉన్నదని అర్థమొస్తుంది. "నిఖిల ముని జనాధిపు" అనే విశేషణం సమాహితత్వమనే ఆచార్య గుణాన్ని తెలియచేస్తుంది. "తపమున నిపుణుడు" అంటే  జ్ఞానాధికుడని, "ముని జనాధిపుడు" అంటే ఉపాసుకులందు శ్రేష్ఠుడని, నారదుడిలో ఈ రెండూ పూర్ణ శక్తులుగా వున్నాయనీ అర్థం. నారదుడు భగవత్తత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడని ఆతర్వాత చెప్పిన పదాల్లో వుంది. “సంప్రశ్నము అన్న పదంద్వారా మిక్కిలి శ్రేష్ఠమైనప్రశ్న అడిగి, మంచివిషయాన్ని రాబట్టదలిచాడన్న అర్థం స్ఫురిస్తుంది. ఇట్లా నారదుడిలోని ఆచార్య లక్షణాలను సంపూర్ణంగా వర్ణించడం జరిగింది.

వాల్మీకి చరిత్ర గురించి కూడా ఇందులో ఇమిడి వుంది. వాల్మీకిలోని శిష్య లక్షణాలను చెప్పడం కూడా జరిగింది. నిర్వేదం లేనివాడు ముముక్షువు కాలేడు. ఉపదేశార్హుడూకాడు. వాల్మీకి జాతి బ్రాహ్మణుడే అనాలి. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ సందర్భంలో "బ్రాహ్మణుడా" అని సంబోధిస్తాడు. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణానికి ఇరవైనాలుగువేల గ్రంథాల పరిమితుంది. ముప్పై రెండక్షరాలను గ్రంథమంటారు. వెయ్యికి ఒకటి చొప్పున 24,000 గ్రంథాలలో 24 గాయత్రీ వర్ణాలు చేర్చబడ్డాయి.

"గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలుచేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి నారదుడిని.

ప్రశ్నలు పదహారు. ఇది తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు  పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి విషయమై  తన అభిప్రాయాన్ని దృఢపర్చుకోవడానికి, భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ పదహారు ప్రశ్నలడిగాడు వాల్మీకి.

బాల్యంలోనే శ్రీరాముడు గుహుడులాంటి వారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి "వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరకపోవడం, జనకాజ్ఞ జవదాటకపోవడం, పరశురాముడిని చంపకపోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ, వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను, సర్వభూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీష శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది.విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా.ఇలానే రాముడు కాంతియుక్తుడనీ, భయంకరుడనీ పలుసందర్భాల్లో అర్థమవుతుంది.

ఇన్నిగుణాలున్నవాడు ఎవరైనా వుంటారా? ఇలాంటి విషమ ప్రశ్నలు వేసి తనను పరాభవిస్తున్నాడేమోనని నారదుడనుకోవచ్చునని భావించాడు వాల్మీకి. అందుకే మళ్లా అంటాడు, వాస్తవార్థం తెలుసుకోగోరి అడిగానే గాని పరీక్షించడానికి కాదని. జవాబుగా నారదుడు: "వాల్మీకీ నీ ప్రశ్నకు తగిన సమాధానం చెప్తాను. సావధానంతో విను" అంటాడు, భగవత్ గుణ వర్ణనానుభవం కలిగిందన్న సంతోషంతో.


తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్లా, శత కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు నారదుడు. వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు.

నారదుడు వాల్మీకి అభిప్రాయాన్ని గ్రహించి అతనికి కావల్సిన రీతిలోనే సమాధానం ఇస్తాడీవిధంగా: "ముని శ్రేష్ఠా, నీవు శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఇట్టి సుగుణ సంపత్తిగలవారెవరో చెప్తా, శ్రద్ధగా విను. ఏ వంశంలోనైతే-ఏ ఇంటిలోనైతే, నిత్యం భగవంతుడు ఆరాధించబడుతున్నాడో, అట్టి ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, ’రామా రామా రామా’, అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరుగలాయన జన్మించాడు. అతివీర్యవంతుడాయన. అసమానమైన, వివిధమైన, విచిత్రమైన శక్తిగలవాడు. అతిశయంలేని ఆనందంగలవాడు. ఇంద్రియాలను, సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు."

"శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. ఋజుస్వభావం గలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు. విష్ణువుతో సమానుడు. లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు”.

“ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు. ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడు. సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడు. అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా వారి, వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు. గొప్పగుణాలున్నవాడు. ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా దర్శనమిచ్చేవాడు. సమస్తభూతకోటికి పూజ్యుడు. అన్నింటా గుణ శ్రేష్ఠుడు. ఆయనే శ్రీరామచంద్రుడు”.

శ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయి. సంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు, ధర్మాత్ములు బలపడ్డారు. శ్రీరామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీరామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి, జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్టలేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తనసుఖాన్ని వదులుకోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు”.

రామాయణ పఠనంవల్ల ఇహపర లోకాల్లో సౌఖ్యంకలిగే విషయాన్ని నారదుడు చెప్తాడీవిధంగా: "రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు, కూతుళ్లతో, మనుమలు, ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని, బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ, పురుషులు, దీన్ని చదవాలి, వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని, కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి".

         రామాయణం ప్రధమ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం "త" కారం తో మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో రామాయణం గాయత్రి సంపుటితమని తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి గ్రంథమని పేరు.

నారదుడు చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించాడు. నారదుడు పోయింతర్వాత, వాల్మీకి, శిష్యుడితో తమసాతీరంలో తిరుగుతూ, ఒక క్రౌంచమిధునాన్ని చూశాడు. ఆయన చూస్తుండగానే, బోయవాడొకడు, జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడ పక్షి ఏడుపు విన్న వాల్మీకి, ఎంతో జాలిపడి, బోయవాడిని శపించాడు. ఇలా ఆదికవి నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల శ్లోకమయింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ, శిష్యుడు భరద్వాజుడితో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం ఆయనకు తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాలని నిశ్చయించుకున్నాడు. సంక్షిప్తంగా నారదుడు చెప్పిన రామ చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకున్నాడు. అలా రామాయణ రచనకు బీజం పడ్డది.
(వాసుదాసు గారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment