Wednesday, May 13, 2020

మహమ్మారికి హోమియోపతి మందు : వనం జ్వాలా నరసింహారావు


మహమ్మారికి హోమియోపతి మందు
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (14-05-2020)
ఆరోగ్యమే మహా భాగ్యం. జీవితంలో అన్నింటికన్న మించిన అదృష్టం ఆరోగ్యంగా ఉండడమే. ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్-19 పేరున్న కరోనా వైరస్ అనే వింత సూక్ష్మ క్రిమి రోగంతో పోరాడుతున్నది. మానవ జీవితాన్ని స్థంభింపజేసిన ఈ వింత రోగం ప్రపంచ ప్రజలందరినీ లాక్ డౌన్ లోకి నెట్టి, ఇంటికి పరిమితం చేసింది.  ఈ అకాల అనారోగ్యాన్ని జయించడం ఎలా అనేది మానవాళి ముందున్న జటిల సమస్య.

         హోమియోపతి వైద్యాన్ని అనుసరించి, తరుణ రోగం లేదా తాత్కాలిక రోగం అనీ, దీర్ఝకాలిక రోగం అనీ రోగాలు రెండు రకాలు. ప్రొడ్రోం పీరియడ్, ప్రొగ్రెస్ పీరియడ్, డిక్లయిన్ పీరియడ్ అని మూడు అంచెలుగా తరుణ రోగాన్ని విభజించవచ్చు.  రోగ కారక క్రిమి, రోగాన్ని కలిగించే క్రిమి లేదా వస్తువు శరీరంలోకి ప్రవేశించి, రోగ లక్షణాలు పుట్టించే సమయాన్ని ప్రోడ్రోం పీరియడ్ అంటారు. రోగ లక్షణాలు తీవ్ర స్థాయికి చేరుకుని, రోగి ఆరోగ్యం బాగుగా దెబ్బతిని, ఆకలి తగ్గి, నిద్రలేకపోవటం, వొళ్లంతా నొప్పులు, తలనొప్పి, కదలలేని పరిస్థితికి చేరుకునే సమయాన్ని ప్రొగ్రెస్ పీరియడ్ అంటారు. ఇక మూడోదైన డిక్లయిన్ పీరియడ్ సమయంలో రోగం కొద్దిగా తగ్గి, రోగ లక్షణాల తీవ్రత తగ్గి, ఆరోగ్యం మెల్లగా కుదుటపడటం లేదా రోగం నుండి తేరుకోలేక మరణించటం జరుగుతుంది.

         వ్యక్తిగత రోగ లక్షణాలు పుట్టించటం, ఆహార అలవాట్లు మారి ఎక్కువగా తినటం లేదా ఆహార లేమి, సరియైన విశ్రాంతి లేకపోవటం, నిద్రలేమి, జ్వరం రావటం, ఒళ్లు నొప్పులు, నిస్త్రాణ, మలబద్దకం, మానసింగా బాధపడటం లాంటి వాటిని సాధారణ రోగం అంటారు. కొద్దిమంది వ్యక్తులకు అనారోగ్యం కలగడం, ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో వున్న కొద్దిమంది వ్యక్తులు ఒకే లక్షణాలతో బాధపడటం, కేవలం ఆ స్థలంలోని వ్యక్తులే బాధపడటం లాంటి వాటిని స్పోరాడిక్ రోగం అంటారు. ఒకే రోగంతో  చాలా మంది ఒకే సమయంలో వివిధ ప్రాంతాలలో బాధ పడినప్పుడు ఎపిడమిక్ అని అంటారు. ఒకే  రోగంతో మొత్తం ప్రపంచం బాధపడినప్పుడు  ప్యాండమిక్ లేదా మహమ్మారి అని అంటారు. కోవిడ్-19 లేదా కరోనా వైరస్ ఆ కోవకు చెందినదే.  

         బ్యాక్టీరియాతో ఏర్పడిన రోగాలను గుర్తించి బ్యాక్టీరియాకు సరిపడ యాంటీ బ్యాక్టీరియా డ్రగ్ ఇచ్చి తగ్గించవచ్చు.  కానీ  ఇప్పుడు వచ్చిన రోగం బ్యాక్టీరియాతో కాక వైరస్ తో వచ్చినది. గతంలో మశూచికం, మమ్స్, పోలియో, ఆటలమ్మ, గత్తరా, చికెన్ పాక్స్, డేంగ్యూ, స్వైన్ ప్లూ ఇలాగే వచ్చాయి. ఇవన్ని వైరల్ రోగాలు. ఇందులో బ్యాక్టీరియావుండదు. ఈ వైరల్ రోగాలకు సరైన మందులు లేవు.  కాలపరిమితి బట్టి వాటంతటవే తగ్గిపోతాయి.  లేదా వాటికి వాక్సిన్లు కనుక్కుని మొత్తం ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి ఇలాంటి  రోగం రాకుండా నిరోధించాలి.

         రోగాలకు తగ్గించటానికి వివిధ వైద్య విధానాలు ఎన్నో వున్నాయి. వాటినే, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్యం, ఇలా రకరకాలుగా పిలుస్తారు.

         వైరల్ రోగాలకు హోమియోపతిలోనే సరియైన వైద్యం వుందని హోమియో వైద్యులు ఘంటాపథంగా చెప్తున్నారు. వారి మాటల ప్రకారం, వందల సంవత్సరాల నుండి హోమియోపతి నుండే రోగ నిరోధనం జరిగింది. అలోపతి వైద్యంలో  ఇలాంటి రోగాలను వ్యాక్సిన్ కనుగొని వాటిని అందరు వ్యక్తులకు ఇచ్చినప్పుడే రోగాన్ని తగ్గించవచ్చు. అలోపతి విధానానికి చెందిన వ్యాక్సిన్స్ మందు తయారీ విధానం, హోమియోపతిలో సాధారణంగా వాడే ఏమందైనా తయారు చేసే విధానం ఒక్కటే.  రోగాన్ని రోగంతోనే తగ్గించటం, విషానికి విషమే విరుగుడు, ముల్లును ముల్లుతోనే తీయాలి, ‘ఊష్ణే ఊష్ణేణ శీతలహ’ లాంటి సూత్రాలు హోమియోపతికి సరిగ్గా సరిపోతాయి.

         హోమియోపతిని సారూప్యఔషధ చికిత్సా విధానం అని కూడా అంటారు. హోమియోపతిలో వస్తుగుణ దీపికలో (మెటీరియా మెడికా)  వున్న అన్ని మందులు మనిషిపై ప్రయోగించి నిరూపించబడిన ఔషధాలే.   ప్రతి మందు కనీసం వేయిమందిపై ప్రయోగించి వాటిని నిర్ధారించుకొని, తరువాత వాటిని వస్తుగుణ దీపిక అనే పుస్తకంలో  ఎక్కిస్తారు. వాస్తవానికి వాక్సిన్ మందు నిరూపణ క్రూడ్ ఒక తరహా ప్రయోగం. హోమియోపతిలోని మందులు అన్ని పోటెన్సీ చేయబడిన మందులంటారు ఆ విధానం వైద్యులు.

         ‘మర్ధనం గుణ వర్ధనం’ అనే సూత్ర ప్రకారం మందును ఎంత ఎక్కువ  నూరితే అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అణు, పరమాణు సిద్దాంతం ప్రకారం అణువులను ఎంత ఎక్కువగా విభజించనట్లైతే అది అంత ఎక్కువ ప్రభావంతంగా తయారవుతుంది. హోమియోపతిలో  మందుకై వాడిన మూల పదార్ధం అసలు ఉండదు.  కానీ దాని అంతర్గతంగానున్న లక్షణాలు బహిర్గతమయి  రోగ లక్షణాలను పుట్టిస్తాయి. హోమియోపతి మందులను ముందు ఆరోగ్యంగా వున్న వ్యక్తులకు ఇచ్చి వాటివల్ల వారిలో వచ్చిన మార్పులను (మానసింగా, శారీరకంగా) వందల మందిపై ప్రయోగించి నిరూపణ జరిగిన తరువాత ఆ మందు లక్షణాలుగా వస్తుగుణ దీపికలో కూర్చటం జరుగుతుంది.

         వైరస్ ఒక డైనమిక్ డిసీజ్. ఆ డైనమిక్ డిసీజ్ ను ఇంకొక డైనమిక్ డ్రగ్ తోనే తగ్గించాలి.   వ్యాక్సిన్ అనేది ఒక క్రూడ్ విధానం. దాని ప్రయోగం వల్ల విపరీతమయిన పరిణామాలు జరుగుతాయి లేదా జరగవచ్చు.   డైనమిక్ మందువల్ల విపరీతమయిన పరిణామాలు అసలే రావు.


         1979లో అనంతపురం రాష్ట్రంలో జపనీస్ ఎన్ కెఫలైటస్ రావడంతో వైద్యులు ఆందోళన చెందారు. చాలా మంది పిల్లలు చనిపోయారు. నాటి ప్రభుత్వం, హైదరాబాదు హోమియో వైద్య కళాశాల వైద్య బృందాన్ని అనంతపురం పంపింది. ఆ జపనీస్ ఎన్ కెఫలైటస్ ఎపిడమిక్ ను క్షణ్ణంగా పరిశీలించి  రోగలక్షణాలను సమీకరించి ఆ లక్షణాలను హోమియో వస్తుగుణ దీపికలో పేర్కొన్న విధంగా ‘బెల్లడోనా’ అనే మందును ప్రీవెంటివ్ గా వాడారు.  చాలా మంచి ఫలితాలను ఇచ్చిందా ఔషధం. చాలా మంది పిల్లలకు రోగం సోకకుండా నిరోధించటం జరిగింది. ఎన్ కెఫలిటిస్ వ్యాధికి గురై పక్షవాతం, ఫిట్స్ తో బాధపడుతున్నపిల్లలను హిందూపుర్, కద్రీ, పుట్టపర్తి, అనంతపుర్ స్థానిక ఆసుపత్రులలో ఉంచి వారికి పూర్తి చికిత్స అందించి రోగంతో వచ్చిన విపరీత పరిణామాలు పూర్తిగా చికిత్స చేయటం జరిగిందని అప్పట్లో ఆ కళాశాలలో పని చేసిన డాక్టర్ వల్లభేందర్ రెడ్డి చెప్పారు.

         అదే సమస్య మళ్లీ 1981 లో, 1984 లో హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ లో వచ్చినప్పుడు హోమియో వైద్యుంతోనే చాలా వరకు తగ్గించటం జరిగింది. ఈ తరుణ వ్యాధులు మరలా  రాకుండా ఉండటానికి హోమియోలో పిల్లలో వ్యాధి నిరోదక శక్తి కల్పించటానికి ఒక కోర్సులాగా బెల్లడోనా, కాల్కేరియా కార్బ్, ట్యూబర్కులినమ్ అనే మందు ఇవ్వటం జరిగింది.   దీనితో జపనీస్ ఎన్ కెఫలిటిస్ అనే రోగం నిరోధించటం జరిగింది. 

         అప్పుడప్పుడు వచ్చే వైరల్ డిసీజెస్ అయిన స్వైన్ ప్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా, లాంటి రోగాలకు ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇచ్చి తగ్గించటం హోమియోపతి మందులతో సాధ్యమేనని హోమియో డాక్టర్లు అంటున్నారు. ఇప్పుడు కూడా హోమియోపతి వైద్య విధానానికి ఈ బాధ్యత అప్ప జెప్పినట్లయితే కోవిడ్ -19 అనే ప్యాండమిక్ కరోనా వైరల్ డిసీజ్ ను ప్రపంచంలో ఎక్కడా లేకుండా తరిమి కొట్టవచ్చునన్న ధీమా కూడా హోమియో వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. హోమియో విధానం చికిత్స వల్ల ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవనీ, ఈ మందుల వల్ల శరీరంలో గల రోగనిరోధక శక్తిని పెంపొందించి  వైరస్ తో ఏలాంటి విపరీతమైన పరిస్థితి ఏర్పడకుండా చేయవచ్చనీ వారి వాదన.

         హోమియోపతిలో రోగం రోగంతోనే చికిత్స చేయబడుతుంది. ఇందులో  మందులన్నీ 1000 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించి, తద్వారా ఉత్పన్నమయిన రోగ లక్షణాలను (మానసికంగా, శారీరకంగా) పరిశీలించి, విజయవంతం అయిన తరువాత మెటీరియా మెడికాలో పొందుపరుస్తారు. దీన్నే వాళ్ళు డ్రగ్ ప్రూఫింగ్ అని కూడా అంటారు.

         ప్రతీ వస్తువులో రోగాన్ని కల్గించే లక్షణముంటుంది.  ఏ వస్తువువైనా మందు తయ్యారు చేయటానికి వాడవచ్చు.  హోమియోపతి వైద్య విధానంలో మాములుగా మనం రోజూ వాడుకునే నిత్యావసర వస్తువులను మందులుగా తయారు చేయటం జరుగుతుంది. ఉప్పు (నేట్రం మూర్),  ఎర్రమిరపకాయలు (కాప్సికం), ఉల్లిగడ్డ (అల్లియం సేపా), ఎల్లిగడ్డ (అల్లియం సాటివా) ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  పాము విషాలతో మందులు నాజా (నాగుపాము విషం),  క్రోటాలస్ హరిడస్ (కట్ల పాము విషం), లాకేసిస్ (సరుకుక్క్రు సర్పం) కూడా వున్నాయి. అలాగే ఆర్సెనికం ఆల్బ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి రసాయినికాలు, శాకాహారాలు, వృక్ష సంపద లాంటివి పేర్కొనవచ్చు.  ఈ మందులకు వాడే వస్తువులను, క్రూడ్  ఫార్మింగ్ లో కాకుండా, వాటిని పొటెంటైజ్ చేసి వాటిలోని నిఘూడమైన శక్తిని విడుదల చేసి మనకవసరమయిన శక్తితో దానిని వాడటానికి తయారు చేస్తారని హోమియో నిపుణులు అంటున్నారు.

ఎలాంటి రోగ చికిత్స చేయటానికైనా రోగి లక్షణాలను వివరంగా కనుగొని రోగి ఆహార లక్షణాలు, నిద్ర, మల విసర్జన, వ్యక్తిగత లక్షణాలు, మానసిక లక్షణాలు, ఇష్టా-యిష్టాలు, ఉద్రేక, ఉపసమాలు విచారించి, వాటికి సరితూగే హోమియోతో ఇదివరకే నిరూపితమైన మందులతో పోల్చి సరిపడే మందు  రోగి రోగ నిరోదక శకిననుసరించి పొటెన్సి సెలెక్ట్ చేయటం జరుగుతుంది. అలా ఇచ్చే మందు పొటెన్సీలో రోగిరోగ శక్తికి మించినదయి, ఎక్కువ  శక్తి కలిగి రోగాన్ని పుట్టించాలి.   అప్పుడు మందు వలన పుట్టిన రోగము ఎక్కువ శక్తివంతమయినది కనుక  రోగమున్న అవయములలో పాతరోగాన్ని తీసివేసి మందు వల్ల పుట్టిన శక్తివంతమయిన  కొత్త రోగము అక్రమిస్తుంది. శరీరం కొత్త రోగము రాకతో  జాగ్రత్తపడి, అసలు రోగాన్ని  ప్రాలదోలటానికి దాగిన శక్తిని సమీకరించుకొని శరీరము నుండి పారద్రోలుతుంది. దానితో రోగము తగ్గి కొత్త శక్తితో శరీరము పనిచేయుట మొదలెడుతుంది. హోమియో చికిత్స పొందిన రోగి రోగనివృత్తి జరిగి రోగము నుండి  బయట బడిన తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శక్తివంతులై, మానసికంగా శారీరకంగా శక్తివంతుడై ఉత్సాహంగా ఉంటాడు. మందువల్ల పుట్టిన రోగము తాత్కాలికము గనుక అది శరీరాన్ని వదిలివేస్తుంది.

         హోమియో వైద్యానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.   రోగే ఒక ప్రయోగశాల.  ఎప్పుడైతే రోగి శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా తయ్యారవుతాడో అతనిలో ఏ రోగము లేదని నిర్దారణ జరుగుతుంది.  రోగి  రోగ లక్షణాలు ముఖ్యం కాని పయోగశాలలో వచ్చే ఫలితాలు ముఖ్యం కాదు.   రోగ నిర్దారణకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలకై ఉపయోగపడ్తాయి గాని మందు సెలెక్షన్ కు ఏ మాత్రము పనికిరావు.

         రకరకాల మందులు కరోనా వ్యాధి నివారణకు వాడవచ్చుననీ, కరోనాలో వున్న వ్యాధి లక్షణాలు, ఆరోగ్యవంతులపై ప్రయోగించి నిరూపించబడిన హోమియో మందుల  లక్షణాలు ఒకే రూపంలోనున్నందున ఈ మందులను వాడటం వలన  ఏ విపరీతమయిన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులను వాడవచ్చనీ ప్రముఖ హోమియో డాక్టర్ వల్లభేందర్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం కొన్ని జోన్ ఏరియాలను ఎంపిక చేసి, అక్కడున్న వారికి హోమియో వైద్యుని సలహాపై మందును  నిర్ణయించి, ఉపయోగించి చూస్తే చాలా ప్రాంతాలను లాక్ డౌన్ నుంచి తొలగించవచ్చునని ఆయన తన ప్రగాఢ నమ్మకాన్ని వెలిబుచ్చారు.

         ఒకానొక సందర్భంలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమియోపతి వైద్యం ప్రజల ఆరోగ్య స్థితిని కాపాడడానికి దోహదపడుతుందన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ హోమియోపతి ఉపయోగాలను నొక్కి వక్కాణించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మార్చ్ 6 న ఒక సూచన కూడా చేసింది మంత్రిత్వ శాఖ.

హోమియో వైద్యం శాస్త్రీయ పద్ధతిలోనే జరగుతుందంటున్నారు హోమియో వైద్యులు. ఈ వైద్యం 200 సంవత్సరాల క్రితం నుంచే అమలులోకి వచ్చింది. భారతదేశంలో నేటికి ఒకటిన్నర శతాబ్దానికి మించి హోమియోపతి విధానం అనుసరించబడుతోంది. జాతీయ వైద్య విధానాలలో ఒకటిగా గుర్తించబడి, దేశ సాంప్రదాయాలతో మిళితం చేయబడిన విధానంగా ఇది పాతుకుపోయింది. అధిక సంఖ్యాక ప్రజానీకానికి ఇది ఆరోగ్య సంరక్షణను కలుగజేయడంలో ఒక అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఒక్కసారి వాడి చూస్తే దీని ప్రతిభ, సామర్ధ్యం విదితమవుతాయి కాబట్టి, కరోనా వైరస్ కు హోమియో మందు వాడి చూస్తే ఎలా వుంటుంది?
         (ప్రముఖ హోమియో వైద్యులు, డాక్టర్ వల్లభేందర్ రెడ్డితో సంభాషణ ఆధారంగా రాసిన వ్యాసం)

No comments:

Post a Comment