Wednesday, May 20, 2020

రామావతారంలో ....దుష్టశిక్షణ స్త్రీ వధతోనే మొదలా? : వనం జ్వాలా నరసింహారావు


రామావతారంలో ....దుష్టశిక్షణ స్త్రీ వధతోనే మొదలా?  
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక, చింతన (21-05-2020)  
మిథిలా నగరానికి పోయే దారిలో శ్రీరామలక్ష్మణులకు  కామాశ్రమాన్ని చూపించి, ఆ తరువాత, తాటకాశ్రమాన్ని వారి పాద స్పర్శతో పవిత్రం చేయించాలన్న తలంపుతో అక్కడికి తీసుకుపోతున్నాడు విశ్వామిత్రుడు. ఆ క్రమంలో నడస్తూ పోయి, గంగాతీరాన్ని చేరారు. అక్కడున్న మునులు వీరు రాబోతున్న సంగతి ముందే తెలుసుకుని, నావను సిద్ధంగా వుంచి, విశ్వామిత్రుడి కెదురుగావచ్చి, గంగానదిని దాటమని ప్రార్థిస్తారు. ఆ ప్రయాణంలో విశ్వామిత్రుడు, వారికి సరయూనది చరిత్రను, దాని పుట్టు పూర్వోత్తరాలను ఆరంభంనుంచి చెప్పాడు.

"బ్రహ్మ దేవుడు తన సంకల్పంతో కైలాసంలో ఒక చెరువును సృష్టించాడు. తన మానసంతో సృష్టించాడు కనుక దానికి ’మానస సరస్సు’ అనీ, దానినుండి వెడలివచ్చిన నదికి ’సరయు’ అని పేర్లు వచ్చాయి. సరయూ నది అయోధ్యా నగరాన్ని తాకుతూ ప్రవహించి, గంగానదిలో కలుస్తుంది. సరయూ నది నీళ్లు ఎత్తునుండి గంగలో పడడం వల్ల, రెండు నదుల నీళ్లు రాసుకుని ఆశ్చర్యకరమైన శబ్దం వస్తున్నది. రెండు నదులు కలసిన ప్రదేశాన్ని గంగా-సరయూ సంగమం అంటారు”.

(సరయూ నది అయోధ్యకు పడమటి భాగంలో ఆరంభమై, ఉత్తరంగా పారి, తూర్పువైపుకొచ్చి, అంగ దేశంలో నుండి ప్రవహించి గంగలో కలుస్తుంది).

అదొక పుణ్య తీర్థం కాబట్టి శ్రద్ధతో నమస్కరించమని విశ్వామిత్రుడనగానే రామ లక్ష్మణులు ముని చెప్పినట్లే చేసి, నది దక్షిణపు వొడ్డుకు చేరారు. అక్కడ నావ దిగి, ముగ్గురూ కాలినడకన ప్రయాణమై పోతుండగా, దారిలో భయంకరమైన అడవిని చేరుతారు. మనుష్య సంచారం లేని  కారడవిని చూసిన రామ లక్ష్మణులు, భయంకరంగా కనిపిస్తుండే ఆ కారడవిలో వుండేదెవరని ప్రశ్నిస్తారు. గంగానదికి దక్షిణపు వొడ్డున వున్న ఆ అడవే తాటకారణ్యం. ఆ అరణ్యాన్ని గురించి విశ్వామిత్రుడు వివరంగా చెప్పాడిలా.

"ఈ వనాన్ని పూర్వకాలంలో దేవతలవంటి వారు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతమంతా ధన ధాన్య సమృద్ధి కలిగి, లోకులందరి చే గౌరవించబడేది. మలద మని, కరూశ మని ఈ వూళ్ల పేర్లు. పూర్వం ఈ స్థలంలో ఇంద్రుడు కశ్యపుడి కొడుకైన వృత్రాసురుడిని చంపినందువల్ల అతడికి బ్రహ్మ హత్యా పాతకం తగిలింది. ఆ దోషం వల్ల ఇంద్రుడికి ఆకలి-మలం విడవడం జరిగింది. ఇంద్రుడికి కలిగిన బాధను, దోషాన్ని తొలగించేందుకు దేవతలు ఆయనతో దివ్య తీర్థాల్లో స్నానం చేయించారు. దాంతో ఆయనకు బ్రహ్మ హత్యా పాతకం తొలగిపోయింది. ఆకలి, మలం, రెండూ ఇక్కడే పోవడం వల్ల, ఇక్కడున్న ఒక ప్రదేశానికి మలద మని, మరో ప్రదేశానికి కరూశ మని ఇంద్రుడు పేర్లు పెట్టాడు. ఈ దేశాలు సౌఖ్యాతిశయంతో అలరారుతుంటే, ప్రజలు ధన ధాన్యాలతో సమృద్ధిగా వుండేవారుఅని చెప్పాడు విశ్వామిత్రుడు.

"కొంతకాలం గడిచిన తర్వాత, ఈ ప్రాంతానికి, వెయ్యేనుగుల బలంగల, తాటక అనే ఒక యక్ష స్త్రీ వచ్చింది. తాటక, సుందుడు అనే వాడికి భార్యై, ఇంద్రుడితో సమానమైన బల పరాక్రమాలు వున్న మారీచుడు అనే నీచ రాక్షస కొడుకును కనింది. వాడు ప్రతిరోజు ఈ ప్రాంతంలో కనిపించిన ప్రతివాడినీ తినడంతో, ఇదొక శ్మశానంగా మారిపోయింది. మలద, కరూశాలు రూపురేఖలు మారిపోయి, భయంకరమైన కారడవిగా తయారయింది రామా" అని అంటాడు విశ్వామిత్రుడు. అలా ఆ దేశం ఏ విధంగా పాడుకాబడ్డదో వివరించి, తాటక నివసించే స్థలం అక్కడికి ఒక ఆమడ దూరంలోనే వుందనీ, తన భుజ బలంతో తాటకను చంపి, ఆ ప్రదేశాన్ని ఖేదంలేనిదానిగా, చేయాలని రాముడిని ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు.

లోకంలో యక్షులు దుర్బలులు అన్న పేరుందని, అలాంటప్పుడు ఒక యక్ష స్త్రీకి ఎట్లా వేయేనుగుల బలం కలిగిందని సంశయం వెలిబుచ్చాడు రాముడు. జవాబుగా: "పూర్వకాలంలో సదాచార సంపన్నుడైన సుకేతుడు అనే గొప్ప యక్షుడుండేవాడు. వాడికి సంతానం లేక పోవడంతో, బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు. సంతోషించిన బ్రహ్మ, వాడికి కొడుకును ఇవ్వకుండా, వేయేనుగుల బలంగల కూతురును ఇచ్చాడు. అది రూప యౌవనాలు కలిగినప్పుడు, సుకేతుడు, ఝర్ఝుని కొడుకైన సుందుడు కిచ్చి వివాహం చేశాడు. వారికి మారీచుడు అనే క్రూరుడైన కొడుకు పుట్టాడు. సుందుడు అగస్త్యుడి వల్ల మరణించాడు. మొగుడిని చంపిన అగస్త్యుడి మీద పగపట్టిన తాటక, కొడుకు మారీచుడుతో కలిసి, అతడిని చంపబోయింది. కోపగించిన అగస్త్యుడు, మారీచుడిని రాక్షసుడుగా కమ్మని, తాటకకు సుందర రూపం పోయి భయంకర రూపం కలగాలని శపిస్తాడు. శాపగ్రస్తురాలైన తాటక రాక్షస రూపంలో, అగస్త్యుడు సంచరించిన ప్రదేశంలోని మనుష్యులను తింటూ, వూళ్లకు వూళ్లనే పాడుచేసింది" అని వివరణ ఇచ్చి, గో బ్రాహ్మణులకు మేలు కలిగే విధంగా, దయను విడిచి, తాటకను చంపి, కీర్తిమంతుడవు కమ్మని రాముడితో అంటాడు విశ్వామిత్రుడు.


"తాటక మిక్కిలి బలశాలి. శాపం వల్ల క్రూరురాలైంది. అలాంటి స్త్రీ ని చంపితే పాపం వస్తుందని భావించ వద్దు. భూమిని పాలించేవారు, ప్రజలను రక్షించేందుకు, క్రూరమైనా, కాకున్నా, పాపం వచ్చినా, పుణ్యం వచ్చినా, తనపై నింద పడ్డా, ఏ పనైనా చేయాల్సిందే. ఎందుకంటే, తాను చెడిపోయినా, లోకంలోని అనేకమందిని కాపాడాలి. ఎందరో మనుష్యులు, ఆవులు తాటక మూలాన ప్రాణాలు కోల్పోతుంటే, నువ్వు వాళ్లను రక్షించే శక్తి వుండికూడా, మౌనంగా వూరుకుంటే, గో - బ్రాహ్మణ హత్యా దోషం నీకు కలుగుతుంది.

స్త్రీ వధ అధర్మమంటే, నిష్కారణంగా, అధర్మంగా, ఇంత మందిని ఈ క్రూరురాలు చంపుతుంటే, రక్షించే శక్తి వుండికూడా, సహించి వూరుకోవడం ధర్మమా? అలా వూరుకుంటే, క్రమక్రమంగా దుష్టులు ప్రబలిపోతారు. శిష్టులు హతమై పోతారు. అధర్మాన్ని ధర్మమే జయించాలి గాని, అధర్మంతో జయించాలనుకుంటే, ఇరువురికీ తేడా లేదుకదా! అధర్మాన్ని ధర్మంతో జయించాలని అనుకున్నప్పుడే, అది ఉత్తమమైన మార్గమవుతుంది. అదే కనుక సాధ్యం కాకపోతే, అధర్మ వర్తనులను, అధర్మ మార్గంలోనే జయిస్తే, వారి అధర్మమే వారిని చంపినట్లవుతుంది. దీనివలన, అధర్మవర్తనుడు ధర్మంతోనైనా, అధర్మంతోనైనా చెడిపోతాడని భావమొస్తుంది. కాబట్టి, క్రూరులను క్రూరంగానూ, కుటిలులను కుటిలత తోనూ, అధర్మ వర్తనులను అధర్మంగానే, లోక హితం కోరి అణచడం తప్పుకాదు”.

“ప్రజలు నిష్కారణంగా చస్తుంటే చూసేవాడు రాజు కాడు. నువ్వు అధర్మ కార్యం చేయాలని నేను చెప్పుతున్నానని అనుకోవద్దు. శాస్త్రం చదవడం వల్ల, అనుభవం వల్ల, నాకు రాజ ధర్మం తెలుసు. కాబట్టి దాన్ని చంపు. రామచంద్రా!  నువ్వింక ఆలోచించాల్సిన పనిలేదు. నేను చెప్పినట్లే తాటకను చంప" మని విశ్వామిత్రుడు రాముడికి పలు విధాలుగా బోధిస్తాడు.

విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ విని, రామచంద్రమూర్తి తనలో తానే ఆలోచించాడు కొంత సేపు. " స్త్రీ వధా పాపం అనిపిస్తుంది. గురువైన విశ్వామిత్రుడేమో అధర్మ ప్రవర్తైన తాటకను చంపడం పాపం కాదంటున్నాడు. ఆయనెందుకు అసత్యం చెప్పి తనతో అధర్మ కార్యం చేయిస్తాడు? ఏదేమైనా, ఈ ధర్మ-అధర్మ విచారం తో నాకు పనిలేదు. నిండు సభలో తన తండ్రి విశ్వామిత్రుడు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు తనతో. జనకుడు ఆజ్ఞ జవదాటకూడదు. గౌరవించాలి. కాబట్తి ధర్మమో, అధర్మమో మునీంద్రుడి ఇష్టప్రకారం నడచుకుంటాను" అని నిర్ణయించుకుంటాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సమానుడైన ఈ బ్రహ్మవాది ఆజ్ఞ నెరవేరుద్దామని అనుకుంటాడు రాముడు. అలా నిశ్చయించుకున్న రాముడు, విశ్వామిత్రుడిని చూసి, చేతులెత్తి నమస్కరించి " మునీంద్రా ! బ్రాహ్మణులు, గోవులు, దేశాలు సుఖపడేందుకు నీ ఆజ్ఞ ప్రకారం తాటక ను చంపుతాను" అంటూ, దిక్కులు వూగే ధ్వని వచ్చే విధంగా తన అల్లె తాడును లాగాడు. చెవులు పగిలి పోయేటట్లు వచ్చిన ఆ ధ్వనిని విన్న తాటక, హుంకారాలతో, భూమి, దిక్కులు పగిలిపోయే విధంగా గర్జిస్తూ,  రాముడి అల్లె త్రాటి ధ్వని వచ్చిన దిక్కును పసిగట్టి, ధ్వని చేసుకుంటూ, పాదాలు నేలపై కొట్టుకుంటూ, భయంకరాకారంతో వీరున్నవైపు రాసాగింది.

దాన్ని గమనించిన రాముడు లక్ష్మణుడితో అంటాడీవిధంగా: "తమ్ముడా, లక్ష్మణా ! ఈ రాక్షసి ఎలా వికార వేషంతో, భయంకర దేహంతో, దిగులు పుట్టే ధ్వని చేస్తుందో చూశావా? ఎవరికైనా దీన్ని జయించడం సులభం కాదు. విశ్వామిత్రుడు సత్యమే చెప్పాడు. దీన్నెవరూ జయించ లేకపోవడం నిజమే. నేనే దీన్ని చంపాలి. కాకపోతే, స్త్రీ ని ఎట్లా చంపాలన్న కరుణ నన్ను పీడిస్తున్నది. అందుకే దీన్ని చంపకుండా, ముక్కు, చెవులు కోసి, గమన వేగాన్ని అణచివేసి, వెనక్కు తిరిగి పోయేటట్లు చేస్తాను. దాంతో భయం కలిగి చెడ్డ పనులు చేయదు" అని అంటుండగానే, ఆ రాక్షసి రాముడి మీద పడబోయింది. ఎప్పుడైతే తాటక భయంకర ఆకారంతో రాముడి పై పడబోయిందో, అప్పుడే విశ్వామిత్రుడు, హుంకారంతో అదిలించి, "రామభద్రుడికి జయం-జయం" అని దీవించాడు.

తాటక కూడా దూరం నుండే రాముడిపై గాలి వాన కురిపించింది. నివ్వెరపడ్డ రాముడు ప్రతిగా ఏం చేద్దామని ఆలోచిస్తుండగానే, తాటక మాయతో రామ లక్ష్మణులమీద రివ్వు-రివ్వున, ధారలు-ధారలుగా, రాళ్లవాన విరామం లేకుండా కురిపించింది. దాని చేష్టలకు కోపించిన రాముడు బాణాలను కురిపించి తాటక రెండు చేతులను నరికివేశాడు. దానిని చంపనని, ముక్కు చెవులు మాత్రమే కోస్తానని అన్న చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్న లక్ష్మణుడు, ఆ పనిని తానే చేయదలిచి, దాని పైకి దూకి, దాని ముక్కు చెవులు ఖండిస్తాడు. అంతమాత్రాన అది వెనుకంజ వేయకుండా, విజృంభించి, నానా రూపాలు ధరించి, కళ్ళకు కనిపించకుండా, మాయలతో, మతి భ్రమణం కలిగించే రీతిలో విపరీతంగా రాళ్ల వాన కురిపిస్తూ ఎదిరించసాగింది.

ఇది గమనించిన విశ్వామిత్రుడు దీన్ని చంపటంలో ఆలశ్యం చేస్తే, సంధ్య వేళైతే, ఇక చంపడం అసాధ్యం అని హెచ్చరిస్తాడు. ఆయనలా అంటుండగానే, తాటక రాళ్లవాన కురిపిస్తూ, మాయా బలంతో తనను సమీపిస్తుంటే, అది కనబడకపోయినా, ధ్వనిని బట్టి గుర్తించి, బాణాలు ప్రయోగించి రాముడు దాని మదం అణిచాడు. తీక్షణమైన బాణాన్ని సంధించి, దాని రొమ్ములో నాటుకునేటట్లు వేయడంతో, ఆ రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది. అది చూసిన ఇంద్రాది దేవతలు, దుష్ట రాక్షసి చనిపోయిందని సంతోషించారు. ఇంతటి బలవంతురాలిని కేవలం బాణాలతోనే రామచంద్రమూర్తి సంహరించాడు. ఆయనకే కనుక అస్త్ర బలం వుంటే ఎంత కార్యమైనా చేయగలడని పొగుడుతూ శ్రీరాముడిని పూజించారు దేవతలు.

శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. స్త్రీ వధ పాపం అని రామాయణమే చెపుతుంది. భరత వాక్యం, హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియచేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు, ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని, బంధువులను చంపితే పాపం వస్తుందని, భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని, స్త్రీ ని చంపవచ్చానని, శంకించాడు రాముడు. కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో, విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకను చంపడం దోషం కాదు.

ఇంద్రాది దేవతలు అస్త్ర దానం చేయడానికి విశ్వామిత్రుడికి రాముడుకంటె యోగ్యుడైన వాడు మరొకరు కనిపించడని, అందుకే, ఆయన దగ్గరున్న విద్యా సమూహాన్నంతా రాముడికివ్వమని చెప్పి పోతారు వారందరు. ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయం కాగానే, తన ఆశ్రమానికి పోదామని అంటాడు. సరేనన్న రామ లక్ష్మణులు, ఆ మూడో రోజు రాత్రి, అక్కడే వుండిపోయారు. ఆ వనం కూడా తాటక చావుతో శాపం తీరిన దానిలాగా, కుబేరుడి ఉద్యానవనం లాగా అనిపిస్తూ, సుందర లక్ష్మికి నివాస భూమిలాగా అగుపడ సాగింది. 
(వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment