Sunday, May 24, 2020

భగవదవతార ప్రయోజనం శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-9 : వనం జ్వాలా నరసింహారావు


భగవదవతార ప్రయోజనం శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-9
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (25-05-2020)
పాయసం పంచడంలో దశరథుడు, భార్యలలో పెద్ద-పిన్న తరం ఆలోచించాడు. అందరికన్నా పెద్దభార్య-పట్టపు దేవి కౌసల్య. రెండోది సుమిత్ర. మూడవ భార్య కైకేయి. కాబట్టి పాయసంలో సగభాగం కౌసల్యకిచ్చాడు మొదలే. తక్కిన సగభాగంలో రెండవ భార్య సుమిత్రకు సగం తొలుత ఇచ్చాడు. ఇంకో సగం కైకేయికిస్తే, సుమిత్రను-కైకేయిని సమానంగా చూసినట్లవుతుందనీ-అది ధర్మంకాదనీ, నయజ్ఞుడైన దశరథుడు ఆలోచించి, మిగిలిన పాతిక భాగంలో సగం కైకేయికి-సగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. కైకేయి అందరికన్నా చిన్నదైనందున "పరక" పాలిచ్చాడు. ఆవిధంగా, సగం కౌసల్యకు-పాతిక ఒకసారి, పరక ఒకసారి సుమిత్రకు-పరక కైకేయికి ఇచ్చాడు. కైకేయి సంభోగ విషయంలో ప్రియురాలు కాని న్యాయంగా భాగంలో కాదు దశరథుడికి. ఇలా తారతమ్యం లేకపోయినట్లైతే, పెద్ద-చిన్న గౌరవం పాటించనట్లు అవుతుంది. ధర్మ దృష్టి చేసిన భాగ పరిష్కారం కనుకనే, రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. దశరథుడికి ధర్మాత్ముడని పేరొచ్చింది అందుకే. ఇకపోతే: రామచంద్రమూర్తి విష్ణువు అర్థాంశం. లక్ష్మణుడు పాదాంశం. భరత-శత్రుఘ్నులు ఇరువురుకలసి పాదాంశం. తనకు న్యాయంగా రావలసిన భాగం దశరథుడు తనకీయగానే కౌసల్య పాయసాన్ని తాగింది-ఆకారణం వల్ల ఆమె కొడుకు తొలుత జన్మించి జ్యేష్టుడయ్యాడు. సుమిత్ర తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడు గా పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు చివరలో జన్మించారు.

దేవతల క్షేమం కోరి శ్రీమహావిష్ణువు భూలోకంలో జన్మించేందుకు సంకల్పించాడు కనుక, ఆయనకు సహాయపడేందుకు, బలవంతులను-కామరూపులను-గోళ్ళు,కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశించాడు బ్రహ్మ. దేవతలు-సిద్ధులు-సాధ్యులు-కిన్నరులు-కింపురుషులు-ఋషులు-చారణులు-ఖేచరులు మొదలైన వారందరూ వానర వీరులను, భల్లూక శూరులను విస్తారంగా పుట్టించారు. వారందరూ, కానల్లో-కోనల్లో-పర్వతాలలో సంచరించసాగారు. భూమిపై వ్యాపించి, రాళ్లు - చెట్లు - గోళ్ళు - కోరలు, ఆయుధాలుగా చేసుకొని, నానా శస్త్రాస్త్ర ప్రయోగాలను తెలుసుకున్నారు. దేవతల పుత్రులు కనుక స్వయంగానే శస్త్రాస్త్రజ్ఞానం కలవారే. కాకపోతే వాటితో యుద్ధంచేయరు-చేయలేదు కూడా. వారి ఆయుధాలు నఖ-వృక్ష-శిలలు. శస్త్రాస్త్ర జ్ఞానం పరులనుండి తమను రక్షించుకోవడానికే గాని, ఇతరులపై ప్రయోగించడానికి కాదు. రామ రావణ యుద్ధంలో, రామలక్ష్మణులు తప్ప వారి పక్షంలో అస్త్ర యుద్ధం చేసిన వారెవరూ లేరు. శస్త్రాస్త్రాలు వానరులు ప్రయోగించడం స్వభావ విరుద్ధం. వారలా చేసుంటే, వానరులను రావణుడు స్వభావవానరులుకాదనీ - దేవతలనీ తెలుసుకొనేవాడు. అప్పుడు వారివల్ల రావణుడికి బాధలేదు. దేవతలు పశుపక్ష్యాదులతో కొక్కోక శాస్త్రం ప్రకారం, ఆంతర సంభోగం ద్వారా సంతానం పొందారని భావించరాదు. తమ సంకల్ప బలంతోనే - తామే ఆయా జాతి స్త్రీులయందు, ఆయా ఆకారాలు ధరించి, జన్మించారని అనుకోవాలి. కొంతకాలం పూర్వం, స్త్రీ - పురుష సంభోగం లేకుండానే, సంతానం దృష్టి - స్పర్శ - సంకల్పంతో కలిగేదని విష్ణుపురాణంలో వుంది. రామచంద్రమూర్తి వధించిన వాలి ఆయనకెలా సహాయపడ్డాడని సందేహం కలగొచ్చు. వాలి-సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే పుట్టారు. ఇదొక రకమైన ఏర్పాటు. దీనినే "సమయ" మని అని పేరు. వాలి రావణవధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు, రావణుడితో స్నేహం చేసాడు. భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే సుగ్రీవుడికి హానిచేసి, అతడిని చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు.


వాలి వధానంతరం సుగ్రీవుడితో: "వాలివలె నీవుకూడా సమయం పాటించకపోతే వాడి గతే నీకూ పట్తుంది"అని రాముడు అంటాడు.ఈ సమయమనేది రామసుగ్రీవులకు ఋశ్యమూకంలోనే జరిగిందికాదనీ-వాలి సుగ్రీవుల జనన కాలంలోనే జరిగిందనీ మరో కథ వుంది.ఈ విషయం అంగదుడి ద్వారా తెలిసిందంటారు. వాలి పుట్టకపోతే-పుట్టినా సుగ్రీవుడితో విరోధించకపోతే-విరోధించినా రాముడి చేతిలో చావకపోతే, రావణాసురుడి వధే జరుగకపోయేది. వాలి జన్మించి సుగ్రీవుడితో విరోధించడం వల్లే సుగ్రీవుడికి-రాముడికి స్నేహం కలిగింది. అదే, వాలికి-రాముడికి స్నేహమయినట్లైతే ప్రయోజనంలేకపోయేది.వాలి భయంతో, రావణుడు సీతను రాముడికి అప్పచెప్పేవాడే. అంటే, లోకోపద్రవం తగ్గేదికాదు. అపరాధికి శిక్షపడకపోయేది. వాలి జననం-సుగ్రీవుడితో విరోధం-రాముడి చేతిలో చావు, రామ కార్యమే.

దశరథుడి వద్దకు విశ్వామిత్రుడు యాగ రక్షణకై రాముడిని పంపమని అడగాడానికొచ్చేంతవరకు, భగవదవతారాన్ని గురించే చెప్పబడింది. ఇక ఇక్కడినుంచి, చివరివరకూ, భగవదవతార ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయోజనాల్లో, శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన ముఖ్యమయినవి. ఈ ప్రయోజనాల్లో సేద్యం చేసేవారికి, ధాన్యంలాగా లభించే ప్రధాన ఫలం, శిశ్ఠపరిపాలనే. పైరు బాగుపడేందుకు ఏ విధంగానైతే కలుపు మొక్కలను పీకేస్తామో, అదేవిధంగా, శిష్ఠరక్షణార్థమై నడమంత్రపు సిరైన దుష్ట శిక్షణ తప్పనిసరిగా జరగాల్సిందే.

విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తన వెంట పంపమన్న మాట వినగానే దశరథుడి ముఖం విలవిల బోయింది. కొడుకుమీదుండే మోహంతో - పామరత్వంతో - శ్రీరాముడి మూల్యాన్నే ఎంచుతూ, ఆయన మహాత్మ్యాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ మరచిపోయి, రామచంద్రమూర్తిని పంపలేనని అంటాడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి మహాత్మ్యాన్ని విశ్వామిత్రుడు చెప్పినప్పటికీ, దశరథుడింకా "మారాముడు", "పసిబాలుడు", "బాలక్రీడారాముడు" అనే అంటాడు. పామరత్వంతో - పుత్ర వ్యామోహాన్ని వదలలేకపోతాడు. పదహారేళ్ళుకూడా నిండనివాడు రాముడంటాడు. మైనారిటీ తీరలేదనే అర్థం స్ఫురిస్తుందాయన మాటల్లో. యుద్ధార్హుడు కాకపోవడానికి కారణం కేవలం వయసు తక్కువగా వుండడమే కాదు - రాక్షసుల స్వభావం తెలియనివాడైనందున యుద్ధంచేయలేడని దశరథుడి ఉద్దేశం.

దశరథుడి మాటల ప్రకారం, శ్రీరాముడి కప్పుడు పదహారో సంవత్సరం నడుస్తున్నదనుకోవాలి. ఆ వయస్సులోనే కొన్నిరోజులతర్వాత వివాహం జరిగింది. ఆ తర్వాత పన్నెండేళ్లు అయోధ్యలో గడిపాడు. అయోధ్యకాండలో ఒకానొక చోట సీతాదేవి చెప్పిందాన్ని బట్టి, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు. అయితే, రావణుడితో భర్తవయసెంతో చెప్తూ, వనప్రవేశసమయంలో రాముడికి 25 సంవత్సరాలనీ, తనకు  18 సంవత్సరాలనీ అంటుంది. మరో సందర్భంలో అరణ్యానికి పోయే ముందర తనను చూడడానికి వచ్చిన శ్రీరాముడితో కౌసల్య అన్న మాటల ప్రకారం, ఆయన కప్పుడు 17 సంవత్సరాల వయస్సుండాలి. ఇదే నిజమైతే, శ్రీరాముడికి ఐదవ ఏటనే పెళ్ళి జరిగుండాలి. విశ్వామిత్రుడి వెంట వెళ్ళే సమయంలో ఆయనకు ఉపనయనమయినట్లు చెప్పబడింది. ఐదో సంవత్సరంలో ఉపనయనం జరగడం శాస్త్రవిరుద్ధం కాబట్టి, శ్రీరాముడు అరణ్యానికి పోయేటప్పుడు 8+17=25 సంవత్సరాల వయస్సని గ్రహించాలి.

No comments:

Post a Comment