Saturday, May 23, 2020

ఆత్మనిర్భర్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం : వనం జ్వాలానరసింహారావు


ఆత్మనిర్భర్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (24-05-2020)
ప్రస్తుతం యావద్భారత దేశం ఇరుక్కుపోయిన ప్రత్యేక సందర్భం, రెండు శతాబ్దాల క్రితం ఆంగ్లేయ వేదాంతి, కవి, జాన్ హెన్రీ న్యూమెన్ రచించిన “ద పిల్లర్ ఆఫ్ ద క్లౌడ్” అనే కవితలోని మొదటి పాదంలోని “లీడ్ కైండ్లీ లైట్” పదాలు గుర్తుకు తెస్తున్నాయి.  “చుట్టూతా అలుముకుంటూ కమ్ముకుంటున్న చీకట్ల మధ్యన సుదూరంలో వున్న దూర దృశ్యాన్ని చూడమని అడగడం లేదు, ఒకే ఒక్క అడుగు వేస్తే సరిపోతుంది నాకు, నన్ను దయతో ఆ అడుగు తేలికగా నడిపించండి” అని దాని అర్థం.

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతినుద్దేశించి చేసిన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పిన ప్రతి అంశాన్నీ-జనతా కర్ఫ్యూ పాటించడం, చప్పట్లు కొట్టడం, తాళాలు వేయడం, గంటలు మోగించడం-దేశ ప్రజలందరూ హృదయపూర్వకంగా స్వాగతించి, ఆమోదముద్ర వేసి, త్రికరణ శుద్ధిగా అమలు చేశారు. ఆ తరువాత కూడా మార్చ్ 24 నుండి 21 రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు కావాలని మరొక్కమారు మోడీ ఇచ్చిన పిలుపును కూడా, విధించబోయే లాక్డౌన్ విరమణ ఎలా వుంటుందో అన్న వ్యూహం కానీ, కరోనాతో సహజీవనం చేయడమెలాగో అన్న విధానం కానీ, ఆయన ప్రకటించక పోయినా సరే, తుచ తప్పకుండా మోడీ ఆదేశాలను అమలు చేశారు ప్రజలు.   

ఇక ఆతరువాత, ఇటీవల మే 31 వరకు పొడిగించిన లాక్డౌన్ తో సహా, ఒకటికి నాలుగుసార్లు లాక్డౌన్లను పొడిగించడం జరిగింది. దానికీ ప్రజల ఆమోదముద్ర పడింది. కాకపోతే, ఒకవైపు నుండి మోడీ లాక్డౌన్ ను అమలు చేయమంటూనే, మరో వైపునుండి, రైళ్లను నడపడం, విమానాలను నడపడం, మద్యం దుకాణాలు తెరవడం, అశాస్త్రీయ పద్ధతిలో (రెడ్, గ్రీన్, ఆరెంజ్) జోనల్ వ్యవస్థను అమల్లోకి తేవడం లాంటి లొసుగులు పాటించడం కూడా జరుగుతున్నది. లాక్డౌన్ అమలు చేసే విషయంలో, కేంద్రం అనుసరించే వ్యూహాన్నే, మార్గదర్శకాలనే రాష్ట్రాలు అనుసరిస్తాయి తప్ప, వాటిని అధిగమించి పోవడానికి ఆస్కారం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాలు ఇష్టం లేకపోయినా కేంద్రం ఆదేశాలను పాటించాల్సి వచ్చింది.      
ఇటీవలే మే 11 వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు వీడియో సమావేశం నిర్వహించారు. అంతవరకూ బాగానే వుంది. కాని, ఆ సమూహాలోచనలో ఏం జరిగిందనే బ్రహ్మ రహస్యాన్ని కానీ, ఏఏ విషయాలలో పీఎం-సీఎంలు అంగీకారానికి వచ్చారన్న విషయాన్ని కానీ, ఏఏ విషయాలలో విభేదించారన్న విషయాన్ని కానీ, పారదర్శకంగా ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియచేసినట్లయితే బాగుండేదేమో! కేంద్రం ఈ కష్టకాలంలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకున్నట్లయితే వారికి ప్రభుత్వంమీద మరింత నమ్మకం కుదిరేది. కాకపొతే, వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి కొందరు సీఎంలు విడి విడిగా లోపల ఏం జరిగిందో, వాళ్లు ఇచ్చిన సూచనలు, సలహాలు ఏమిటో పత్రికలకు విడుదల చేశారు. వాళ్ల ఆలోచనను పారదర్శకంగా ప్రజలతో పంచుకున్నారు.

దేశంలో కరోనా వ్యాప్తి చెందడానికి ఆస్కారం లేకుండా, గతంలో, వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా రద్దు చేసిన పాసింజర్ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించవద్దని, వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కోరారు. ధిల్లీ, ముంబాయ్, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలో ఇప్పటికీ కరోనా వైరస్ ప్రభావం ప్రబలంగా వుందనీ,ఈ నగరాల నుండి రాకపోకలకు అనుమతిస్తే, కరోనా వైరస్ ను కట్టడి చేయడం కష్టతరమని కేసీఆర్ ప్రధానికి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణాన రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులపై తీవ్రమైన దుష్ప్రభావం పడిందనీ, ఆదాయం బాగా తగ్గిపోయిందనీ, అందువల్ల రాష్ట్రాలు తీసుకున్న రుణాల చెల్లింపులను వాయిదా వేసి, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని సీఎం కేసీఆర్ ప్రధానికి చెప్పారు. ఇప్పుడప్పుడే కరోనా అంతం అయ్యే సూచనలు కనబడడం లేదనీ, ఇక దానితో సహజీవనం చేయాల్సి వస్తున్నదనీ, కాబట్టి ఆ దిశగా ప్రజలను సమాయత్తం చేయాలనీ ఆయన అన్నారు. దీనికొరకు మొట్టమొదట చేయాల్సింది ప్రజల్లో భయం పోగొట్టడమనీ, లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలనీ ఆయన సూచించారు ప్రధానికి.


ఈ నేపధ్యంలో మరోమారు ప్రధాని మోడీ మే 12 న జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్ మహమ్మారి కనీ-వినీ ఎరుగని ఒక సంక్షోభం అని ఉద్ఘాటిస్తూ, ఎకానమీ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, శక్తివంతమైన జనాభా, డిమాండ్ అనే ఐదు స్థంబాల ఆధారంగా ఒక స్వావలంభన భారతదేశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ తరువాత ఆయన ఉహించుకున్న స్వావలంభన భారత దేశం, లేదా, “ఆత్మనిర్భర్ భారత్” సాధించేందుకు భారీ స్థాయిలో రు. 20 లక్షల కోట్ల పాకేజీని ప్రకటించారు. భారత స్థూల దేశీయ ఉత్పత్తిలో ఇది దాదాపు 10% వుంటుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని పేద ప్రజల, కార్మికుల, వలసదారుల లాంటి వారి సాధికారికత మీద ఈ పాకేజీ సమగ్ర దృష్టి సారిస్తుందని ప్రధాని చెప్పారు.                  

ఇదిలా వుండగా, ప్రధాని తన సందేశంలో పేర్కొన్న విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ మర్నాటి నుండి, ఐదు రోజుల పాటు, వరుస పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసి, పాకేజీ వివరాలను వెల్లడి చేశారు.

మొదటి రోజు ఆర్ధిక మంత్రి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు (ఎమ్మెస్ఎంయీలు) మనుగడ సాగించడానికి, అవి కరోనా వైరస్ మహమ్మారి మూలాన సంభవించిన ఆర్ధిక దుష్ప్రభావాన్నుండి కోలుకోవడానికి  రాయితీలు ప్రకటించారు. మర్నాడు, వలస కార్మికులకు ఉచిత ఆహార ధాన్యాల సరఫరాకు, రైతులకు రాయితీ క్రెడిట్, వీధి వర్తక-వ్యాపారులకు వర్కింగ్ కాపిటల్ ఋణ సౌకర్యం, ఆర్ధిక ఉద్దేపనలో రెండో భాగంగా ప్రకటించారు. ఇక మూడో రోజున, వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాల లాజిస్టిక్స్ బలోపేతానికి; వివిధ రంగాలలో సామర్ధ్య పెంపుదలకు; వ్యవసాయం, మత్స్య సంపద, ఆహార శుద్ధి రంగాలలో పాలనా-పరిపాలనా సంస్కరణల అమలుకు, ఆయా రంగాల బలోపేతానికి చర్యలను ప్రకటించారు. బొగ్గు, ఖనిజాలు, రక్షణ, పౌర విమానయానం, విద్యుత్ సరఫరా, సామాజిక మౌలిక సదుపాయాలు, అంతరిక్ష-పరమాణు శక్తి రంగాలలో నిర్మాణాత్మక సంస్కరణలకు సంబంధించి పాకేజీ వివరాలను నాలుగో రోజున ప్రకటించారు. చివరి రోజున ఏడు అంశాలను ప్రాదాన్యతలుగా, ప్రాధాన్యతా రంగాలుగా ప్రకటించారు. అవి వరుసగా: మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి పధకం, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం-కోవిడ్ 19, కంపెనీ చట్టాన్ని చట్టబద్ధం చేయడం, సులభతర వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు-రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు.          

రాష్ట్రాల రుణపరిమితిని పెంచుతూ కొంత ఆశ కలిగిస్తూనే, ఆ పరిమితికి అనేక నిబంధనలు, షరతులు విధించారు ఆర్ధిక మంత్రి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కనీ-వినీ ఎరుగని విధంగా ఆ మహమ్మారి ప్రభావం వుండడం వల్ల, రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి మాత్రమే, వాటి ఋణపరిమితిని ఇప్పుడున్న 3% నుండి 5% కి పెంచి, తద్వారా, అదనంగా రు. 4.28 లక్షల కోట్ల ఋణ సౌకర్యం పొందడానికి, వనరుల సేకరణకు వీలు కలిగించారు ఆర్ధిక మంత్రి. కాకపోతే రాష్ట్రాలకు అనుమతించిన ఈ ఋణపరిమితి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని కేంద్రం ప్రకటించిన నిర్దిష్ట సంస్కరణలకు అనుసంధానం చేసింది. 3% నుండి 3.5% అంటే 0.5% పెంపుదల భేషరతుగా వుంటుంది. తరువాత 1% నాలుగు అంచలుగా, ఒక్కోటి 0.25% వుండే విధంగా, కేంద్రం ప్రకటించిన సంస్కరణల అమలుకు ముడి వేసింది. చివరి 0.5% పొందాలంటే, కేంద్రం ప్రకటించిన నాలుగు అంశాలలో కనీసం మూడింటిలో నిబంధనల మేరకు మైలు రాళ్లను అధిగమించాలి. ఇన్ని షరతులతో కూడిన ఋణ పరిమితి నామ మాత్రమే అని పరిశీలకుల అభిప్రాయం.

రెవెన్యూ మిగులు రాష్టాలైన గుజరాత్, తెలంగాణలకు ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం ఋణ పరిమితి భేషరతుగా 3.5% వుంది. ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఇకపోతే, 3.5% నుండి 4.5% వరకూ పెంచిన ఋణపరిమితి అనేక షరతులతో కూడి ఉన్నందున అది సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఏదో, అదీ-ఇదీ సాధిస్తేనే ఋణపరిమితి పెరుగుతుందని చెప్తూనే, పరిమితిని పెంచాం అని చెప్పడం కేవలం కంటి తుడుపు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితులలో, ఈ క్లిష్ట సంవత్సరంలో, కేంద్రం చెప్పిన మైలు రాళ్లను అధిగమించడం ఏ రాష్ట్రానికైనా అసాధ్యమే. అదే కాకుండా ఇలాంటి పలచబడ్డ సౌకర్యం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే కదా!       

ఇంకొక విషయం: ఈ పాకేజీ ప్రకటనలన్నీ కొత్తగా చెప్తున్న మాటలేమీ కాదు. ఇవన్నీ ఒక విధంగా బడ్జెట్లో చెప్పిన పలుకులే. దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు, సామాన్య-సగటు మనిషి జీవిక అస్తవ్యస్తమై పోయిన తరుణంలో ఈ ఉద్దీపన పాకేజీలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. భారత ఆర్ధిక వ్యవస్థ మీద, యావత్తు భారతీయుల మీద నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన పాకేజీ వివరాలు ఒక పెద్ద జోక్ గా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వర్ణించారు. స్వావలంభన అంటే, అప్పుల మీద, పెరుగుతున్న బాధ్యతల మీద, తక్కువ పొదుపు చేసి ఎక్కువ వ్యయం చేయడం మీద ఔత్సాహికులు ఆధారపడేట్లు చేసి, వారికేదో మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం కాదు.  

ఏదైతేనేం.....ఉద్దీపన పాకేజీ మొత్తాన్ని రు. 20 లక్షల కోట్లగా ప్రకటించింది కేంద్రం. దీంట్లో సింహ భాగం బాంకుల ద్వారా, ఋణ పద్ధతిలో, ఎంఎస్ఎంయీ లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, తదితర రంగాలకు లభిస్తుంది. రాష్ట్రాలకు ఇచ్చే పాకేజీ పూర్తిగా నిరుత్సాహ పూరితం అనాలి. ఆరోగ్యం లాంటి క్లిష్ట, కీలక రంగాలకు సరైన మోతాదులో మద్దతు లేనేలేదు. రెట్టింపు లెక్కింపు, అంటే లెక్కించిన నగదునే మళ్లీ-మళ్లీ లెక్కించే ప్రమాదం వుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. రాష్ట్రాలకు ఇచ్చిన పాకేజీ పూర్తిగా నిరుత్సాహభరితంగా వుంది. కీలక, ప్రాధాన్యతా రంగమైన ఆరోగ్యానికి కేంద్రం ఇచ్చిన మద్దతు అంతంత మాత్రమే. రాష్ట్రాలకు నేరుగా ఎలాంటి నిధులను ప్రతిపాదించ లేదీ పాకేజీలో. వాస్తవానికి రాష్ట్రాలకు మొత్తంగా ఇచ్చింది కేవలం రు. 4000 కోట్ల లోపే! సహకార సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా లోపించింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో భారత సహకార సమాఖ్య వ్యవస్థలో కేంద్రం అవలంభించాల్సిన కీలక ఫెడరల్ విధానం ఇది కానే కాదు. విత్త సమాఖ్య స్ఫూర్తికి కూడా పాకేజీ విరుద్ధం.          

ప్రజల విశ్వాసం పొందడం, వారిలో నమ్మకం కలిగించడం అనేది ఒక కళ, ఒక శాస్త్రం, ఒక రకమైన నాయకత్వ లక్షణం. అది అందరికీ చేతకాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రికా సమావేశం వుందంటే, ఆయన మళ్లీ-మళ్లీ మాట్లాడాలని, మళ్లీ-మళ్లీ వినాలని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. దానికి కారణం లేకపోలేదు. ఆయన మాటలకు వారంతా ప్రభావితమౌతారు. ఉత్సాహపడతారు, స్ఫూర్తి పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు కోరుకున్నది ఆయన నోటి వెంట వస్తుంది. అదే ప్రేక్షకులు, కేంద్రం, పౌర సంబంధాల నిపుణుడు ప్రధాని మోడీ ద్వారా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లాస్ రూమ్ లెక్చర్ల ద్వారా ప్రకటిస్తున్న ఆర్ధిక పాకేజీ విని విసుగు చెందుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో, ఆపత్కాలంలో ప్రజలకు కావాల్సింది ఒకింత సేద, ఓదార్పు, నాలుగు మంచి మాటలు, ధైర్యం. ఇదే చెప్పాడు వేదాంతి, రచయిత జాన్ హెన్రీ న్యూమెన్ తన “లీడ్ కైండ్లీ లైట్” వాక్యాల ద్వారా.     

No comments:

Post a Comment