Sunday, December 6, 2020

రామాయణం చెప్పేందుకు వాల్మీకిని నియమించిన బ్రహ్మ ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-34 : వనం జ్వాలా నరసింహారావు

 రామాయణం చెప్పేందుకు వాల్మీకిని నియమించిన బ్రహ్మ

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-34

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-12-2020)

వాల్మీకి నోట వచ్చిన పద్యానికి (శ్లోకానికి) కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని చిరునవ్వుతో, బ్రహ్మ, సార్ధక జన్ముడైన వాల్మీకితో ప్రేమగా ఇలా అంటాడు:

"మునీశ్వరా, ఎందుకంత దూరమాలోచిస్తున్నావు? సందేహం వదులుకో.నీ నోటినుండి వచ్చింది (శ్లోకమే) పద్యమే. అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. నా పనుపున సరస్వతీ దేవి నీ నోటినుండి పలికించింది. ఇది నేను తలపెట్టిన కార్యం. సరస్వతీ దేవికి నీ నోటినుండి పద్యం (శ్లోకం) పలికించాల్సిన పనేం కలిగిందని అనుకుంటున్నావా? నారదుడు ఉపదేశించిన ప్రకారంగా, శ్రీరామ చరిత్రంతా, ఇప్పుడు నువ్వు చెప్పిన (శ్లోకాల) పద్యాల లాంటివే చెప్పి, మిక్కిలి భక్తితో గొప్ప కావ్యంగా రచించాలి. ఆయన చరిత్ర నేనెందుకు చెప్పాలంటావా? బ్రాహ్మణోత్తమా, సమస్త కళ్యాణ గుణాలున్న వాడు, హేయ గుణాలేవీ లేనివాడు, సమస్త ధర్మాలకు నిలువనీడ శ్రీరాముడే. బుద్ధిమంతుడా, లోకంలో ఏ విషయాలు బహిరంగంగా చెప్పొచ్చు-ఏవి చెప్పకూడదు అని వివరించే శ్రీరాముడి చరిత్రలోని రహస్యాలు-రహస్యం కాని విషయాలు, సీతారామ లక్ష్మణ, రావణ చరిత్ర, అంతా నీ మనస్సుకు స్పష్టంగా గోచరిస్తుంది. లోక పూజ్యమయిన నీ కావ్యంలో, ఏ విషయంలోనైనా, జరిగినదానికి విరుద్ధంగా కాని, పూర్వోత్తర విరుద్ధమయిందికాని, ఒక అర్థానికి మరో అర్థం వచ్చే మాటకాని, వాక్యంకాని ఒక్కటికూడా వుండదు. ఇక నువ్వు సందేహించకుండా, కీడును తొలగించి-మేలుచేసే రామ కథను మంచి-మంచి (శ్లోకాలతో) పద్యాలతో, శీఘ్రంగా-కావ్యంగా రచించు నాయనా. నా లోకంలో నేను చేసినట్లే, భూ లోకంలో దీన్ని ప్రచారంలోకి తేవాలి నువ్వు".

"నువ్వంటే దేవతా శ్రేష్టుడివి. లోకపూజ్యుడివి. అందుకే నువ్వు పలికిన రామాయణం నీ లోకంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అట్టి మహిమ నాలో లేదు కదా-నేను చెప్పింది నా కాలం వారైనా వింటారా-నా కాలంలోనైనా ప్రచారంలోకి వస్తుందా? అసూయాపరులెక్కువగా వున్న ఈ లోకంలో ఎలాంటి విఘ్నాలొస్తాయో-ఏమో? కొంతకాలమే వుండి, కొంతమేరకే ప్రచారంలోకి వచ్చే దానికొరకై నేనెందుకు శ్రమపడాలి అని అంటావేమో. నీకావిచారంతో పనిలేదు. ఎంతవరకు కుల పర్వతాలు, నదీ-నదాలు, భూమిపై వుంటాయో అంతవరకు నువ్వు రచించిన రామ చరిత్ర శాశ్వతంగా వుంటుంది. నీ రామాయణం శాశ్వతంగా లోకంలో నిలిచి పోతుందనుకో. దాని వల్ల ఏం లాభమంటావా? ఎంతవరకు నీ రామాయణ కావ్యం  భూలోకంలో ప్రచారంలో వుంటుందో, అంతవరకు, నువ్వు పూర్ణమైన యశస్సుతో జీవించి, ఆ తర్వాత మా లోకానికొస్తావు. బ్రహ్మ లోకంతో సహా అన్ని లోకాలకు పునరావర్తి వుంటుందికదా- అలాంటప్పుడు మోక్షానికై తపస్సు చేస్తున్న నువ్వు పరమపదానికి పోకుండా, నా లోకానికొస్తే, నీ కోరికెట్లా నెరవేరుతుందంటావేమో. నా లోకానికొచ్చిన నీకు ముక్తి హాని లేదు. అది ఎప్పటికైనా నా సొత్తే. నా లోకం వారుకూడా నీ రామాయణం వినేందుకు కుతూహలపడుతున్నారు. నువ్వు మా లోకానికొచ్చి, నేనున్నంతవరకుండి, నాతోనే ముక్తుడవుకా".


ఇలా చెప్పి బ్రహ్మ వెళ్లిపోతాడు. ఆయన చెప్పిన మంచిమాటలకు సంతోషించిన వాల్మీకి, జరిగిన వృత్తాంతమంతా శిష్యులతో చెప్పి, ఆలోచించి, సంతోషంతో తేలిపోతాడు. ఆయన శిష్యులుకూడా అంతే సంతోషంతో, అదే విషయాన్ని మళ్లీ-మళ్లీ తల్చుకుంటూ, ఎంత వింత జరిగిందే అనుకుంటారు. "స్పష్టంగా, సమాన సంఖ్యగల అక్షరాలున్న నాలుగు పాదాలతో-అందంగా-మన గురువుగారి శోకమే శ్లోకంగా (పద్యంగా)-భగవద్విషయం భావ గర్భితంగా వెలిసిందే! ఏమి ఆశ్చర్యం! ఇలాంటి వింత వుంటుందా?“అని శిష్యులు ఆనందంతో చర్చించుకుంటుంటారు. వాల్మీకి మహర్షి భగవంతుడిని ధ్యానిస్తూ, పరమాత్మ విషయం చెప్పాలని తల్చుకుంటూ, బోయవాడి విషయంలో ఆశువుగా తను చెప్పిన రీతిలోనే, పూర్తి శ్లోకాలతో (పద్యాలతో)-నిర్వచనంగా రామాయణాన్ని రచించాలని నిర్ణయించుకుంటాడు.

రసవంతంగా, వింటానికింపుగా, మననం చేయడానికి అమృత సమానంగా, రహస్యార్థాలకు ఆధారంగా, పఠించేవారికి-వినే వారికి నిర్మలమైన కీర్తినిచ్చేదిగా, భగవత్ ప్రాప్తికి విరుద్ధమైన పాపాలను హరించేదిగా వాల్మీకి రామాయణం వుండాలనుకుంటాడు మహర్షి. రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా-సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా-సమత్వం, మాధుర్యం,అర్థ వ్యక్తి లాంటి గుణాలు కలబోసి వాక్య బద్ధమైన కావ్యంగా-యోగం, రూడ్యార్థాలతో కూడినదిగా-రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా-మనస్సుకు సుఖమిచ్చేదిగా-పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా-చక్కటి కావ్య గుణాలతో అలంకరించినదిగా, తాను రచించ బోయే రామాయణాన్ని-అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి.

No comments:

Post a Comment